విగ్రహ వివాదాన్ని ఎలా చూడాలి?

Date:

బ్రాహ్మ‌ణేత‌ర కులాల‌కూ ఆరాధ‌న తంతులు
విగ్ర‌హ స్థాప‌న ఓకే… ఆంత‌ర్య‌మే వివాదాస్ప‌దం
(కల్లూరి భాస్కరం)
వైదికమనండి, ఆర్షమనండి, బ్రాహ్మణమనండి, హిందూ అనండి…ఆ పేర్లలోకి ఇప్పుడు వెళ్లను కానీ; మొదటినుంచీ ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయంలో ఆస్తికులే కాక, తగు సంఖ్యలో నాస్తికులు, హేతువాదులతో సహా ఇప్పుడున్న అన్ని రకాల భావజాలాలవారూ, దృక్కోణాలవారూ ఉన్నారు. వేదాలు, రామాయణ, మహాభారతాది వాఙ్మయాలలో దాదాపు ఈ అన్నిరకాల గురించిన ప్రస్తావనలూ ఉన్నాయి.
ఈ సంప్రదాయానికి సమాంతరంగా బ్రాహ్మణేతరకులాలకు తమవైన అమ్మవార్లు, పురుషదేవుళ్ళ ఆరాధనా, తంతులూ ఉన్నాయి. కాలగతిలో ఈ రెండు సంప్రదాయాల మధ్యా ఇచ్చి పుచ్చుకునే సంబంధాలూ ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయన్న చర్చలోకి కూడా ఇప్పుడు నేను వెళ్లను.


సంస్క‌ర‌ణ ల‌క్ష్యంతోనే కొన్ని మ‌త పంథాలు
మరోవైపు, వైదిక/ఆర్ష/బ్రాహ్మణ/హిందూసంప్రదాయానికి సమాంతరంగా బౌద్ధ, జైనాలున్నాయి. వైదిక/ఆర్ష/బ్రాహ్మణ/ హిందూసంప్రదాయంలో భాగంగానూ, లేదా, దానికి పోటీగానూ, లేదా దానిని సంస్కరించే లక్ష్యంతోనూ మరికొన్ని మతపంథాలు వచ్చాయి. ఇవి తాత్వికంగా అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత రూపాలనూ; మతపరంగా శైవ, వీరశైవ, వైష్ణవ, శివకేశవ అభేదరూపాలనూ తీసుకున్నాయి. ఆపైన ఇవి భక్తి ఉద్యమాన్ని వెంటబెట్టుకుని వచ్చాయి. మధ్యయుగాలనుంచి నేటి ఆధునికయుగంవరకూ ఎంతోమంది భక్తులు, భక్తకవులు, కీర్తనకారులు ఈ భక్తిఉద్యమధారను సజీవంగా నిలుపుతూనే ఉన్నారు.
ఇది ఈ దేశపు మత, ఆధ్యాత్మిక రంగంలో వచ్చిన పరిణామాల స్థూలచిత్రమే కానీ, సమగ్రచిత్రణ కాదు. ఇప్పటి పరిణామాలను అర్థం చేసుకోవడానికీ, అంచనా వేయడానికి అవసరమైన ఒక సంక్షిప్త చారిత్రక నేపథ్యాన్ని సూచించడం కోసమే పై విషయాలను స్పృశించాను.


ఆధిప‌త్య ధోర‌ణులు, అణ‌చివేత‌
పై సంప్రదాయం కూడా అన్ని విధాలా ఉజ్వలమైనదీ, ఆదర్శవంతమైనదీ కాదు. అందులోనూ రాజకీయాలున్నాయి; ఆధిపత్య ధోరణులూ, అణచివేతా, అసమానతలూ, వంచనలూ ఉన్నాయి. ఇంకోవైపు, వైరుధ్యాలను, ఘర్షణ పరిస్థితులను మరుగుపరిచి తక్షణ సామాజిక శాంతినీ, సామరస్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా తప్పనిసరి రాజీలూ, సర్దుబాట్లు, సుహృద్భావాన్ని పెంపొందించే ప్రయత్నాలూ ఉన్నాయి. ఆవిధంగా అందులోనూ చీకటి-వెలుగులు రెండూ ఉన్నాయి. గుళ్లూ, గోపురాల నిర్మాణాలూ; భక్తివిశ్వాసాల ప్రదర్శనలూ, భారీవిగ్రహాల స్థాపనలూ ఉన్నాయి.
ప్ర‌వేటు జాబితాలో భిన్న‌మైన భావజాలాలు
చరిత్ర గతిలో వర్తమానానికి వస్తున్నకొద్దీ; కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా మనకు కొన్ని అనుభవాలూ, ఆ అనుభవాలా రీత్యా ఈ దేశంలోని అన్నిరకాల వైవిధ్యాలనూ గుర్తించి, గౌరవించి; ఇన్ని వైవిధ్యాల మధ్యనే ఈ దేశాన్ని ఒకటిగా చేసే అవసరమూ తలెత్తింది. దేశానికి స్వాతంత్య్రం రాగానే అందుకు అనుగుణమైన ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామికదృక్పథానికి అద్దంపట్టే రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. అంటే, కొత్త రాజ్యాంగాన్ని తెచ్చుకోవడం ద్వారా మనం ఒక దేశంగా కొత్త చరిత్రను ప్రారంభించాం. మతాలూ, దేవుడూ, భక్తివిశ్వాసాలు, పూజలూ, పురస్కారాలూ; వాటికి వ్యతిరేకంగా నాస్తిక, హేతువాదాలూ; రాజకీయంగా, ఇతరత్రా భిన్నభిన్న భావజాలాలూ-అన్నీవ్యక్తిగత, లేదా ప్రైవేట్ జాబితాలో చేరాయి; రాజ్యాంగలక్ష్యాలను సాకారం చేయడం సహా లౌకికకార్యాచరణ అంతా ఉమ్మడి అజెండాలో చేరింది. ప్రభుత్వాల బాధ్యత ఆ ఉమ్మడి అజెండాను అమలుచేయడం మేరకే పరిమితమైంది; పరిమితం కావలసి ఉంటుంది.


అన్ని నిర్మాణాల‌కూ ఈ వ్య‌వ‌స్థ‌లో స్థానం
ఈ వ్యవస్థలో ఎవరి గుళ్లూ, గోపురాలూ, మసీదులూ, చర్చిలూ, గురుద్వారాలూ వారు నిర్మించుకోవచ్చు; బౌద్ధ, జైననిర్మాణాలు చేసుకోవచ్చు; బృందాలుగా ఏర్పడి ఎవరి మతపరమైన తంతులను వారు జరుపుకోవచ్చు. అయితే, ఒక షరతు ఏమిటంటే, ఇవన్నీ ప్రైవేట్/వ్యక్తిగతంలోకే వస్తాయి. ప్రభుత్వాలకు ఇందులో పాత్రకానీ, ప్రమేయం కానీ ఉండకూడదు; ఉండవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యతాత్వికతకు అద్దంపట్టే రాజ్యాంగం ద్వారా కలుగుతున్న అవగాహన ఇదే; రాజ్యాంగస్ఫూర్తి ఇదే.


అంద‌రి అభిమ‌తాల‌నూ గుర్తించాలి
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఓటు ప్రాతిపదికపై, మెజారిటీ అభిమతాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాలను ఎన్నుకోవడమే కనుక, మెజారిటీ ప్రజలు తమ మతవిశ్వాసాలకూ, ఆరాధనావిధానాలకూ అనుకూలమైన ప్రభుత్వాలను ఎన్నుకోవడం కూడా ప్రజాస్వామ్యం కిందికే వస్తుంది కదా అన్న వాదనను ఎవరైనా లేవనెత్తవచ్చు. రాజ్యాంగ రూపంలో ఒక ఉమ్మడి ఒప్పందం కిందికి రావడంలో మెజారిటీ/మైనారిటీ మతాల పాత్రను మించి మొత్తంగా భారతీయుల సమష్టి పాత్ర ఉంది కనుక వారందరి అభిమతాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది. ఈ రాజ్యాంగం ఈ దేశపు వైవిధ్యమనే పునాది మీద అవతరించినది కనుక- ఏం చేసినా ఆ పునాది దెబ్బతినకుండా చూసుకోవలసి ఉంటుంది. ఒకరకంగా మనం అమలు చేసుకుంటున్న ప్రజాస్వామ్యానికి ఈ వైవిధ్యమనే పునాది ఒక పరిమితిని, ఒక షరతును విధిస్తోందని అనుకోవచ్చు.


ప్రైవేటు ప్ర‌య‌త్నాల‌లో రాజ‌కీయాల చొర‌బాటు
అయితే, కొన్నేళ్లుగా మన దేశం ఎదుర్కొంటున్న అనుభవం భిన్నమైనది. మెజారిటీ మత, భక్తివిశ్వాసాల ప్రదర్శనలో ప్రైవేట్/ ప్రభుత్వాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. మెజారిటీ మతానికి చెందిన గుడి-గోపురాల నిర్మాణంలో ప్రభుత్వాలు ప్రత్యక్షపాత్ర పోషిస్తున్నాయి. ప్రైవేట్ /వ్యక్తిగత ప్రయత్నాల వెనుక కూడా రాజకీయశక్తులు చేరుతున్నాయి. వెనకటి ప్రభుత్వాల కాలంలో ఇలాంటివి జరగలేనిది కాదు; అయితే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకస్థానాలలో ఉన్నవారే వీటిని సూత్రరీత్యా, సిద్ధాంతరీత్యా సమర్థించడం, ఒక విధానంగా అమలుచేయడం జరుగుతోంది. మన ప్రజాస్వామిక రాజ్యాంగస్ఫూర్తిరీత్యా కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు ఒక మతంతో; ఆ మతానికి చెందిన ఆరాధనా కేంద్రాలతో, బాహ్య చిహ్నాలతో బాహాటంగా మమేకం అవుతున్న కారణంగా; ఆ మతానికి చెందనివారు, ఆ ఆరాధన కేంద్రాలతో మమేకం కాలేనివారు (ఆ మతానికే చెందిన నాస్తికులు సహా), ఆ భక్తివిశ్వాసాల ప్రదర్శనలో భాగస్వాములు కాని వారు మానసికంగా ఆ ప్రభుత్వాలకు బయట ఉండిపోతున్నారు. దానిని తమ ప్రభుత్వంగా భావించలేకపోతున్నారు. ఇలాంటిది ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద వైరుధ్యం.


మ‌తానుకూల పాల‌న‌లో హిందుత్వ ప్ర‌ముఖం
ఈ మెజారిటీ మతానుకూలపాలనలో ‘హిందుత్వ’ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొదట్లో చెప్పుకున్న వైదిక/ఆర్ష/బ్రాహ్మణ/హిందూసంప్రదాయానికి; ఈ హిందుత్వకు కొన్ని తేడాలు తప్పనిసరిగా ఉన్నాయి; ఎన్నో పోలికలూ ఉన్నాయి. వైవిధ్యానికి పట్టం కట్టే రాజ్యాంగం వెలుగులో ఈ తేడాలను, పోలికలను ఎవరికి వారు వివేచించుకోవలసిన అవసరం ఉంది. తాము ఇప్పటి ఈ ‘హిందుత్వ’ కార్యాచరణ వైపు మొగ్గు తున్నారో; లేక మత, భక్తివిశ్వాసాల పాటింపును, ప్రదర్శనను, గుడి గోపురాల నిర్మాణాన్ని ప్రైవేట్/వ్యక్తిగత అజెండాకు పరిమితం చేస్తూ; లౌకిక విషయాలకు మాత్రమే పరిమితమైన ఉమ్మడి అజెండాను అమలు చేయడమే ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నారో నిర్ణయించుకోవలసి ఉంటుంది.


భ‌క్తి విశ్వాసాల‌ను పాటించే వారంతా హిందుత్వ వాదులు కారు
హైందవమత, భక్తివిశ్వాసాలను పాటించేవారు అందరూ ‘హిందుత్వ’వాదులు కారన్నది స్పష్టమే. వారు పైన చెప్పుకున్నట్టు ప్రైవేట్/వ్యక్తిగత పరిధిలో, గతంలో లానే ఇప్పుడు కూడా స్వేచ్ఛగా మత, భక్తివిశ్వాసాలను పాటించవచ్చు, ప్రదర్శించుకోవచ్చు. వెనకటి నుంచీ వస్తున్న సంప్రదాయమూ, ఇప్పటి హిందుత్వా కలగాపులగమయ్యే పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కనుక, తాము ఎటువైపో ఎవరికి వారు కొత్తగా నిర్ణయించుకోవలసిన అవసరం తలెత్తింది. మెజారిటీ మతానికీ, రాజకీయాలకూ మధ్య హద్దులు చెరిగిపోయి రెండూ కలసిపోతున్న ప్రస్తుతసమయంలో మెజారిటీ మతానికి చెందిన ఏ కార్యకలాపాన్ని అయినా అనుమానంతో చూడవలసిన అనివార్యత ఏర్పడిన సంగతిని గుర్తించవలసి ఉంటుంది. ఈ కొత్త సందర్భాన్ని అర్థం చేసుకుని తాము వాస్తవంగా ఎటువైపు ఉన్నారో తేల్చుకోలేకపోతే- ఇలాంటి గుడి గోపురాలు, విగ్రహాల నిర్మాణంద్వారా అయాచితప్రచారం పొందుతూ హిందుత్వరాజకీయశక్తులే ఎక్కువ బలోపేతమవుతాయి. ఇది ఈ దేశపు వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే మెజారిటీమతవిశ్వాసులు కూడా ఇష్టపడే పరిణామం కాబోదు.
రామానుజ విగ్ర‌హ వివాదం క్లాసిక్ సంద‌ర్బం
రామానుజుల భారీ విగ్రహ వివాదం ఈ వివేచనకు ఒక క్లాసిక్ సందర్భం. మతమూ, గుడిగోపురాలు, విగ్రహాల నిర్మాణం ప్రైవేట్/వ్యక్తిగత పరిధిలో ఉన్నంతకాలం వారి వారి మతాలకు చెందిన ఆరాధ్య వ్యక్తుల విగ్రహాలను ఎంత భారీగానైనా నిర్మించుకోవచ్చు; రాజకీయం కలగలిసినప్పుడూ, అందుకు ఎంతైనా అవకాశం ఉన్నప్పుడూ సహజంగానే ఆ విగ్రహాల స్థాపన వెనుక; ఆ గుడిగోపురాల నిర్మాణం వెనుక ఆంతర్యమూ, లక్ష్యమూ అనుమానాస్పదంగా మారి చర్చనీయం అవుతాయి. అలా వాటిని అనుమానించడం కానీ, చర్చించడం కానీ – ఆ మూర్తులను, వారి గుడిగోపురాల నిర్మాణాన్ని, ఆ మూర్తులను ఆరాధించేవారినీ, మొత్తంగా హైందవసంప్రదాయాన్నే వ్యతిరేకించడమవదు. ఈ తేడాను కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

Kalluri Bhaskaram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...