వెల్ క్యాపింగ్ లో కీలకంగా కోటిపల్లి సత్యనారాయణ
పర్యాటక ప్రదేశాన్ని తలపించిన పాశర్లపూడి
నేను – ఈనాడు: 30
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
హైదరాబాద్ నుంచి కూడా రిపోర్టర్లు వస్తున్నారు. సంబంధిత డెస్కు నుంచి సబ్ ఎడిటర్లు వెళ్లకపోతే ఎలా? ఈ ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. దీనికి కారణం లేకపోలేదు. బ్లో అవుట్ సైట్ చూడడానికి వెళ్ళినవాళ్ళు ఏదో ఒక కొత్త సమాచారాన్ని రిపోర్టరుకు చెప్పేవారు. అలాంటప్పుడు స్టాఫ్ వెడితే.. వారే వార్త రాయచ్చుగా అన్నది అప్పటి రాజమండ్రి యూనిట్ మేనేజర్ జి.వి.రావు ఆలోచన. అంతే.. వరసగా డెస్కు నుంచి కూడా బ్లో అవుట్ సైటుకు ఉప సంపాదకులు వెళ్లడం ప్రారంభమైంది.. ఒక రోజు నేను రాధాకృష్ణ గారితో వెళ్ళాను. ఆయన నన్ను ఒక కొత్త కంట్రిబ్యూటర్‌కి అప్పచెప్పారు. అతను నన్ను బ్లో అవుట్ సైట్ దగ్గరకు తీసుకెళ్లారు.
వెడుతున్నానే కానీ, ఏదో భయం. అక్కడ ఎలా ఉంటుందో… నాకు రాయడానికి అంశం ఏదైనా దొరుకుతుందో లేదో … ఇలా అనేక ఆలోచనలు ముప్పిరిగొంటుండగానే సన్నగా విజిల్ వినబడడం ప్రారంభమైంది. దగ్గరకు చేరుకుంటున్న కొద్దీ ఆ శబ్దం భీకరంగా పెరుగుతోంది. ఎంతగా అంతే… చెవుల్లో దూది పెట్టుకోవాల్సి వచ్చేటంతగా…
నేను రాసిన ప్రత్యేక కథనం కూడా ఇలాగే ప్రారంభించాను. ఆ ప్రాంతీయులతో మాట్లాడి.. వారు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రోది చేసి, అధికారుల స్పందన జోడించి కథనాన్ని రాశాను. ఇదే సందర్భంలో అక్కడకు వస్తున్న వారినీ పలకరించాను. ఆ ప్రాంతం ఒక పర్యాటక ప్రదేశంలా తయారైంది. అక్కడికి దగ్గరలో ఉన్నవారు, ఎడ్ల బళ్లపై వస్తే… దూరప్రాంతాలవారు టాక్సీలు కట్టించుకుని మరీ వచ్చేవారు. ఇదే విషయాన్ని నా అనుభవాలు చదువుతున్న శశిధర్ బలిజేపల్లి నాతో పంచుకున్నారు.
(Sasidhar Balijepalli)
‘బ్లో అవుట్ సమయంలో దానిని చూడటానికి ఎక్కడెక్కడి బంధువులు వచ్చేవారు, అలా మా ఇంటికి వచ్చిన వారిని అక్కడికి తీసుకెళ్లడం నా పని, కొంతమందైతే ఏకంగా టాక్సీ కట్టించుకుని మరీ వచ్చేవారు. మాంచి కోలాహలంగా ఉండేది వచ్చే పోయే బంధువులతో…’ అంటూ ఆయన నాకు మెసేజ్ పంపారు.
బ్లో అవుట్ అదుపు సంగతి ఏమో గానీ, ఇక్కడకు వచ్చేవారిని అదుపులో పెట్టడానికి పోలీసులకు తలకు మించిన భారమయ్యేది. ఒక పక్కన నేషనల్, ఇంటర్నేషనల్ రిపోర్టర్లు, ఒ.ఎన్.జి.సి. అధికారులు… మంత్రులు… ఇలా అందరూ.. కణకణలాడుతూ భగభగమండుతున్న బ్లో అవుట్ మంట చుట్టూ తిరుగుతుంటే అదొక పండుగ వాతావరణాన్ని తలపింపచేసింది.
మరొకపక్క, నీల్ ఆడమ్స్ అదుపు చేసే విధానం నచ్చక వారి కంపెనీని ఒ.ఎన్.జి.సి. వదిలించుకుంది. రేమండ్ ఎడ్మన్డ్స్ రంగప్రవేశం చేశారు. వారు చేస్తున్న సూచనలను జాగ్రత్తగా పాటిస్తూ సంస్థకు చెందిన కోటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలోని క్రైసిస్ మేనేజిమెంట్ బృందం వెల్ క్యాపింగ్ చేసి మంటలను అదుపులోకి తెచ్చింది. బ్లో అవుట్ ద్వారా ఎగిసే మంటలను అదుపుచేయడానికి వెల్ క్యాపింగ్ ఒక్కటే మార్గం. క్యాపింగ్ చెయ్యటం అంత సులభం కాదు. బ్లో అవుట్ వెల్ దగ్గరకు వెళ్లాలంటే విపరీతమైన వేడిని తట్టుకోవాలి. దీనికి కావలసిన సరంజామాను సమకూర్చుకుని, నిపుణులైన సాంకేతిక, ఇతర అధికారుల బృందాన్ని సమన్వయం చేసుకుంటూ… మారుతున్న బ్లో అవుట్ బోర్ వెల్ కి మూత పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అరవై ఐదు రోజులలో మొత్తం పది లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు వృధాగా మండిపోయింది. ఈ నష్టం సంస్థకు రోజుకు పదిహేడు లక్షల రూపాయలని తేలింది. అప్పటి జనరల్ మేనేజర్ రంగరాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదంతా ఒక ఎత్తైతే వార్తల కవరేజిలో ఈనాడు మిగిలిన పత్రికలకు అందనంత ఎత్తులో నిలిచింది. దీనికి కారణం డెస్కు ప్లానింగ్. దానికి మెరుగులు దిద్దిన పై అధికారులు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ కవరేజిని మెరుగుపరిచారు.
ఇలాంటి కవరేజిల వెనుక ఎందరో హేమామీలైన రిపోర్టర్లు ఉన్నారు. సంస్థకు సర్వం ధారపోసిన వారు ఉన్నారు. ఎంత చేసినా చివరి దశలో ఇబ్బంది పడినవారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బొబ్బిలి రాధాకృష్ణ గారు… ఆయన గురించి రేపటి ఎపిసోడ్ లో…