దర్శ’కుల’పతి పుట్టిన రోజు

0
302

బ్రహ్మ తరవాత బ్రహ్మ సినీ దర్శకుడు
(మహాదేవ్)

మే 4 -దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి పుట్టిన రోజు.
దర్శకుడు అనే వాడు సినిమా అనే 24 క్రాఫ్ట్ల సమ్మేళనాన్ని రస సిద్ధి కలిగేలా సమన్వయ పరిచి తెరపై ఆవిష్కరించే అద్భుత సృష్టి కర్త.
బ్రహ్మ సమస్త జీవరాశిని సృష్టిస్తే, దర్శకుడు ఆ జీవ రాశిని అంతటినీ తీక్షణంగా పరిశీలించి, పరీక్షించి, వాటి ప్రవర్తనను, పరివర్తనను అర్ధం చేసుకుని, ఆకళింపు చేసుకుని వెండి తెరపై పాత్రలుగా సృష్టిస్తాడు.
అందుకే దర్శకుడు బ్రహ్మ తర్వాత బ్రహ్మ.
దర్శకునికి 24 క్రాఫ్ట్ల పై పట్టు ఉండవచ్చు,లేదా 24 క్రాఫ్ట్ల నుండి అద్భుతమైన ప్రతిభను కనబరిచేలా పని చేయించుకునే శక్తి కలిగి ఉండవచ్చు.. అది కేవలం ఆ దర్శకుని వ్యక్ఘిగత, నైపుణ్య ,సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటాయి.
ఈ ప్రపంచం లో ఏ ఉద్యోగానికి అయినా, ఎలాంటి పనికి అయినా పుస్తకాల చదువు,డిగ్రీ పట్టాలు, సర్టిఫికేట్ లు ఉంటే సరిపోతుంది. కానీ దర్శకుడు అవ్వాలి అంటే ఎలాంటి డిగ్రీలు, పుస్తకాలు, సర్టిఫికేట్ లు పని చేయవు..

Knowledge is different from wisdom. Knowledge can be acquired through books, but wisdom comes from deep within yourself.

వాల్మీకి, వ్యాస భగవానులు ఏ పుస్తకాలు చదివి రాశారు అని మహా దృశ్య కావ్యాలు ? ఓం కారం నుంచి సృష్టి పుట్టినట్టే, ఒకే శబ్దాన్ని ఉచ్చరిస్తూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసాక ఆ శూన్యం నుంచి పుట్టిన మహా గ్రంధాలు అవి.. వారు దర్శకులు కన్నా గొప్ప వారు,ఈ జగతికి దార్శనికులు.
సరే,ఇది వేరే విషయం, ఇప్పుడు దర్శకుల దినోత్సవానికి వస్తే
దాసరి నారాయణరావు గారు 24 క్రాఫ్ట్స్ లో 10 క్రాఫ్ట్ల మీద బలమైన పట్టు కల వ్యక్తి, వ్యక్తిగా పట్టుదల గల మనిషి.
నటన, స్క్రీన్ ప్లే రచయిత, మాటల రచయిత, గీత రచయిత, దర్శకత్వం, నిర్మాణం, ఇలా విభిన్న కోణాలలో తనని తాను చెక్కుకుంటూ, తన మనో ఫలకం పై అద్భుతాలను సృజిస్తూ, మనందరికీ గొప్ప చిత్రాలను ఆవిష్కరించిన మహా మేధావి – దర్శక రత్న – ‘దశ’రి (దాసరి).
మొన్న ఈ మధ్య ఒక 12 నిమిషాల చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చెయ్యడానికే ఎంతో మేధో మథనం, మరెంతో శ్రమ చేసి అలసిపోయాను నేను.
అలాంటిది, 150 సినిమాలు – గిన్నిస్ రికార్డ్, 30 సంవత్సరాల కెరీర్, విభిన్న పాత్రలు, విప్లవాత్మక చిత్రాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, స్టార్ హీరో లు లేకుండా కేవలం కథ తోనే హిట్లు కొట్టిన దర్శకుడు. ఇలాంటి అసాధ్యాలు అన్ని సుసాధ్యాలు చేసిన మానవాతీత వ్యక్తి.
అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ లో సినిమా అంటే కేవలం హీరో, హీరోయిన్లు మాత్రమే అని భ్రమించే ప్రేక్షుకుల దృష్టి కోణాన్ని విచ్చిన్నం చేసి, సినిమా అంటే తెరపై నటించే పాత్రలు ఒకటే కాదు, వాళ్ళందర్ని ఆడించే, శాసించే తెర వెనుక బలమైన పాత్ర ఒకటి ఉంది – అతనే ‘దర్శకుడు’ అని పామరులకి కూడా అర్ధం అయ్యేలా ఆ పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి,దర్శకుని హక్కులను కాపాడిన వ్యక్తి, దర్శకుడు అనే పదానికి వన్నె తెచ్చిన వ్యక్తి – దర్శక రత్న.

అలాంటి మహా వ్యక్తి పుట్టిన రోజు దర్శ’కుల’ దినోత్సవం ఈరోజు.
(వ్యాస రచయిత సినీ నటుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here