ఆహ్లాదం… ఆరోగ్యం… పెట్టుబడులు… ఉద్యోగాలు….
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటళ్లు…
సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం
హెలీ టూరిజం.. టూరిజం పోలీస్ వ్యవస్థ ప్రారంభం…
ఫిల్మ్, మెడికల్ టూరిజం పోర్టళ్ల ప్రారంభం…
బహుముఖ అవకాశాలకు మార్గంగా పర్యాటక రంగం
ఈనెల 27 న శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్
హాజరుకానున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
(హైదరాబాద్)
నచ్చిన అడవి… మెచ్చిన వంట… దుమికే జలపాతం.. హెలీకాఫ్టర్ విహారం… డబుల్ డెక్కర్ పడవ ప్రయాణం… అడవి జంతువుల సందర్శన… పర్యాటకం అంటే అంతేనా అంటే ఇప్పటి వరకు దాదాపు అంతే… కానీ ఇప్పుడు ఆ ఆర్ధం మరింత విస్తృతమవుతోంది. నచ్చిన అడవి దగ్గరే రాత్రి వేళ బస చేసే అవకాశం.. నిశి రాత్రి వేళ అడవి జంతువులను చూడడం… మన సంప్రదాయ వంటలను ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం.. మనం అందించే వైద్య సేవలను ప్రపంచానికి తెలియజేయడం.. వాటి కోసం వచ్చే వారికి అన్ని వసతులు కల్పించడం.. వారి సందేహాలు నివృత్తి చేయడం.. సందర్శన కోసం మన దగ్గరకు వచ్చే పర్యాటకులకు సకల వసతులు కల్పించి వారికి మరిచిపోలేని మధురానుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది…ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పారామం వేదికగా శనివారం నిర్వహించే తెలంగాణ టూరిజం కాంక్లేవ్-2025లో వాటిని రాష్ట్ర ప్రజలకు ఆవిష్కరించనుంది.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ఇందులో పాల్గొననున్నారు… కాంక్లేవ్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు…

15 వేల కోట్ల పెట్టుబడులు…. 50 వేల ఉద్యోగాలు….
పర్యాటక రంగాన్ని కేవలం ఆహ్లాదానికే పరిమితం చేయకుండా దాని నుంచి పెట్టుబడులు ఆకర్షించడం… పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని అధ్యయనం చేసిన పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హోటళ్లు, వెల్‌నెస్ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

ఇందులో అనంతగిరి కొండల్లో జెసోమ్ అండ్ జెన్ మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్‌నెస్ సెంటర్, ద్రాక్ష పంట నుంచి వైన్ తయారీ యూనిట్, అటవీ ప్రాంతంలో తాజ్ సఫారీ, మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ఫ్రంట్ రిసార్ట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, తెలంగాణలో టైర్ 2 నగరాల్లో జింజర్ హోటళ్లు, నాగార్జున సాగర్‌లో వెల్‌నెస్ రిట్రీట్.. వెడ్డింగ్ డెస్టినేషన్ సెంట బుద్ధవనాన్ని మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్‌కు చెందిన Fo guang shan సిద్దంగా ఉంది. ముఖ్యమంత్రిఎ.రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు ఈ సంస్థలు ఆయా పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఫలితంగా రూ.15 వేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు రావడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుంది…

అంతర్జాతీయ చిత్ర నగరిగా….
ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా ఇప్పటికే హైదరాబాద్‌కు మంచి పేరు ఉంది.. దానిని మరింగా అభివృద్ధి ప్రపంచ చిత్ర పరిశ్రమకు మరింత స్నేహపూరిత వాతావరణం కల్పించి అత్యధిక చిత్రాలు హైదరాబాద్‌లోనే నిర్మించేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా శనివారం రోజు ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ లోకేషన్లలో షూటింగ్‌లకు తక్షణ అనుమతి లభించనుంది. ఈ సులువైన విధానాలతో జాతీయ, అంతర్జాతీయ చిత్ర నిర్మాణాలకు హైదరాబాద్ నిలయంగా మారనుంది..
ఆరోగ్య నగరం….
చౌక ధరల్లోనే మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులో ఉండడంతో ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో హైదరాబాద్ ఆసుపత్రులకు వస్తున్నారు.. వారిని మరింత పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు తెలంగాణ మెడికల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌లో హైదరాబాద్‌లో ఏ ఏ ఆసుప్రతులు ఉన్నాయి… ప్రముఖ వైద్యులెవరు.. వారు ఏరకమైన సేవలు అందిస్తారు… ఏ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది.. వీసాల జారీ.. పొడిగింపు తదితర వివరాలుంటాయి. విమానాశ్రయం నుంచి ఆ ఆసుపత్రికి ఎలా చేరుకోవాలనే వివరాలుంటాయి. అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే వారి సౌలభ్యం కోసం వారి భాషను అనువదించే ట్రాన్స్‌లేటర్ల వివరాలు ఉంటాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో హెల్త్ టూరిజం అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి….

హెలీకాఫ్టర్ విహారం…. సి ప్లేన్ ప్రయాణం
రాష్ట్రంలో ఇప్పటి వరకు హెలీకాఫ్టర్ టూరిజం లేదు… పెరిగిన జీవన ప్రమాణాలు… సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకులు సరికొత్త అనుభూతి చెందేందుకు హెలీకాఫ్టర్ టూరిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.. తొలుత హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం వరకు హెలీకాఫ్టర్ సేవలు ప్రారంభిస్తారు.. పర్యాటకుల ఆదరణ ఆధారంగా దానిని మరింతగా విస్తరిస్తారు… సీ ప్లేన్ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి భద్రాచలం వరకు సీప్లేన్ విహారం ఉండనుంది. నీటి మీద మాత్రమే లాంఛయ్యే సీ ప్లేన్‌లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై (ఫీజుబిలిటీ) అధ్యయనం సాగుతోంది..

మన వంట రుచులు….
తెలంగాణలో వంటల వైవిధ్యం ఎంతగానో ఉంది.. హైదరాబాద్ బిర్యాని ప్రపంచ ప్రసిద్ధం.. అలాగే మన సర్వపిండి.. సకినాలు… బోటి కూర… ప్రతి జిల్లాల్లో ప్రత్యేకమైన వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఏ ప్రాంతంలో ఏ వంట.. ఆ వంట ప్రత్యేకతలతో కూడిన మ్యాప్ తయారు చేసింది. ఈ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఒప్పందాలతో మనం వంటలకు అంతర్జాతీయంగా గిరాకీ పెరగడంతో పాటు స్థానిక ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి…

పర్యాటకులకు భద్రత…
తెలంగాణను సందర్శించే ప్రతి పర్యాటకునికి సరైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం 15 మంది టూరిస్ట్ పోలీసులే ఉండగా ఆ సంఖ్యను 90కు పెంచాలని నిర్ణయించింది. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు ఒంటరిగానే పర్యాటక ప్రదేశాలకు వస్తున్నారు.. వారికి భద్రత, భరోసా కల్పించేలా ఈ టూరిస్ట్ పోలీసులు సేవలు అందించనున్నారు…

ప్రయాణం… వసతి….
తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు రైళ్లు, బస్సులు, అవసరమైన వాహనాల్లో సాఫీగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ, ఇతర ట్రావెలింగ్ సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందం చేసుకుంటోంది. వీటితో పర్యాటకులు కోరుకునే వాహనాలను అందుబాటులో ఉంటాయి..పర్యాటకుల సంఖ్య ఆధారంగా భారీ వాహనాలు క్యారవాన్‌లు అందుబాటులో ఉంచుతారు…అలాగే డిజిటల్ టూరిజం కార్డ్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్డును రీఛార్జ్ చేసుకుంటే వివిధ ఆలయాలు, రవాణా వాహనాలు, హోటళ్లలో రాయితీలు లభిస్తాయి. ఒకే కార్డు పలు చోట్లు ఉపయోగపడడంతో పర్యాటకులకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

భారీ కార్యక్రమాలు… అవార్డులు…
తెలంగాణలో భారీ కార్యక్రమాల నిర్వహణకు వీలుగా బుక్ మై షోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది.. ఈ ఒప్పందంతో భారీ సినిమా ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే వీలుంటుంది. పర్యాటక రంగంలోని హోటళ్లు, ఇతర సంస్థలు అందించే సేవల ఆధారంగా వాటికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుంది…

ముచుకుందా ప్రారంభం…
జల విహారాల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్‌లో 120 సీట్ల సామర్థ్యమున్న డబుల్ డెక్కర్ బోట్‌ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. హైదరాబాద్‌కు ఒక నాడు జీవనాడిగా ఉన్న మూసీ అసలు పేరైన ముచుకుందా పేరును ఈ బోట్‌కు పెట్టారు..


