రామోజీ ఆగ్రహించిన వేళ…

Date:

సమీక్ష సమావేశాల తీరు అలా ఉంటుంది…
ఈనాడు – నేను: 18
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
సమావేశానికి సరిగ్గా ముందురోజు రాత్రి ఆ సంఘటన జరిగింది… దారుణ హత్య… అదీ ఒక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఛోటా రాజకీయనాయకుడి తమ్ముడిని నరికేశారు. అన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది… ఒక్క ఈనాడులో తప్ప… ఈనాడులో వార్త మిస్‌ అవ్వడాన్ని మించిన మహాపాపం మరోటి లేదు. వార్త మిస్సయ్యిందంటే… ఎవరో బలయిపోయినట్లే (ఆరోజుల్లో సంగతది). ఈ విషయాన్ని పక్కన పెడితే.. రేపు రామోజీరావుగారిని ఈ అంశంలో సమాధానపరచడమెలాగా… అందరిలో(సీనియర్లలో) ఇదే ఆలోచన. అప్పటికే వార్త మిస్సయిన విషయం ఆయనకి చేరిపోయింది. రామోజీరావుగారి అనుగ్రహ దృక్కులను చూసిన నాబోటి వాడికి ఆ సమావేశం నరక సదృశంగా మారింది.
ఉదయాన్నే పది గంటలకి సమావేశం. అందరం ఆ గది బయట నిలబడ్డాం.. సీనియారిటీలవారీగా.. ముందు జనరల్‌ డెస్క్‌ ఇనార్జి శ్రీనివాసరావుగారు.. తరువాత తూర్పు గోదావరి డెస్క్‌ ఇంఛార్జి శర్మ గారు.. అందరికంటే ముందు మేనేజర్‌ జి.వి. రావుగారు… ఆయన ముందు నడిచారు. రావుగారు లోపలికి వెడుతుండగా తలుపు తెరుచుకున్న సందులోంచి కనిపించారు రామోజీరావుగారు.. ఆ దృశ్యం చూసి నాకు పైప్రాణాలు పైనే పోయాయి… పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నారాయన. సాధారణంగా మాకు కనిపించే దృశ్యం సుఖాశీనులై లోపలకి వచ్చే వారిని సునిశితంగా పరికించి చూసే రామోజీరావుగారు. ఇది అందుకు భిన్నం. తలుపు తెరవగానే లోపలి నుంచి వేడి సెగలు బయటికి చిమ్ముకొచ్చినట్లు అనుభూతి. మూసుకున్న తలుపు మళ్ళీ కొద్దిసేపటికి తెరచుకుంది. రావుగారు.. కిందిపెదవిని కొరుకుతూ… రండి లోపలికి అన్నారు. నా ముందున్న వారెవ్వరూ అడుగు ముందుకేయలేదు. అలాగే నిలబడ్డారు.. నిశ్శబ్దం…
సమావేశం జరుగుతున్న అంతస్తులో సుమారు యాబైమంది ఉద్యోగులుంటారు.. చడీచప్పుడూ లేదు. సినిమా ప్రారంభానికి ముందు సైలెన్స్‌ ప్లీజ్‌ అనే స్లైడ్‌ పడగానే అలముకునే నిశ్శబ్దాన్ని తలపించింది.

ముందు లోపలికి రండయ్యా! … రామోజీరావుగారి గంభీర స్వరం..(ఆయనకు కోపం వస్తే చేసే సంబోధన అది)
బిక్కుబిక్కుమంటూ ఒక్కొక్కరూ లోపలికి వెళ్ళారు..
కూర్చోండి.. మళ్ళీ ఆదేశం…
కూర్చోలేదు… మరో రెండు నిముషాలు గడిచిందలా..
సింహం బోనులో ఉన్నట్లుంది మా పరిస్థితి..
ఎవరి ఉచ్ఛ్వాసనిశ్వాసాలు వారికే తెలుస్తున్నాయి…

మీరు క్షమించానంటే కూర్చుంటాం… ఈ మాట అన్నది ఎవరో తెలీలేదు.. మెల్లిగా అన్నారు..
అంటే నువ్వు తప్పు చేస్తే నేను తలదించుకోవాలా…
ఈనాడు పరువును గంగలో కలిపేశారు..
కోట్లాది రూపాయలు పెట్టి ఇక్కడ బిల్డింగు కట్టడం.. మీరేమో మా పరువును బజారునకీడ్చడం..
అంతా పొండవతలికి… ఇక్కడ ఆఫీసును మూసేస్తాను… రామోజీరావుగారు మహోగ్రరూపంతో విరుచుకుపడుతున్నారు..
వార్త ఎందుకు మిస్సయ్యిందనే అంశంపై సమీక్ష జరగటం లేదక్కడ…
రాజమండ్రి వచ్చిన కొద్దినాళ్ళకే వార్త మిస్సవ్వడం …. ఇది ఘోర తప్పిదం.

మరికొంతసేపు ఆయన తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు… ఇంక చెప్పేందేం లేదన్నట్లు ఊరుకున్నారు..
ఎవరికీ నోట మాట రావడం లేదు.. నేను మెల్లిగా నోరు విప్పాను.. అసలేం జరిగిందేమిటంటేనండి…. అన్నానో లేదో…
ఏం జరిగిందయ్యా… ఏం జరిగింది.. వార్త మిస్సయ్యాం. దీనికి వివరణ కూడానా… అని మరోసారి ఆగ్రహంగా అన్నారు. పక్కనుంచి ఎవరో నన్ను మాట్లాడవద్దన్నట్లు మోచేత్తో పొడిచారు. అది కూడా గమనించారాయన.. ఎందుకతన్ని ఆపుతావ్.. చెప్పు అన్నారు..

ఈ లోపు పిఎస్‌ఆర్‌ గారు అందుకున్నారు. రాజమండ్రి శివారులోని మోరంపూడి నుంచి కడియం వెళ్లే దారిలో హుకుంపేటకు సమీపంలో ఈనాడు యూనిట్‌ ఉంది. శ్యామలా టాకీస్‌ వెనుక భాగంలో ఈనాడు లోకల్‌ ఆఫీసు ఉంది. అక్కడ రిపోర్టర్స్‌ ఉంటారు. రాత్రి పదకొండున్నర గంటల వరకూ రిపోర్టర్లు విడతలవారీగా ఉంటారు. ఆఫీసు మూసేంతవరకూ ఉండే రిపోర్టర్‌ వెళ్ళే ముందు అన్ని పోలీసుస్టేషన్లు, ఫైర్‌ స్టేషన్లు… ఇతర ముఖ్య విభాగాలతో మాట్లాడి.. తాజా సమాచారం ఏమైనా ఉంటే తెలుసుకుని వార్త రాస్తారు.. ఆరోజు ఒక కంట్రిబ్యూటర్‌ది నైట్‌ డ్యూటీ. మరొక కంట్రిబ్యూటర్‌.. ఏదో ప్రత్యేక కథనం రాసుకోవడం కోసం లోకల్‌ ఆఫీసుకు తొమ్మిది గంటలకు వచ్చాడు. ఎలాగూ ఇతను ఉన్నాడు కదా అని అప్పటిదాకా ఉన్న కంట్రిబ్యూటర్ ఇప్పుడే వస్తానని బయటకెళ్ళాడు. మళ్ళీ రాలేదు. రెండో అతను తన పని పూర్తిచేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరూ తాజా వార్తల కోసం చేయాల్సిన ఫోన్లు చేయలేదు. అందుకే ఈ సంగతి తెలియలేదు. పైగా ఈ హత్య జరిగింది.. ఎక్కడో లాలాచెరువు ప్రాంతంలో… పోలీసులు చెబితే తప్ప తెలీదది. జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. పొద్దున్న పేపర్లు చూసే వరకూ ఈ విషయం ఎవరికీ తెలీదు. కానీ దీన్ని అంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు… ఎవరూ!

రాజమండ్రికి వచ్చిన మొదటి నెలరోజులూ ఏం చేశామో గుర్తుచేసుకోండి… మళ్ళీ రామోజీరావుగారి తీవ్ర స్వరం..
నిజమే గుర్తుచేసుకున్నాను. విజయవాడ నుంచి ప్రత్యేక పాత్రికేయ బృందం రాజమండ్రికి వచ్చింది.. వారిలో హరిప్రసాద్‌, మహ్మద్‌ గౌస్‌, చెన్ను పెద్దిరాజు వచ్చారు. వారి పని ఉదయం నాలుగు గంటలకి మొదలయ్యేది. అన్ని పేపర్లనూ తెప్పించుకుని చదివి.. ఈనాడులో వచ్చిన వార్తలతో సరిపోల్చుకునే వారు.

ఈనాడులో మాత్రమే వచ్చిన వార్తలు, ప్రత్యేక కథనాలు.. ఇలా అన్నింటినీ ప్రోది చేసి ‘ఈనాడు విశ్లేషణ’ పేరుతో ఉదయం తొమ్మిది గంటల కల్లా మిగిలిన పత్రికల పాఠకులకు ఓ అనుబంధాన్ని ఉచితంగా పంపిణీ చేసేవారు. దీనివల్ల ఈనాడు గొప్పతనాన్ని ఇతర పత్రికల పాఠకులు తెలుసుకునే వీలు కలిగింది. చూడండి ఎంత అద్భుతమైన మార్కెటింగ్‌ టెక్నిక్‌ ఇది. మిగిలిన పత్రికల కంటే ఈనాడు ఎక్కువగా ఏమిచ్చిందనే అంశాన్నీ, వార్తల సంఖ్యను గణాంకాలతో సహా అందులో వివరించేవారు.. ఇది చాలదా.. కొత్త పాఠకుణ్ణి ఆకర్షించడానికి…
అంతా సానుకూల ప్రచారం…
సానుకూల దృక్పథం…

అంతకు మించిన కఠోర కృషి.. ఇటు పాత్రికేయులు.. మార్కెటింగ్‌ సిబ్బందీ… ఎవరి కృషి వారు చేసేవారు… ఫలితంగా
విజయవాడలో ఉన్నప్పుడు 17000 ఉన్న పత్రిక సర్క్యులేషన్‌ రెండు నెలల్లోనే 35000 దాటింది. నాయకుడు ముందుండి నడిపిస్తే వచ్చే ఫలితాలకీ… మీరు చేయండని పురమాయించి చేస్తే వచ్చే ఫలితాలకీ తేడా అది.

ఈలోగా రామోజీ గారి కోపం కొంత చల్లారింది. మేం భయపడుతున్న విషయాన్ని గ్రహించారు. మామూలు స్థితిలోకి వచ్చి… ఇది అందరికీ గుర్తుండాలి.. బాధ్యులెవరో తెలుసుకుని చర్య తీసుకోండని ఆదేశించి… సమీక్షను పూర్తిచేశారు.

రామోజీరావుగారి మీటింగ్‌ అయిన వెంటనే న్యూస్‌టుడే మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌బాబుగారి మీటింగ్‌ ఉంటుంది. మొదటి మీటింగ్‌ను బట్టి ఈ మీటింగ్‌ తీరు… పెద్దాయన ఆగ్రహిస్తే.. ఈయన అనునయిస్తారు. ఆయన మామూలుగా మాట్లాడితే ఈ రెండో మీటింగులో టాప్‌ లేచిపోతుంది. చెమడాలు లెక్కదీస్తా… నీ తల తీసి కోటగుమ్మానికి వేలాడదీసినట్లు ఈనాడు గుమ్మానికి కట్టేస్తా … ఇలాంటి వ్యాఖ్యానాలు దొర్లుతాయి… అందులో… రమేష్‌ బాబు చాలా దిట్ట.

మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌ ఇది..
ఈసారి మాత్రం ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడారు. సంఘటనపై శూలశోధన చేశారు. బాధ్యత వహించాల్సిన స్టాఫర్‌ తప్పించుకున్నాడు.. ఆఫీసుకొచ్చి రాసుకుందామనుకున్న కంట్రిబ్యూటర్ బలయిపోయాడు. ఈ సమయంలో నైట్‌ డ్యూటీ ఎవరిదనే అంశాన్ని అందరూ విస్మరించారు. ఆ సమయంలో ఉన్నాడు కాబట్టి అతనిదే బాధ్యతని తీర్మానించేశారు. వేటు వేసేశారు. అతను చాలా చక్కగా రాసే కంట్రిబ్యూటర్లలో ఒకడు. కానీ.. అలా జరిగిపోయింది. ఇప్పుడతను కాకినాడలో ఓ ఆంగ్ల పత్రికకు రిపోర్టర్‌ గా చేస్తున్నాడు. ఏం జరిగినా మన మంచికే అనే సూత్రాన్ని ఇతనికి ఆపాదించవచ్చునా… అతను నా వద్దవదిలి వెళ్ళిన బూదరాజు రాధాకృష్ణగారి ఈనాడు వ్యవహారిక పదకోశం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. కొన్ని సంఘటనలు గుర్తుండాలంటే ఇటువంటి జ్ఞాపికలు కూడా అవసరమే…

ఇక వచ్చే భాగాలలో రాజమండ్రిలో తెలుగు దేశం మినీ మహానాడు, ప్రధానిగా పివి నరసింహారావుగారి పర్యటన, కోనసీమ తుపాను, పాశర్లపూడి బ్లోఅవుట్‌.. నన్ను అపనిందకు గురిచేసిన ఓ పడవ ప్రమాదం సంఘటనల గురించి వివరిస్తా…

రెండు పుష్కరాలు నేర్పిన అక్షరాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...