అన్నమయ్య అన్నది – 8
(రోచిష్మాన్, 9444012279)
‘‘అన్ని చోట్లఁ బరమాత్మ నీవు
ఇన్ని రూపుల భ్రమయింతువుగా’’
అన్ని చోట్లా ఉండే పరమాత్మా, నువ్వు ఇన్ని (చాల) రూపాల్లో తిరుగుతావుగా అని అంటూ సంకీర్తననూ, భగవత్ తత్త్వాన్నీ పల్లవింపజేస్తున్నారు అన్నమయ్య. చాల రూపాల్లో ఉన్నావుగా అని అనకుండా చాల రూపాల్లో తిరుగుతావుగా (భ్రమయింతువుగా) అంటూ అన్ని చోట్లా ఉన్నవాడు (ఇన్ని) చాల రూపాల్లో తిరుగుతుండే వాడు అని చెబుతున్న ఈ నుడి ఉన్నతమైన అభివ్యక్తికి అన్నమయ్య కట్టిన గుడి. అంతేకాదు ఇది ఉక్తి వైచిత్రి కూడా!
ఉక్తి వైచిత్రి లేకపోతే వస్తువుకు నవ్యత్వం ఉండదు. ఆనందవర్థనాచార్యుడి ధ్వన్యాలోకం అన్న అలంకార శాస్త్రానికి లోచనము అనే పేరుతో రాసిన వ్యాఖ్యానంలో అభినవగుప్తుడు ఇలా చెప్పాడు: “ఉక్తి వైచిత్ర్యేణ తు త ఏవార్థ నిరవధయో భవంతీతి/ తద్విషయాణాం ప్రతిభాన మానంత్య ముపపన్న మతి / నను ప్రతిభావంతస్య కిం ఫలమితి నిర్ణేతుం వాణీ నవత్వ మయాతి”. వైచిత్రివల్ల ఉక్తిలో ఉండే అర్థానికి ఆటంకం ఉండదు; ఆ విషయం ప్రతిభానమానం ఔతుంది లేదా ప్రతిభతో తెలియవస్తూ ఉంటుంది. ఉక్తిలోని నవ్యత్వం ఆ ప్రతిభావంతుడు లేదా ఆ కవికి ఫలం లేదా ఫలితం ఏమిటి అన్నదాన్ని నిర్ణయిస్తుంది అని ఆ మాటలకు అర్థం. ‘కావ్య సౌందర్యం ఉక్తి వైచిత్రివల్ల సాధించబడుతుంది’. ఉక్తి వైచిత్రితో శ్రేష్ఠమైన, విశిష్టమైన కావ్య సౌందర్యాన్ని సాధించిన మహోన్నతమైన కవి అన్నమయ్య. అందుకు ఈ సంకీర్తన కూడా ఒక ఋజువు.
“పాల జలనిధి నుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి
భూలోక నిధివై పురుషోత్తమాన నుండి
వేల సంఖ్యల రూపై విచ్చేతుగా”
పాల కడలి నుంచీ (పాల జలధి నుండి), బదరీవనం నుంచీ (బదరీవనాన నుండి), గయలో స్థానాన్ని పొంది ఆపై ప్రయాగ నుంచీ (ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి… ఆలయమై అంటే స్థానాన్ని పొంది అని అర్థం చేసుకోవాలి), భూలోకానికి నిధిగా (భూలోక నిధివై), ఆత్మ శ్రేష్టత్వం నుంచీ (పురుషోత్తమాన నుండి) వేలవేల రూపాలుగా వస్తావుగా (వేల సంఖ్యల రూపై విచ్చేతుగా) అని అన్నారు అన్నమయ్య ఈ సంకీర్తన మొదటి చరణంలో.
పాల కడలి నుంచీ, బదరీవనం నుంచీ, ప్రయాగ నుంచీ అంటూ పరమాత్మను మహావిష్ణువుగానూ, నారాయణుడుగానూ, మాధవుడుగానూ అన్నమయ్య సూచించారు. ఇన్ని రూపాల విష్ణువును భూలోకానికి నిధిగా అనడం ఎంతో గొప్పగా ఉంది కదా? ఆపై ఆత్మ శ్రేష్టత్వం లేదా పురుషోత్తమం నుంచి అని అనడమూ ఇంకెంత బావుందో కదా? అన్నమయ్య అంటే అదే మఱి! పోతన కూడా తన భాగవతంలో “అఖిల రూపముల్ తన రూపమైన వాడు” అని అన్నారు.
“ఉత్తర మధురలో నయోధ్య లోపలి నుండి సత్తైన నంద వ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి
వత్తుగా లోకములు పావనము సేయఁగను”
ఉత్తర మధురలో నుంచీ, అయోధ్య లోపలి నుంచీ (ఉత్తర మధురలో నయోధ్య లోపలి నుండి), బలవంతులైన గోపాలకుల బృందం నుంచీ
(సత్తైన నంద వ్రజాన నుండి), మనసుంచిన పంచవటి నుంచీ (చిత్తగించి పంచవటి), సింహాద్రి లోపల నుంచీ (సింహాద్రిలోన నుండి), లోకాల్ని పావనం చెయ్యడానికి వస్తావుగా (వత్తుగా లోకములు పావనము సేయఁగను) అని రెండో చరణంలో అన్నారు అన్నమయ్య.
ఉత్తర మధురలో నుంచీ, గోపాలకుల బృందం నుంచీ అన్నప్పుడు కృష్ణుడుగానూ, అయోధ్య నుంచీ, పంచవటి నుంచీ అన్నప్పుడు రాముడుగానూ, సింహాద్రి లోపల నుంచీ అన్నప్పుడు నరసింహుడుగానూ అన్నమయ్య పరమాత్మను సూచించారు.
ఆణ్డాళ్ తన తిరుప్‌పావై ఐదో పాసురమ్‌లో (ఆండాళ్, తిరుప్పావై, పాశురం అన్న పదరూపాలు సరైనవి కావు) కృష్ణుణ్ణి ‘వడమదురై మైన్దనై’ అని సంబోధించింది. అంటే ఉత్తర మధురానాథుణ్ణి అని అర్థం. దక్షిణాన తమిళ్ష్ దేశంలో మదురై (తమిళ్ష్‌లో మధురై అని ఉండదు) అన్న ఊరు ఉంది కాబట్టి ఆణ్డాళ్ కృష్ణుడి మధురను ఉత్తర మధుర అన్నది. ఉత్తర మధుర అనడాన్ని ఆణ్డాళ్ నుంచే అన్నమయ్య తీసుకున్నారేమో?
“శత్రువులు పతనం అయ్యేట్టుగా యుద్ధం చేసే
ఏ దోషమూ లేని గోపాలుల…” ఇవి తిరుప్పావై పదకొండో పాసురమ్‌లో ఆణ్డాళ్ మాటలు. ఆ మాటల స్ఫూర్తితోనే అన్నమయ్య ఇక్కడ “బలవంతులైన గోపాలకుల బృందం నుంచీ
(సత్తైన నంద వ్రజాన నుండి)” అని అన్నారని అనిపిస్తోంది.
“వాడే వేంకటేశుడనే వాడే వీడు” అన్న సంకీర్తన రెండో చరణంలో “పెరియాళువారి బిడ్డ పిసికి / విరుల దండల మెడవేసిన వాడు” అంటూ ఆణ్డాళ్‌ను స్మరించుకున్నారు అన్నమయ్య. అంతేకాకుండా “చూడరమ్మ సతులాల సోబాన బాడరమ్మ / కూడుకున్నది పతిఁ జూడి కుడుత నాచారి” అని మొదలయ్యే సంకీర్తనలోనూ, “ఎంత చనువిచ్చితివో యీపై నీపై వెదజల్లీ / కొంతపు జూపుల చూడి కొడుత నాచారి” అని మొదలయ్యే సంకీర్తనలోనూ పూర్తిగా ఆణ్డాళ్ గుఱించే నినదించారు అన్నమయ్య.
తిరుప్పావై ఇరవైమూడో పాసురమ్‌లో ఆణ్డాళ్ కృష్ణుణ్ణి మగ సింహంతో పోల్చింది. అన్నమయ్య కూడా “మలసీఁ జూడరో మగ సింహము / అలవి మీఱిన మాయల సింహము” అంటూ సంకీర్తన చేశారు. తిరుప్పావై ఇరవైనాలుగో పాసురమ్‌లో ఆణ్డాళ్ “కొండను గొడుగులా ఎత్తావు” అని అంటే “గుట్టున ఆవుల కొఱకు మేలనే కొండ / పట్టి యెత్తిన వాడు” అని అన్నారు అన్నమయ్య. ఆణ్డాళ్ అంటే అన్నమయ్యకు అభిమానమేమో?! ఆణ్డాళ్‌ను తెలుగుకు పరిచయం చేసింది అన్నమయ్యేనేమో?
“కైవల్యమున నుండి కమలజ లోకాన
మోవఁగ శ్రీరంగమున నుండి
ఈవల నావల నుండి ఈ వేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా”
రెండో చరణంలో కొన్ని క్షేత్రాలు చెప్పి ఆ క్షేత్రాల నుంచి వస్తావుగా అని అన్నాక మోక్షం లేదా నిర్వాణం నుంచీ (కైవల్యమున నుండి), బ్రహ్మలోకం నుంచి (కమలజ లోకాన) శ్రీరంగం నుంచి (మోవగ శ్రీరంగమున నుండి), అటు నుంచి, ఇటు నుంచి వచ్చి వేంకటాద్రిపై నువ్వే నెలకొన్నావుగా (ఈవల నావల నుండి యీ వేంకటాద్రిపై / నీవే నీవే వచ్చి నెలకొంటిగా) అని అన్నారు అన్నమయ్య చివరగా మూడో చరణంలో.
మోక్షం లేదా నిర్వాణం నుంచీ, బ్రహ్మలోకం నుంచీ వచ్చి అని అనడం అన్నమయ్య ముద్ర; అన్నమయ్య స్థాయి. మోక్షం లేదా నిర్వాణం నుంచి వచ్చి అని అనడం అన్నమయ్య తప్పితే మఱొకరు చెయ్యలేనిది.
‘భూలోకానికి నిధిగా (భూలోక నిధివై)’ అని మొదటి చరణంలో చెప్పాక మూడో చరణంలో వేంకటాద్రిపై నువ్వే నెలకొన్నావుగా (యీ వేంకటాద్రిపై నీవే నీవే వచ్చి నెలకొంటిగా) అంటూ ‘భూలోకానికి నిధిగా వేంకటాద్రిపై పరమాత్మ నెలకొన్నాడని (భ్రమియింతువుగా) అన్నమయ్య చెప్పకుండానే చెబుతున్నాడు.
ఈ సంకీర్తనలో మహావిష్ణువు అవతారాల్ని పరమాత్మ రూపంగా చెప్పిన అన్నమయ్య మఱో సంకీర్తనలో “కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని / పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమనుచు/ తలంతురు మిము శైవులు తగిన భక్తులను శివుఁడనుచు / అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచు/ సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు” అనీ అన్నారు.
ఈ సంకీర్తనలో ప్రస్తావించబడ్డ వేంకటాద్రి గుఱించి తెలుసుకుందాం…
బ్రహ్మాండ, వరాహ పురాణాల్లో వేంకట అనే శబ్దం గుఱించి కొన్ని వివరణలున్నాయి. వామన, గరుడ పురాణాల్లో వేంకటాచల క్షేత్రప్రస్తావన ఉంది. ‘వికటే’ అనేదే ‘వేంకట’ పదానికి పూర్వ రూపం అనీ, ‘వేం’ అంటే పాపం అనీ, ‘కటతి’ అంటే కాల్చేది అనీ వివరణలు ఉన్నాయి.
పురాతనమైన తమిళ్ష్ కావ్యాల్లో వేంకటాద్రి ప్రస్తావన ఉంది. 2వ శతాబ్దికి చెందిన సఙ్‌గ కాల (సంగ కాల) కవి కల్లాడనర్ రాసిన అగనానూఱు కావ్యంలో 83వ పద్యంలో “తిరువేఙ్‌గడమలై కళియినుమ్ కల్లా ఇళైయర్ పెరుమగన్ పుల్లి వియన్దలై నన్ నాట్టు వేఙ్‌గడమ్ (శ్రీవేంకటగిరిపైన ఆటవిక తెగ యువరాజు విహరించిన విశాలమైన మంచి ప్రదేశంలోని వేంకటం)” అని చెప్పబడ్డది. ఇక్కడ శ్రీవేంకటగిరి ప్రసక్తీ, వేంకటం ప్రసక్తీ కనిపిస్తున్నాయి. ఆ కావ్యంలో మఱికొన్ని చోట్ల కూడా ఈ వేంకట శబ్దం చెప్పబడ్డది. అంతేకాదు ఆ రచనలో ‘ఏళ్షీర్ కున్ఱమ్’ అంటే ఏడుకొండల ప్రస్తావన కూడా ఉంది.
తమిళ్ష్ సఙ్‌గ కాల సాహిత్యం అన్నది కొందఱు కవుల రచనల సంకలనం. సఙ్‌గ కాల సాహిత్యం 2వ శతాబ్దికన్నా పాతది అనే పరిశీలన కూడా ఉంది. ఈ తమిళ్ష్ సఙ్‌గ సాహిత్యంలో మఱికొందరు కవులు కూడా వేఙ్‌గడమ్ (వేంకటం) గుఱించి ప్రస్తావించారు. “ఉత్తర వేంకటం నుంచి దక్షిణ కన్యాకుమారి మధ్యన ఉన్నది తమిళ్ష్ పలికే మంచి లోకం (వడ వేఙ్‌గడమ్ తెన్ కుమరి / ఆయిడై తమిళ్ష్ కూఱు నల్ ఉలగమ్)” అనే లోకోక్తి చాలా పాతనాళ్లలోనే తమిళ్ష్‌లో ఉన్నది.
3వ శతాబ్దిలో తమిళ్ష్‌కవి ఇళఙ్‌గో (ఇళంగో)
రాసిన సిలప్పదిగారమ్ కావ్యంలో వేంకటేశ్వరుడి ప్రస్తావన ఉంది. ఆ రచనలో “తిరువరఙ్‌గత్తిల్ కిడన్ద తిరుక్కోలముమ్, వేఙ్‌గడత్తిల్ నిన్ఱ తిరుక్కోలముమ్” అని చెప్పబడ్డది. అంటే శ్రీరంగంలో (తిరువరఙ్‌గత్తిల్) పడుకుని ఉన్న పవిత్ర రూపమూ, వేంకటంలో (వేఙ్‌గడత్తిల్)
నుంచుని ఉన్న పవిత్ర రూపమూ అని అర్థాలు. ఆ రచనలో నుంచుని ఉన్న వేంకటేశ్వరుడి గురించి ఉటంకింపు పునరావృతమూ అయింది.
పురాణాల్ని మినహాయిస్తే వేంకటం గుఱించి, వేంకటేశుడి గుఱించి 1, 2, 3 శతాబ్దులకే (అంతకన్నా ముందే ?) తమిళ్ష్ కావ్యాలలో ప్రస్తావన ఉంది. అటు తరువాత సామాన్య శకం 1- 8 శతాబ్దులకు చెందిన ఆళ్ష్వార్‌ల కాలానికి (పొదిగై ఆళ్ష్వార్, బూదత్తు ఆళ్ష్వార్, పేయ్ ఆళ్ష్వార్ ఈ ముగ్గురూ తొలి దశ ఆళ్ష్వార్‌లు. వీళ్ల కాలం సామాన్య శకానికి పూర్వం 300 -200 అని చెప్పే పరిశీలనలూ ఉన్నాయి) వేంకటేశుడు వేంకటాద్రితో సహా ప్రసిద్ధమైనాడు. ఆళ్ష్వార్‌లు పలు పాసురాల్లో (ఆళ్ష్వార్‌లు పాడిన విష్ణుభక్తి గీతాల్ని పాసురాలు అని అంటారు) వేంకటేశుణ్ణి కీర్తించారు. తొలిదశకు చెందిన పేయ్ ఆళ్ష్వార్ తిరుమలై అనే పదాన్ని వాడారు. తిరుమలై (తిరుమల), తిరుపతి అన్నవి తమిళ్ష్ పదాలు. తిరు అంటే శ్రీ , పవిత్రమైన, ఉన్నతమైన అని అర్థాలు. మలై అంటే పర్వతం.
తిరుమలై అంటే శ్రీ పర్వతం, పవిత్రమైన పర్వతం, ఉన్నతమైన పర్వతం అనీ, తిరుపతి అంటే శ్రీపతి, పవిత్రమైన నాథుడు, ఉన్నతమైన నాథుడు అనీ అర్థాలు.
పరమాత్మ చాల రూపాల్లో తిరుగుతూ ఉండే సత్యాన్ని పరమాద్భుతంగా ప్రవచించారు అన్నమయ్య ఈ సంకీర్తనలో. అందుకే ప్రశస్తంగా మెఱుస్తూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.
- * *
అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగు భాషకు సంబంధించినంత వఱకూ ప్రజల్లో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.
అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం, ఏ విధమైన చింతన, ఏ విధమైన భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ స్థాయిలో కవిత్వం చెప్పారు అన్నమయ్య.
అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!
అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!
అన్నమయ్య అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం.
(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)
(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)