అన్నమయ్య అన్నది – 5
(రోచిష్మాన్, 9444012279)
అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగు భాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.
అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం, ఏ విధమైన చింతన, ఏ విధమైన భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ స్థాయిలో కవిత్వం చెప్పారు అన్నమయ్య.
అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!
అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!
అన్నమయ్య అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం రా రండి-
(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)
“పుడమి నిందరిఁ బట్టె – భూతము కడుఁ
బొడవైన నల్లని భూతము”
భూమిపై అందఱినీ పట్టిందట భూతం, అది చాల పొడుగ్గా ఉండే నల్లని భూతం అట. నల్లని భూతం అంటే విష్ణుమూర్తి లేదా దైవం. దైవం అందఱినీ పట్టిందట. ఏం చెప్పారు అన్నమయ్య! మనం “దెయ్యం పట్టింది” అని అంటాం, వింటాం. అన్నమయ్య “దైవం పట్టింది” అంటున్నారు. అదీ పిశాచం అని అర్థం వచ్చే పదంతో! గొప్ప విరోధాభాస ఇది. భూతం అన్న పదానికి నిజమైనది అన్న అర్థం కూడా ఉంది. ఇక్కడ భూతం అంటూ దైవం నిజమైనది అని గొప్పగా చెబుతున్నారు అన్నమయ్య.
ఈ పల్లవి తరువాతి చరణాలలో ఈ భూతం రకరకాలుగా ఉందని, పరోక్షంగా దశావతారాలలో ఉందని అంటూ అటు తరువాత అదే వేంకటగిరిపై భూతమైందనీ ఆపై పులుగుపై మహాభూతమై ఉందని చెబుతున్నారు అన్నమయ్య.

దశావతారాలను ఉటంకిస్తూ అన్నమయ్య వ్రాసిన 90కి పైగా సంకీర్తనల్లో ఇది ఒకటి. కొన్ని సందర్భాల్లో బలరాముణ్ణి, కొన్ని సందర్భాల్లో కృష్ణుణ్ణి దశావతారాలలో ఒక అవతారంగా అన్నమయ్య సంకీర్తన(లు) చేశారు.
“మత్స్య కూర్మ వరాహ మనుష్యసింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుద్ధ కలికి” అన్న శ్లోకం ప్రకారమూ, “మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః/ రామో రామశ్చ రామశ్చ బుద్ధః కల్కి రేవచ. (ఈ శ్లోకం 8వ శతాబ్దికి చెందినది. మామల్లపురం లేదా మహాబలిపురం శిలాశాసనాల్లో ఉంది.) అన్న శ్లోకం ప్రకారమూ దశావతారాలలో కృష్ణుడు లేడు.
మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ అంటే పరశురాముడు, రామ అంటే అయోధ్య రాముడు, రామ అంటే బలరాముడు, బుద్ధ అంటే మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు కాదు. ఈ బుద్ధుడు త్రిపురాసుర వధ సందర్భంగా అవతరించిన బుద్ధ అవతారం. చివరగా కల్కి. ఇవి దశావతారాలు. ఇక్కడ కృష్ణుడు ప్రసక్రి లేదు. జయదేవుడికి కూడా కృష్ణుడు దశావతారాలలో ఒకడు కాదు.
‘ఇందరికి అభయంబు లిచ్చు చేయి’ సంకీర్తనలో “యెలయ నాగేలు ధరించిన చేయి” అని అని బలరాముణ్ణి తీసుకున్న అన్నమయ్య ఈ సంకీర్తనలో దశావతారాలలో కృష్ణుణ్ణి తీసుకున్నారు.
నృసింహ పురాణంలో విష్ణువు యొక్క రెండు శక్తులు ఒకటి తెలుపు, ఒకటి నలుపు బలరామ, కృష్ణ అవతారలని చెప్పబడ్డది. అన్నమయ్య ఈ చింతనను అనుసరించారేమో? అందుకే కొన్ని సంకీర్తనల్లో బలరాముణ్ణి, కొన్ని సంకీర్తనల్లో కృష్ణుణ్ణి దశావతారాల్లో ఒకరిని చేశారేమో? ఇక ప్రస్తుత సంకీర్తనలోకి వేళదాం…
“కినిసి వోడ మింగెడి భూతము” అనీ,
(వచ్చి ఓడల్ని మింగే తిమింగలాలు ఉంటాయి సముద్రంలో. అలా అంటూ మత్స్యావతారాన్ని సూచించారు)
“పునుక వీపు పెద్ద భూతము”
(వీపు మీద ఎముక చిప్ప ఉన్నది అంటే కూర్మం) అనీ,
“కనలి కవియు చీకటి భూతము”
(కోపంతో సాగే నల్లనైన వరాహం) అనీ,
“పొనుగు సోమపు మోము భూతము”
(పరాక్రమంతో ఉండే మొహం ఉన్న నరసింహం) అనీ,
“చేట కాళ్ల మించిన భూతము”
(చాల పెద్ద కాళ్లతో పెరిగిన వామనుడు) అనీ,
“పోటు దారల పెద్ద భూతము”
(చంపే వాళ్లలో పెద్దవాడైన పరశురాముడు) అనీ,
“గాటపు జడల బింకపు భూతము”
(అరణ్య వాసంలో జడలతో మసలిన అయోధ్య రాముడు) అనీ,
“జూటరి నల్ల ముసుగు భూతము”
(జిత్తుల మారి, మోసగాడు అయిన నల్ల ముసుగు భూతం-కృష్ణుడు) అనీ,
“కెలసి భిత్తలే తిరిగేటి భూతము”
(నగ్నంగా తిరిగే భూతం. త్రిపురాసుర సంహారం కోసం అతడి భార్య పాతివ్రత్యాన్ని భగ్నం చేసుందుకు వచ్చిన బుద్ధ అవతారాన్ని చెబుతున్నారు) అనీ,
“పొలుపు దాంట్ల పెద్ద భూతము”
(గుఱ్ఱం మీద దుష్టుల్ని చండాడుతూ వేగంగా దాటుకుంటూ సాగే కల్కి అవతారాన్ని చెబుతున్నారు) అనీ,
“బలుపు వేంకట గిరి పయి భూతము” అనీ, ఆపై
“పులుగు (గరుడ) మీద మహా భూతము” అనీ అని ముగించారు అన్నమయ్య.
పులుగు అంటే పక్షి. పక్షి అన్నది చాల భావాలకు ప్రతీక. ప్రాణం, ఆత్మ , మార్మికత ఇలాంటి వాటికి ప్రతీక పక్షి. ఇక్కడ మనం వాటిల్లో దేన్నయినా తీసుకోవచ్చు. పక్షి మీద మహాభూతం అట. అద్భుతం, అత్యద్భుతం ఆన్నమయ్య ఈ అభివ్యక్తి. ఈ సంకీర్తనది ఒక ఉదాత్తమైన శిల్పం. శిల్పం (aesthetic format) అన్నది ఒక రచనను కావ్యం చేస్తుంది. ఈ సంకీర్తన ఒక రసాత్మక మహా కావ్యం.
ఒక్క అన్నమయ్య మాత్రమే ఇటువంటి విశేషమైన రచన చెయ్యగలరు. విషయ సాధికారికతతోనూ, విశిష్టమైన శిల్ప సౌందర్యంతోనూ ఒక మహోన్నతమైన కృతై , సత్కృతై మెఱుస్తున్నది ఇలా అన్నమయ్య అన్నది.
సంకీర్తన:
పుడమి నిందరిఁ బట్టె భూతము
కడుఁబొడవైన నల్లని భూతము
కినిసి వోడ మింగెడి భూతము
పునుక వీఁపు పెద్ద భూతము
కనలి కలియు చీఁకటి భూతము
పొనుగు సోమపు మోము భూతము
చేటకాళ్ళ మించిన భూతము
పోటుదారల పెద్ద భూతము
గాఁటపు జడల బింకపు భూతము
జూటరి నల్లముసుఁగు భూతము
కెలసి బిత్తలే తిరిగేటి భూతము
పొలుపు దాంట్ల పెద్ద భూతము
బలుపు వేంకటగిరి పయి భూతము
పులుగుమీఁది మహాభూతము
(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)
🙏🙏🙏