“జగదేకవీరుడు అతిలోకసుందరి” తెర వెనుక కథ

0
162

(యండమూరి వీరేంద్రనాథ్)

సమిష్టి కృషికి నిదర్శనంగా నిలబడే సినిమాలలో ఒకటి “జగదేకవీరుడు అతిలోకసుందరి”.
చక్రవర్తి రెండు వాక్యాలు మూలకథగా చెప్పి వెళ్లి పోయాడు.

చిరంజీవినీ, శ్రీదేవిని హీరో హీరోయిన్లుగా ఊహించుకున్న అశ్వనీదత్తుకి ఈ కథా౦శం బాగా నచ్చింది.

కథా విస్తరణ మీద కూర్చున్నాము.

‘కథానాయకుడు మంచివాడు. అడిగితే ఉంగరం ఇచ్చేస్తాడు కదా…’ అన్న అనుమానం దేవకన్యకీ ప్రేక్షకులకి రాకపోవడం మా అదృష్టం. అప్పుడు సినిమా రెండవ రీల్లోనే అయిపోయేది.

  • * **

“ఆవకాయ అంత కథని ఆరు రుచుల వంటగా విస్తరించాలి. దాన్ని చిరంజీవికి చెప్పి ఆయన్ని ఒప్పించాలి” అన్నాడు దత్తు. వారం రోజులు పోయాక ఒక రాత్రి 7:00కి చిరంజీవి ఇంటికి ఇద్దరం వెళ్లాం. ‘ఆలోచన బావుంది. గో ఎహెడ్’ అన్నారు చిరంజీవి.

హీరోయిన్ దేవకన్య కాబట్టి, విలన్ మాంత్రికుడు అయితే బాగుంటుందన్నాను. అప్పటికే ‘ఆఖరిపోరాటం’ లో కొంత వరకూ ఆ రకమైన గెటప్ అమ్ఇరేష్చ్చా పూరికి ము. అందులో స్వామీజీ. ఇందులో క్షుద్రదేవతోపాసకుడు. ‘మెడలో పుర్రెల దండ వేసుకుంటాను’ అన్నాడాయన.

‘హీరో వృత్తి ఏమి పెడదాం’ దర్శకేంద్రుడు అడిగినప్పుడు “గైడ్” అన్నాను. దానికి కారణం చివర్లో చెప్తాను. అది చెప్తే, ఆయనకు ఆ ‘గైడ్’ కాన్సెప్ట్ ఎంత బాగా నచ్చిందంటే ఏ ఫైట్ తోనో కాకుండా “మన భారతంలో” అన్న పాటతో స్టెప్సూ గట్రా లేకుండా గట్స్ తో హీరోని పరిచయం చేశారు.

స్వర్గలోకం నుంచి వచ్చింది కాబట్టి శ్రీదేవికి ఇంద్రజ అని పేరు పెట్టాను. కాస్త షూటింగ్ పూర్తయిన తర్వాత, హీరోయిన్ స్వర్గానికి తిరిగి వెళ్ళటానికి గడువు పెట్టక పోతే సస్పెన్స్ ఉండదని అనుకున్నాము. ఆ విషయం డైరెక్టర్ గారికి చెప్పి, మేఘాల మధ్య నుంచి ఇంద్రుడు శ్రీదేవిని హెచ్చరించే సీన్ ఒకటి అందులో కొత్తగా కలిపాము.

మా కాలేజీ రోజుల్లో ‘కాకినాడ చిరంజీవి, రాజమండ్రి శ్రీదేవి’ అని ఒక జంట రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా ఫేమస్. ఆ సందర్భంగా సినిమాలో పోలీసులు హీరో, హీరోయిన్ల వెంట పడినప్పుడు, వాళ్లు ఒక రికార్డింగ్ డాన్స్ డెన్ లోకి ప్రవేశిస్తారు. రంగస్థలం మీద నాట్యం చేస్తోంది నిజమైన చిరంజీవి, శ్రీదేవి అని మసక వెలుతుర్లో గుర్తించని ప్రేక్షకులు “మాకు వీళ్ళు కాదు. కాకినాడ చిరంజీవి, రాజమండ్రి శ్రీదేవే కావాలి” అని గోల చేస్తారు. ఈ సీన్ కామెడీ కోసం వ్రాసినా, అభిమానులతో కాంట్రవర్సీ అవుతుందని, జంధ్యాల, దర్శకులు కలిసి తర్వాత దీన్ని “ఆంధ్ర కింగ్ – బాంబే క్వీన్” గా మార్చారు.

వేటూరివారు “అబ్బనీ తీయని దెబ్బ” అని వ్రాశాక, సెన్సార్ కత్తెర నుంచి తప్పించు కోవాలంటే ఒకటే మార్గం..! శ్రీదేవి చెంప మీద హీరో కొట్టాలి..! అప్పుడు ఆలోచించి, శ్రీదేవి కారు తోలటం రాక- యాక్సిడెంట్ చేయడం, పిల్లల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే హీరోకి కోపం వచ్చి కొట్టటం – అన్న దృశ్యం కేవలం ఆ పాట కోసం కొత్తగా క్రియేట్ చేశాం.

శ్రీదేవి రాఘవేంద్రగారితో, ‘వెండితెర మీద కాన్వెంట్ స్కూల్ కాస్ట్యూమ్ వేసుకుని కనపడాలని ఎప్పటి నుంచో కోరిక..’ అని చెప్పిందంట. హీరో చెంప దెబ్బ కొట్టగానే ఆమె వెళ్లి స్కూల్లో చేరే సీన్ సృష్టింపబడింది. స్వామి కార్యము, స్వకార్యం ఆ విధంగా నెరవేరాయి.

సింగపూర్ నుంచి మా అబ్బాయి “డేట్ విత్ ఏన్ ఏంజెల్.. అనే సినిమా చూడు. మీ సినిమాకి పని చేస్తుంది” అని సూచన ఇచ్చాడు. రెక్క విరిగిపోయిన ఒక దేవకన్య ఏకాంత ప్రదేశంలో పడి ఉంటే, హీరో రక్షించి ఇంటికి తీసుకొస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. క్లైమాక్స్ లో హీరో చావు బతుకుల మీద ఉంటే, ఆమె అతన్ని బ్రతికించి తిరిగి వెనక్కి వెళ్ళిపోయే కథాంశమున్న సినిమా ఇది. అందులో హీరోయిన్ పసుపక్ష్యాదులతో మాట్లాడుతుంది.

శ్రీదేవి తొలిసారి దేవకన్య అని హీరోకీ, మిగతా పిల్లలకీ, తెలిసే(కనబడే) సీన్ ఒక రోమాంచిత దృశ్యంగా ఉండాలి- అనుకున్నాం.

“గది పై కప్పు చూరు లోంచి ఒక చంద్ర కిరణం ఏటవాలుగా ఇంటి లోపలికి పడుతుంది. పున్నమిరాత్రి ఆకాశంలో నిండు చంద్రుడు, చుట్టూ కుందేళ్లు, లేళ్లు, సెలయేళ్లు, చెట్టు కింద ఒద్దిగ్గా కూర్చుని శ్రీదేవి వాటితో మాట్లాడుతుండగా, హీరో పిల్లలతో సహా ఆ దృశ్యాన్ని దిగ్భ్రా౦తుడై చూసి, ఆమె మామూలు మనిషి కాదన్న విషయాన్ని గ్రహిస్తాడు” అని వ్రాశాను.

ఈ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు దర్శకేంద్రులవారు. తెలుగు చిత్రపరిశ్రమ సృష్టించిన అతి గొప్ప కళాత్మక దృష్టి ఉన్న దర్శకుల్లో రాఘవేంద్రరావుగారు ఒకరు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

సినిమా చివరికి వచ్చాక ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ఉందాలి. ఉంగరం విలువ తెలిసాక అది పోవాలి. లేకపోతే సినిమా సాదాగా నడిచిపోతుంది. అందుకే ఇందులో కొంచెం హిప్నాటిజం కూడా కలపటం జరిగింది.

పాపని మాయ చేసి మాంత్రికుడు ఉంగరం సంపాదిస్తాడు. బావుంది అనుకున్నాం. కానీ, సినిమా క్లైమాక్స్ కి వచ్చిందికాబట్టి, వెంటనే మళ్ళీ అది హీరోకి చేరాలి. ఎలా?

“విలన్ చేతి లోంచి ఉంగరం ఎత్తుకు పోయి కోతి హీరోకి ఇస్తుంది” అని చెప్పాను. ‘చాలా సిల్లీగా ఉంది’ అన్నాడు సత్యమూర్తి. ‘దానికే థియేటర్లో చప్పట్లు పడతాయి. చూస్తూ ఉండు’ అన్నాడు జంధ్యాల.

అలా ఉండేవి చర్చలు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ పని చేసే వాళ్ళము. వాళ్ళిద్దరు ప్రస్తుతం లేరన్న విషయం జ్ఞాపకం వస్తే మనసు శూన్యంగా అనిపిస్తుంది.

క్లయిమాక్స్ ఎంతకీ తెగటం లేదు. క్లాసికల్ రొమాన్స్ సినిమా కాబట్టి, క్లైమాక్స్ లో విలన్స్ తో భారీ ఫైట్ అక్కర్లేదని కొందరు, చిరంజీవి సినిమాల్లో ఫైట్ లేకపోతే ఎలా అని మరికొందరు అన్నారు.

అంతకు ముందే ‘అష్టావక్ర…’ అని ఒక నవల రాశాను. అందులో క్షుద్ర దేవతోపాసకుడు ఏడుగురు కన్యలని బలి ఇవ్వటం గురించి ఉంది. మాంత్రికుడైన అమ్రిష్ పురి శ్రీదేవిని ఆ విధంగా బలి ఇస్తున్నట్టు ఒక నిర్ణయానికి వచ్చాము.

సరే. కథ పూర్తయింది.

డైలాగ్ వెర్షన్ పూర్తయ్యాక దత్తు, జంధ్యాల, రాఘవేంద్రరావుగారు, నేను తిరుపతి వెళ్ళాం. దేవుడి పాదాల దగ్గర స్క్రిప్ట్ పెట్టడం ఆయనకి ఆనవాయితీ. తిరిగి వెనక్కి వస్తుండగా రెండు మూడు కొండలు దిగాక, చుట్టూ కోతులు, కొండలు, ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉన్న ఒక విశాల ప్రదేశంలో చెట్ల కింద కూర్చున్నాం. డైలాగు వెర్షన్ కొంత భాగం వినిపించాడు జంధ్యాల. రచయిత ‘తాను కనపడే ప్రయత్నం చెయ్యకుండా’ కథలో ఇమిడిపోయే చాలా క్లుప్తమైన సీన్లు. అల్లు రామలింగయ్య పాత్ర సృష్టి తనదే. నా స్క్రీన్–ప్లే లో లేదు.

‘మానవా’ ‘ఈ డైలాగు మానవా’ ‘దానిని వంకాయ అందురు’. స్క్రిప్ట్ విన్న తర్వాత అందరికీ హిట్ అనీ నమ్మకం కుదిరింది.

చిరంజీవిని ‘గైడ్’ గా పెట్టడం క్లైమాక్స్ గురించి మొదట్లో చెప్పాను కదా. జంధ్యాల అనుమతి తీసుకుని, క్లైమాక్స్ డైలాగ్ వ్రాశాను. ఇందులో కాస్త వెన్నెల్లో ఆడపిల్ల పోలికలు కనపడతాయి.

“వెళ్ళిరా ఇంద్రజా. ఓ గైడుగా ఎంతోమందికి ఇక్కడి అందాలు చూపించి ఆనందంగా వీడ్కోలు చెప్పేవాడిని. కానీ దేవకన్యవైన నీకు మా లోకంలోని కష్టాలూ, కన్నీళ్ళూ, మోసాలు, ద్వేషాలు, విధ్వంసాలూ, వైషమ్యాలూ చవి చూపించి కన్నీటితో వీడ్కోలు ఇస్తున్నాను. ఆలస్యమైతే స్వర్గలోక ద్వారాలు మూసుకుపోతాయి. వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా. బయలుదేరు.”
అలా అని చిరంజీవి అనగానే శ్రీదేవి ఉంగరాన్ని సముద్రంలోకి విసిరేస్తుంది. దాన్ని చేప మింగటం అనేది దర్శకేంద్రులవారి కోసం మెరుపు.

మొత్తానికి షూటింగ్ పూర్తయింది.

అప్పుడు నేను కే.ఎస్. రామారావు సినిమా స్క్రిప్ట్ కోసం మద్రాసులోనే ఉన్నాను. రీ-రికార్డింగ్ కి ప్రసాద్ స్టూడియోలో . రాత్రి 7:00 అయింది. థియేటర్లో నేను ఇళయరాజా ఇద్దరమే చూశాము. సినిమా ఎడిటింగ్, డబ్బింగ్ , పూర్తీ అయిన తరువాత, నేను చూడటం కూడా అదే మొదటి సారి.

షో పూర్తయ్యాక రాజా నా వైపు తిరిగి “వంద రోజుల సినిమా” అన్నారు.
“రి-రికార్డింగ్ అయిన తర్వాత 200 రోజుల సినిమా” అన్నాను. అప్పటికే ఇద్దరం కలిసి ఆరేడు సినిమాలు చేశాము. ఆ పరిచయమూ, చనువూ ఉంది.

చాలా సినిమాల్లో ఎవరి విభాగంలో వాళ్ళు పని చేసుకు పోతూ ఉంటారు. కానీ ఈ సినిమాకి అందరూ సమిష్టిగా చేశారు. దర్శకుడు, నటీనటులను పక్కన పెడితే టెక్నీషియన్స్ జంధ్యాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విన్సెంట్, ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్స్…అందరూ విజయానికి కారకులే. ఆ రోజుల్లో ఇంత టెక్నికల్ ఎఫెక్ట్స్ అభివృద్ధి చెందలేదు. కెమెరా లెన్స్ కి వ్యాజలైన్ వృత్తంగా రాసి శ్రీదేవిని షూట్ చేసిన కొన్ని షాట్స్ అద్భుతంగా రావటం మీరు గమనించ వచ్చు.

క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీసుకి వచ్చేసరికి రాత్రి 11 అయింది. రామారావు మెలకువగానే ఉన్నాడు. రాగానే ‘ఎలా ఉంది సినిమా’ అని అడిగాడు. “వేవ్స్ సృష్టించబోతోంది” అన్నాను. తుఫాను రోజుల్లో విడుదలై, ఆ తర్వాత కలెక్షన్ల తుఫాను సృష్టించింది.

(ఒరేయ్-ఒరేయ్ అనుకునే మిత్రులం- జంధ్యాల, సత్యమూర్తి జ్ఞాపకాలతో…)

(వ్యాస రచయిత రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here