ఇలాంటి ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారు !

Date:

(G. VALLISWAR)

1983 లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వలేదు. అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారుల్ని ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా ఉందని, నేడో రేపో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగు అడగడానికి వెళ్తే, ముఖ్యమంత్రి మూడు “అవినీతి నేరాల” ప్రశ్నలతో నిలదీశారు.

ముఖ్యమంత్రి: మీరు టిటిడి నిధుల్లోంచి లక్షలాది రూపాయల్ని కేవలం బ్రాహ్మణులకే దోచిపెట్టారట. నిజమా? కాదా?
ఐ.ఏ.ఎస్: కొంతవరకు నిజమే సర్. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సలహా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టిటిడి అమలు చేసిన పథకం క్రింద చేశాను. ఎవరైతే 12-16 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేసి, ఘనాపాటీలుగా, క్రమాపాటీలుగా గుర్తింపు పొంది ఉన్నారో, వారిలో ఎవరు ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున తమకి సమీపంలోని దేవాలయంలో సమాజ క్షేమం కోసం వేదపారాయణ చేస్తారో వాళ్ళకి నెలకి 600 నుంచి 800 వందల రూపాయల గౌరవ వేతనాన్ని టిటిడి చెల్లిస్తుంది. అటెండర్ ఉద్యోగం చేసే వాళ్ళే నెలకి 15 వేలు సంపాదింకుంటున్నారు. 16 సంవత్సరాల పాటు కంఠ నరాలు తెగిపోయేలా వేదాధ్యయనం చేయటం అంటే ఒక పోస్ట్ గ్రాద్యుయేషన్ చేయటం వంటిది. అలా నేర్చుకున్న వేద విద్యని సమాజ శ్రేయస్సు కోసం దేవాలయాల్లో పారాయణ చేసినందుకు టిటిడి నుంచి లబ్ధి పొందిన వేదపండితుల సంఖ్య 370. ఆ పండితులకు నెలకు రూ.800 చెల్లించటం దోచిపెట్టడం అనీ, నేరమనీ నేను అనుకోవట్లేదు.

ముఖ్యమంత్రి: మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యాం నిర్మాణం విషయంలో నిబంధనల్ని కాంట్రాక్టరుకి అనుకూలంగా సవరించేసి, లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారట గదా!
ఐ.ఏ.ఎస్: నేను 1978లో టిటిడిలో చేరాను. అప్పటికే డ్యాం నిర్మాణానికి హెచ్.సి.సి అనే కంపెనీ ఎంపికయింది. వాళ్ళు పని ప్రారంభించబోయే సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు – మరో 100-150 మీటర్లు దిగువన డ్యాం కడితే, నీటి నిల్వ సామర్ధ్యం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది.
కొండ మీద యాత్రికులకు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా టెండర్లు పిలవాలంటే ఇంకో ఆరుమాసాలు పడుతుంది. పైగా పాత కాంట్రాక్టరుకి నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ నేను అప్పటి ధర్మకర్తల మండలిగా ఉన్న ‘పెర్సన్స్ ఇంచార్జీ‘ కమిటీ ముందు పెట్టాను. వాళ్ళ ఆమోదంతో, కొండమీద యాత్రికులకు నీటి కొరతని త్వరగా తీర్చే ప్రయత్నంలో హెచ్.సి.సి కంపెనీకే పాత రేట్లే చెల్లించే ఒప్పందం మీద ఆ ప్రాజెక్టు కేటాయించాలని ‘పెర్సన్స్ ఇంచార్జి ‘ అంగీకరించింది. ఫలితంగా, రెండున్నర ఏళ్ళలో పూర్తి కావలసిన డ్యాం ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తయింది. మీరు రికార్డులు తెప్పించుకొని చూడవచ్చు. ఒక్క రూపాయి కూడా హెచ్.సి.సి కి అదనంగా చెల్లించకుండా, రికార్డు సమయంలో డ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయించటమే నేరమైతే, అది నేను చేశాను.

ముఖ్యమంత్రి: సరే. పెద్ద నేరం ఒకటుంది. తిరుమల శ్రీనివాసుడికి వజ్ర కిరీటం చేయించటంలో మీరు కస్టమ్స్ శాఖవారి వజ్రాలు వద్దని, ప్రయివేటు వ్యాపారుల దగ్గర వజ్రాలు కొన్నారనీ, అందులో చాలా వజ్రాలను మీరు మూటగట్టుకున్నారనీ, మీ ఇంట్లో పరుపుల్లో, తలగడల్లో ఈ వజ్రాలు దాచుకున్నారనీ అంటున్నారు. ఇలా జరిగి ఉంటే అది పాపం కూడా ? నిజం చెప్పండి.
ఐ.ఏ.ఎస్: అవునండి. వజ్రాల కిరీటానికి వజ్రాలకోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు వచ్చారు. అక్రమ రవాణాల్లో కస్టమ్స్ వారికి పట్టుబడిన వజ్రాలు టిటిడికి తక్కువధరకు వస్తాయని ఆశపడి ప్రధానమంత్రిని అడిగాను. ఆవిడ అంగీకరించారు. కొన్ని రోజులకి ఆవిడ ముఖ్య కార్యదర్శి కృష్ణస్వామి రావ్ సాహెబ్ గారు ఫోన్ చేసి, కస్టమ్స్ స్వాధీనం చేసుకునే వజ్రాలు స్మగ్లర్లు మర్మాంగాల్లో దాచి తెచ్చినవై ఉంటాయి కాబట్టి అలా అపవిత్రమైన వజ్రాలను పవిత్రమైన స్వామి వారి కిరీటానికి వాడవద్దని ప్రధానమంత్రి చెప్పారని అన్నారు. అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందూస్తాన్ డైమండ్ కార్పొరేషన్ (హెచ్.డి.సి) ద్వారా హాలండ్ నుంచి వజ్రాలు కొనుకోలు చేయించే ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరక్టరుతో మౌలికమైన ఇన్సూరెన్స్ వగైరా అంశాలమీద మా అధికార బృందానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వజ్రాలు దిగుమతి అయ్యేనాటికి చాలా ముందుగానే నాకు టిటిడి నుండి బదిలీ అయింది. ఆ వజ్రాలను చూసే అవకాశమే నాకు లేదే. ఇంక ….!!!

ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆలోచనలో పడిపోయారు.
అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ఐ.ఏ.ఎస్ అధికారి తన సీట్లోంచి ఉద్వేగంతో లేచి ముఖ్యమంత్రి మీద తన ఆవేశాన్ని కుమ్మరించారు:

“సర్. మీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి నేను లండన్లో ఒక కోర్సు చేస్తున్నాను. నేనంటే అసూయతో ఎవరెవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నా మీద నేరాలు మోపుతున్నారు. టిటిడి లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నేను ప్రతి పనినీ ఆ స్వామి మీద విశ్వాసంతోనే చేశాను. సత్ప్రయోజనాన్ని ఆశించే చేశాను. స్వామి ప్రేరణతో నా విధ్యుక్త ధర్మంగా భావించి మాత్రమే చేశాను. నా చిత్తశుద్ధిని, నిజాయితీని ఆ శ్రీనివాసుడు ఆమోదించినంతకాలం ఈ ప్రభుత్వం నాలో వెంట్రుక ముక్క కూడా కదిలించలేదు. మీ ఇష్టమొచ్చినన్ని విచారణలు జరిపించుకోండి… నేను నేరస్థుణ్ణి అని మీరు నమ్ముతుంటే, ఎలాంటి శిక్ష అనుభవించటానికైనా నేను సిద్ధమే. అది కూడా శ్రీనివాసుడి ప్రసాదమే అనుకుంటాను… శలవు…”

చటుక్కున ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ లేచి, ఆ ఐ.ఏ.ఎస్ అధికారి చేతులు పట్టుకొని, “ఆవేశపడకండి బ్రదర్. మేం పాలనకి కొత్తగా వచ్చాం. ఎవరో మీమీద ఈ అభియోగాలు చేశారు. అయితే, మా కార్యదర్శులు మోహన్ కందా గారు, బెనర్జీ గారు మీమీద ఎలాంటి చర్య తీసుకోదల్చినా, అందుకు ముందుగా మీతో మేం మాట్లాడితీరాలని పదే పదే చెప్పారు. అందుకే మాట్లాడాం. అపార్థం చేసుకోవద్దు బ్రదర్…”

ఇది జరిగిన గంటలోనే ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ఎండిగా పాత పోస్టింగు ఇచ్చారు. రెండు మాసాల్లో ‘సమాచార, పౌర సంబంధాల, సాంస్కృతిక, చలనచిత్ర అభివృద్ధి శాఖల కమీషనరుగా, కార్యదర్శి’ గా అదే ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ని నియమించింది ప్రభుత్వం.

పాలనా సామర్ధ్యం, దూరదృష్టి, ప్రణాళికా రచనలో పరిణతి, నీతి నియమాలు, నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, సాహిత్యం-లలిత కళల పట్ల మక్కువ, విజయం పరాజయం – రెండూ భగవంతుడి అనుగ్రహమే అని నమ్మే భక్తి విశ్వాసాలు, చివరి శ్వాస వరకూ సనాతన ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం …. ఇవన్నీ కలబోస్తే వచ్చే రూపం శ్రీ పి వి.ఆర్.కె.ప్రసాద్. ప్రధానమంత్రి కార్యాలయం, ఎక్సయిజ్ శాఖ, విశాఖ పోర్టు, పంచాయతీ రాజ్, ఉన్నత విద్య, ప్రకృతి వైపరీత్యాలు-పునరావాసం, మానవ వనరుల శిక్షణ తదితర ఏ పోస్టులో పని చేసినా కేవలం తన పని తీరుతో ఆ పోస్టుకి వైభవం, గుర్తింపు తీసుకు వచ్చిన విశిష్ట వ్యక్తి ప్రసాద్. టిటిడిలో పనిచేసిన 54 మాసాల కాలంలో (1978-82) అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి నిత్యాన్నదాన పథకం దాకా శాశ్వతంగా నిలిచిపోయే 27 ప్రాజెక్టులను అమలు చేసి, తనదంటూ ఒక చెరగని ముద్ర వేసిన కారణజన్ముడు.
ఇప్పటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత.

2009 నాటి లోక్ సభ, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఒక అసాధారణమైన చరిత్ర సృష్టించి, జాతీయ స్థాయిలో ‘ఆదర్శ ఛీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ‘గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ఐ.వి.సుబ్బారావు మాటల్లో చెప్పాలంటే – “సంపూర్ణ మానవుడు అంటూ ఎవరన్నా ఉండి ఉంటే, అది పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారే.”

(ఆగష్టు 21 పి.వి.ఆర్.కె.ప్రసాద్ వర్ధంతి, 22 జయంతి)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...