టైటిల్ వెనుక కథ – నా ఊహ
(మహాదేవ్, 9490646306)
సుకుమార్ గారిది రాజోలు పక్కన, 3 km దూరంలో ఉన్న మట్టపర్రు అనే చిన్న గ్రామం. అప్పట్లో, ఆయన రాజోలు డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో maths lecturer లేక లెక్కలు నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బంది తన జూనియర్స్ పడకూడదు అనే సదుద్దేశంతో రాజోలులోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని “Tetrahedral Tuition Point” అని పెట్టి జూనియర్స్ అందరికి లెక్కలు, ఫిజిక్స్ చెప్పేవారు. ఆయనకు తన జూనియర్స్ ని ప్రోత్సహించాలనే ఆలోచన అప్పటి నుంచే ఉందన్నమాట. ట్యూషన్ పాయింట్ కి వచ్చే విద్యార్థులతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉండేది,వాళ్ళ సైకిల్లతో ఆ ముందు జాగా అంతా నిండిపోయేది,అది చూసే ఆదిత్య కాలేజి యాజమాన్యం ఆయనకి కాకినాడలో లెక్చరర్ గా అవకాశం ఇచ్చారు అని చెప్తారు. ఆ తర్వాత అక్కడ కూడా రాజీనామా చేసి సినిమాల్లో దిగ్దర్శకులుగా ఎదిగిన క్రమం మనందరికీ విదితమే.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఆర్య సినిమాకి ముందు నుంచీ అనుకున్న టైటిల్ – నచికేతన్, పురాణాల్లో నచికేతనుడు గురించి కథ కూడా ఉంటుంది, చదవచ్చు..అయితే చివరి క్షణంలో “ఆర్య” గా రెండు అక్షరాల టైటిల్ని పెట్టి, ఇప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు మన సుకుమార్ గారు.
నేను అనుకోవడం, మా రాజోలులో ఎప్పటి నుంచో “ఆర్య వైశ్య భోజన హోటల్” అని పిలవబడే హోటల్ చాలా ఫేమస్. అది సుకుమార్ గారు ట్యూషన్లు చెప్పిన ఇంటి పక్కనే ఉంటుంది. ఆర్య అనే టైటిల్ అక్కడ నుంచి ఆయన ఏమైనా inspire అయ్యి ఉండచ్చు అనేది కేవలం నా ఊహ.
నిజానికి ఆర్య అంటే తెలుగులో శ్రేష్ఠుడు, ఉత్తముడు అని అర్ధం.
మనుషుల్లో ఎప్పుడూ రెండు కోణాలు ఉంటాయి.
మంచోడు మనలోనే ఉంటాడు – చెడ్డోడు మనలోనే ఉంటాడు.
కానీ మనలోని చెడ్డోడికి మాస్క్ వేసేసి మంచోడిలా నటించడానికి అందరం ప్రయత్నిస్తాం.
“ఆర్య” అనేవాడు అలాంటి ముసుగులు ఏమి లేకుండా బతుకుతాడు.
ఉన్నది ఉన్నట్టు కుండబద్దలైనట్టు ఖచ్చితంగా చెప్తాడు.
మంచి అయినా, చెడు అయినా బయటకే అనేస్తాడు.
అలా ఉన్నవాడినే మనుషుల్లో ఉత్తముడు అంటారు – అంటే “ఆర్య” అంటారు.
అలా ఉండగలగడం చాలా కష్టం కాబట్టే మన అందరికీ ఆర్య పాత్ర అన్నా, ఆర్య సినిమా అన్నా చాలా ఇష్టం.

(Author is an actor in Tollywood)