ఉషశ్రీరామనవమి

Date:

(డా. పురాణపండ వైజయంతి)

శ్రీరామనవమి అంటే…
అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.
కాని మాకు మాత్రం సీతాకల్యాణం అనగానే శ్రీరామనవమి బదులుగా ఉషశ్రీరామనవమి అనే మనసులో స్ఫురిస్తుంది. రాముడి కంటె ముందుగా నాన్న మా మనసుల్లో మెదులుతారు. ఆ రోజున నాన్నతో మాట్లాడుకోవటం మాకు తెలియకుండానే జరిగిపోతుంది. ఈసారి నాన్నతో మాట్లాడుకున్న మాటలను అక్షరాకృతిలో ఉంచుతున్నాను.
–––––––––––
నాన్నా!
భద్రాచలంలో సీతాకల్యాణం జరుగుతున్నంతసేపు మాకు నువ్వే గుర్తుకు వచ్చావు. మాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి, అంటే సుమారు 1975 నుంచి నువ్వు రాములవారి కల్యాణాన్ని నీ గళంతో యావత్‌ తెలుగు ప్రపంచానికి కళ్ల ముందుకు తీసుకువచ్చావు. ఆకాశవాణిలో నువ్వు చేసిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకున్నావు. ఇంటింటా సీతారాములను సాక్షాత్కరింప చేశావు.
ఈ కల్యాణం నీ చేతుల మీదుగా జరగడానికి ముందు…
నువ్వు రెండు మూడు సంవత్సరాలు జమ్మలమడక మాధవరామశర్మగారితో కలిసి ఆయన రాములవారి కల్యాణం ఎలా చేయిస్తున్నారో చూసి వచ్చానని స్వయంగా చెప్పావు. ఆయన దగ్గర నేర్చుకున్నదానికి నీ మార్గంలో నువ్వు ఆ తంతు నడిపిస్తూ, శ్రోతలంతా ఆ రాముడిని నీ రాముడిగా భావించేలా ప్రజల మనస్సుల్లో శాశ్వత ముద్ర వేశావు.
ఇక మన ఇంటి విషయానికి వస్తే…
ఒక నాన్నగా నిన్ను గుర్తు చేసుకుంటే…
నువ్వు ఆ తొమ్మిది రోజులూ ఊపిరి సలపనంత హడావుడిగా ఉండేవాడివి. అన్ని పందిళ్లలోనూ నీ గొంతు వినిపించేది. కాని ఇంట్లో మాత్రం మాకు వినిపించేది కాదు. మాకు సీతాకల్యాణం నీతో కూర్చుని చేసుకోవాలనిపించేది. కాని ఆ రోజున భద్రాచలంలో నువ్వే పౌరోహిత్యం వహించి రాములవారి కల్యాణం జరిపించాలని రాముడు ఆదేశించి ఉంటాడు. దానికి తోడు ఉద్యోగబాధ్యత కూడా.
నిజంగానే నువ్వు నీ గొంతుతో కల్యాణం చేయిస్తుంటే రాముడు ఎంత మురిసిపోయి ఉంటాడో నాన్నా. వారి చేష్టలను నీకు కావలసినట్లుగా నువ్వు భావన చేస్తూ, వ్యాఖ్యానం చెప్పావు. నువ్వు 1986లో భద్రాచలంలో ఇచ్చిన ప్రత్యక్ష వ్యాఖ్యానం అప్పట్లో ఎందుకో రికార్డు చేశాం. ఆ గళాన్ని ఇప్పుడు 40 సంవత్సరాల తరవాత వింటుంటే, ఎంతో నూతనంగా అనిపించింది. ఆ రాముడు మురిసిపోవడం, జానకమ్మ సంబరపడటం… అన్నీ నీ ఊహలే. ఎంత అందంగా ఊహ చేశావో నాన్నా…
ఇప్పుడు ఆనాటి నీ వ్యాఖ్యానాన్ని సోషల్‌ మీడియాలో పెట్టగానే, అందరూ నిన్ను గుర్తు చేసుకుంటూ, ఎంత మంచి మంచి స్పందనలు తెలియచేస్తున్నారో తెలుసా..
నీతో మాట్లాడుతుంటే, నన్ను నేను మరచిపోతున్నాను నాన్నా. ఆ వ్యాఖ్యానం వింటూ నేను నీతో మాట్లాడుకుంటున్నట్లుగా,
నా ఊహలు కొనసాగుతున్నాయి.
అంతలోనే మరో ఊహ…
పక్కనే ఏదో అలికిడి వినిపించింది.
ఆ అలికిడి ఏమిటో ఇంకా తెలియట్లేదు.
కాని నిశ్శబ్దంగా అంతా గమనించడం మొదలుపెట్టాను.
అంతలోనే ఆ సీతాపతి నెమ్మదిగా మందహాసం చేస్తూ వస్తూ నాన్న దగ్గరగా రావటం కనిపించింది.
––––––––––––
ఏమోయ్‌ దీక్షితులూ…
ఎవరూ నన్ను దీక్షితులు అని పిలుస్తున్నారు.
ఇంకెవరు నేనేనోయ్‌.
నా ప్రాణ స్నేహితులు మాత్రమే నన్ను దీక్షితులూ అని పిలుస్తారు.
నేను కూడా నీ ప్రాణస్నేహితుడినే. ఆ పిలుపు పిలిచేది నేనే!!!
రామా! నువ్వా!!
అవును, నేనేనోయ్‌!!
నా మీద ఇంత అనుగ్రహం కలిగిందేమిటి స్వామీ!!!
నీ మీద నాకు అనుగ్రహం కలగడమేమిటి. ఏటా నువ్వే నీ పలుకులతో నా ప్రజలకు నన్ను చూపిస్తూ అనుగ్రహిస్తున్నావు.
అంత పెద్ద మాటలు వద్దు రామా!
పెద్ద మాటలేమిటోయ్‌. ఉన్న మాటలే..
ఉన్నమాటలా?
అవును. ఉన్నమాటలే.. ఏటా నా కల్యాణాన్ని నువ్వే దగ్గరుండి జరిపిస్తున్నావు కదా.
నేను జరిపిస్తున్నానా?
అవును, నువ్వే..
పురోహితులు కదా జరిపిస్తున్నది.
వారు మంత్రాలు చదువుతారయ్యా. నువ్వు మంత్రముగ్ధుల్ని చేస్తావు, నీ మాటలతో!!!
ధన్యుడను రామా!!
మాంగల్య తంతు ఎంత పవిత్రంగా జరిపించావో కదా.. ముడి వెయ్యి ముడి మీద ముడి వెయ్యి, మూడు ముళ్లు వెయ్యి… అంటూ నా కల్యాణం నీ వాక్కుతో ఎంత వైభవంగా జరిగిందో కదా. నిజంగానే మా కల్యాణం జరిగినప్పుడు, మా శిరస్సుల మీద నుంచి జాలువారుతున్న ఆ ముత్యాల సందుల్లోంచి జానకి నన్ను చూసిందో లేదో నాకు తెలీదు. కాని నువ్వు మా కల్యాణాన్ని నీ మనోనేత్రంతో ఊహించేశావు. మా ఇద్దరి చేత తలంబ్రాల తంతు ఎంత సంబరంగా చేయించావు. నా జానకి కూడా నీ మాటలు విన్నప్పుడల్లా మురిసిపోతూంటుంది. మా వివాహానికి వచ్చిన వారి శిరస్సుల రంగులను ఎంత అందంగా వర్ణించావు. తెలుపు రంగుల కేశాలు, నలుపు రంగుల కేశాలతో పాటు, బుక్కాలు జల్లుకున్న గులాబి రంగుల కేశాలను సృష్టించేశావు.
అంతా నీ కటాక్షం రామా!
నా కటాక్షం కాదయ్యా, నీ కరుణాకటాక్షంతో శ్రోతలను కటాక్షించావు. నీ కారణంగా నా జానకి నాతో ఎంత మనోహరంగా సంభాషిస్తుందో తెలుసా.
అంతకంటె నా జన్మకు ఇంకేం కావాలి రామయ్యా.


నల్ల కలువల వంటి నా చేతులలో ముత్యాలు, ఎర్ర తామరల వంటి జానకమ్మ చేతిలో ముత్యాల తలంబ్రాలు… ఆహా… ఎంత కమనీయంగా, ఎంత రమణీయంగా వర్ణించావయ్యా. మా పాణిగ్రహణం అంటే నీకు ఎంత పులకరింతో.
నన్ను అంతగా ప్రశంసల జల్లులో తడపద్దు రామా!
ఇది చాలా తక్కువ. నాకు నీ అంత మాటలు కూడా రావట్లేదు.
రామా! నీ ఘనత… నా చేత పలికించింది. నీ గురించి ఎంత పొగిడినా చాలా తక్కువే. నా నోటిలో నుంచి వచ్చే ప్రతి పలుకు నువ్వు పలికించినదే. నీ అనుగ్రహం లేకపోతే నేను ఎలా మాట్లాడగలను రామా.
నువ్వు గొప్పవాడివయ్యా. నన్ను నీకు నచ్చినట్లుగా మలుచుకుని, నీకు నచ్చిన విధంగా నా కల్యాణం జరిపిస్తూ, నీకు నచ్చిన విధంగా నన్ను వర్ణిస్తూ, అంతా నేను పలికించానంటావేమిటి?
అలా పలకటం కూడా నీ అనుగ్రహమే రామా!
అది సరే కానీ, సుమారు పదిపదిహేను సంవత్సరాల పాటు నువ్వు నా కల్యాణం జరిపించావు కదా, ఏం నా మీద అలిగావా, నా మీద కినుక వహించావా… నీ గళంలో వినిపించటం మానేశావు.
అయ్యో! రామా! అటువంటిదేమీ లేదు.
నాకు నీ గళమే అజరామరం. నా కల్యాణాన్ని ఎలా జరిపించాలో నీకు నేర్పిన మాధవరామశర్మ గళం ఇష్టం. మీ విధానం నాకు నచ్చిందయ్యా.
ధన్యుడను రామా!
నా కల్యాణమంటే చాలు నువ్వు, ఆ తొమ్మిది రోజులూ ప్రతి పందిట్లోనూ నా కథను ఎంత ఇంపుగా వివరంగా వినిపించావో, నేను ప్రతి పందిరికి వచ్చి నీ గళం వినేవాడిని.


ఈ జీవితానికి ఇది చాలు రామా! నేను గతించి ఇప్పటికి మూడున్నర దశాబ్దాలు గడిచిపోయింది. అయినా నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చావంటే, అది నా తల్లిదండ్రులు నాకు అనుగ్రహించిన ఈ జీవితమే, ఈ గళమే.
ఓ దీక్షితులూ! నీ గొంతు గురించి నీకు తెలియదయ్యా. ఆ గళంలో అమృతం ఉందో, మకరందం ఉందో, మధువు ఉందో… ఈ గళం అమరం. ఇటువంటి గాత్రం ఇంతకు ముందు వినలేదు, ఇక ముందు వినలేను కూడా.
నీ ఆశీర్వాదం రామా! ఒక్క సూర్యుడు, ఒక్క చంద్రుడు, ఒక్క రాముడు, ఒక్క సీత కదా…
అవును
అలాగే ఒక్క దీక్షితులు గళం కూడా. అందరూ నిన్ను ఉషశ్రీ అని పిలిచినా, నేను మాత్రం నిన్ను దీక్షితులు అనే పిలుచుకుంటాను.
నా జన్మ ధన్యమైంది రామా!
నీ జన్మ మాత్రమే కాదు, అందరి జన్మలు చరితారవ్థమయ్యాయి. ఇంటింటికీ నా కల్యాణాన్ని తీసుకువెళ్లి, సీతారాముల కల్యాణం ఆదర్శమని అందరి మనసుల్లోనూ ప్రతిష్ఠించావు. భక్తులు భగవంతుని ఎక్కడో నిలబెట్టేస్తారు. అందునా నీలాంటి భక్తులుంటే, మేం సింహాసనం కాదు, ఆపైన ఇంకేదైనా ఉంటే, అది ఎక్కి కూర్చుంటాం.
రామా! నీ కథ చెప్పి, నేను నలుగురిలో గుర్తింపు పొందానయ్యా. నీ కథ ఎవరు చెప్పినా అందంగానే ఉంటుంది. అది నీ గొప్పదనం. నీ గురించి చెప్పిన వాల్మీకి మహర్షి ఘనత. ఆ తరువాత కాళిదాసు, భవభూతి, మురారి, విశ్వనాథ సత్యనారాయణ, పుల్లెల శ్రీరామచంద్రుడు… అబ్బో ఎందరో!!!
నువ్వు చిరంజీవివి నాయనా! హనుమంతుని వెంట తిరుగుతూ, శబ్దబ్రహ్మవేత్తవి అయ్యావు. నా హనుమతో పాటు, నువ్వు కూడా నా గుండెల్లో చిరకాలం స్థిరంగా ఉంటావు.
ధన్యుడిని రామా!
ఇదిగో నీ మాటలు నేను పలుకుతున్నాను చూడు, స్వస్తి,
చాలా సంతోషం రామా! నీ నోట ఆ మాట రావటం… మాటల్లో నా ఆనందాన్ని చెప్పలేను. ఇంక ఆ స్వస్తి, నా పేరుతో అందరూ తప్పకుండా అనుసంధానం చేస్తారు.
అని మాట్లాడుతుండగా…
నిద్రలో నుంచి లేచినట్లుగా ఒక్కసారిగా తెలివిలోకి వచ్చాను. రాముడు నాన్నతో మాట్లాడుతున్నట్లు కలిగిన భావనకు నాకు చాలా ఆనందం వేసింది. నాన్న తన బాల్యంలో మాటలు నేర్చుకున్నది మొదలు రామనామ జపం చేస్తూనే ఉన్నారు. జపం అంటే ముక్కు మూసుకుని కూర్చోవటం కాదు, రాముని వెంట తిరుగుతూనే ఉన్నారు. రాముని కథను అందరికీ వినిపిస్తూనే ఉన్నారు. రాముని కథను అక్షరీకరిస్తూనే ఉన్నారు. ఇంట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా, రామనామం జపించమనే చెప్పారు. ఏనాడూ ఔషధాలు వేసుకోమనలేదు. రామనామమే పరమౌషధం అని చెప్పారు. రామనామమే శ్వాసగా జీవించారు. ఆ నామం జపిస్తూనే ఇక్కడ తుది శ్వాస విడిచి, అక్కడ రాముని చేరుకున్నారు.
బహుశః ప్రత్యక్షంగా ఆయన కథను ఆయనకే వినిపిస్తూ ఉంటారు. ఏటా ఆయన కల్యాణానికి అక్కడ ఆయనే వశిష్ఠునిగా పౌరోహిత్యం వహిస్తున్నారేమో.
సమస్త సన్మంగళాని భవంతు.. అనే మాట నా మనసులో మెదులుతోంది.
(సృజన రచన)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...