అన్నమయ్య అన్నది-28
(రోచిష్మాన్, 9444012279)
“ఇదివో శ్రుతి మూల మెదుటనే వున్నది
సదరముగ హరి చాటీ నదివో”
ఇదిగో వేదానికి మూలమైనది ఎదురుగానే ఉంది. చాతుర్యంగా (సదరముగ) హరి చాటుతున్నాడు అదిగో అని అంటున్నారు అన్నమయ్య.
వేదం లేదా శ్రుతికి మూలం పరమాత్మ; ఆ పరమాత్మ ఇదిగో ఎదురుగానే ఉంది; హరి దాన్ని చాటాడు అదిగో అని శ్రీవేంకటేశ్వరుణ్ణి చూపుతున్నారు అన్నమయ్య. ఇదిగో అంటూ మొదలు పెట్టి అదిగో అంటూ ఏది ఏదో తెలియజెప్పడానికి అన్నమయ్య ఈ సంకీర్తనను చేస్తున్నారు.
“వేదోఖిలో ధర్మమూలమ్” అని మనుస్మృతి చెప్పింది. అంటే ధర్మం మొత్తానికి మూలం వేదం లేదా శ్రుతి అని అర్థం. వేదానికి ఉన్న వేర్వేఱు పేర్లలో శ్రుతి అనే పేరు కూడా ఉంది. “శ్రుతిస్తు వేదో విజ్ఞేయః” అని మనుస్మృతి చెప్పింది. గురువు ఉచ్చరించినదాన్ని విని శిష్యుడు నేర్చుకుంటాడు కనుక శ్రుతి అని పేరు.
“వేదో నిత్య మధీయతాం తదుతం కర్మ స్వనుష్ఠీయతాం” అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. అంటే వేదం నిత్యమూ చదవాల్సినది, దాని నుంచి వచ్చిన కర్మ స్వయంగా ఆచరించేందుకు తగినది అని అర్థం. “వేదయతీతి వేదః” అంటే తెలియజేసేది వేదం అనీ, “వేదయతి యతో ధర్మాధర్మ ఇతి వేదః” అంటే ధర్మ, అధర్మాలను తెలియజెప్పేది వేదం అనీ అర్థం.
“ఎనసి పుణ్యము సేసి యేలోక మెక్కిన
మనికై భూమి యందు మగుడఁ బొడముటే
పొనిగి యా బ్రహ్మ భువనా లోకాః
పునరావృత్తి యనెఁ బురుషోత్తముఁడు”
సరైన (ఎనసి) పుణ్యం చేసి ఏ లోకానికి వెళ్లినా జీవించడానికి (మనికై) భూమిలో మళ్లీ (మగుడ)
పుట్టాల్సిందే (పొడముటే) నిస్తేజమైపోయి (పొనిగి); యా బ్రహ్మ భువనా లోకాః పునరావృత్తి అన్నాడు పురుషోత్తముడు (కృష్ణుడు) అని మొదటి చరణంలో చెబుతున్నారు అన్నమయ్య.
భగవద్గీత (అధ్యాయం 8 శ్లోకం 16)లో “ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావృత్తినోऽర్జునః” అని కృష్ణుడు చెప్పాడు. అంటే బ్రహ్మ భువనం ఆదిగా లోకాలన్నీ మళ్లీ, మళ్లీ పుడుతూంటాయి అని అర్థం. ఆ గీతా వాక్యాన్ని ఇక్కడ ఉటంకించారు అన్నమయ్య.
“తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన
పటుగతితో మోక్ష పదము సులభమనె
ఘటన మాముపేత్యతు కౌంతేయ మహిని
నటనఁ బునర్జన్మ న విద్యతే”
అవలీలగా (తటుకున) శ్రీహరి, తననే కొలిస్తే తెలివైన గమనంతో (పటుగతితో) మోక్ష ప్రయత్నం (మోక్ష పదము) సులభం అన్నాడు పూనుకుని (ఘటన); అని చెప్పాక “మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే” అన్న భగవద్గీత వాక్యంలో మహిని, నటన అన్న రెండు పదాల్ని కలిపి రెండో చరణాన్ని అందిస్తున్నారు అన్నమయ్య. మహిని, నటన ఈ రెండు పదాలూ ఇక్కడ అర్థవంతంగా లేవు. ట కార ప్రాస కోసమూ, పాద పూరణ కోసమూ అన్నమయ్య ఈ పదాలను వ్యర్థంగా వాడారని తెలుసుకోవచ్చు.
తననే కొలిస్తే తెలివైన గమనంతో మోక్ష ప్రయత్నం సులభం అవుతుంది అని పూనుకుని శ్రీహరి చెప్పాడు అని అంటూ మొదటి చరణంలో ఉటంకించబడ్డ గీతా శ్లోకంలోని రెండో పాదం అయిన ‘మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే’ను ఇక్కడ పొదివారు అన్నమయ్య. కుంతీ పుత్రుడా, నన్ను పొందాక పునర్జన్మ లేదు అని ఆ భగవద్గీత మాటలకు అర్థం.
“ఇన్నిటా శ్రీవేంకటేశ్వరు సేవే
పన్నిన గతి నిహ పర సాధన మదే
మన్నించి యాతఁడే మన్మనా భవ యని
అన్నిటా నందఱి కానతిచ్చెఁ గాన”
అన్నిటిలోనూ (ఇన్నిటా) శ్రీవేంకటేశ్వరుడి లేదా పరమాత్మ సేవే సరైన గమనం (పన్నిన గతి); ఇహ పర సాధనం అదే; అనుగ్రహించి (మన్నించి) పరమాత్ముడే (అతడే) మన్మనా భవ అని మెత్తం అందఱికీ ఆనతి ఇచ్చాడు కాబట్టి (కాన) అని అంటూ సంకీర్తనను ముగించారు అన్నమయ్య.
భగవద్గీత (అధ్యాయం 18 శ్లోకం 65)లో “మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు” అని కృష్ణుడు చెప్పాడు. అంటే నాపై మనస్సు కలవాడివిగానూ, నా భక్తుడివిగానూ, నా అభ్యర్థివిగానూ ఉండు; నన్ను పూజించు అని అర్థం. ఇలా పరమాత్మ ఆనతి ఇచ్చాడు కాబట్టి అన్నిటిలోనూ వేంకటేశ్వరుడి లేదా పరమాత్మ సేవే సరైన గమనం; ఇహ పర సాధనం అదే అని వక్కాణించారు అన్నమయ్య.
కొన్ని సంకీర్తనల్లో భగవద్గీత భావాల్ని తన మాటల్లోకి తీసుకు వచ్చి చెప్పిన అన్నమయ్య ఈ సంకీర్తనలో భగవద్గీత వాక్యాల్ని యథాతథంగా ఉటంకించారు.
భగవద్గీత వాక్యాలను ఉటంకిస్తూ, శ్రుతికి మూలం పరమాత్ముడే అన్న సత్యాన్ని ఉద్ఘాటిస్తూ ఓ ఉత్కృతై ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

