ప్రపంచస్థాయిలో మెరిసిన తెలుగు షార్ట్ ఫిలిం
ఈజిప్షియన్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్
న్యూయార్క్: అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి తెలుగు షార్ట్ ఫిలిం ఎంపికైంది. నటుడు మహాదేవ్ “పునరపి జననం” (Punarapi Jananam) అనే షార్ట్ ఫిలింను రూపొందించాడు. సామాజిక స్పృహ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. మహాదేవ్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం న్యూయార్క్‌లో జరుగుతున్న ఈజిప్షియన్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కు ఎంపికైంది.
ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా 5,100కి పైగా చిత్రాలు అందాయి. ఈ చిత్రం, భారతదేశం నుంచి ఎంపికైన మూడు షార్ట్ ఫిల్మ్‌లలో ఒకటిగా నిలిచి, తెలుగు సినిమా ప్రతిష్టను శిఖరాయమానం చేసింది.

“పునరపి జననం” అంటే “మళ్లీ పుట్టడం” — ఈ సినిమా మనిషి – ప్రకృతి మధ్య ఉన్న సంబంధం, సమతుల్యం గురించి ఆలోచింపజేస్తుంది. మనుషుల చర్యలు ప్రకృతిని ప్రభావితం చేసినట్లే ప్రకృతి తన పునర్జనన చక్రంలో మనిషికి ఎలా బోధ చెబుతుందో ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది.

పునరపి జననం దర్శకుడు మహాదేవ్
అందమైన విజువల్స్, హృదయాన్ని తాకే కథనంతో దర్శకుడు మహాదేవ్ ఈ చిత్రంలో మనిషి–ప్రకృతి అనుబంధాన్ని చక్కటి సందేశం తో కలిపి అద్భుతంగా చూపించారు.
“ఇది నాకు మాత్రమే కాదు, భారతదేశానికి కూడా గర్వకారణమైన క్షణం. పునరపి జననం మనం ప్రకృతితో కలసి జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే కథ. ప్రకృతిని కాపాడటం అంటే జీవితాన్ని కాపాడటమే.” అని మహాదేవ్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రపంచ వేదికపై ఈ గుర్తింపు భారతీయ షార్ట్ ఫిల్మ్‌లకు మరొక మైలురాయిగా నిలిచింది. తెలుగు భాషలోనూ, భారతీయ ఆలోచనలలోనూ పుట్టిన కథలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని పునరపి జననం మరోసారి నిరూపించింది.
త్వరలోనే చాయ్ బిస్కెట్ యూ ట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ కాబోతున్నట్టు మహాదేవ్ తెలిపారు.

