ఆ మూర్తి… ఏ మూర్తీ కాడా?

0
111

అన్నమయ్య అన్నది -17
(రోచిష్మాన్, 9444012279)

“నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు
సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు,
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం
స్తుత్యుఁడీ తిరువేంకటాద్రి విభుఁడు”

ఎడతెగని ఆత్మ అయి ఉండి ఎప్పుడూ (శాశ్వతంగా) వెలుగుతూంటాడు; నిజమైన ఆత్మగా ఉండి నిజమై తానుంటాడు; ఎదురుగా ఉండి బ్రహ్మమై ఉంటాడు‌. కీర్తించతగినవాడు ఈ తిరువేంకటాద్రి ప్రభువు అంటూ సంకీర్తనను పల్లవింపజేశారు అన్నమయ్య.

“నిత్యమేవచ భావాత్” అని‌ ఒక బ్రహ్మ‌సూత్రం (అధ్యాయం 2 పాదం 2 సూత్రం 14) తెలియజేస్తోంది. అంటే బ్రహ్మం భావంవల్ల నిత్యమైనది అని అర్థం. ఆదిశంకరాచార్య వివేకచూడామణి (శ్లోకం‌ 352)లో “నిత్యాద్వయాఖండ చిదేక రూపో…” అని ప్రవచించారు. అంటే పరమాత్మ‌ అద్వితీయమైన (రెండవది లేని), ఖండితం కాని ఒక్కటే‌ అయిన‌ జ్ఞాన రూపం అని అర్థం. “తదే తత్సత్యం” (2-1-1) అని ముండకోపనిషత్ తెలియజేసింది. అంటే అది సత్యమైనది అని అర్థం.

“ఏమూర్తి లోకంబులెల్ల నేలెడుఁ‌ నాతఁడే
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదికెడు నాతఁ
డేమూర్తి నిజమోక్ష మియ్యఁ జాలెడు నాతఁ
డేమూర్తి లోకైక హితుడు
డేమూర్తి నిజమూర్తి యేముర్తియునుఁ గాడు
ఏమూర్తి‌ త్రైమూర్తు లేకమైన యాతఁ
డేమూర్తి సర్వాత్ముఁ డేమూర్తి పరమాత్ముఁ
డామూర్తి తిరువేంకటాద్రి విభుఁడు”.

ఏ మూర్తి లోకాలన్నిటినీ ఏలే అతడు ఏ మూర్తి? బ్రహ్మాదులందఱూ వెతికే అతడు ఏ మూర్తి? నిజమైన మోక్షాన్ని ఇవ్వగలిగే అతడు ఏ మూర్తి? లోకానికి ఏకైక హితుడయిన అతడు ఏ మూర్తి?
శాశ్వతమైన మూర్తి (నిజమూర్తి) ఏ మూర్తీ కాడు.
ఏ మూర్తి ముమ్మూర్తులు ఏకమైన అతడు ఏ మూర్తి? సర్వాత్ముడు ఏ మూర్తి? పరమాత్ముడు‌ ఆ మూర్తి‌ (ఆ పరమాత్ముడు) తిరువేంకటాద్రి‌‌ ప్రభువు అని అంటూ ఒక అనన్యమైన శయ్య (పదాల అల్లిక) తో ఒక అభిజ్ఞమైన అభివ్యక్తిని చేశారు అన్నమయ్య‌. ఎంత అద్భుతంగా‌ చెప్పారు! అద్భుతంగా చెప్పడం‌‌ అంటే ఇదే అన్నట్టుగా చెప్పారు అన్నమయ్య.

ఏ మూర్తి, ఏ మూర్తి‌, ఏ మూర్తి అంటూ‌ ఉన్నతమైన శిల్పంతో పురోగమిస్తూ ఏ మూర్తీ కాదు అని అన్నారు అన్నమయ్య. అంతేకాదు ఆ చెప్పడం ఒక గతిలో
సాగుతూ, సాగుతూ ఆ గతిలోనే మఱికొంత ముందుకు సాగడానికి అనువుగా కాస్తంత పక్కకు అడుగు వేసినట్టు ఉంది. సంగీతం పరంగా గాయనం లేదా‌ గానం సాగుతూండగా తెఱిపినిచ్చే స్వరం (relief-note) లాగా ఉంది ఆ తీరు.

“అనజానన్తి మాం మూఢా మానుషీం తను మాశ్రితం / పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరం” అని భగవద్గీత(అధ్యాయం 9 శ్లోకం 11)లో పరమాత్ముడు చెప్పాడు. అంటే ప్రాణులన్నిటికీ మహేశ్వరుణ్ణైన నాయొక్క శ్రేష్ఠమైన భావాన్ని తెలియని వాళ్లై ఆకారాన్ని లేదా మూర్తిని ఆశ్రయించానని మూఢులైన మానవులు నన్ను తెలుసుకుంటారు అని అర్థం.‌ పరమాత్మకు ఆకారం లేదా మూర్తి ఉండదు అని అన్వయం. “మాన్త్ర వర్ణికమేవచ గీయతే” అని బ్రహ్మ‌సూత్రం (అధ్యాయం 1 పాదం 1 సూత్రం‌ 15) చెబుతోంది‌. అంటే బ్రహ్మం రహస్యరూపం కలది అని నిశ్చయంగా గానం చెయ్యబడుతోంది అని అర్థం.

ఈ‌ చరణంలో అన్నమయ్య చెప్పినది వివేకచూడామణి (శ్లోకం 389)లో‌ ఆది‌శంకరాచార్య ఇదిగో ఇలా చెప్పినదాన్ని తలపిస్తోంది‌. “స్వయం బ్రహ్మ స్వయం విష్ణుస్వ్సయంమింద్రస్వ్సయంశివః / స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్యన్న కించన” అంటే తాను (పరమాత్మ) బ్రహ్మ , తాను‌ విష్ణు, తాను ఇంద్రుడు, తాను శివుడు, తాను ఈ సర్వప్రపంచం తనకన్నా మఱొకటేదీ లేదు అని అర్థం.

“ఏ దేవు దేహమున నిన్నియును జన్మించె
నే దేవు దేహమున నిన్నియు నణఁగె మఱి
యే దేవు విగ్రహం బీసకల మింతయును
ఏ దేవు నేత్రంబు లిన చంద్రులు,
ఏ‌ దేవుఁడీ జీవు లిన్నింటిలో నుండు
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార
మేదేవుఁడవ్యక్తు డేదేవుఁ డద్వంద్వుఁ
డా దేవుఁడీ వేంకటాద్రి విభుఁడు”.

ఏ దేవుడి దేహంలో ఇన్నీ పుట్టాయో, ఏ దేవుడి దేహంలో ఇన్నీ ఇమిడాయో, ఏ దేవుడి విగ్రహంగా ఈ సకలమంతా ఉన్నదో, ఏ దేవుడి నేత్రాలు సూర్య చంద్రులో, ఏ‌ దేవుడు‌ ఈ ఇన్ని జీవాలలో‌ ఉంటాడో, ఏ దేవుడు చైతన్యం ఇన్నిటికీ ఆధారమో, ఏ దేవుడు అవ్యక్తుడో, ఏ దేవుడు ద్వంద్వుడు‌ కాడో ఆ‌ దేవుడే ఈ వేంకటాద్రి‌ ప్రభువు అని అంటూ పరమాత్ముణ్ణి అనఘంగా అన్నమయ్య ఆవిష్కరించారు.

“జన్మాద్యస్య యతః” అని బ్రహ్మసూత్రం (అధ్యాయం 1 పాదం 1 సూత్రం 2) చెప్పింది. అంటే ఈ‌ సృష్టికి‌ ఆదిగా ఏది ఉందో అది‌ బ్రహ్మం లేదా పరమాత్మ. “అహం సర్వస్వ ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే” అని భగవద్గీత ( అధ్యాయం 7 శ్లోకం 8) చెప్పింది. అంటే నేను (పరమాత్మ) సకలమూ పుట్టడానికి కారణం. నా ద్వారా (పరమాత్మ‌ ద్వారా) సకలమూ నడుస్తుంది అని అర్థం.

‘దేవుడి విగ్రహం ఈ సకలమంతా’ అని చెప్పడం విశ్వరూపాన్ని సూచించే గొప్ప అభివ్యక్తి. పరమాత్మ‌ లేదా బ్రహ్మం‌‌ గుఱించి ఆదిశంకరాచార్య‌ వివేకచూడామణి (శ్లోకం‌ 210) లో ఇలా‌ చెబుతున్నారు: “నిరస్తమాయాకృత సర్వభేదం నిత్యం సుఖం నిష్కళంక మప్రమేయమ్ / అరూపమవ్యక్త మనాఖ్య మవ్యయం జ్యోతిస్స్వయం కించిదిదం చకాస్తి”. ఇక్కడ శంకరులు బ్రహ్మాన్ని అవ్యక్తం అంటే ఇంద్రియాలకు కనిపించనిది అని చెబుతున్నారు‌. అన్నమయ్య కూడా ఇక్కడ అవ్యక్తుడని అంటున్నారు.

భగవద్గీత (అధ్యాయం 10 శ్లోకం 20)లో “అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ యస్థితః” అని ఉంది. అంటే నేను (పరమాత్మ) అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్న జీవాన్ని అర్జునా అని అర్థం. భగవద్గీత (అధ్యాయం 10 శ్లోకం 22)లో “భూతానామస్మి చేతనా” అనీ ఉంది.‌ అంటే ప్రాణుల్లో చైతన్యం నేను అని‌ అర్థం. భగవద్గీత (అధ్యాయం 11 శ్లోకం 18)లో “త్వమస్య విశ్వస్య పరం నిధానం” అని అర్జునుడు పరమాత్మను అంటాడు. అంటే నువ్వు ఈ‌ ప్రపంచానికి గొప్ప ఆధారం అని అర్థం. భగవద్గీతలోనే (అధ్యాయం (11 శ్లోకం 19) “శశి సూర్య నేత్రం” అని పరమాత్మను అర్జునుడు అంటాడు. అంటే చంద్ర సూర్యులను కళ్లుగా కలిగి‌నవాడు అని. ఒక కైవల్యోపనిషత్ శ్లోకం ఇలా తెలియజేస్తోంది: “మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం / మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం” అంటే నా ఒక్కడినుండే అన్నీ పుడుతున్నాయి, అన్నీ నాలోనే నెలకొన్నాయి, అన్నీ నాలోనే లయిస్తున్నాయి నేను ఆ అద్వంద్వమైన బ్రహాన్ని అని. అన్నమయ్య ఈ‌ భావాలనే తన కావ్యవాక్యాలలో ఇక్కడ ప్రతిష్ఠించారు.

“ఏ వేల్పు పాదయుగ మిలయు నాకాశంబు
ఏ వేల్పు పాద కేశాంతం బనంతంబు
ఏ‌ వేల్పు నిశ్వాస మీ మహామారుతము
ఏ‌ వేల్పు నిజదాసులీ పుణ్యులు,
ఏ వేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ
డే వేల్పు భువనైక హిత మనోభావకుఁడు‌
ఏ వేల్పు కడు‌సూక్ష్మ మేవేల్పు కడు‌ ఘనము
ఆ‌ వేల్పు తిరువేంకటాద్రి విభుడు”

ఏ వేల్పు యొక్క రెండు పాదాలు భూమి, ఆకాశాలో, ఏ వేల్పు పాదాల, కేశాల చివరిభాగాలు అనంతాలో, ఏ వేల్పు నిశ్వాసం ఈ మహామారుతమో, ఏ వేల్పుకు
ఈ పుణ్యాత్ములు నిజమైన దాసులో, ఏ వేల్పు సర్వేశ్వరుడో‌, ఏ వేల్పు పరమేశ్వరుడో‌, ఏ వేల్పు‌ భువనానికి సత్యమైన (భువనైక… భువన+ఏక; ఏక= సత్యమైన) హితాన్ని మనసులో భావిస్తాడో? ఏ వేల్పు చాల సూక్ష్మమైన వాడో, ఏ వేల్పు చాల గొప్ప లేదా చాల విస్తారమైన వాడో ఆ వేల్పు తిరువేంకటాద్రి ప్రభువు అని అంటూ పరమమైన‌ వేల్పు గుఱించి వాక్యాల కావ్యాలను చెక్కారు అన్నమయ్య.

ఏ వేల్పు రెండు పాదాలు భూమి, ఆకాశాలో, ఏ వేల్పు పాదాల, కేశాల చివరిభాగాలు అనంతాలో అనడం పరమాత్మ‌ బ్రహ్మాండత్వాన్ని‌ మళ్లీ తెలియజెయ్యడం, సనాతన వాఙ్మయం తెలియజెప్పినదాన్ని కవితాత్మకంగా వల్లెవేసుకోవడం. పరమాత్మ‌ నిశ్వాసం‌ మహామారుతం అనడం శ్రేష్ఠమైన భావుకత. భువనంలో ఏకైక హితం‌ అంటున్నారు…‌ ఈ సంకీర్తన మొదటి చరణంలోనూ లోకైక హితుడు అని చెప్పారు అన్నమయ్య. ఇలా చెప్పడం దేన్ని సూచిస్తోంది? అన్నమయ్యను అడిగి తెలుసుకునే అవకాశం‌ మనకు లేదు. మనం ఆలోచన చేద్దాం.

భగవద్గీత (అధ్యాయం 4 శ్లోకం 7) లో “యదా యదా‌ హి ధర్మస్య గ్లానిర్బవతి భారత / అభ్యుత్థానమధర్మస్య తథాऽऽత్మానం సృజామ్యహం” అని పరమాత్మ చెప్పాడు. అంటే ఎప్పుడెప్పుడు బలమైన ఆలోచనకు (ధర్మస్య ) దౌర్బల్యం లేదా బడలిక (గ్లాని), బలహీనమైన ఆలోచనకు (అధర్మస్య) అభివృద్ధి (అభ్యుత్థానం) వస్తుందో అప్పుడే నేను పరాక్రమాన్ని (ఆత్మానం) సృష్టిస్తాను అని అర్థం. ఆ పరాక్రమమే పదమాత్మ చేసే హితం. అది పరమాత్మ మాత్రమే చెయ్యగల హితం. అదే భువనానికి సత్యమైన (ఏకైక) హితం. ఇలా భువనానికి సత్యమైన హితాన్ని మనసులో భావిస్తున్న వేల్పు పరమాత్మ.

“అణవశ్చ” అని బ్రహ్మ‌సూత్రం‌ (అధ్యాయం 2 పాదం 4 సూత్రం 7) తెలియజేస్తోంది. అంటే అణువులా కూడా పరమాత్మ ఉంటాడు అని అర్థం. కఠోపనిషత్ (1-2-20) ఇలా‌ చెబుతోంది: “అణోరణియాన్ మహతో మహియాన్ ఆత్మన్…” అంటే పరమాత్మ అణువులో అణువు, గొప్ప (మహత్) వాటిల్లో గొప్ప అని‌ అర్థం. పరమాత్మ సూక్ష్మమైన వాడూ ఎంతో గొప్ప‌ లేదా ఎంతో విస్తారమైన వాడూనూ.

ఇవాళ ప్రపంచంలో ఉత్తమ కవిగా పరిగణించబడుతూ ఎక్కువగా చదవబడుతున్న చైనీస్ కవి, తాత్త్వికుడు లావ్ – చు (Lao – Tzu) పరమాత్మపై చెప్పిన‌ కొన్ని‌ పంక్తుల్ని చూడండి; “పరమాత్మ(Tao – టావ్)ను తెలుసుకోలేం; ఆతడు పరమాణువులోని‌ ఋణ విద్యుత్కణం‌ కన్నా స్మూక్షమైన వాడు (Tao can not be perceived / smaller than an electron)”, అన్నీ పరమాత్మలో‌ ముగుస్తాయి (All things end in Tao)”, “గొప్పవాడైన పరమాత్మ ప్రతి చోటా ప్రవహిస్తుంది. అన్నీ దాని నుండే పుట్టాయి (The great Tao flows every where / All things are born from it)”. ఇవి ఈ సంకీర్తనలో అన్నమయ్య మాటలకు సరిపోలుతున్నాయి.

ప్రస్థానత్రయం భావాలతో, ప్రశస్తమైన పద పురోగతితో, ప్రశంసనీయమైన శిల్పంతో పరమాత్మపై పరమోత్కృష్టమైన‌ కావ్యంగా పరిఢవిల్లుతూ ఉన్నది ఇలా అన్నమయ్య‌ అన్నది.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here