ఎన్.జి. రంగా ఘనత
నేడు రైతు బాంధవుని వర్ధంతి
(శివ రాచర్ల)
తెలుగు సినిమా రంగం నుండి ప్రత్యక్ష ఎన్నికలలో (లోక్ సభ) గెలిచిన మొదటి వారు జగ్గయ్య,1967లో కాంగ్రెస్ తరుపున ఒంగోలు లోక్ సభ స్థానం నుండి గెలిచారు. జగ్గయ్యగారికన్నాముందు భారతదేశంలో మరే నటుడు లేదా నటి లోక్ సభకు ఎన్నికయ్యారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి.
రాజ్యసభకు ఎన్నికయిన తొలినటుడు పృధ్విరాజ్ కపూర్, 1952లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆంధ్రా నుంచి రావు గోపాల్రావు రాజ్యసభకు ఎన్నికయిన తొలినటుడు. 1986లో ఎన్టీఆర్ రావు గోపాల్ రావును రాజ్యసభకు ఎంపిక చేశారు. అంతకు ముందు 1984లో రావు గోపాలరావు ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు.

జగ్గయ్య ఆకాశవాణిలో న్యూస్ రీడరుగా పనిచేసిన సమయంలో ఒకసారి అధికార వార్తా పత్రికలతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అనధికార పత్రిక కూడా కలిసిపోయింది. ఆ పత్రికను సైతం జగయ్య చదవటంతో ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.
ఉద్యోగం పోయిన తరువాత జగ్గయ్య తన “కంచు కంఠాన్ని” నమ్ముకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

ఆ తరువాత రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి 1962లో తెనాలి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్.జి.రంగాపై పోటీ చేద్దాం అనుకున్నారు. రంగా గారి లాంటి రైతు నాయకులు పార్లమెంటులో ఉండాలి అని నెహ్రు జగ్గయ్యను పోటీ చెయ్యొద్దని చెప్పారంట. రంగాగారు గెలవలేరు కమ్యునిష్టుల చేతిలో ఓడిపోతారని జగ్గయ్య చెప్పినా అయినా నెహ్రు పోటీవద్దన్నారట. జగ్గయ్య చెప్పినట్లే రంగా గారు కొల్లా వెంకయ్య(CPI) చేతిలో ఓడిపోయారు.
1967 ఎన్నికలలో తెనాలి లోక్ సభ స్థానం రద్దు కావటంతో జగ్గయ్య ఒంగోలు నుండి పోటీచేసి గెలిచారు.

1956లో చిత్తూరు నుంచి గెలిచిన (అప్పటి స్పీకర్ కూడా) అనంతశయనం అయ్యంగారు 1962లో తిరిగి గెలిచి కొన్ని నెలలకే లోక్ సభకు రాజీనామా చేసి (ఆరోగ్య కారణాలతో) బీహారు గవర్నరుగా వెళ్లారు. అప్పటి ఉప ఎన్నికలో తెనాలి నుంచి ఓడిపోయిన రంగా గారు స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. డీఎంకేకు మద్రాస్ స్థానం ఉప ఎన్నికలో మద్దతు ఇచ్చినందుకు స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా రంగాగారికి చిత్తూరు ఉప ఎన్నికలలో డిఎంకె మద్దతు ఇవ్వటంతో రంగాగారు గెలిచారు.

1967లో రంగా సిట్టింగ్ సీట్ చిత్తూరు నుంచే లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన శిష్యుడు గౌతు లచ్చన్న ఆ ఎన్నికలలో “సోంపేట” నుంచి అసెంబ్లీకి శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకు గెలిచి ఉన్నారు. లచ్చన్న శ్రీకాకుళం ఎంపీ పదవికి రాజీనామా చేసి రంగాగారిని అక్కడి నుంచి గెలిపించారు. ఇలా రెండుసార్లు సాధారణ ఎన్నికల తరువాత కొన్ని నెలల్లోనే ఉప ఎన్నికలలో గెలవటం ఒక రికార్డు.
1971లో శ్రీకాకుళం నుంచి ఓడిపోయినా తరువాత దాదాపు 2 దశాబ్దాలు కీలక కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ఉన్న రంగా తిరిగి కాంగ్రెసులో చేరి ఎమర్జెన్సీ సమయంలో ఇందిరకు మద్దతు ఇచ్చారు.

రంగా 1977-1980 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున 1980,84,89 ఎన్నికల్లో గెలిచి 91 సంవత్సరాల వయస్సులో 1991 ఎన్నికల్లో టీడిపీ లాల్ జాన్ బాషా చేతిలో ఓడిపోయారు.
1952లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయినప్పటి నుంచి 1991 మధ్య కాలం కేవలం 1971-1977 మధ్య మాత్రమే రంగా గారు పార్లమెంటులో సభ్యులు కాదు. రంగా గారిలా ఒకే రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాల నుంచి గెలిచిన మరే ఇతర నాయకుడు లేరు.
1995 జూన్ 9న రంగా గారు చనిపోయారు. రంగా శిష్యుడిగా రాయపాటి సాంబశివరావు గుంటూరు నుంచి లోక్ సభ సభ్యుడిగా 1996, 1998, 2004, 2009లో గెలిచి 1999లో ఓడిపోయారు.
నాయకులను తయారు చేశారన్న అభిప్రాయంతో ఆయన శిష్యులు “నాయకుల” ను ఇంటి పేరులో చేర్చి గోగినేని రంగనాయకుల పేరును ఎన్.జి. రంగా మార్చారు.
రంగా గారు బ్రిటన్లో(Oxford) చదువుకొని రాజకీయాలకు రావటం, వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టటం తదితర అంశాలు చిన్న వయస్సులోనే పెద్దనాయకుడిని చేశాయి. అప్పట్లో మంచి ఉపన్యాసాలను పార్టీలకు అతీతంగా వినటం కూడా రంగా లాంటి ఉపన్యాసకులు నాయకులుగా ఎదగటానికి ఉపయోగ పడింది. రంగా గారు సొంత ఊరు నిడుబ్రోలులో వ్యవసాయ శిక్షణా తరగతులు నిర్వహించేవారు. అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడ శిక్షణ పొందారు.
(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకులు)