అన్నమయ్య అన్నది-27
(రోచిష్మాన్, 9444012279)
“పరమాత్ముని నోరఁ బాడుచును యిరు-
దరులు గూడఁగఁ దోసి దంచీ మాయ”
పరమాత్ముణ్ణి నోటితో పాడుతూ రెండు వైపులూ కలిసేట్టుగా తోస్తూ దంచుతోంది (దంచీ) మాయ అంటూ ఒక మార్మికమైన భావనతో అన్నమయ్య ఇలా ఓ సంకీర్తనను అందుకున్నారు.
మాయ… భగవంతుని యొక్క అనిర్వచనీయమైన శక్తి. (The indescribable power of the infinite) మాయ గుఱించి ఆదిశంకరులు వివేకచూడామణి (శ్లోకం 111) లో ఇలా చెప్పారు: “సన్నాప్య సన్నాప్యు భయాత్మి కానో భిన్నాప్య భిన్నాప్యు భయాత్మి కానో / సాంఞాప్యసంఞా హ్యుభయాత్మి కానో మహాద్భుతానిర్వచనీయ రూపా” అంటే (మాయ అన్నది) ఉన్నదీ కాదు, లేనిదీ కాదు; ఈ రెండూ కూడా కాదు; ఈ రెండిటికన్నా వేఱైనదీ కాదు. అవయవాలతో ఉన్నదీ కాదు; అవయవాలు లేనట్టిదీ కాదు; ఈ రెండూ కాదు. అనిర్వచనీయమైనది; మహాద్భుతమైనది అని అర్థం.
ప్రపంచంలోని ఉన్నతమైన కవులందరూ మార్మిక
(mystical) రచనలు చేశారు. ఆదిశంకరాచార్య, లావ్ – చు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, కబీర్, విలిఅమ్ బ్లేక్ (William Blake), విశ్వనాథ సత్యనారాయణ, సుబ్రమణియ బారతి, రవీంద్రనాథ్ టాగోర్ వంటి కవులు విశేషమైన మార్మిక రచనలు చేశారు. అన్నమయ్య చేసిన ఈ మార్మిక రచనలోకి కొనసాగుదాం…
“కొలఁది బ్రహ్మాండపు కుందెనలోన
కులికి జీవులను కొలుచు నించి
కలికి దుర్మోహపు రోఁకలి వేసి
తలఁచి తనువులను దంచీ మాయ”
చిన్న బ్రహ్మాండం వంటి ధాన్యాన్ని దంచే ఱోలు (కుందెన)లో పోసి (కులికి) జీవులు అనే ధాన్యాన్ని (కొలుచు) నింపి సమర్ధురాలై (కలికి) దుర్మోహం అన్న రోకలితో బుద్ధిపూర్వకంగా సంకల్పించి (తలఁచి) శరీరాలను దంచుతోంది మాయ అని అంటున్నారు అన్నమయ్య.
‘సమర్ధురాలైన మాయ సంకల్పించి చిన్న బ్రహ్మాండం వంటి ఱోటిలో ధాన్యం వంటి జీవుల్ని పోసి నింపి దుర్మోహం అనే రోకలితో ఆ జీవుల శరీరాల్ని దంచుతోంది మాయ’ అని అన్నమయ్య చెప్పడం మన దైనందిన జీవన స్థితిని సూచిస్తోంది.
“తొంగలి రెప్పల రాత్రులుఁ బగలును
సంగడి కన్నులుగా సరిఁదిప్పుచు
చెంగలించి దిక్కులనే చేతు లూచుచు
దంగుడు బియ్యాలుగా దంచీ మాయ”
వాలే (తొంగలి) రెప్పలున్న రేయి పగళ్లు అనే రెండు (సంగడి) కళ్లుగా సరిగ్గా తిప్పుతూ విజృంభించి దిక్కులు అనే చేతుల్ని ఊపుతూ పొట్టు ఊడిపోయేట్టు (దంగుడు) బియ్యాన్ని దంచుతున్నట్టుగా దంచుతోంది మాయ అని అంటున్నారు అన్నమయ్య.
ఎంత గొప్పగా చెప్పారో గమనించండి. ఒక. విషయాన్ని ఉత్కృష్టమైన కవిత్వంగా చెప్పడం అంటే ఇదే. రేయి పగళ్లు ఈ రెండిటినీ వాలిపోయే రెప్పల కళ్ల ద్వయంగా చెప్పడమూ, దిక్కుల్ని చేతులుగా చెప్పడమూ శ్రేష్ఠంగా ఉన్నాయి. వాలిపోయే రాత్రుళ్లు, పగళ్లు వంటి కళ్లతో చూస్తూ, దిక్కులు అనే చేతులు ఊపుతూ మన పొట్టు ఊడిపోయేట్టుగా మనల్ని మాయ దంచుతోందట. ఇక్కడ పొట్టు దేనికి ప్రతీక? తెలుసుకున్న వాళ్లకు తెలుసుకున్నంత.
“అనయముఁ దిరువేంకటాధీశ్వరుని
పనుపడి తనలోఁ బాడుచును
ఒనరి విన్నాణి జీవులనెడి బియ్యము
తనర నాతనికియ్య దంచీ మాయ”
ఎల్లప్పుడూ (అనయము) తిరు వేంకటేశ్వరుణ్ణి లేదా పరమాత్ముణ్ణి అలవాటుగా (పనుపడి) తనలో పాడుకుంటూ సిద్ధమైన (ఒనరి) సన్యాసి (విన్నాణి) జీవులు అనే బియ్యం వర్ధిల్లేట్టుగా (తనర) పరమాత్ముడికి ఇవ్వడానికి (నాతనికియ్య) దంచుతోంది మాయ అంటూ సంకీర్తన్ని ముగించారు అన్నమయ్య.
మాయ మానవుల్ని దంచుతోంది, దంచుతోంది, దంచుతోంది అంటున్న అన్నమయ్య ఎందుకు దంచుతోంది? అన్న ప్రశ్నకు ‘పరమాత్ముడికి ఇవ్వడానికి’ అన్న సరైన సమాధానం చెప్పేశారు. రకరకాలుగా దంచాక పరమాత్మకు మాలిమి అయి
సిద్ధపడ్డ వాళ్లను పరమాత్మకు ఇవ్వడానికి దంచుతోంది మాయ అని అంటూ సిద్ధపడడం లేదా సిద్ధపడాలి అన్నదాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు అన్నమయ్య.
దంచడం అన్నది జీవి జీవితంలో ‘ఆటుపోట్లను కలిగించడం’ అన్నదానికి ప్రతీక. ఇక్కడ పాడడం అన్నది పరమాత్ముణ్ణి స్మరించడం, మనననం చేసుకోవడం వంటి వాటికి ప్రతీక. రవీంద్రనాథ్ టాగోర్, రూమీ వంటి మార్మిక కవులు కూడా పాటనూ, పాడడాన్నీ భక్తి , భగవచ్చింతన వంటి వాటికి ప్రతీకలుగా చూపారు; చూశారు; చేశారు. మాయ కూడా పాడుతూనే దంచుతోంది; పాట పాడుకునే సన్యాసుల్ని పరమాత్మ దగ్గఱకు చేర్చుతోంది. మాయకు కూడా భగవచ్చింతన ఉంది; మాయకూడా భగవజ్జనితమే!
మన జన జీవనంలో స్త్రీల దంపుడు పాటలు ఉన్నాయి. వాటిని చూసి ఈ సంకీర్తనను అల్లారు అన్నమయ్య. దంచే స్త్రీని మాయగా తీసుకున్నారు ఇక్కడ. అన్నమయ్య సహజకవి. దైనందిన జీవనంలో చలామణిలో ఉన్నదాన్ని తీసుకుని ఇలా మార్మికతను ఆపై పారలౌకికతను ప్రసారం చేశారు అన్నమయ్య.
ఒక మహోన్నతమైన భావం, ఒక మహోన్నతమైన రచనా సంవిధానం, ఒక మహోన్నతమైన కవిత్వావిష్కరణం, ఒక మహోన్నతమైన తాత్త్విక చింతనం సమ్మిళితమై ఒక మార్మిక అభివ్యక్తిగా విలసిల్లుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

