58 అంగుళాల ఛాతి కాదు కృత నిశ్చయం కావాలి

0
145

మోడీ, అమిత్ షా ల వాళ్ళ గోల్డ్ మెడల్స్ రావు
నాలెడ్జి హబ్ గా తెలంగాణ-తమిళనాడు
త్వరలో తెలంగాణాలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం
విద్యలో ముందంజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
చెన్నై:
యాభై ఎనిమిది అంగుళాల ఛాతి ఉంటే చాలదని, కృతనిశ్చయం కావాలనీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు క్రీడల విషయంలో కలిసినడుస్తాయని చెప్పారు. తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిమంతంగా ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కితాబునిచ్చారు. చెన్నై జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం ఏర్పాటైన విద్య‌లో ముందంజ‌లో త‌మిళ‌నాడు కార్య‌క్ర‌మంలో ఆయన ప్రసంగించారు. ఇంత మంచి కార్య‌క్ర‌మానికి న‌న్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అన్నాదొరై, క‌రుణానిధి, కామ‌రాజ్ నాడార్ వంటి గొప్ప యోధులకు త‌మిళ‌నాడు జ‌న్మ‌స్థ‌లమని అన్నారు. క‌రుణానిధి విజ‌న్‌ను అమ‌లు చేస్తున్న స్టాలిన్, ఉద‌య‌నిధిల‌ను రేవంత్ అభినందించారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించే బాధ్య‌త తెలంగాణ‌-త‌మిళ‌నాడు తీసుకుంటాయనీ, మోదీ, అమిత్ షాలతో అది సాధ్యం కాదని సీఎం చెప్పారు. 58 అంగుళాల ఛాతీ ఉంటే ఇది చాలదని ఆయన పీఎం ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కామరాజ్ ప్రణాళికను అమలు చేసిన ఇందిరాగాంధీ
కామ‌రాజ్ ప్రణాళికను ఇందిరాగాంధీ అనుస‌రించారనీ, కామ‌రాజ్ త‌మిళ‌నాడులో తీసుకువ‌చ్చిన‌ విద్యా విధానాన్ని దేశం ఇప్పటికీ అనుస‌రిస్తోందనీ రేవంత్ తెలిపారు.
ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుందని ప్రశంసించారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ కు ప్రశంసలు
త‌మిళ‌నాడు అవలంభిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్య‌క్ర‌మం హృద‌యాన్ని తాకిందనీ, బ్రేక్‌ఫాస్ట్‌తో పేద విద్యార్థుల‌కు ఎంతో మేలు క‌లుగుతుందనీ రేవంత్ చెప్పారు. తెలంగాణ‌లోనూ బ్రేక్‌ఫాస్ట్ ప‌థ‌కాన్ని వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. నాన్ ముద‌ల‌వ‌న్ (స్కిల్ డ‌వెల‌ప్‌మెంట్) రూ.10 వేల ఉపకార వేత‌నం ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌కు వెళ్లే బాలురు, బాలిక‌ల‌కు ఇచ్చే స్కీమ్‌లను సీఎం ప్రశంసించారు. త‌మిళ‌నాడు పేద‌ల‌కు సీఎం స్టాలిన్ మంచి అండగా ఉన్నారన్నారు.
ఎప్పటినుంచో చారిత్రక సంబంధం
ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. 1991 స‌ర‌ళీక‌ర‌ణ త‌ర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందగా, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. సామాజిక న్యాయం అమ‌లులో త‌మిళ‌నాడు-తెలంగాణ మ‌ధ్య సారూప్య‌త‌లున్నాయని తెలిపారు. క‌రుణానిధిని తాము స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు.
ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

  • మా రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓబీసీల‌కు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీల‌కు, మొత్తంగా 69 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌బోతున్నట్లు రేవంత్ చెప్పారు. భార‌తీయులంతా త‌మిళ‌నాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారని తెలిపారు.
    దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమేనని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఇంకా ఏమన్నదీ ఆయన మాటల్లోనే…
  • తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది.
  • దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచింది.
  • తెలంగాణలో మా ప్రభుత్వం, నేను విద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం…
  • విద్యా శాఖ‌ను నా ద‌గ్గ‌రే ఉంచుకున్నా…
  • మా రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించాం.
  • తెలంగాణ నుంచి ప్ర‌తి ఏటా 1.10 ల‌క్ష‌ల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు క‌ళాశాల‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు…
  • నైపుణ్య‌లేమితో ఉద్యోగాలు ద‌క్క‌క‌పోతుండ‌డంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం…
  • పీపీపీ విధానంలో ఈ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం.. దానికి ఛైర్మ‌న్‌గా ఆనంద్ మ‌హేంద్ర‌ను నియ‌మించాం. కార్పొరేట్ సంస్థ‌ల అధిప‌తుల‌ను డైరెక్ట‌ర్లుగా నియ‌మించాం…
  • మేం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ప్రారంభించాం. ఇక్క‌డ అనేక మంది క్రికెట్‌, టెన్నిస్, ఇత‌ర క్రీడాకారులు ఉన్నారు…
  • మ‌న‌కు 140 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నా ఒలింపిక్స్‌లో మ‌న‌కు ఒక్క గోల్డ్ మెడ‌ల్ రాలేదు…
  • 4-5 కోట్ల జ‌నాభా లేని ద‌క్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడ‌ల్స్ వ‌చ్చాయి…
  • 30 ఎక‌రాలు ఉన్న ద‌క్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ వాళ్ల‌కే 16 గోల్డ్ మెడ‌ల్స్ ద‌క్కాయి…
  • ఒక క్రీడాకారిణికే మూడు అర్చ‌రీ గోల్డ్ మెడ‌ల్స్ వ‌చ్చాయి.. మరి మ‌న విజ‌య గాథ ఎక్క‌డ ఉంది…
  • 75 ఏళ్ల స్వాతంత్య్ర భార‌తంలో మ‌నం ఎక్క‌డ ఉన్నాం… ఒక్క గోల్డ్ మెడ‌ల్ లేదు….
  • 56 అంగుళాల ఛాతీతో ఏం ప్ర‌యోజ‌నం
  • అందుకే నేను యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ప్రారంభించాం… అందులో సంజ‌య్‌ గోయెంకా, అభిన‌వ్ బింద్రా, కపిల్ దేవ్‌, ఉపాస‌న కొణిదెల వంటి క్రీడాకారులు, కార్పొరేట్ వాళ్ల‌ను తీసుకున్నాం…
  • స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం….
  • త‌మిళ‌నాడు-తెలంగాణ మ‌ధ్య సాంస్కృతిక‌, స్నేహ సంబంధాలు కొన‌సాగాల‌ని కోరుకుంటున్నా…
  • త‌మిళ విద్యార్థులు, కోచ్‌ల‌కు స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో అవ‌కాశాలు క‌ల్పిస్తాం…
  • గతంలో SC, ST, OBC, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవి. మేం వారంతా వేర్వ‌ర‌ని అనుకోవ‌డం లేదు…
  • వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. SC, ST, OBC, మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట ఉంటారు.. చ‌దువుకుంటారు..
  • ప్ర‌తి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 25 ఎక‌రాల్లో రూ.200 కోట్ల‌తో నిర్మిస్తున్నాం…
  • 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్ప‌టికీ అదే సిల‌బ‌స్ కొన‌సాగిస్తున్నారు… ఇప్ప‌టికీ డీజిల్ మెకానిక్‌, ప్లంబ‌ర్ ట్రైనింగ్ ఇస్తున్నారు.. అక్క‌డ శిక్ష‌ణ తీసుకున్న వారికి ఉపాధి ల‌భించ‌డం లేదు..
  • టాటా కంపెనీ భాగ‌స్వామ్యంతో తెలంగాణ‌లో ఐటీఐల‌ను అడ్వాన్సుడ్ టెక్నాల‌జీ సెంట‌ర్లుగా (ATC) అప్‌గ్రేడ్ చేస్తున్నాం…
  • ఇటీవ‌లే మేం నూత‌న విద్యా విధానం తీసుకువ‌చ్చాం.. అందులో భాగంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో వ‌చ్చే ఏడాది నుంచి న‌ర్స‌రీ ప్రారంభిస్తున్నాం…
  • త‌మిళ‌నాడులో మాదిరే తెలంగాణ‌లో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థ‌లున్నాయి…
  • త‌మిళ‌నాడు… తెలంగాణ దేశానికి రోడ్‌మ్యాప్ ఇవ్వ‌నున్నాయి.. నాలెడ్జ్ హ‌బ్ కానున్నాయి…
  • త‌మిళ‌నాడు మాదిరే తెలంగాణ కూడా విద్య‌పై చేసే వ్య‌యాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌పై పెట్టుబ‌డిగా భావిస్తుంది..
  • కేవలం విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నాం.
  • మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు స్టాలిన్ గారికి, తమిళనాడు ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా.
  • విద్యను విప్ల‌వంగా మేం భావిస్తున్నామని సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here