కనువిందు చేసిన ‘షణ్ముఖ’ శివపదం

0
305

నృత్యోత్సవంలో నర్తకుల విశ్వరూపం

(డాక్టర్ వైజయంతి పురాణపండ)

దేవతలు దిగివచ్చిన వేళ
ప్రమథ గణములు నర్తించిన వేళ
హిమగిరులు మలయపవనమును వీచిన వేళ…

కైలాసమే కదలి ఇలకు రాగా…
శివపదముతో కనువిందు చేయా…
ఉప్పొంగి డెందములు ఆర్ద్రమవగా…
ఆనందబాష్పములు ఉరకలేయా…

నాట్యం గురించి కాళిదాసు ‘నాట్యం చాక్షుష యజ్ఞం’ అని ఒక మంచి మాట అన్నాడు. అంటే కళ్లతో చేసే యజ్ఞమే నాట్యం.
జూన్‌ 6, 2025 వ తేదీ శుక్రవారం సాయంత్రం బషీర్‌బాగ్‌ భారతీయ విద్యాభవన్‌లో శివపదం నృత్యోత్సవం సభ ప్రారంభంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ముందుమాటలో ఈ కాళిదాసు విషయాన్ని ప్రస్తావించడం చూస్తే…
జరగబోయే కార్యక్రమాన్ని ముందుగానే దర్శించి, మనకు చెప్పారేమో అనిపించింది. ఈ నృత్య కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు శివ సాక్షాత్కారం జరిగింది. నిస్సందేహంగా ఆహూతులైన సభ్యులంతా చాక్షుష యజ్ఞమే చేశారు.

రెండు గంటలపాటు మానసికంగా అందరూ కైలాస శిఖరానికి చేరుకున్నారు. శివపరివారాన్ని చర్మచక్షువులతో వీక్షించి, పరవశించారు.

సాధారణంగా లలిత కళలు మానసిక ప్రశాంతతను ఇస్తాయంటారు.
కళను కళగా, లలితంగా ప్రదర్శిస్తేనే మనసు హాయి అనే ఊయలలో ఊగుతుంది. ఏ మాత్రం కళ తప్పినా, అది మనోవికారాన్ని కలిగిస్తుంది.

తేర్ల శ్రావణ కుమార్‌ గారి నృత్యదర్శకత్వంలో ‘నృత్య తరంగిణి ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ’, ప్రొద్దుటూరు కళాకారులు మనలకు కైలాస సాక్షాత్కారం కలిగించారు. వారు ఏ జన్మలోనో చేసిన పుణ్యం ఈ ‘శివపదం’ రూపంలో ఫలించింది.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు రచించిన శివపదంలోని పదిహేను పదాలకు నృత్యం చేసి అలరించారు.. అని రాస్తే అది చిన్న మాట అవుతుంది. రెండు గంటల పాటు సాగిన నాట్యం… రెప్పపాటు కాలంలో పూర్తయినట్లు భావన కలిగించారు. వారి ప్రదర్శనను పొగడటానికి మాటలు చాలవు. చిరుమువ్వల çపదాలతో వారి పాదాలకు అందెలను అందించలేం. ముప్ఫైనాలుగు మంది కళాకారులు దేవతా రూపంలో సాక్షాత్కరించారు. శ్రీ శర్మగారు తను రచించిన పదాల నాట్యాన్ని స్వయంగా ఆస్వాదించాలనుకున్నారు. ప్రేక్షకులలో సామాన్యునిలా కూర్చుని, బాలశిశువులా ఆనందించారు.

గణపతయే గుణపతయే
గజముఖాయ నమో నమో
అంటూ వినాయక ప్రార్థనతో కైలాసానికి ఆహ్వానించారు.
‘మంత్ర సహితమైన ఈ గీతంలోని ప్రతి పదం గకారంతో కూడి ఉంటుంది. గాయత్రీ మహా మంత్రంలో మధ్యలో ఉండే ‘భర్గో’ అనే పదంలో గకారం ఉంది. పాలించేది, శాసించేది గ వర్ణం’ అని శర్మగారు వ్యాఖ్యానించారు. మరోసారి శర్మగారు ఋషిలా అనిపించారు. నాట్యకారులు ప్రేక్షకులను శాసించినట్లుగా అందరూ అనిమిషులే అయ్యారు.
–––––––––––––––

శివకార్ముకమా పినాకమా
చెలువపు మ్రొక్కులివే గొనుమా

కనబడు మా కనుబొమలకు నడుమను
అనుపమ శాంభవ లీలాకారా…
శివుని ఆయుధ ఆభరణాలకు సాష్టాంగ వందనము చేయించారు. శివుని శూలము, శివుని కార్ముకమైన పినాకము మనో నేత్రాలకు సాక్షాత్కరించింది. ‘స్వర్గవాసులైన దేవతలను సైతం రక్షించగలిగినది పినాకము’ అని పలికిన శర్మగారి మాటలు మరోమారు ఆయనను ఋషితుల్యుడిని చేశాయి. దేవతల ఆయుధాలు. దేవతల లీలారూపాలు… అన్నీ ప్రేక్షకులలో చైతన్యం కలిగించాయి.
–––––––––––––

శివుడు దిగంబరుడు. దిక్కులే వస్త్రంగా కలిగినవాడు. అవును అందుకే ఆయన సర్వాంతర్యామి. మరి శివుని నాట్యం సర్వవ్యాప్తం కాదా. ఈ నర్తనం అన్నిదిక్కులా వ్యాపించిన భావన కలుగుతుంది.

తపమును చేసెను గౌరి
కపర్ది శంకరు గోరి

వేడి చలువలను దుఃఖసుఖమ్ముల
విడచి ద్వంద్వముల నిరీహౖయె
స్థిరయోగమ్మున శివుని సగమ్మును
తరుణి పొందినది షణ్ముఖ జనని

ఈమారు శర్మ గారు ఆ గౌరీ తనయుడయ్యారు. ఆవిడను ‘షణ్ముఖ జనని’ అంటూ తనను ఆ తల్లికి అర్పించుకున్నారు. ఆ తల్లి కరుణ లేనిదే ఇంతటి దివ్యమైన పదప్రయోగం జరగదు. ఇంతటి దివ్యమైన నర్తనలాస్యాలను ప్రదర్శించలేరు.
–––––––––––

యవనికాంతరదహర యంత్రస్థమీశం…
తెరవెనుక ఉన్నదే చిదంబర రహస్యం..
కంటికి కనపడనిదే రహస్యం…
మనస్సుకి మాత్రమే కనిపించేదే దైవీ భావన.
సుబ్రహ్మణ్యుడిని దర్శింపచేస్తూ…
అన్నిటి వెనుక రహస్యాలుంటాయి. ఇవేవో నమ్మకాలు కావని చెప్పిన శర్మగారు కార్తికేయుడు కాక మరేమిటి.
బాల కార్తికేయుడి నాట్యం కుమారస్వామి దర్శనం చేయించాడు.
–––––––––––––

ప్రణవ గిరి కరిగి ప్రవహించే
పరమామృతఝరీ! చిల్లహరీ!
ప్రణతులు సేతును నదీమతల్లీ
వాజినీవతీ సర స్వతీ

ఇహపరములకాధారము నీవే
నిఖిల పోషిణీ షణ్ముఖ జననీ

అని సరస్వతీ మాత యొక్క వైదిక దర్శనం చేయించారు మన చేత. మరోమారు శర్మగారు షణ్ముఖునిగా ఆ జననీ తనయుడుగా తల్లిని ఆరాధించారు.
సరస్వతీ నది కలియుగంలో అంతర్థానమవుతుంది… అంతర్వాహిని అవుతుంది. సరస్వతి అంటే ప్రాణశక్తి. ఈ ప్రవాహం కింది నుంచి పైకి వెళ్తుంది. అంటే ‘బ్రహ్మవార్ధిగామిని’ పరబ్రహ్మమనే సముద్రం వైపుగా సరస్వతి ప్రవహిస్తోంది.. అని పలికిన మాటలు మరోమారు శర్మగారిని ఋషి అనకుండా ఉండనేల. నాట్యాన్ని దర్శిస్తున్న వారంతా ఆ సరస్వతీ నదీ మాత తమను అక్కున చేర్చుకున్న భావనలో తడిసి ముద్దయ్యారు. సరస్వతీ పుష్కరాలకు వెళ్లకపోయినా, ఇక్కడ కావలసినంత సేపు నదిలో మునకలు వేశారు.
మూడు మునకలకే మోక్షం లభిస్తుంది. మరి ఇక్కడ వేసిన ఇన్ని మునకలకు మోక్షాన్ని మించినది లభిస్తుందా.
––––––––––––––


అమ్మవారు శివుని చూస్తూ.. పలు సందర్భాలలో నవ్వడం గురించి…
అమ్మవారి నవ్వుకు నమస్కారం.. అన్నారు శర్మగారు.
ఆ తల్లి సాక్షాత్కారం లేనిదే, ఇన్ని చిరునవ్వులు ఎలా అక్షరాలలో నిండుతాయి. అన్నమయ్య ‘ఇందరికీ అభయమ్మునిచ్చు చేయి…’ ‘బ్రహ్మ కడిగిన పాదము…’ అంటూ చేతలను, పాదాలను.. ఇలా ఎన్నిటినో వర్ణించారు. ఇక్కడ శర్మగారు అమ్మవారి చిరునవ్వును మనలకు అందించారు. ఎంతటి కష్టం వచ్చిన సందర్భంలో అయినా అమ్మవార చిరునవ్వులే చిందించింది. సాక్షాత్తు గరళాన్ని మ్రింగి, శ్రీకంఠుడైనప్పుడు కూడా దరహాసాన్ని విడిచిపెట్టలేదు తల్లి. ఆ ఆనందాన్ని శర్మగారి పదాలతో, దిగివచ్చిన దేవతల పాదాలతో మనలకు ఇహలోకం నుంచి పరలోకానికి పరమపథం వేశారు.
–––––––––––––

శబ్దం విజ్ఞాన శాస్త్రం అంగీకరిస్తోంది. వాఙ్మయమంతా శివస్వరూపమే. శూలాన్ని గిరగిర తిప్పుతూ అన్ని దిక్కులను రక్షించమని కోరుతారు… అని పలికిన శర్మగారి పలుకులు పదేపదే ఋషిత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి.
శబ్దబ్రహ్మావిర్భావం
స్తబ్దనిశ్శబ్ద విస్ఫోటం
ఏకమ్మే అనేకమ్మై
అవ్యక్తమ్మే వ్యక్తమ్మై
అనామతమ్మే ఆహతమై
ప్రణవ ప్రాణస్పందనమై

ఈ పదాలలో ఎంత విస్ఫోటం ఉందో… ఆ నాట్యంలో అంతకు రెండింతల విస్ఫోటం ఉంది. ప్రేమక్షకులు శబ్దబ్రహ్మంలో, ఆ విస్ఫోటంలో ఇక దేనినీ వినలేదు. శర్మగారి శబ్ద విస్ఫోటం ప్రేక్షకుల ప్రణవ ప్రాణస్పందనమైపోయింది.
––––––––––––––––

శివా భవానీ చిద్రసరూపా
దనుజ దమని శ్రీదయాఖని
పల్లవ కరగత వరాయుధమ్ముల
సల్లలితమ్ముగ సాకుము జననీ

ఆదినారి అయిన అమ్మవారిని స్తుతిస్తూ, సకల దేవతా సాక్షాత్కారం కలిగించారు ఈ భువి దేవతలు. శర్మగారి ఋషిత్వం అంతటా సాక్షాత్కరిస్తూనే ఉంది. సల్లలితమ్ముగ సాకుము జననీ అని వారు స్తుతిస్తే… ఈ నాట్య దేవతలు ప్రేక్షక భక్తులను వారి లాస్యంతో లలితంగా సాకారు.
––––––––––

శివుని అందరి వాడు. ఋషులను, మునులను, తపస్సులను, యతులను అనుగ్రహించడమే కాకుండా జానపదులను కూడా తనవారినిగా అక్కున చేర్చుకున్నాడు. జానపదులు స్వచ్ఛమైన మనస్సుతో, అమాయకంగా, తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటారు.

కప్పురపు ఛాయవాడ కాలకంఠుడా
తప్పులెన్నబోకురా తాండవశివుడా! అంటూ
నిలువెల్ల ఆనందనిధులుగా పులకించి
మురిసిపోయెడి కలిమికురిపించుమయ్యా
ముదిత షణ్ముఖనుతా సదయధీరోన్నతా

అంటూ మరోమారు తన ఋషిత్వాన్ని చాటారు షణ్ముఖనుతులంటూ.
––––––––––––

భగవన్నామము విన్న వెంటనే , కళ్లు చెమర్చి ఒళ్లు పులకరించి గొంతు బొంగురుపోతే… అది అసలైన భక్తి అన్నారు రామకృష్ణ పరమహంస. వారి బోధనలను

శివా అనునంతనె చమరించు కనుదోయి…
పులకరించెడి ఒడలు పొంగిపోయడి ఎడద
చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యము
ఇది యొక్కటీయుమా ఇతరములు కోరను
అని శర్మగారు షణ్ముఖునిగా శివుని ప్రార్థించారు.
ఈ పదాలకు చెమర్చని కళ్లు లేవు, ఈ పాదాలకు పరవశించని ఎడదలు లేవు.
–––––––
అమ్మవారి రూపాలు…
దుర్గ లక్ష్మి సరస్వతిగాయత్రి రాధ దేవీ భాగవతం…
నవదుర్గలు, సప్త మాతృకలు.. అన్ని ఒక్క పదం లోనే చూపారు ఆరుమోముల శర్మగారు.
వందే శ్రీమాతరం మహాదేవ తరుణీ
శ్రీచక్ర నివాసినీం శ్రీకరీం శివంకరీమ్‌
అంటూ ఆ తల్లులందరూ మనలను ఆశీర్వదించటానికే భూమి మీదకు దిగినట్లుగా ఈ నాట్యదేవతలు మన మనసుల మీద నాట్యసంచారం చేశారు.

–––––––––––

సాంబశ్శివ శరణం మమ…
సాంబశ్శివ శరణం మమ
స్తంబాది బ్రహ్మాన్త సకల జగద్వా్యపకః

ఉపమన్యు, దధీచి, గౌతమ మహర్షి, మృకండు మహర్షి, వసిష్ఠుడు, అగస్త్యుడు.. మొదలైన శివ భక్తుల కథలు చెబుతూ, ఆ సాంబశివుడిని శరణు కోరారు. హరష్షణ్ముఖావనః.. అంటూ శర్మగారు మరోమారు మనలకు శివసాక్షాత్కారం చేశారు. అందుకే వారు ఋషితుల్యులు.
–––––––––––––

సమగ్రంగా శివతత్త్వంపై రచించారు శివపదాలను.. అంతే సమగ్రంగా ఈ ప్రమథ గణాలు మానవరూపంలో నర్తించి. మనలను నాట్య యజ్ఞానికి కట్టిపడేశారు.
సనాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ కార్యక్రమానికి శుభారంభం చేశారు. సభను సంప్రోక్షణ చేస్తూ కార్యక్రమాన్ని ఆరంభించడం, హారతులిచ్చి, పూలవర్షం వేదిక మీద కురిపించటం మానసిక ఉల్లాసాన్ని కలిగించింది. పదిహేను శివపదాలను ఆధునికతను జోడిస్తూ సంప్రదాయ సంగీతంలో స్వరపరిచారు. నాట్యం సైతం.. ఈతరం వారిని సైతం ఆకట్టుకునేలా రూపొందించారు. ఆ మొత్తం 34 మంది భూలోక దేవతలకు సాష్టాంగ వందనం. వారికి కూడా మంగళహారతులీయవలసిందే.

త్రిపురాంతక శివ మంగళమ్‌
త్రిపుర సుందరి మంగళమ్‌
షణ్ముఖవత్సల సాంబశివ
సకల జగన్నుత సోమ శివ
మంగళమ్‌ శ్రీమంగళమ్‌
మంగళమ్‌ శ్రీమంగళమ్‌
మంగళమ్‌ మంగళమ్‌ మంగళమ్‌…
వేదికంతా మంగళమయమే


లాస్యం, తాండవం ప్రదర్శించిన ఆ నటరాజ మూర్తులంతా వేదిక మీదకు వేంచేసి, కైలాసగిరిని తలపింప చేశారు.
రాసినవారు సాక్షాత్తు శివస్వరూపులు.
నర్తింపచేసినవారు సాక్షాత్తు నటరాజ స్వరూపులు.
నర్తించినవారంతా సాక్షాత్తు ప్రమథ గణాలు.
వీరు మానవమాత్రులు మాత్రం కాదు.
వీక్షించిన వారు ధన్యులు.


(శివపదం నృత్యోత్సవంపై నివేదిక)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here