ఎస్ఐఆర్‌పై 40 తమిళ పార్టీల న్యాయపోరాటం

0
100

(పెద్దాడ నవీన్)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశం, భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిపాదించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్షాలతో పాటు, డీఎండీకే, ఎంఎన్ఎం సహా 40కి పైగా పార్టీలు హాజరయ్యాయి. ఈ SIR ప్రక్రియ ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజల ఓటు హక్కును హరించే కుట్ర అని స్టాలిన్ తీవ్రంగా ఆరోపించారు. 

ఈ న్యాయపోరాటానికి ప్రధాన కారణం “బీహార్ ఎస్ఐఆర్ కేసు”. బీహార్‌లో ఇదే ప్రక్రియ అమలుపై సుప్రీంకోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. అక్కడ తుది తీర్పు వెలువడక ముందే, తమిళనాడు సహా 12 రాష్ట్రాల్లో ఈసీ హడావుడిగా SIR ప్రారంభించడం చట్టవిరుద్ధమని స్టాలిన్ కూటమి వాదిస్తోంది. బీహార్‌లో ఎస్ఐఆర్ ద్వారా సుమారు 65 లక్షల ఓట్లు తొలగించారని, ముఖ్యంగా మైనారిటీలు, బీజేపీ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈసీ “కీలుబొమ్మ”గా మారిందని సమావేశ తీర్మానం ఆరోపించింది. 

ఈ అంశంపై తమిళనాడులో రాజకీయ ఏకాభిప్రాయం లేదు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, బీజేపీ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ పార్టీలు SIR ప్రక్రియను బలంగా సమర్థిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో లక్షలాది “బోగస్ ఓటర్లు” ఉన్నారని, వారిని తొలగించడానికి (జాబితా శుద్ధికి) SIR చాలా అవసరమని అన్నాడీఎంకే వాదిస్తోంది. అన్నాడీఎంకే నేత పళనిస్వామి తమ కార్యకర్తలు ఈ ప్రక్రియలో పాల్గొని, జాబితాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈసీ చేస్తున్న మంచి పనిని డీఎంకే రాజకీయం చేస్తోందని, బీహార్‌లో ఇది విజయవంతమైందని బీజేపీ ఆరోపించింది. 

ఈ వివాదంలో మరో ఆసక్తికర పరిణామం ఉంది. నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK), సీమాన్ ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) కూడా స్టాలిన్ సమావేశానికి హాజరుకాలేదు. వారు కూడా SIRను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, స్టాలిన్ సమావేశాన్ని TVK ‘రాజకీయ నాటకం’గా, తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంగా అభివర్ణించింది. SIRకు వ్యతిరేకంగా పొరుగున ఉన్న కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగలిగింది. డీఎంకే ప్రభుత్వం తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని విజయ్ ప్రశ్నించారు. 

ఈ వివాదం కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాలేదు. ఇది పరోక్షంగా జాతీయ పౌర పట్టిక (NRC) అమలుకు దారితీయవచ్చనే భయాలు ఉన్నాయి. ఇప్పటికే జాబితాలో ఉన్న పౌరులు తమ ఓటు హక్కును నిలబెట్టుకోవడానికి మళ్లీ పత్రాలు సమర్పించాలా?. ఈసీ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రసాదించిన ఓటు హక్కును ఉల్లంఘిస్తుందా? అనే కీలక రాజ్యాంగ ప్రశ్నలు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు తేలాల్సి ఉంది.


(వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here