అరవై ఐదు రోజుల్లో వార్తల బ్లో అవుట్

Date:

మంట ఎత్తు వార్తలపై సందేహాలు
ఈనాడు బృందం నిర్విరామ కృషి
నేను – ఈనాడు: 30
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


బ్లో అవుట్ ను అదుపు చేయడానికి ఒ.ఎన్.జి.సి. క్రైసిస్ మేనేజిమెంట్ బృందం ప్రయత్నాలను ప్రారంభించింది. అది ఆ బృందానికి కొరుకుడు పడకపోవడంతో విదేశీ కన్సల్టెన్సీల సాయాన్ని కోరాలని నిర్ణయించుకున్నారు. మొదటగా అమెరికాకు చెందిన హౌస్టన్లోని నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటింగ్ కంపెనీకి ఈ బాధ్యతను అప్పగించారు. దీని అధినేత నీల్ ఆడమ్స్ కు విజయవాడలోని కాంధారి హోటల్లో వసతి కల్పించారు. ఆయన ప్రతిరోజూ అక్కడినుంచే హెలీకాఫ్టర్లో బ్లో అవుట్ సీటుకు విచ్చేసి, గంట రెండు గంటలు గడిపి, సూచనలు చేసి తిరిగి వెళ్ళిపోయేవారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు నచ్చక ఒ.ఎన్.జి.సి. వెనక్కి పంపింది. ఆయన స్థానంలో రేమండ్ ఎడ్మండ్ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. ఎడ్మన్డ్ చేసిన సూచనలు పాటిస్తూ ఒ.ఎన్.జి.సి. ఉన్నతాధికారి కోటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలోని క్రైసిస్ మేనేజిమెంట్ బృందం మంటలను అదుపు చేసింది.

బ్లో అవుట్ వల్ల నష్టం ఎంతంటే….
మంటల అదుపునకు 65 రోజులు పట్టింది. 1995 జనవరి 8 వ తేదీ రాత్రి 6 50 కి ప్రారంభమైన బ్లో అవుట్ మార్చ్ 15 న అదుపులోకి వచ్చింది. బ్లో అవుట్ కారణంగా సంస్థకు 16 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రమాద ప్రదేశంలో ధ్వంసమైన రిగ్గు ఖరీదు తొమ్మిది కోట్లు. ఏడు కోట్ల రూపాయల విలువైన ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. ఇది కాక క్రైసిస్ మేనేజిమెంట్ ఖర్చు. మొత్తం మీద మంటలు అదుపుకావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అరవై ఐదు రోజుల పాటు 200 మీటర్ల వెడల్పున మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపారు. ఆర్టీసీ బస్సులలో 1500 మందిని తరలించారు. అంతకు ముందే మరికొంతమంది.. భయంతో అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

తొలిరోజు నుంచి ఈనాడు దూకుడు
ఈనాడు బృందం ఈ అరవై ఐదు రోజులూ అవిశ్రాంతంగా పనిచేసింది. బ్యూరో చీఫ్ నవీన్ గారి నాయకత్వంలో కోనసీమ రిపోర్టింగ్ బృందం పక్కా ప్రణాళిక సాగించుకుని సాగింది. హైదరాబాద్ నుంచి కూడా కొందరు రిపోర్టర్లు వచ్చి వెడుతుండేవారు. మొదటి రోజునుంచే ఈనాడు దూకుడును ప్రదర్శించింది. ఏ కోణాన్నీ వదలకుండా వార్తలను సమర్పించింది. ఒక రోజున నేను కూడా వెళ్ళాను. బొబ్బిలి రాధాకృష్ణ గారు నన్ను ఆయన బండి మీద తీసుకెళ్లారు. ఆయనది ఎల్.ఎం.ఎల్. వెస్పా.. అప్పట్లో కొత్తగా రిలీజ్ అయ్యింది. చోదకుడికి వెన్నుదన్ను ఇచ్చేందుకు ఆ బండిపై ఏర్పాటు ఉండేది. రాధాకృష్ణ గారి బండి మీద వెళ్లడం అంటే ఎంతో భయం వేసేది. కారణం ఆయన తన బండిని రోడ్డు అంచులో పోనిచ్చేవారు. ఇప్పుడు పరవాలేదు గానీ, అప్పట్లో రోడ్డు ఎత్తుగా ఉండేది. పక్కనే మట్టి రోడ్డు ఇంచుమించు రెండు మూడు అంగుళాలు కిందకి ఉండేది. పొరపాటున చక్రం కిందకి జారిందో… బోల్తా పడడమే. ఇదే నేను ఆయనతో అని చాలా భయపడేవాడిని. మీరు భయపడకండి… రోడ్డు చూడండి. ఏమీ కాదు అనే వారు. ఆయన బండి మీద ప్రయాణించేటప్పుడు కళ్ళు మూసుకుని కూర్చునే వాడిని. (ఈ రాధాకృష్ణ గారి గురించి మరొక ఎపిసోడ్ లో పూర్తిగా రాస్తాను.)

ఎవరేమి చేశారంటే…
నవీన్ గారికి ఒ.ఎన్.జి.సి. ప్రాజెక్టులు, పనులపై మంచి అవగాహన. సాంకేతికపరమైన అంశాలు.. దినవారీ తీసుకున్న చర్యలతో పాటు, ప్రత్యేక కథనాలను కూడా ఆయన రాసేవారు. ఏ. రామకృష్ణ, పి. సుబ్బారావు, భగత్ సింగ్, తదితర రిపోర్టర్లు, స్థానిక పరిణామాలపై వార్తలు ఇచ్చేవారు. మెయిన్ పేజీకి ప్రతి రోజు బ్యానర్ వార్తను అన్ని అంశాలతో కలిపి ఇవ్వడం డెస్క్ ఇంచార్జి శర్మ గారి బాధ్యత. వార్తలన్నింటినీ కలిపి అన్ని మినీలకు ఒక సెంటర్ స్ప్రెడ్ ఇవ్వడం ఒకరు చూసేవారు. న్యూస్ కంట్రిబ్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ, ఫోటోలు, వార్తలు సకాలంలో సక్రమంగా వస్తున్నాయా లేదా చూసేది ఒకరు. ఇది ఒక వార్త వ్యవస్థ పనిచేసే విధానం. సిస్టం అవిచ్చిన్నంగా సాగితే తప్పులకు అవకాశం ఉండదు. ఇది ఈనాడు నమ్మిన సిద్ధాంతం. ఎక్కడ ఎవరు తప్పు చేసినా సిస్టం విచ్చిన్నమవుతుంది. దాని పరిణామం… ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. ఒక సిస్టంను ఈనాడు డెవలప్ చేసుకుంది కాబట్టే… విజయాలను సొంతం చేసుకుంటూ పోతోంది.

ఇది ఒక కోనసీమ తుపానుకైనా, బ్లో అవుట్ అయినా, రోడ్డు ప్రమాదమైన, ఎన్కౌంటర్ అయినా, భూకంపం అయినా, ఢిల్లీలో ముషారఫ్ పర్యటన అయినా, తెలుగుదేశం మహానాడు అయినా, ఏదైనా ఇదే సిస్టం. నడిపించేవాడు సిస్టం ఫాలో అయితే చాలు. అప్రతిహతంగా సాగిపోవచ్చు. ఇది ఆనాడే కాదు… ఇప్పుడూ ఈనాడు ఫాలో అవుతోంది.

ప్రత్యేక సందర్భాలు – ప్రత్యేక ఏర్పాట్లు
ఏదైనా విపత్తు సంభవించినా, ప్రముఖుల పర్యటనలు, కీలక సమావేశాలు, ఎన్నికలు ఇలా ఏవైనా ముందు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాటితో స్పెషల్ డెస్కులు ఏర్పడతాయి. దానికి ఒక ఇంచార్జి ఉంటారు. ఇది ఇప్పుడు అనుసరిస్తున్న పద్దతి. అప్పట్లో ఒక ఇద్దరికీ బాధ్యతలు అప్పజెప్పి డెస్క్ ఇంచార్జి సమన్వయం చేసేవారు. ఎన్నికలు అయితే ఎలక్షన్ డెస్క్ అనే పేరుతో ఏర్పాటయ్యేది. పుష్కరాలకు పుష్కర డెస్క్ ఇలా అన్నమాట. ఇలా పేరు పెట్టడానికి కూడా, అందరి అభిప్రాయాలు సేకరించేవారు. ఉత్తమమైన పేరును ఎంపిక చేసి, సంబంధిత ఉద్యోగికి చిరు పారితోషికం అందించేవారు. ఈ పధ్ధతి అప్పుడు అనుసరించి ఉంటే మేము పనిచేసిన డెస్కుకు బ్లో అవుట్ డెస్క్ అని పేరు పెట్టిఉండేవారు.

ఇలా స్పెషల్ డెస్కులు ఏర్పాటైనప్పుడు సందడే సందడి. ఎవరి పని వారు చేసుకుంటూ, మధ్యలో అభిప్రాయాలను పంచుకుంటూ, సందేహాలు తీర్చుకుంటూ సాగేది. పని ఒక్కటే అప్పటి పరమార్ధం. అంతర్గతంగా ఏదైనా జరిగినా మూడో కంటికి తెలిసేది కాదు (తెలియనిచ్చేవారు కాదు కూడా). దీన్నే మూడో కన్ను అని పిలిచేవారు. ఎవరు ఎన్ని కళ్ళు చేసుకుని చూసినా తప్పు జరిగితే తప్ప, ఎవరికీ భయం లేదు. ఆ తప్పు జరగకుండా చూసేదే ఈనాడు సిస్టం. జరిగిందా ఎవరికో మూడినట్టే…(అదే ఉద్యోగిపై వేటు… ఇది సైలెంట్ గా జరిగిపోయేది.) అలా ఒకరు అవమానకరంగా నిష్క్రమించారని తెలియడానికి రోజులు పట్టేది. టాపిక్ డైవర్ట్ అయినట్టు అనిపిస్తోంది కదా.. అసలు విషయంలోకి వచ్చేస్తున్నాను మళ్ళీ.

బ్లో అవుట్ మంట ఎత్తు ఎలా కొలిచారంటే

బ్లో అవుట్ కొనసాగినన్ని రోజులూ ఏ రోజు ఎంత ఎత్తుకు మంట పెరిగిందో… తరిగిందో కొలిచినట్టు వార్త ఇచ్చేవాడు రామకృష్ణ. అది చూసి ఇతర పత్రికల వాళ్ళు ఎగతాళి చేసేవారు. ఈయన వెళ్లి స్కేల్ పెట్టి కొలుస్తున్నాడు అంటూ వెకిలిగా మాట్లాడేవారు. అసలు ఇంతకీ మంట ఎత్తుపై వచ్చిన వార్తలు నిజమేనా… ఊహించి రాశాడా అని రామకృష్ణను అడిగితే డెస్కుకు కూడా చెప్పేవాడు కాదు. మేము అడగడం చూసినప్పుడు నవీన్ గారు కూడా ముసిముసిగా నవ్వేవారు. ఎందుకంటే అసలు కారణం ఆయనకు తెలుసు కాబట్టి. అదేమిటంటే..

ఒకరోజు బ్లో అవుట్ ప్రాంతంలో రామకృష్ణ తిరుగుతున్నప్పుడు.. దూరంగా ఒక పరికరం పెట్టుకుని ఒక వ్యక్తి కనిపించాడు. అతనికి పాత్రికేయపరమైన ఆసక్తి కలిగి… ఏమి చేస్తున్నారిక్కడ అని ప్రశ్నించాడు. మంట ఎత్తును కొలుస్తుంటాను అని అతను చెప్పడంతో అదెలా అనే సందేహం వచ్చింది. టెలిస్కోప్ లాంటి పరికరంతో అతను భూమి నుంచి బ్లో అవుట్ మంట ఎంత ఎత్తున ఉందీ చెప్పాడు. ఇలా తానూ రోజూ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని రామకృష్ణకు తెలిపాడు. ఆ ఎత్తును తనకు కూడా రోజూ చెప్పాలని కోరడంతో ఆ ఉద్యోగి ఇచ్చేవాడు. అదే ప్రతిరోజూ వార్తగా ఇచ్చేవాడు. ఈనాడులో ప్రచురితమయ్యేది. ఆరోజుల్లో అదొక సంచలనం. డెస్కుకు చెబితే అది బయటకు తెలిస్తే ప్రమాదమని అతను చెప్పలేదని అప్పుడు మాకు తెలిసింది. కానీ ఒక రోజున ఈనాడులో వస్తున్న మంట ఎత్తు వార్తల గురించి ఒక ఉన్నతాధికారి వద్ద ఇతర పత్రిక రిపోర్టర్లు ప్రస్తావించగా, ఆయన అసలు విషయం చెప్పారు. ఈ దెబ్బకి వాళ్లకి దిమ్మతిరిగిపోయింది. ఒక ఎక్స్క్లూజివ్ వార్త వెనుక ఎంత కథ నడుస్తుందో… ఎంత సీక్రెసీ మైంటైన్ చెయ్యాల్సి ఉంటుందో ఈ ఘటనతో తెలిసింది. అప్పుడు అదొక మజా.
ఇక వచ్చే ఎపిసోడ్ లో నేను బ్లో అవుట్ స్థలానికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభవం, రాసిన వార్త గురించి వివరిస్తాను.

ఈనాడు ఇవ్వని మరణాల వార్త … అప్పుడేమైందంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

First Alumni Meet at a Engineering College in Telangana

Kshatriya College of Engineering (KCEA), Nizamabad District (Dr Shankar...

స్వామి పులకరింత భక్తుని కంట…

ఏడుకొండల స్వామి అనుగ్రహ ఫలితం(డాక్టర్ వైజయంతి పురాణపండ)ఏమయ్యోయ్‌! నిన్నే! పిలిస్తే పలకవేం! ఏమయ్యోయ్‌...

Nations have permanent interests not enemies or friends

India should not expect too much from Trump (Dr Pentapati...

ఆశల ప్రయాణం – మోదీ అమెరికా యానం

(వాడవల్లి శ్రీధర్)భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో ఇంతవరకూ 9 సార్లు పర్యటించారు....