(డా. పురాణపండ వైజయంతి)
కొన్ని కథలు మానవ జీవితంలో సుస్థిర స్థానాన్ని చోటుచేసుకుంటాయి. ఆ కథలకు ఆధునికత జోడించితే, అంగీకరించడం అంత తేలిక పని కాదు. అందుకే ఎంతో సామర్థ్యం, జ్ఞానం, నేర్పరితనం… ఇంకా చాలానే ఉండాలి. అవి లేకపోతే.. ఆ వ్యక్తి పడిన శ్రమంతా వృథానే.
త్యాగరాజు రచించిన కీర్తనలను ఫ్యూజన్ పద్ధతిలో చాలామంది గానం చేస్తుంటారు. అటువంటి సమయంలో వారు అసలు రాగాన్ని ఏ మాత్రం పక్కకు పోనీయకుండా, కొన్ని ఆధునిక వాద్య పరికరాలను ఉపయోగిస్తూ, లయ (బీట్) కు ప్రాధాన్యమిస్తూ, ఆ కీర్తనలను సామాన్యులకు చేరేందుకు కృషి చేస్తున్నారు, అందులో విజయం సాధిస్తున్నారు.
ఇంత ఉపోద్ఘాతం దేనికంటే..
కన్నప్ప…
ఈ సినిమాను ఎవ్వరి ప్రభావం లేకుండా చూడాలనే ఉద్దేశంతో, రివ్యూలు చదవకుండా, కథ వినకుండా, ఫ్రెష్ మైండ్‌తో చూడటానికి వెళ్లాను. ఆ సినిమా చూసిన తరవాత నా అభిప్రాయాన్ని ఒక రివ్యూలా రాయాలనుకున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయంతో ఎవ్వరూ ఏకీభవించనక్కరలేదు. ఎవరి అభిరుచి వారిది…
కథ…
ఈ సినిమా –
యాక్షన్ సినిమానా…
ఫ్యాక్షన్ సినిమానా…
భక్తి సినిమానా…
స్వదేశీ సినిమానా…
విదేశీ సినిమానా…
అసలు ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహాత్మ్యం.. కథేనా…
ఇటువంటి ప్రసిద్ధి చెందిన కథలను సినిమాగా తీసేటప్పుడు…
ఎక్కువమందిని మెప్పించటం చాలా కష్టం..
పాత సినిమాలో కన్నడ రాజకుమార్ ఎలా చేశాడు…
బాపు దర్శకత్వంలో వచ్చిన కృష్ణంరాజు ఎలా చేశాడు…
ఇప్పుడు మంచు విష్ణు ఎలా చేశాడు…
ఈ మూడిట్లో ఏ సినిమా బాగా తీశారు..
సంగీతం ఎలా ఉంది…
పాటలు బావున్నాయా..
భావోద్వేగాలు చూపగలిగారా…

ఇలా..
ఎన్నో…
ఎన్నెన్నో…
ప్రతి అంశం మీద లెక్కలు వేస్తుంటారు.
పోనీ అలా పోల్చకుండా చూద్దామా అంటే…
అది ప్రబంధ కథ.
అందునా శివభక్తుని కథ…
ముందుగా కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం…
ఈ సినిమా కోసం మంచు విష్ణు తన సర్వశక్తులూ ఒడ్డి నటించాడు.
అంతే…
జీవించాడు అనలేం.
మరి వేషధారణ…
బెన్‌హర్‌లాంటి చిత్రాలు చూసినవారికి ఈ మేకప్ ఎలా ఉందో అర్థమైపోతుంది.
మల్టీ స్టారర్ మూవీ కనుక ఇతర భాషలకు చెందిన నటులు నటించారు.
వారికి ఇచ్చిన డబ్బింగ్ కారణంగా ఒక్కరి మాటలోనూ ఎటువంటి భావం పలకలేదు. అసలు సంభాషణలకు ప్రాణమే నటుల గొంతులో పలికే భావం.
ఎంత చెత్త డైలాగునైనా బ్రహ్మానందం వంటి వారు మాట్లాడితే మనకు నవ్వు వస్తుంది.
ఎస్. వి. రంగారావు, గుమ్మడి వంటి వారి నోటి నుండి వెలువడే మాటలకు మనం కన్నీరు కార్చుతాం.
అటువంటి ఒక్క భావోద్వేగమూ ఈ చిత్రంలో నాకు కనిపించలేదు.
ఆఖరి పావు గంట వరకు సినిమా అంతా ఇంగ్లీషు సినిమాలలో హీరోలు, విలన్లు కొట్టుకుంటున్నట్లే అనిపించింది.
గ్రాఫిక్స్‌ను అవసరానికి మించి వాడటం వలన వాటికి ఏ మాత్రం విలువ లేకుండా పోయింది.
ఇతర భాషల వారిని ఎంచుకోవడం తప్పు కాదు, కానీ, ఆ పాత్రలకు మంచి డబ్బింగ్ లేకపోతే, కథ బలంగా నిలబడదు.
ఇక శివపార్వతు పాత్రలు…
శివుడిగా ఎన్. టి. ఆర్, బాలయ్య (క్యారెక్టర్ నటుడు) వంటి వారిని చూసిన తరువాత –
అక్షయ్ కుమార్ ను చూస్తే అంగీకరించలేరు.
అతడి ముఖం ఆ పాత్రకు ఏ మాత్రం సరిపోదు.
పైగా ఎడమ చేతితో ఆశీర్వాదం.
ఇంక –
పార్వతీదేవిగా భానుప్రియ, జయపద్ర, సౌందర్య వంటివారు తప్పించి మిగతా వారిని అంగీకరించటం కష్టమే.
ఒక పాత్ర చేసేటప్పుడు ఆ పాత్రలో నటిస్తున్నంతసేపు ఒక పవిత్ర భావన కలగాలి ప్రేక్షకులకు.
ఇక కథానాయిక పాత్రను వర్ణించటానికి ఒక్క అక్షరం కూడా రాదు.
పూర్తిగా వివస్త్రగా ఉండటానికే ప్రాధాన్యత కలిగిన పాత్ర.
ఒక శివ భక్తురాలు అంటే ఎంతో భక్తితో నటించాలి. కాని ఈమె మాత్రం పూర్తిగా రక్తితో నటించింది.
గూడెంలో ఉండేవారు వస్త్రాలు ధరించరా అని ప్రశ్నించుకోవాలి.
ఇలా రాసుకుంటూ పోతే నావంటి ఉత్తమ అభిరుచి గల సినిమా ప్రేమికులకు చాలా లోపాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఈ తరం వారికి కన్నప్ప కథ తెలియదు కాబట్టి, ఈ కథను వారు పెద్ద మనస్సుతో ఆదరించారు.
సినిమా సక్సెస్ అయింది.

పెట్టిన డబ్బులు కూడా వచ్చేశాయి.
ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ప్రభాస్.
అతిథి పాత్రలో కనిపిస్తాడు.
ఆ తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు కావలసినంతా అందించేశాడు.
సంభాషణలు చక్కగా రాశారు.
కాని రచయిత మనసులోని ఆ భావాన్ని ఎవరి గొంతులోనూ వ్యక్తపరచలేకపోయారు.
నేను ఇలా రాశానని సినిమా బాగోలేదనే భావనతో ఉండకండి.
ఈ కథ నేపథ్యంలో గతంలో వచ్చిన రెండు సినిమాలు చూసినవారికి ఇప్పుడు వచ్చిన ఈ సినిమా నిరాశనే మిగులుస్తుంది.
నిర్మాతలు వందల కోట్లు ఖర్చు చేసుటప్పుడు, ఇటువంటి కథను ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకునేలా చేసే దర్శకుడిని ఎంచుకుని, వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి.
అప్పుడు ఆ దర్శకుడు అందమైన దృశ్యకావ్యాన్ని అందించగలడు.
కాంతార సినిమా చూస్తున్నంతసేపు, అందరూ ఆ పల్లె వాతావరణంలోకి వెళ్లిపోయారు.
‘ఇటువంటి ప్రదేశాలలో మనుషులు ఇలా ఉంటారా’ అనే భావనలోకి వెళ్లగలిగారు.
కాని
కన్నప్ప విషయంలో…
!!!!!!!
గమనిక: ఏ సినిమానైనా ఎవరి మనస్సుతో వారు చూడండి, ఎవరి రివ్యూలకు ప్రభావితులు కావద్దు. సినిమా… చూడాలనుకుంటే చూడాలి.. వద్దనుకుంటే మానేయాలి.. అంతే…
ఎవ్వరో ఏదో చెప్పారని…
ఎవరో ఏదో రాశారని…
ఎవ్వరి అభిప్రాయాలకు ప్రభావితులు కాకుండా…
ఫ్రెష్ మైండ్‌తో చూడండి.
ఈ రివ్యూ ద్వారా ఎవ్వరినీ కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. టికెట్ కొనుక్కుని, అత్యంత విలువైన సమయాన్ని వెచ్చించి, సినిమాను చూసిన తరువాత మనసులో మాటను వ్యక్తపరచాలనిపించింది.
అంతే.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)
చాలా కరెక్ట్ గా చెప్పారు. అది భక్తి చిత్రం కాదు.