తుపాను ముందు ప్రశాంతతను చూశాం
ఈనాడు-నేను: 24
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
అది 1996 నవంబర్ 4 వ తేదీ. అంతా ప్రశాంతంగా ఉంది. ఆకాశం మరింత నిర్మలంగా ఉంది. మరొక వారం రోజుల్లో దీపావళి. ఒక పక్క పంటలు కోతకొచ్చాయి. నేడో రేపో కోయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.
మరోపక్క జిల్లా ఉన్నతాధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం నాయకత్వంలో ఒక బృందం వాసాలతిప్ప డ్రైనును పరిశీలించేందుకు కొమరగిరిపట్నం వెళ్లారు. అది ఆ ప్రాంతంలోనే సముద్రంలో కలుస్తుంది. వివిధ కారణాల వల్ల డ్రైన్ పూడుకుపోయింది. ఈ కారణంగా మురుగు నీరు వెనక్కి తంతోంది. దీనివల్ల పొలాల్లో నీరు బయటకు వెళ్లకుండా ఉండి, పంటలకు నష్టం కలిగిస్తోంది. ఈ పరిస్థితి నుంచి రైతులను రక్షించడానికి ఈ బృందం తన పని ప్రారంభించింది. పరిశీలించేందుకు ఒక నాటుపడవలో సముద్రంలోకి వెళ్లారు. అంతలో ఊహాతీతమైనదేదో జరగబోతోందన్నట్టుగా, సన్నగా గాలి మొదలైంది.
ఆ గాలి వీచే తీరు విచిత్రంగా అనిపించింది. అసాధారణంగా తోచింది. పడవ నడిపే వ్యక్తి చెప్పాడు… మనం వెంటనే ఒడ్డుకు చేరి, సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోవాలని. అందరూ నవ్వారు. అంతా బానే ఉందిగా మరేం పరవాలేదన్నట్టు చూశారు. కోనసీమ చుట్టూ విస్తరించి ఉన్న సముద్ర తీరంపై అవగాహన ఉన్న ఈనాడు రిపోర్టర్ అడ్డాల రామకృష్ణ కూడా వెంటనే ఒడ్డుకు వెళ్ళిపోదామని అన్నారు. ఏమనుకున్నారో ఏమో.. అయిష్టంగానే ఒడ్డుకు చేరారు.
రెడ్డి సుబ్రహ్మణ్యం బృందం వేరే పని మీద కోనసీమలోని వేరొక ప్రాంతానికి వెళ్లారు.
రామకృష్ణ ఆఫీసుకు చేరుకున్నారు. ఈలోగా ఫోన్ మోగింది… కోనసీమలో వాతావరణం ఎలా ఉందంటూ అడిగారు. ప్రస్తుతానికి బానే ఉందండీ.. రాత్రికి ఏమైనా జరగచ్చు.. అని రామకృష్ణ బదులిచ్చారు. ఓకే.. అప్రమత్తంగా ఉండండి. ఏమి జరిగినా వెంటనే తెలియజేయండి అని డెస్కు నుంచి ఆదేశాలు.
కాట్రేనికోన, మామిడికుదురు, అమలాపురం, ముమ్మిడివరం, ఇలా అన్ని మండలాల రిపోర్టర్లకు ఆదేశాలు అందాయి. సాయంత్రానికల్లా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కోనసీమపై కక్ష గట్టినట్టు గుంపులుగుంపులుగా తరలి రావడం ప్రారంభమైంది. ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. కోనసీమకు అలంకారము… గర్వమూ అయిన నారికేళ వృక్షాలు.. గాలి తాకిడికి నేలను తాకుతూ, పైకి లేస్తున్నాయి. దూరంగా సముద్రంలో అలజడి… సుడులు తిరుగుతూ ఉవ్వెత్తున లేస్తున్న అలలతో పోటీపడుతూ నిప్పులు భూమి పైకి కమ్ముకుంటూ వస్తున్నాయి. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో సముద్రతీరప్రాంత గ్రామస్థులు పరుగులు తీసుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడంలేదు. ఇంట్లో ఉన్నవారు, బయటకు రావడానికి జంకుతున్నారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్ల ఆవరణాలలో కట్టేసి ఉన్న పశువులు, తప్పించుకునే వీలు లేక విలవిలలాడాయి. ప్రాణాలు విడిచాయి. ఇళ్ల కప్పులు కూలిపోతూ… ప్రాణాలు హరిస్తున్నాయి. సాయంత్రానికే చిమ్మ చీకటి కమ్ముకోవడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు…. జిల్లా ఉన్నతాధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం సహా.
215 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు… కుంభవృష్టి… అప్పుడే కొంతమందికి సముద్రపు నీటిలో మంటలు రేగుతూ కనిపించాయి. నీటితో పాటూ భూమిమీదికి దాడిచేశాయి. అవి కొంతమందిపై పడి, శరీరం కాలిపోయింది. నీటిలో పుట్టిన మంట బడబాగ్ని అని వినడమే కానీ, ఎప్పుడూ చూడలేదు. చందమామ కథలలో వర్ణించిన మాదిరి నీళ్లు నిప్పులు కలిసి కాట్రేనికోన మండలంపై దాడి చేశాయి.
ఇంకొక పక్క రాజమండ్రి తూర్పుగోదావరి డెస్కులో హడావుడి. కోనసీమలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. ఎక్కడి నుంచీ సమాచారం లేదు. ఒక్కొక్కటిగా వార్తలు వస్తున్నాయి. వినడానికే ఒళ్ళు జలదరించేలా ఉన్నాయి. తుపాను కాకినాడ – యానాం మధ్య తీరం దాటింది. ఈ తుపాను ప్రభావం మొత్తం నాలుగు రోజులు ఉంది. నవంబర్ ఏడో తేదీ వరకూ గాలులు వీస్తూనే ఉన్నాయి. తూర్పు గోదావరి డెస్కు ఈ తుపాను వార్తలను ఎలా కవర్ చేసిందీ… అధికారులు ఎలా పనిచేశారు? వంటి అంశాలు వచ్చే ఎపిసోడ్ లో..
భయానకంగా వున్నాయి… బడబాగ్ని… మిగిలినదృశ్యాలు.next episode కోసం చూస్తూ వుంటాము.