ఆ నాట‌కం చెరిపేసే దాకా నిద్ర ప‌ట్ట‌లేదు

Date:

రేడియో వాగ్దేవి శారద శ్రీ‌నివాస‌న్‌
లాడ్లీ మీడియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక‌
వ్య్యూస్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ
(డా.వైజయంతి పురాణపండ, 8008551232)
నాటకం ఆవిడ ప్రాణం. సంగీత సాహిత్యాలు ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. ఒకసారి గొంతెత్తి రవీంద్రుని గీతాలు ఆలపిస్తే మరొకసారి దేవులపల్లి వారి కావ్యకన్యక అవుతారు. చలం, గోపీచంద్, బుచ్చిబాబు, తిలక్‌, పానుగంటి… రచయిత ఎవరయితేనే వారి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. పాత్ర చిన్నదా, పెద్దదా, పేరొస్తుందా, రాదా… ఈ తర్జనభర్జనలేవీ లేకుండా, నటిగా తన కర్తవ్యాన్ని సమర్థంగా పోషించి, పాత్రలో మమైకమైపోయి… పాత్రలకు శాశ్వత కీర్తి తెచ్చారు, తను తెచ్చుకున్నారు. తన విలక్షణ స్వరంతో రేడియో నాటక చరిత్రను మార్చేసిన వాగ్దేవి. ఆమె గొంతు విప్పితే కళ్లముందు పాత్ర ప్రత్యక్షమవుతుందే కాని రూపం గుర్తుకురాదు. తాము సృష్టించిన పాత్రలను ఆమె పోషిస్తేనే శాశ్వతంగా ఆ పాత్ర నిలబడిపోతుంది అనుకునేవారు రచయితలు. ఇడిపస్‌లో పాత్ర చేసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. పురూరవలో ఊర్వశిగా వేసి చలం మెప్పు పొందారు. బిర్లా ప్లానెటోరియంలో ఖగోళశాస్త్రాన్ని తన గళంతోనే వినిపించి అందరికీ విశ్వవీక్షణ భాగ్యం కలిపిస్తున్నారు. లాడ్లీ మీడియా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకుంటున్న సందర్భంగా శ్రీమతి శారదాశ్రీనివాసన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ…
వివిధ అంశాల‌పై ఆమె చెప్పిన అంశాలు ఆమె మాట‌ల్లోనే…

నాటకరంగ ప్రవేశం…
ఆడపిల్లలకు చదువు ఎందుకు అనుకునే కుటుంబం మాది. అతి కష్టం మీద మా ఇంటి దగ్గరున్న హిందీ విద్యాలయానికి పంపారు. అందులో చిర్రావూరి సుబ్రహ్మణ్యం (దక్షిణ భారత హిందీ ప్రచారసభ సంచాలకులు, ప్రస్తుతం కీ.శే.) గారు పనిచేసేవారు. ఆయన హిందీ, సంస్కృత భాషల్లో ఉద్దండులు. పిల్లలకు చదువు అవసరం అనే అంశం మీద ఆయన రచించిన ‘అమ్మ’ నాటకంలో నన్ను వేషం వెయ్యమన్నారు. నాటకం వేయడం అంటే ఏమిటో తెలియని నాచేత ఆయన బలవంతంగా వేయించారు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. ఆ నాటకం సక్సెస్‌ అయింది. అది పూర్తయిన తరవాత సి.హెచ్‌. నరసింహారావుపంతులుగారు (రేడియో ఆర్టిస్ట్‌) నన్ను చూసి ‘ఈ అమ్మాయి ఎవరో గాని బాగా వేసింది, మంచి భవిష్యత్తు ఉంది’ అన్నారు. నేనసలు నాటకాలే వేయను కదా! మంచిభవిష్యత్తు ఉందని ఎలా అన్నారు? అసలు ఇదెలా సాధ్యం అవుతుంది? అని మనసులో అనుకున్నాను. ఆయన వాక్కు నిజం అవుతుందని ఆ రోజు అనుకోలేదు.
రేడియోలో మొట్టమొదట ఎలా ప్రవేశించారు?
నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో, మా స్కూలు పిల్లలందరినీ రేడియోలో ఆడిషన్‌ టెస్ట్‌కి పిలిచారు. కొందరిని ఎంపికచేసి పంపారు. అక్కడికి వెళ్లాక ఎలా మాట్లాడాలో అర్థం కాక భయపడ్డాను. అయితే చదవడానికి రూమ్‌లోకి వెళ్లాక ఇంక భయం వెయ్యలేదు. ఎందుకంటే లోపల నన్ను ఎవ్వరూ చూడరు. నా ఇష్టం వచ్చినట్టు చదువుకోవచ్చు. ఆ ధైర్యంతోనే చక్కగా చదివేశాను. అలా 1956 జనవరి 5న మొట్టమొదటగా ఒక హిందీ నాటకం వేసే అవకాశం వచ్చింది.


వేమూరి స‌ల‌హాతోనే….
వేమూరి రాధాకృష్ణగారు (ప్రఖ్యాత రంగస్థల నటులు) నాలో ఉన్న ప్రతిభతను గుర్తించి, రేడియోకి ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ‘రేడియోలో నేను దేనికి పనికి వస్తాను. రేడియో అంటే మ్యూజిక్‌ మాత్రమే కదా!’ అన్నాను నవ్వుతూ. ఆయన నా మాటలను పక్కనపెట్టి, పట్టుబట్టి రేడియోకి పంపారు. రేడియోలో పనిచేస్తున్న జనమంచి రామకృష్ణగారు నాలో ఉన్న కళను గుర్తించి చాలా అవకాశాలు ఇచ్చారు. అన్నిటినీ సద్వినియోగం చేసుకున్నాను. ఆల్‌రౌండ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాను.
రంగ‌స్థ‌లంపై ఏ ఏ పాత్ర‌లు పోషించే వారు?
రజనీ గారు రచించిన ‘శతపత్రసుందరి’ సంగీత రూపకంలో వసంతుడిగా, ద్విజేంద్రలాల్‌ రాసిన ‘చంద్రగుప్త’ లో చంద్రగుప్తుడుగా వేశాను. వయసులో చిన్నదానినయినా పొడుగ్గా ఉండటం వల్ల అబ్బాయి పాత్రలు ఎక్కువగా వచ్చేవి. రజనీ గారు రచించిన ‘క్షీరసారగమథనం’ చేశాను. అయితే ఏ నాటకంలోనైనా సరే డైలాగులు బట్టీ పట్టలేనని ఎంతచెప్పినా, పట్టుబట్టి నేర్పించి మరీ నాతో వేయించేవారు. ఒక్కసారి వెనక్కిచూసుకుంటే ‘అన్ని వేషాలు ఎలా వేశానో!’ నాకే తెలియకుండా జరిగిపోయింది.


ఇన్ని నాటకాలలో అవకాశాలు వచ్చినందుకు మీకు ఎలా అనిపించింది…
నేను బడికి వెళ్లనందుకు బాధపడిన మాట వాస్తవం. అయితేనేం, అనుకోకుండా వచ్చిన అవకాశంతో నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్నాను. బహుశ ఇన్ని నాటకాలు చే యడానికి అదే కారణం అయి ఉంటుంది. రజనీ రచించిన గోదావరి రూపకంలో వేసిన గోదావరి పాత్రకు బహుమతి వచ్చింది. ఆ తరవాత పింగళి లక్ష్మీకాంతంగారి దగ్గరకు తీసుకెళ్లి, ‘ఈవిడ భాష బావుంది, సంస్కృత నాటకంలో వేయించవచ్చు’ అన్నారు. ‘నాకు సంస్కృతం రాదు, వేయను’ అని చెప్పినా కూడా నా మాట వినలేదు. నెలరోజుల పాటు రిహార్సల్స్‌ చేయించి నేర్పించారు. అప్పుడు వేసినదే ‘వత్సరాజు’ నాటకం. నా పద్ధతి చూసి పింగళివారు, నా వివరాలు అడిగారు. నేను చెప్పేసరికి, ‘‘నువ్వు మా గురువుగారి అమ్మాయివా,’’ అని ఆశ్చర్యపోయారు. (కాజ శివరామకృష్ణగారు మా పెదనాన్న. పింగళివారికి మా పెదనాన్న గురువుగారు).
మీరు నటించిన మొట్టమొదటి తెలుగు నాటకం ఏది?
రజనీగారు కర్ణుడికి సంబంధించిన కథ నాటకంగా చేయించారు. నాది కర్ణుడి భార్య పాత్ర. కుంతిగా నాగరత్నమ్మగారు (రేడియో నటి) వేశారు. అందులో నటిస్తున్నవారందరికీ అప్పటికే రంగస్థల అనుభవం ఉంది. నాకు మాత్రం మొదటి నాటకం. అయినా బెరుకు లేకుండా చేసి, అందరినీ మెప్పించాను. స్థానం నరసింహారావుగారి నాటకాలంటే ఎంతదూరమైనా వెళ్లి చూసే మా నాన్నగారు, నా నాటకాలు మాత్రం ఎప్పుడూ చూడలేదు.


లలిత సంగీతం గురించిన వివరాలు…
లలిత సంగీతం ముసునూరి వెంకటరమణమూర్తి గారి దగ్గర నేర్చుకుని, భక్తిరంజనిలో పాడాను. అలాగే మంగళంపల్లి బాలమురళిగారి ఇంటికి కూడా వెళ్లి కొన్నాళ్లు నేర్చుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్‌ ఆకాశవాణిలో డ్రామా ఆర్టిస్ట్‌ పోస్ట్‌ ఉందని చిత్తరంజన్‌గారు చెప్పారు. విజయవాడలో అప్పటికే నాగరత్నమ్మ, నండూరిసుబ్బారావు, రామమోహన్‌రావుగారు వంటి ఉద్దండులు ఉన్నారు. నాకు అక్కడ అవకాశం లేదు. అందుకే భాగ్యనగరానికి వెళ్లడానికి అంగీకరించి, 1959లో అక్కడ చేరాను.
సాంఘిక నాటకాలేనా… ఇతర నాటకాలలో కూడా వేశారా?
సంగీత నాటకాలలో కూడా చేశాను. గోపీచంద్‌ ‘మేఘసందేశం, మగువ మాంచాల’ లో వేశాను. ఆ తరవాత 1961లో కృష్ణశాస్త్రిగారి ‘శర్మిష్ఠ’ నాటకంలో దేవయానిగా నటించాను. ఆ పాత్ర చాలా చిన్నది. ఈ నాటకం విని పాకాల రాజమన్నార్‌ ‘నాటకం చాలా బాగా వచ్చింది, ముఖ్యంగా మొదటి మూడు పేజీలు’ అని ఒక ఉత్తరం కృష్ణశాస్త్రిగారికి రాశారు. ఆయన నాకు చూపించారు. బుచ్చిబాబుగారి ‘ఉత్తమ ఇల్లాలు’ అనే నాటకం ‘ఎంకి’ని దృష్టిలో ఉంచుకుని ఒక ఊహాగానం చేశారు. అందులో ఎంకి పాటలు నిరంతరం హమ్‌ చేస్తూండాలి. పాట కేవలం ఒక్క లైన్‌ మాత్రమే. అందులో ఎంకిగా వేశాను. ఆయన రాసిన సోక్రటీస్‌లో భార్య పాత్ర పోషించాను. కృష్ణశాస్త్రిగారు ‘బావొస్తే!’ అని 1960 లో సంక్రాంతి పండగకు రాశారు. బావగా గొల్లపూడి మారుతీరావు, కొత్త మరదలుగా నేను నటించాం. ఇవేకాక చైనాకు వ్యతిరేకంగా రాసిన పాటలు పాడేటప్పుడు చైనాను తరుముతున్నట్టుగా ఇమోషనల్‌గా పాడేవాళ్లం. అలాగే 1977లో ఉప్పెన సమయంలో ‘కన్నీటి కెరటాలు’ అనే శీర్షికన ‘జలప్రళయం’ పేరుతో సంగీత కార్యక్రమం చేశాం.


ఠాగూర్‌ రచనలకు…
1960 లో టాగూర్‌ సెంటినరీ సెలబ్రేషన్స్‌… దేశంలోని అన్ని వైపుల నుంచి అన్ని భాష‌ల‌ ఆర్టిస్టులు, కవులు, పండితులు అందరూ రేడియోకి వచ్చారు. ఇంతమంది జనంతో పాడటమన్నది నా అదృష్టం.
నవలలకు రేడియో అనుసరణ, సంగీతం…
రంగనాయకమ్మ ‘బలిపీఠం’ లో అరుణ, ద్వివేదుల విశాలాక్షి ‘మారిన విలువలు’, (సొంత ప్రొడక్షన్‌). ‘పురానా ఖిల్లా’ అని కలవటపు రామగోపాలరావు రాసినది, మొట్టమొదట స్వయంగా చేశాను. అందులో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కోసం నా దగ్గరున్న అన్ని రకాల టేపులను కలిపి గందరగోళం ఎఫెక్ట్‌ వచ్చేలా చేశాను. అది బ్రాడ్‌కాస్ట్‌ అయిపోయింది. నాటకం విన్న అయ్యగారి వీరభద్రరావు (అప్పటి స్టేషన్‌ డైరెక్టరు) గారు, ‘‘చాలా బావుంది, ఈ ఎఫెక్ట్‌ ఎలా వచ్చింది’’ అని అడిగారు. ఆ క్రెడిట్‌ చాలు నాకు. నేను నాటకాలు ప్రొడ్యూస్‌ చేసేటప్పుడు అవసరమైనచోట మాత్రమే మ్యూజిక్‌ ఇచ్చేదాన్ని. ఎక్కడ ఎలివేట్‌ చెయ్యాలో అక్కడ సంగీతాన్ని ఇచ్చేదాన్ని. సంగీతం లేకుండా డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా ఉండాలనేది నా అభిప్రాయం. రేడియోలో నేనే మొట్టమొదటి లేడీ ప్రొడ్యూసర్‌ని. రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి నన్ను బాగా ప్రోత్సహించారు.


కృష్ణశాస్త్రిగారి గురించి…
కృష్ణశాస్త్రిగారు తన స్క్రిప్ట్స్‌ అన్నీ నా చేతే చెప్పించారు.
‘సుబ్బమ్మవ్వ’ అని ఓ క్యారెక్టర్‌ని సృష్టించి, మోనో యాక్షన్‌ నా చేత చేయించారు. నేను చదివిన విధానం చూసిన ఆయన చాలా సంతోషపడ్డారు.
రికార్డింగులంటే …
అందరూ ఆకాశవాణి స్టూడియోలో ఎర్ర లైట్‌ చూస్తే భయపడతారు. కాని నాకు మాత్రం అది చూడగానే ఉత్సాహం వచ్చేది. అది నాకొక ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చేది. అది చూడగానే గంభీరంగా మారిపోయి పాత్రలోకి ప్రవేశించేసేదాన్ని.
రేడియోలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు?
ఫ్యామిలీ ప్లానింగ్‌ నాటకాలు ప్రొడ్యూస్‌ చేశాను. రేడియో ఉత్తరాలు చదివాను. వేలకొద్దీ నాటకాలు వేశాను. గ్రామీణ, స్త్రీల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ కార్యక్రమం అన్నీ నిర్వహించాను. పసలేని నాటకాలను సైతం పండించాను.
ఇతర నాటకాలు…
‘అమ్మకి ఆదివారం లేదా’ అనే రంగనాయకమ్మగారి నాటకం వేశాను.
రాంభొట్ల కృష్ణమూర్తిగారు రచించిన ‘మధురవాణి’ అనే మోనోలాగ్‌ చదివాను.
నార్ల చిరంజీవిగారు రాసిన ‘మహానిష్క్రమణం’ చేశాను.
నాటకాల నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా…?
నాటకాలలో కొన్ని జ్ఞానాన్ని ఇచ్చాయి. కొన్ని మనసుకు నచ్చాయి.
బంగ్లాదేశ్‌ విభజన సమయంలో… కందుకూరి చిరంజీవి ‘సోనార్‌ బంగ్లా’ అని నాటకం రాశారు. అది చాలా బాగా వచ్చింది. కాని ప్రసారం కాలేదు. అది నాకు జ్ఞానాన్ని ఇచ్చింది. నార్ల చిరంజీవిగారు ‘భాగ్యనగరం’ అని రాశారు. దాన్ని కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశాం. ఈయన రాసిందే ఒక టీన్‌ ఏజ్‌ అమ్మాయికి సంబంధించిన నాటకం వేశాం. ఇది రికార్డింగ్‌ కాకుండా ప్రత్యక్షంగా చేశాం. పేరు కూడా జ్ఞాపకం లేదు. అది నాకు నచ్చిన నాటకం. ఇందులో కుటుంబ బంధాలు అంతర్లీనంగా ఉండేలా చక్కగా రాశారు. దాని పేరు మర్చిపోయినా కూడా దానిమీదొక ప్రేమ. ఇంకా… పొగమేడలు (ఇంగ్లీషు లవ్‌ స్టోరీ, బ్లడ్‌ క్యాన్సర్‌కి సంబంధించినది), నేరము – శిక్ష (క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌), యద్దనపూడి సులోచనారాణి సెక్రటరీ, విజేత, వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనుషులు’ (సొంత ప్రొడక్షన్‌), మునిమాణిక్యం ‘కాంతం కథలు’…


ఎక్కువ నటించింది ఎవరితో…
ఖైదీ నాటకంలో నండూరి విఠల్, నేను చేశాం. మా కాంబినేషన్‌కి మంచి పేరు. ఆయనతోనే
‘కాలకన్య’ సీరియల్‌ చేశాను. ఆయన రాసిన ‘సీతాపతి’ నాటకంలో యంగ్‌ కపుల్‌గా వేశాం. బెజవాడ గోపాలరెడ్డిగారు ఈ నాటకాన్ని మళ్లీ వెయ్యమన్నారు. ఇదేకాక ‘అశ్వఘోషుడు’ వేశాం. ఆ తరవాత ఒక ఎక్స్‌పెరిమెంటల్‌ నాటకం వేశాం. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారిద్దరూ ఒకరితో ఒకరు చెప్పలేనంత ప్రేమను కనపరుచుకుంటారు. కాని మనసులో మాత్రం ‘వీడు ఎప్పుడు పోతాడా అని ఆవిడ, ఇది ఎప్పుడు పోతుందా’ అని అతను అనుకుంటారు మనసులో.
మీకు పూర్తి సంతృప్తినిచ్చిన నాటకం…
తిలక్‌ రచించిన ‘సుప్తశిల’ నాకు పూర్తి సంతృప్తినిచ్చిన నాటకం. ఆయనదే ‘నల్లజర్ల రోడ్డు’ వేశాం. అయితే ఏ పాత్ర చేసినా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించేది. కాని ఈ నాటకంలో పాత్ర మాత్రం నాకు పూర్తి స్థాయి ఆనందాన్నిచ్చింది.
మీరు చేసిన పి.వి.నరసింహారావుగారి రచన గురించిన విశేషాలు…
పి.వి.నరసింహారావు రచించిన ‘ఎవరు లక్ష్యపెడతారు’ (మరాఠీ మూలం) నాటకం చేశాం. అది నేను, విఠల్‌గారు రేడియోకి నాటకీకరణ చేసి, స్త్రీల కార్యక్రమంలో సీరియల్‌గా చేశాం. అందులో నేను బాల వితంతువుగా (మెయిన్‌ రోల్‌) చేశాను. నన్ను పి.వి. మెచ్చుకుంటూ నా గురించి మీటింగులో మాట్లాడారు. నాకు ఇంతకు మించిన అవార్డులు, రివార్డులు ఎందుకు? 1959లో గోరాశాస్త్రి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నాటకాన్ని సీరియల్‌గా వేశాం. ఇందులో నేను ఇందిర వేషం వేశాను. కొంతకాలం తరవాత దీనిని నవలా పఠనం చేశాను. అనుకోకుండా దీన్ని మూడుసార్లు చేశాను.
మీరు మరచిపోలేని సంఘటన…
గ్రీకు నాటకం ‘ఇడిపస్‌’ని లక్కాకుల సుబ్బారావు ‘రాజా ఇడిపస్‌’ అని తెలుగులో రాశారు. ఆ నాటకం వేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్‌ అయ్యాను. అందులో నేను రాణి పాత్ర వేశాను. రాణి కుమారుణ్ని చంపేయమని రాజు ఆజ్ఞాపిస్తాడు. పిల్లవాణ్ని అడవిలో వదిలేస్తే ఎలాగూ జంతువులు ఆ పిల్లవాణ్ని తినేస్తాయి కదా అనుకుంటారు సైనికులు. దైవవశాత్తూ ఆ పిల్లవాడు అక్కడి అడవి మనుషులకు దొరుకుతాడు. వారు అతడిని పెంచి పెద్ద చేస్తారు. ఆ బాలుడు పెద్దవాడయ్యి అన్ని రాజ్యాలను జయిస్తూ, తల్లి ఉన్న రాజ్యం మీద దండెత్తి దానిని కూడ జయిస్తాడు. జయించిన రాజ్యంలోని రాణివాసం కూడా వారి అధీనం లోకి వస్తుంది. వెంటనే రాణిని కూడ తన రాణివాసంలోకి తీసుకుంటాడు. ఇద్దరికీ తల్లీ కొడుకులని తెలీదు. అటువంటి సమయంలో కొడుకు తల్లి దగ్గర తప్పుడుగా ప్రవర్తిస్తాడు. అంతా జరిగిపోయాక తల్లికి అతడు తన కొడుకు అని తెలిసి వేదన భరించలేక చచ్చిపోతుంది.
ఆ నాటకం వేసిన రోజు అర్ధరాత్రి మెలకువ వస్తే ఒళ్లు జలదరించింది. మానసికంగా చాలా బాధపడ్డాను. ఇది నాటకం కదా ఎందుకు ఆ ఇన్సిడెంట్‌ మర్చిపోను అనుకున్నాను. ఆ నాటకం వేశాక ఎందుకో నాకు దుఃఖం ఆగలేదు. నాటకం టేపులు చెరిపేయాలనుకున్నాను. కొన్ని రోజుల పాటు నేను నిద్రపోలేకపోయాను. చిరంజీవి గారి వెంట పడి దానిని చెరిపేయమని సాధించేశాను. నా పోరు పడలేక దానిని ఒక సంవత్సరం తరవాత తీసేశారు. అప్పటికి నా మనసు శాంతించింది. నిజానికి అందులో చాలా బాగా నటించానని అందరూ నన్ను మెచ్చుకున్నారు. అది చెరిపిన తరవాత ఎంత తప్పు చేశాను, ఇది నాటకమే కదా, ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను అనుకున్నాను. నాటకం వేస్తే నేను ఆ పాత్రలోకి ప్రవేశించేస్తాను. మా ఆర్టిస్ట్‌ల మనసులు ఎవరూ అర్థం చేసుకోలేరు. మేం సైకలాజికల్‌గా ఎన్ని బాధలు పడతామో అర్థం కాదు. పాత్రలకి ప్రాణం పోయాలని, మూర్తీభవింపచేయాలని అనుకున్నాను.
చలం గారి రచనల గురించి…
చలం గారి ‘పురూరవ’ చేశాం. జనమంచి రామకృష్ణగారు ఎడిట్‌ చేశారు. ఊర్వశి, పురూరవుడు రెండే పాత్రలు. సంగీతం మొత్తం చిత్తరంజన్‌ చేశారు. ఇది 1977లో చేశాం. నేను చాలా బాగా చేశానని చలం అభినందించారు. ఆ నాటకం విని ఆర్మీ మేజర్‌ జనరల్‌ పి.వెంకట్రామయ్యగారు మెచ్చుకున్నారు. ఒకసారి చలంగారి అమ్మాయి సౌరిస్‌ గారి దగ్గరకు వెళ్లినప్పుడు ఆవిడ ‘పురూరవ శారదేనా?’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నటనతో ఆయనను మెప్పించాను. నాకు ఇదే పెద్ద అవార్డు.
ఇంకా మీరు చేసిన నాటకాలు గురించి…
ఆర్‌.వి.చలం ‘విరజాజి’, నార్లచిరంజీవిగారి ‘మహానిష్క్రమణం’ చేశాను.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన ‘శిలామురళి’ కోసం నన్ను విజయవాడ పిలిపించి చేయించారు. అది నేను వీరభద్రరావు (సుత్తి వీరభద్రరావు రేడియో నాటకాలలో హీరో పాత్రలు వేసేవారు) కలిసి చేశాం. ఈయన రాసినదే ‘తలుపు’ అని నేను రామం (ఎస్‌.బి.శ్రీరామ్మూర్తి) కలిసి చదివాం. దీన్ని నిర్వ‌హించింది క‌ల‌గ కృష్ణ‌మోహ‌న్‌. ఇదొక వేదాంతం వేదాంత ధోర‌ణిలో సాగుతుంది. అది వింటే ఆత్మశాంతిలాంటిది కలుగుతుంది.
ఇప్పుడున్న ఇతర వ్యాపకాలు…
బిర్లా ప్లానెటోరియంలో ఇప్పటికీ నా కామెంటరీనే వేస్తున్నారు. ఇవి కాక ఎస్‌.ఐ.ఇ.టి. వాళ్ల పాఠాలకు నా గొంతు ఇస్తున్నాను. నా గొంతులో శక్తి ఉన్నంత వరకు నేను నాటకాలలో నటిస్తూనే ఉంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...