అత్త్యుత్తమ మేనేజర్ ఎవరంటే…
ఈనాడు – నేను: 42
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

ఈనాడులో నేను పనిచేసిన ఇరవై రెండు సంవత్సరాలలో ఆరుగురు మేనేజర్లను చాలా దగ్గర నుంచి గమనించాను. మొట్టమొదట కొల్లి వెంగళనీడు గారు. విజయవాడ మేనేజర్. నేను చేరేసమయానికి పూర్తిగా ఓపెన్ మైండ్ తో ఉన్నాను. కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారి స్ఫూర్తితో పాత్రికేయాన్ని ఎంచుకున్న నాకు… ఆయన పని తీరు ఎంతో నచ్చేది. ఆఫీసుకు రావడం. తన పని పూర్తిచేసుకోవడం. ఇంటికి వెళ్లడం. అంతే.. ఆయన పని రాక్షసుడు. పనిలోనే నాకు విశ్రాంతి… పాఠకుడే దైవం అన్న సూక్తిని రామోజీరావు గారి కంటే ముందే పాటించిన మనీషి. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పలేదు. ఆచరించి చూపారు. అలా ఉన్నందువల్ల ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది వేరే విషయం.

నా విషయంలోకి వస్తే. వెంగళనీడు గారి తరవాత జి.వి. రావు గారు. విజయవాడలో ప్రాసెస్ విభాగానికి ఇంచార్జి అయిన రావుగారు రాజమండ్రి యూనిట్ కి తన పని తీరుతో మేనేజర్ అయ్యారు. ఆయన 1997 అంటే కోనసీమ తుపాను అనంతరం, ఈనాడు తుపాను సహాయక నిధులతో తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన సూర్య భవనాలు పూర్తయ్యే వరకూ ఉన్నారు. ఈ క్రతువును అత్యంత శ్రద్ధాశక్తులతో పూర్తి చేశారని చెబుతారు. తరవాత ఆయనను రామోజీ ఫిలిం సిటీకి బదిలీ చేశారు. అక్కడ ఈటీవీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
జి.వి. రావు గారి పనితీరు చాలా గమ్మత్తుగా ఉండేది. ఎవరేం చెప్పినా, మొహంలో ఎటువంటి మార్పు కనిపించేది కాదు. అది మంచి విషయమైనా… చెడ్డ విషయమైనా. ఎడమ పెదిమను పైపంటితో కొరుకుతూ, చెప్పింది వినేవారు. ఇక చెప్పడం చాలు అనుకుంటే, చెబుతున్న వ్యక్తి భుజం మీద చెయ్యి వేసి… సరే చూద్దాం అంటూ ముందుకు వెళ్ళిపోయేవారు. ఈనాడులో కంపోజింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అంతవరకూ మేము వార్తలు రాస్తే, కంప్యూటర్ సెక్షన్లో కంపోజ్ చేసి, బ్రోమైడ్స్ ఇచ్చేవారు. వాటిని మేము చదివి, తప్పులు దిద్దేవాళ్ళం. ఎప్పుడైతే, సబ్ ఎడిటర్లే తమ వార్తలను తాము కంపోజింగ్ చేసుకోవాలని ఆదేశాలు అందాయో జి.వి. రావుగారు ఒక మీటింగ్ పెట్టారు.
“మీకు రాస్తుంటే చేతులు నొప్పి పుట్టవా?” అన్నది ఆయన వేసిన మొదటి ప్రశ్న.
అదేమీ లేదండి. అలవాటే కదా… రాస్తుంటే చాల ఆనందంగా ఉంటుందని ఇంచుమించు అందరూ చెప్పారు.
ఇప్పుడు నేను చేస్తున్న సూచన అమలు చేస్తే, మీరు మరింత వేగంగా వార్తలు రాయచ్చు. చెక్కపెన్నులూ… న్యూస్ ప్రింట్ తో చేసే పుస్తకాల అవసరం ఉండదు. వాటిని కట్టలు కట్టి దాచే అవసరం అంతకంటే ఉండదు… అన్నారు. ఇంకా ఏమన్నారంటే… కంపోజింగ్ నేర్చుకోవడం కూడా చాలా తేలిక. మీరు రోజూ నాలుగున్నరకి వస్తున్నారు కదా… ఒక్క పదిహేను రోజుల పాటు ఒక గంట ముందుగా ఆఫీసుకు వచ్చి సాధన (ప్రాక్టీస్) చేస్తే చాలు… వచ్చేస్తుంది… చాల సింపుల్ .. అని మమ్మల్ని ఆ దిశగా ఆలోచించేలా చేశారు. ఒకరిద్దరు మొండికేశారు కూడా. రాయడంలో ఉన్న మజా కంపోజింగ్ చేయడంలో రాదు. మెదడు అంత చురుగ్గా పనిచేయదు కూడా అన్నారు.
సరే ప్రయత్నించి చూడండి… వస్తే సరే… రానివారిని ఏమి చేయాలో ఆలోచిద్దాం అన్నారు. ఆ స్వరంలో నాకైతే హెచ్చరిక స్వరం వినబడింది.
మా తరం ఎలా ఉండేది అంటే… ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇబ్బందులున్నా సద్దుకుపోవాలి… ఇదీ తత్త్వం. అందువల్లే… ముఖ్యంగా నేను 22 సంవత్సరాల పాటు సబ్ ఎడిటర్ గానే ఉండిపోయాను. నాతో చేరిన వారికి ప్రమోషన్లు వస్తున్నా పెద్దగా బాధ అనిపించేది కాదు. కారణం ఉద్యోగం ఉంది చాలు కుటుంబాన్ని పోషించుకోడానికి అనుకునేవాణ్ని. డెస్క్ ఇంచార్జి, మేనేజర్, చైర్మన్ ఇలా అందరూ కొన్ని తప్పులను మన్నించి వదిలేయడం కూడా నన్ను అలా ట్యూన్ చేసిందేమో ఇప్పటికీ అర్ధం కాదు. ఇలాంటి దశలో ఉన్న నేను కంప్యూటర్ మీద కంపోజింగ్ నేర్చుకోవడానికి సంసిద్ధుడినైపోయాను. తొలిదశలో చాలా ఇబ్బంది అనిపించింది. క్రమేపీ అలవాటైంది.
ఈ సందర్భంలోనే, జి.వి. రావు గారు మరోమాట చెప్పారు. కంప్యూటర్లను గోడ వైపునకు చెక్కలు కొట్టించి… దానిమీద పెట్టిస్తాం. ఒక గుడ్డ కూడా ఇస్తాం. డ్యూటీకి రాగానే, మీ కుర్చీ మీరు తుడుచుకోవచ్చు. కంప్యూటర్ ని శుభ్రం చేసుకుని పని ప్రారంభించవచ్చు అని.
అంటే బాయ్ అవసరం కూడా ఉండదు. మీరు చేసే పని నెట్వర్క్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి, ఎప్పుడైనా అనుమానం వస్తే, చెక్ చేసుకోవచ్చు అని వివరించారు. దీనిని ఎవరు ఎలా తీసుకున్నా నేను మాత్రం సానుకూలంగానే భావించాను. (ఇక్కడ ఒక సంఘటన చెప్పుకోవాలి. ఒకసారి ఒక మేజర్ మిస్టేక్ జరిగింది. అప్పడు వార్తలు కాగితాల మీద రాసేవాళ్ళం. వాటిని కట్టలు కట్టి భద్ర పరిచేవారు. తప్పులు జరిగితే నేరం ఎవరిదో తెలుసుకోవడానికి ఉపయోగపడేది. ఆ మిస్టేక్ జరిగిన రోజున, అది రాసిన వ్యక్తి చూసుకున్నారు. అందరికంటే ముందే ఆఫీస్ కి వచ్చి సంబంధిత వార్త రాసిన కాగితాలను మాయం చేశారు. తరవాత పరిశీలనలో ఈ వార్త తాలూకు కాగితాలు కనిపించలేదు. ఆ రకంగా అతను బయట పడ్డాడు. రుజువు లేదు కాబట్టి చర్య ఏమీ లేకపోయింది. కంప్యూటరైజేషన్ వల్ల ఇలాంటి వాటికి తావు ఉండదు). ఆ సానుకూలతే నాకు శ్రీరామరక్ష అయ్యింది. ఈనాడు తప్ప వేరే ప్రపంచం ఉంటుందని నాకు తెలీదు. అందుకేనేమో దెబ్బలు తింటున్నా కుటుంబం గడిచిపోతోంది కదా అని సరిపెట్టుకున్నాను.
జి.వి. రావు గారి తరవాత ఇమ్మానుయేల్ గారు మేనేజర్ అయ్యారు. ఈయన కూడా విజయవాడ నుంచి వచ్చిన వారే. ప్రకటనల విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఈయనకి జర్నలిజం కంటే… ఆంగ్ల సాహిత్యం మీద ఆసక్తి. ఎప్పుడు ఎవరు కలిసినా లేదా మీటింగులోనైనా అంతకు ముందు రోజు తాను చూసిన ఇంగ్లీష్ సినిమా గురించి చర్చించేవారు. ఆయన గురించి నాకు తెలిసినది ఇంతే.
ఇమ్మానుయేల్ గారి తరవాత రమేష్ బాబు గారు మేనేజర్ అయ్యారు. ఆయన కూడా ప్రకటనల విభాగానికి చెందిన వారే. ఈయన ఉన్నప్పుడే… ఈనాడులో జనరల్ డెస్కులు కేంద్రీకృతమయ్యాయి. అంటే, జిల్లాల్లో ఉన్న జనరల్ డెస్కులను హైద్రాబాదుకు బదిలీ చేసారు. ఉత్తరాంధ్ర, సెంట్రల్, రాయలసీమ రీజినల్ డెస్కులుగా విభజించారు. ఆ సమయంలో నన్ను జనరల్ డెస్కుకు మార్చారు. ఈ కారణంగా నా ఉద్యోగ ప్రస్థానం హైదరాబాద్ కు మారింది. ఇక్కడ మేనేజర్ స్థానాన్ని కో ఆర్డినేటర్స్ ఆక్రమించారు. శ్రీనివాస్, పద్మాకర్ ఈ ఇద్దరూ అప్పట్లో కో ఆర్డినేటర్స్. ఇక్కడి ప్రస్థానం గురించి ఆ సందర్భంలో చెబుతాను.
నన్ను మూసాపేటకు బదిలీ చేసాక అక్కడ ఎదురైన మేనేజర్ రమేష్ గారు. నేను చేరిన నెలరోజులకు, ఆయనను బదిలీ చేశారు. తరవాత వచ్చింది దుర్గాప్రసాద్. తొలిరోజుల్లో హైదరాబాద్ లో ఈయన టైమ్ ఆఫీస్ లో పనిచేసేవారు. మేనేజర్ పాత్ర పోషించడానికి ఆయన పూర్తిగా డెస్క్ ఇంచార్జిల పై ఆధారపడేవారు. అప్పటివరకూ నేను చూసిన మేనేజర్లకు కొద్దో గొప్పో న్యూస్ సెన్స్ ఉంది. ఈయనకు తక్కువ. రోజువారీ వ్యవహారాలతో పాటు డెస్కుల పర్యవేక్షణ కష్టమనుకున్నారో ఏమో… డెస్కు ఇంచార్జిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వారెంత చెబితే ఈయనకు అంత…

వీరు కాకుండా నేనొక అద్భుతమైన వ్యక్తిని మేనేజరుగా చూశాను. ఆయన కింద పని చేసే అదృష్టం నాకు కలగలేదు. విశాఖపట్నం యూనిట్లో తొలి మేనేజర్ డాల్ఫిన్ అప్పారావు గారి సోదరుడు రాంబాబు గారు. ఆ తర్వాత వజీర్. అనంతరం భావరాజు కామేశ్వరరావు గారు. అక్కడ అధికారిక బదిలీల భాగంగా ఆయనకు అవకాశం వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఎంత సమర్ధంగా పనిచేయాలో… తలచుకుంటేనే భయం వేస్తుంది. కానీ ఆయన తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు. ఎవరి పొట్టా కొట్టలేదు. ఆయన మిగిలిన వారిలా ఆలోచించి ఉంటే ఆ యూనిట్లో కొందరి ఆటలు సాగేవి కావు. ఒకసారి ఆయన రాజమండ్రి యూనిట్ కి వచ్చారు. మేనేజర్ రూంకి పిలిస్తే వెళ్ళాను. అప్పటి మేనేజర్ గారు కామేశ్వరరావు గార్ని పరిచయం చేశారు. మీ గురించి తెలిసి మిమ్మల్ని చూడాలంటే పిలిపించానని చెప్పారు. అనంతరం ఆయనను నేను హైద్రాబాదులో కలిశాను. చీమకు కూడా ఎప్పుడూ అపకారం చేయలేదు ఆయన. ఈయనే నా ఫేవరెట్ ఎంప్లాయ్ ఇన్ ఈనాడు.
మేనేజర్లందరూ సమర్దులే… కానీ ఎవరికీ వారికి సొంత అజెండాలు ఉండేవి. సొంత నమ్మకస్తులు ఉండేవారు. వారేమి చెబితే అదే వారికి వేదం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో సూక్తిని పాటిస్తే చాలదు… రాజు సేవలో కూడా తరించాలి కదా… ఈ ప్రయత్నంలోనే నాలాంటి వాళ్ళు బలయ్యే వారు.
ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్ లో…
“సరే ప్రయత్నించి చూడండి… వస్తే సరే… రానివారిని ఏమి చేయాలో ఆలోచిద్దాం”
Very good management trait.