ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

Date:

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…
టీ నుంచి ట్రక్ వరకూ
అప్రెంటిస్ నుంచి చైర్మన్ దాకా
(వాడవల్లి శ్రీధర్)

ఓ గొప్ప పారిశ్రామికవేత్త. ప్రపంచంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. రతన్ టాటా మరణవార్తతో యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది. ఎనిమిది పదుల వయసులోనూ నిర్విరామంగా పనిచేసిన వ్యక్తి రతన్ టాటా. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ నలుమూలల విస్తరించడంతో పాటు.. దేశం పట్ల ఆయన బాధ్యతను ఎన్నడూ మరువలేదు. ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు.. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు.. పరోపకారి.. ఆయనో మానవతావాది యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశం లోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానం లో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ ని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా.
టెక్స్టైల్ మిల్లుగా ఆరంభమై…
టాటా కంపెనీ మొదట ఒక టెక్సటైల్ మిల్ గా ప్రారంభమయ్యింది. జంషెడ్ జీ టాటా దీనిని స్థాపించారు. 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటా లే. ఇప్పుడు ఎయిర్ ఇండియా మొదట టాటా గా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022 లో ఎయిర్ ఇండియా ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇదొక్కటే కాదు ఆసియా లోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ, మన దేశం లోనే మొట్ట మొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ స్థాపించింది కూడా టాటా లే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం, అభివృద్ధి లో టాటాల పాత్ర అద్వితీయం.
అమెరికాలో ఇంజినీరింగ్ విద్య
రతన్ టాటా డిసెంబర్ 28, 1937 సంవత్సరం లో దేశం లోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఉద్యోగం వచ్చింది .. ఇండియాకి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియా కి వచ్చి జంషెడ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తరువాత 1991 రతన్ టాటా ని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించారు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చారు రతన్ టాటా.
టాటా ఇండికా ప్రస్థానం
భారత దేశంలో ప్యాసింజర్‌ సెగ్మెంట్‌లో తయారైన మొదటి కారు టాటా ఇండికానే. దీన్ని టాటా మోటార్స్‌ సంస్థ 1998లో తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది బడ్జెట్‌ కార్ల విభాగంలో మంచి ఆదరణ సంపాదించుకుంటూ వచ్చింది. చిన్నగా ఉండే ఈ కారు ధర కూడా అంతే అందుబాటులో ఉండేది. దీంతో విడుదలైన రెండేళ్లలోనే ఈ మోడల్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. ఆ కార్లు మొదట సంవత్సరం విఫలమయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మెయ్యాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకుని .. ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టీంతో వెళ్లారు. ఆ సమావేశంలో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, రతన్ టాటా తో “మీకు కార్లు ఎలా తయారు చెయ్యాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు ప్రారంభించారు” అని టాటాను అవమానపరిచారు. ఈ కారణంగా టాటా ఆ ఒప్పందం కుదుర్చుకోకుండా ముంబై కి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వర్-ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ జాగ్వర్-ల్యాండ్ రోవర్ రెండు కంపెనీల కొనుగోలుకు ముందుకొచ్చారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న లను 9300 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు కంపెనీలనూ మళ్ళీ లాభాల బాట పట్టించారు. ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో… వాళ్లనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఇదొకటే కాదు యూరప్ కి చెందిన స్టీల్ కంపెనీ ని కొనుగోలు చేశారు. ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ టీ కంపెనీ ని కొని టాటా టీలో విలీనం చేసి ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద టీ కంపెనీగా అవతరింపచేశారు. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళకు తన కింద ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22 కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకుని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా.
రతన్ టాటా లవ్ స్టోరీ
అపర కుబేరుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాకు ఓ క్యూట్ లవ్ స్టోరీ ఉంది. ఆయన లాస్ ఏంజిల్స్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్నప్పడు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ చిగురిస్తున్న సమయంలో రతన్ టాటా అమ్మమ్మ అనారోగ్యంతో మంచాన పడ్డప్పడు టాటా భారత్‌కు తిరిగి వచ్చారు. తనతో పాటు తన ప్రియురాలు కూడా భారత్‌కు వస్తుందని భావించిన రతన్ టాటాకు నిరాశే ఎదురైంది. ఇక భారత్‌కు వచ్చిన తర్వాత 1962లో భారత్ -చైనా మధ్య యుద్ధం జరిగింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్‌కు పంపేందుకు ఇష్టపడలేదు. దీంతో రతన్ టాటా లవ్‌స్టోరీకి ఎండ్ కార్డు పడింది. ఈ జ్ఞాపకాలతోనే బ్రహ్మచారిగా జీవితాంతం ఉండిపోయారు.
టాటా సుమో పేరు వెనుక కధ
లారీ డ్రైవర్లతో కలిసి భోజనం చేస్తూ, వాహనాల్లోని సమస్యలను అడిగి తెలుసుకుని, దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఫీడ్‌బ్యాక్ అడిగి, దాన్ని మెరుగుపరిచేందుకు టాటా మోటార్స్ ఆర్‌అండ్‌డి విభాగానికి చెప్పేవారు. సుమంత్ మూల్గోకర్ నాయకత్వంలో, మోటారు కార్లు మాత్రమే కాకుండా, ట్రక్కుల రూపకల్పన, ఉత్పత్తి అనేక విభాగాలలో మెరుగుపడింది. సుమంత్ మూల్‌గావ్‌కర్‌కు టాటా సుమో అనే పేరు పెట్టారు, పని పట్ల అతని అంకితభావానికి గుర్తింపుగా, కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులందరినీ అభినందించారు. 1991లో టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా మోటార్స్ 1994లో మొట్టమొదటి టాటా సుమో కారును పరిచయం చేసింది.
పైలట్ గానూ టాటా
రతన్‌ టాటాకు స్పీడ్‌ కార్లంటే చాలా ఇష్టం. అదే సమయంలో ఆయన విమానాలు నడిపే ఓ మంచి పైలట్‌ కూడా. ఆయన పేరిట అరుదైన రికార్డు ఉంది. ఆయన 69 ఏళ్ల వయసులో ఫైటర్‌ జెట్‌ను నడిపి సంచలనం సృష్టించారు. అమెరికా ఆయుధ తయారీ సంస్థ ఆయన్ను స్వయంగా ఎఫ్‌-16 నడపడానికి ఆహ్వానించింది. ఆయనకు జెట్‌ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్‌ కూడా ఉంది.
ఎయిర్ షోలో కో పైలట్ గా…
2007లో బెంగళూరులో ఏరో ఇండియా షో జరిగింది. దీనిలో లాక్‌హిడ్‌ మార్టిన్‌ కూడా తమ ఫైటర్‌జెట్లను ప్రదర్శించింది. నాడు ఆ సంస్థ టాటాను ఆ ఫైటర్‌ విమానం నడిపేందుకు ఆహ్వానించింది. ఈ అవకాశాన్ని టాటా సంతోషంగా అందుకొన్నారు. ఈ ప్రయాణంలో ఆయన కోపైలట్‌గా వ్యహరించారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ అడ్వెంచర్‌లో లాక్‌హిడ్‌ పైలట్‌ విమానం కొద్దిదూరం నడిపి.. కంట్రోల్‌ టాటాకు అప్పగించారు. ఈ సమయంలో పైలట్‌ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. వాస్తవానికి ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్‌ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్‌హిడ్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ మర్నాడే ఆయన బోయింగ్‌ సంస్థకు చెందిన ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని నడపడం విశేషం.
ఎయిర్ ఇండియా విలీనం
దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్‌ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకుంది. ఈ సంస్థ టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన తర్వాత టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌, టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా తొలిసారిగా స్పందించారు. ఎయిరిండియా ప్రయాణికులకు సాదర స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్‌ పంపారు. రతన్‌కు వైమానిక రంగంపై ఉన్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది.టాటా ఎప్పుడూ ఇండియా ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారత దేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో (ఒక సారి రతన్ టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త , భార్య ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. పేద,మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయల ధరకు కారుని తయారు చెయ్యాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. వాళ్ళు లక్ష రూపాయలలో కారుని తయారు చెయ్యడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలం అయ్యింది. నానో కారు తయారుచెయ్యడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారుచెయ్యడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.
లాభం కోసం వ్యాపారం చేయని వ్యక్తిత్వం
సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో , వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చెయ్యలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటా లు సంపాదిస్తున్న దాంట్లో చాల వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు . అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డ్ణా లోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో ఉద్యోగులు తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా 1500 మందికి పైగా అతిధులను కాపాడారు. ఆ ప్రయత్నం లో భాగంగా ఏంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు.


టాటా ట్రస్ట్ …. దేశంలోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య ,ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాలలో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ లు అందుతున్నాయి. తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకు టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ కి 300 కోట్ల రూపాయలు పైగా విరాళంగా ఇచ్చారు. అందుకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్ లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా కేన్సర్ పేషంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను అందచేశారు.
అవార్డులు…. గుర్తింపు
రతన్ టాటా తన కృషికి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2010లో ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు లభించింది. 2014లో క్వీన్ ఎలిజబెత్ రతన్ టాటాకు ప్రతిష్టాత్మకమైన నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డును ప్రదానం చేశారు. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయం.

ఒకప్పుడు వ్యాపారం చెయ్యడానికి పనికిరాడు అన్నారు .. కానీ ఇప్పుడు 10000 కోట్ల రూపాయల విలువైన సంస్దని తన నాయకత్వం లో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగు పెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, కెమికల్స్, టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, ఇలా ఏకంగా 96 కి పైగా వ్యాపారాలను ఈ సంస్థ నడుపుతోంది. ఇంత పెద్ద పారిశ్రామిక వేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాల సామాన్యంగా ఉంటుంది. మీడియాకి మీటింగ్ లకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మాన్ కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటంలో 100 శాతం విజయాన్ని సాధించారు. మంచితనంలో ఆయన అపరకుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్ గా రతన్ టాటా నిలిచిపోయారు.
ఆయన తన ఆస్తిలోస్తి సుమారు 60 నుంచి 65% సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవారు. ఆయన యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దాదాపు 30 స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. వ్యాపారానికి అతీతంగా, టాటా వారసత్వం దాతృత్వంలో లోతుగా పాతుకుపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...