నేడు 104 వ జయంతి
(రోచిష్మాన్, 9444912279)
భారతీయుల అభీష్ట సిద్ధిగా అయోధ్యలో రామాలయం సాకారం అవడానికి, బీ.జే.పీ. దేశ ప్రజా ప్రభుత్వం అవడానికి తొలి అడుగు పీ.వీ. నరసింహారావు.
ఇవాళ పీ.వీ. నరసింహారావు జయంతి-
స్వతంత్ర భారతదేశం చరిత్రను పీ.వీ. నరసింహారావుకు ముందు, తరువాత అని పరిగణించాలి. భారతదేశాన్ని పునర్నిర్మించిన మనీషి శ్రీమాన్ పీ. వీ. నరసింహారావు. ఆయన తరువాత కాలంలో భారతదేశం సాధించిన ప్రగతికి మూలకం ఆయనే! ఈనాటి ఈ దేశానికి కీలకం ఆయనే. ఈ దేశానికి అమరిన అత్యంత ప్రధానమైన ప్రధానమంత్రి పీ.వీ. నరసింహారావు.
దేశ ప్రధాని కాకముందే కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో ఎన్నో సంస్కరణల్ని తీసుకువచ్చారు. విదేశాంగ శాఖ, మానవ వనరుల శాఖల్లో ఎంతో గణనీయమైన మార్పును, సంస్కరణనూ తీసుకొచ్చారు పీ.వీ.ఎన్. 1973లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూసంస్కరణల్ని చేశారు. సంస్కరణల్ని తీసుకురావడం అన్నది చదువువల్ల, మేధవల్ల ఆయనకు సహజంగా అమరిన లక్షణం.

1991లో యాదృచ్ఛికంగా దేశ ప్రధాన మంత్రి అయ్యారు పీ.వీ.ఎన్. ఈ దేశానికి మంచి కూడా అదేవిధంగా యాదృచ్ఛికంగానే జరిగిందేమో? ఆయనే లేకపోతే ఈ దేశం పరిస్థితి ఏమయ్యేదో?
పతనమైపోయిందానికి ప్రగతినివ్వడం అన్నది ఒక విశేషమైన మేధ వల్లే సాధ్యపడుతుంది. ఆ విశేషమైన మేధ పీ.వీ. ఎన్. మేధ. అప్పటికి అంతకు పూర్వ ప్రభుత్వాల పని తీరువల్ల దేశం నాశనం అయిపోయింది. కావలిసినంత బలం లేని ప్రభుత్వంతో దేశానికి అత్యవసరంగా కావాల్సిన దాన్ని అద్భుతంగా చేశారు పీ.వీ. ఎన్. ఆ తన పనితనంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపఱిచారు ఆయన.
పీ.వీ. నరసింహారావు ఇంకో సారి ప్రధాని అయితే భారతదేశం అగ్రదేశం అయిపోతుందని అమెరికాకు నిఘావర్గాలు నివేదికనిచ్చారు అంటేనే తెలిసిపోతోంది పీ.వీ.ఎన్. ఎలాంటి వారో.
పీ.వీ. నరసింహారావు దేశప్రధాని అయిన వెంటనే పరిష్కరించాల్సిన సమస్య ఆర్థిక స్థితి. దానికి తరుణోపాయంగా పీ.వీ. చేసిన మొదటి పని సుబ్రమణియన్ స్వామిని పిలవడం. ఈ దేశానికి అవసరమైన ఆర్థిక విధానాల బ్లూ ప్రింట్ స్వామి అప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆ విషయం నరసింహారావుకు తెలుసు. నెహ్రూ, ఇందిర విధానాలవల్ల అప్పటికి దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. అప్పటికి దేశానికి అవసరమైనవి స్వామి ఆర్థిక ఆలోచనలే. ఇక్కడే పీ.వీ. ఎన్. సరిగ్గా పనిచేశారు. స్వామికి ఆర్థికమంత్రి పదవి ఇస్తానన్నారు. స్వామి తిరస్కరించారు. దేశావసరాల కోసం స్వామి తన బ్లూ ప్రింట్ ను పీ.వీ.కి ఇచ్చేశారు. దాన్ని పీ.వీ. తమ మేధతో మెఱుగుపఱిచి అమలుపఱిచారు. దేశాన్ని గట్టెక్కించారు. ప్రపంచాన్ని విస్మయపఱిచారు. స్వామి ఒకసారి ఇలా అన్నారు: “నేను రాయిని, రావ్ పాఱే నది.” మఱోటీ అన్నారు స్వామి ఇలా: “గొప్ప పాలనను అందించింది రావ్ మాత్రమే.” (ఆ సమయం వరకూ)

రాజకీయాలు, దేశభద్రత, ప్రభుత్వ నిర్వహణ, విదేశాంగ విధానం, వాణిజ్యం వీటిల్లో పీ.వీ.ఎన్. విశేషమైన నేర్పును ప్రదర్శించారు. ఈనాటి దేశ గమనానికి ఆధారం పీ.వీ. పాలన.
ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రషా (రష్యా) నుంచి మనదేశం బయటకు జరగాల్సిన ఆవశ్యకతను గుర్తించి మన దేశాన్ని బయటకు జరిపారు పీ.వీ.ఎన్. కొన్ని అవసరాల రీత్యా మనదేశానికి అమెరికా ఆవసరాన్ని గుర్తించి అటువైపుకూ దేశాన్ని నడిపారు. కొన్ని సందర్భంలో అమెరికాకు బుద్ధిచెప్పారు పీ.వీ.ఎన్.

వాజ్ పేయి ప్రధాని అయ్యాక పీ.వీ. కి భిన్నంగా వెళ్లాలని ఎంతో ప్రయత్నించి సత్ఫలితాల్ని పొందలేక తనను తాను మార్చుకుంటూ పోతే చివరికి పీ.వీ.ఎన్. మార్గంలోకే వెళ్లారు. అంత వాజ్ పేయికి కూడా అప్పుడు కానీ అర్థం కాలేదు పీ.వీ. ఎన్. అంటే ఏమిటో. పీ.వీ. ఎన్. ను అర్థం చేసుకోవాడానికి మేధావులకే కొన్ని దశాబ్దులు పట్టింది.
బీ.జే.పీ. ఎదగడానికీ, అధికారంలోకి రావడానికి వెనుక పీ.వీ. ఎన్. మేధ ఉందని కొందఱు చెబుతారు. ఈ దేశం విదేశీ దుష్టశక్తుల పాలయ్యే అవకాశాలున్నాయనీ అది జరగ కూడదనీ వాజ్ పేయి, ఆడ్వాణీలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రోత్సహిస్తూ వాళ్లకు ప్రాముఖ్యతను తీసుకువచ్చారు పీ.వీ.ఎన్. బాబ్రీ మసీద్ కూలడంలో పీ.వీ.ఎన్. పాత్ర బహిరంగ రహస్యమే. దాని వల్ల లబ్ది పొందింది బీ.జీ.పీ.నే.
పీ.వీ. ఎన్. ప్రధానమంత్రి అయిన ఏడాదిలోపే సోనియా తనకు ఆ పదవి కావాలని పీ.వీ.ఎన్. పై ఒత్తిడి తెచ్చారనీ, పీ.వీ.ఎన్. ఆమెను కట్టడి చెయ్యడమే కాకుండా పార్టీకే ఆమెను దూరం చేశారనీ సుబ్రమణియన్ స్వామి చెబుతారు. సోనియాను ప్రధానమంత్రి కాకుండా చెయ్యగలిగింది మొదట పీ.వీ.నరసింహారావే. అందుకు దేశమంతా ఎప్పటికీ ఆయనకు కృతజ్ఞత చెబుతూండాలి.

(పీ.వీ. ఎన్. 1997లో తమిళ సినిమా నటుడు రజనీకాంత్ చేత ప్రాంతీయ పార్టీ పెట్టించే ఆలోచన చేశాక, చర్చలు జరిగాక రజనీకాంత్ చివరి సమయంలో వెనక్కు తగ్గడంతో అది జరగకుండా పోయింది)
మనదేశంలో కమ్యూనిజమ్ దెబ్బతినడానికి కూడా నరసింహారావు మేధే కారణం అని చెప్పబడుతూంటుంది. మనదేశంలో అత్యంత హితకరమైన పరిణామాలుగా జరిగిన కాంగ్రెస్, కమ్యూనిజమ్ రెండిటి పతనానికి పీ.వీ. నరసింహారావు తీరే కారణమా? ఈ దేశానికి మేలు చేసిన తొలి ప్రధాని పీ.వీ. నరసింహారావేనేమో? ఆయన చేసినట్టుగా ఆయనకు ముందు ఈ దేశానికి మఱే ప్రధానీ మేలు చెయ్యలేదేమో?

“భారతరత్న ఇవ్వడానికి సరిగ్గా తగిన వ్యక్తి పీ.వీ. నరసింహా రావ్” అని ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకోగలిగిన మేధ ఉన్న సుబ్రమణియన్ స్వామి పదే పదే బహిరంగంగానే ప్రకటిస్తూండే వారు. ప్రస్తుత కేంద్ర ప్రజాప్రభుత్వం మాన్య ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పీ.వీ. నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేసింది. అందుకు కేంద్ర ప్రజాప్రభుత్వానికి ప్రతి తెలుగువ్యక్తీ కృతజ్ఞత తెలపాలి.
అవును పీ.వీ. నరసింహారావు సిసలైన భారతరత్న.
ఎంతో చెప్పుకోవచ్చు; ఎంతో చెప్పుకోవాలి ఆయన గుఱించి. ఆయన జయంతి సందర్భంగా ఈ దేశ పౌరులంగా పీ.వీ. నరసింహారావు గారిని మనసారా స్మరించుకుందాం.
‘P.V. Narasimha Rao, the transitional figure in the Indian growth and governance’

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)