మాటల డింగరి – 3
జగదేకవీరుని కథ చలన చిత్రం
(పురాణపండ వైజయంతి)
కథ, మాటలు, పాటలు – పింగళి నాగేంద్రరావు
సినిమా అనుకరణ – కె. వి. రెడ్డి
జగదేక పింగళి వీరుని కథకి పింగళి మాటలు రచించారు. ఆయనను జగదేకవీరుడిని చేశారు. పదాలతో చమత్కారంగా ఆడుకున్నారు. ఆంగ్ల పదాలను, ప్రాకృత పదాలను తెలుగు పదాలుగా తన పద నిధిలో పెట్టేశారు. ఇవి పింగళి మాటలు అని అంగుష్ఠ ముద్ర కొట్టించేసుకున్నారు. పాత్రలు, వారి నామకరణాలు, వారి వేషధారణలు కలిసేసరికి పింగళి వామనుడి నుంచి త్రివిక్రముడిగా నిచ్చెన లేకుండానే ఆకాశానికి ఎక్కడం చేశారు.
ఇదీ కథ…
అనగనగా ఒక రాజుగారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు నలుగురు దేవకన్యలను వివాహం చేసుకోవాలని కల గన్నాడు. కల నెరవేర్చుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర అనుమతి స్వీకరించాడు. నలుగురు కన్యలను పెళ్లి వివాహం చేసుకున్నాడు. ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏమైతేనేం… చివరాఖరుకి నలుగురు అమ్మాయీమణులతో హాయిగా జీవించాడు.
…..
పింగళి సిరాక్షరాలు పరిశీలన చేసి, అంగుళం అంగుళం లోతుల పరవేశ దవారంలోకి అస్మదీయులంతా రావలసిందే.. లేదంటే త్రిశోకాలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త.
…………………
కథను పక్కకు పెట్టి ఉయ్యాల తోసి రాజని…
మాటలమాలలను పరిశీలన సాయిద్దాం…
‘ఒట్టి దండాలేనా! దండకాలేవి? గొంతులు ఆరిపోయాయా’ అంటూ రాజుగారి రెండో కుమారుడు ప్రశంసలు కురిపించమని తన కత్తిని ఝళిపించారు.
ఆ దండానికో దండం పెట్టి, మరో సరదా దగ్గరకి వెళితే…
‘సంస్కారాన్ని బట్టి కోరికలు పుడతాయి… కోరికల్ని బట్టి జీవితాలు నడుస్తాయి’’ ట.
సరదాగా చెప్పిన మాటలా…
తప్పు తప్పు…
తెలివితో చెప్పిన మాటలే..
ఇదో రకం సరదా తెలివి..
ఏదో ఒక తెలివి ఉండాలిగా మరి..
ఇప్పుడు ఆ ఏదో ఒక తెలివిని తెలివిగా దాచే సి, మరో తెలివిలోకి ప్రవేశిద్దాం.
‘‘బుద్ధిమంతుడవుతాడనుకుంటే, ఇలా మతిభ్రష్టుడు అయ్యాడు. నీకు ఈ బుద్ధి జాడ్యం ఎక్కడ నుంచి వచ్చింది’’
ఏం ఎప్పుడూ రాజ్యభ్రష్ఠులే అవ్వాలా. మతిభ్రష్ఠులు కూడా అవ్వాలిగా. మతి భ్రమించినా భ్రష్ఠం అయినా రెండూ ఒకే తెలివి కదా.
మరోటి బుద్ధి జాడ్యం …
బుద్ధి చంచలించటంతో పాటు, బుద్ధికి జాడ్యం కూడా పట్టాలి అప్పుడప్పుడు. ఇది బుద్ధి తెలివి అన్నమాట.
ఆ భ్రష్ఠత్వాన్ని, జాడ్యాన్ని ఓ వింటికి కట్టేసి, జ్యాష్టంకారం చేద్దాం.
‘మహాకాంక్షలతో మహాకార్యాలు సాధించారు’ ట.
మహామహా పింగళి మహా గొప్పగా చూపారు.
మంత్రాలు… మంత్రాలు…
కొత్త మంత్రాలు.. కొత్తకొత్త మంత్రాలు…
ఇవిగో ఈ పింగళిగారి అక్షర గంపలో నుంచి ఏరుకోండి…
అం అః
ఈ కొత్త మంత్రాన్ని మన పూజ స్తోత్రాలకు జత చేకూర్చుదాం. ఆయన సృష్టించారు.. మనం స్వీకరించాలి.
ఆ మంత్రం నుంచి ఈ మ్లేచ్ఛంలోకి ఆగమిద్దాం.
హలా… హలో…
ఇంగ్లీషువారి పుణ్యమా అని మనం ఎవరిని పలకరించాలన్నా హలో అంటున్నాం. తెలుగులో కూడా హలో అనాలిగా.
అందుకే ఓ హలా అంటే సరిపోయింది.
ఓ హలా! వారుణీ. వరుణ కుమారివైనందుకా ఈ హోసూ… ఈ రాణా…
హోసేంటో, రాణా ఏంటో.
హోయలు… హోసు అయిందా…
రాణికి బదులు రాణా అయిందా.
ఇంద్రకుమారివైనందుకా ఈ సౌరు,
ఏ హలా నాగినీ ఓ హలా నాగినీ
హై హలా నాగినీ
‘పకపకలు చాలించి చకచక రారమ్మా జలక్రీడకు…’
‘అహో బత’ ‘అవునుగా హలా’ హలా హలా హలా హలా
ఇదీ ఓ హలా కథ…
………..
ఇలా కూడా మాట్లాడొచ్చుట..
‘నీ చెంబు నిద్ర లేచి నా మీద నీళ్లు పోసిందంటావా…’
చెంబులు కూడా రాత్రంతా హాయిగా భలేగా విశ్రమిస్తాయి కదా. అందుకే ఉదయాన్నే లేచి జల క్రీడలు చేయించిందేమో.
‘మేం వట్టి ఆటుపోటు దెయ్యాలం’
వచ్చిపోయే దెయ్యాలేమో. సముద్రానికి ఆటుపోట్లు ఉంటాయి. ఈ దెయ్యాలకు కూడా ఉన్నాయంటే… ఏమిటో మరి… అందులోని అంతరార్థం.
‘భేతాళుడి మీద ఆన’
గొప్ప ఆనే వేశాడు. భగవంతుడి మీద, అమ్మనాన్నల మీద కాదు… ఏకంగా భేతాళుడి మీదే వేశాడంటే… ఏదో చెడ్డ కార్యం తలపెట్టాడనేగా.
‘సాయం సమంగా పంచుకుందాం’ అంటున్నాడు. ఇదెలాగో మరి. ఆస్తి, అంతస్తు, తిండి, బట్టలు.. వాటి లాగే సాయమూనూ. మంచిదే సమానంగా పంచుకుని, సమన్యాయం చేద్దామా..

‘రెండుచింతలు… రెండే రెండు కోర్కెలు..
నా పేరు కూడా రెండు చింతలు…’ అంటూ రేలంగోడు అంటుంటే… హాస్యనవ్వు వచ్చేస్తుందిగా.
వాడికి జోడు ఏకాశ.
‘ఖగోళభూగోళ శాస్త్రాలన్నీ తల్లకిందులుగా చదివాను’ సకల శాస్త్ర పాఠిఘనా అన్నమాట. తల్లకిందులుగా చదివాడుగా. ఆయన బిరుదు కూడా తల్లకిందులేగా మరి.
‘లుసు లుసు… లుసులుసులుసు’
‘జోడు దెయ్యాలు కట్టిన బండిరా…’
అంటుంటే అదేదో పులుసులాగ నోరూరిస్తోంది కదూ. కానీ అది తెలుసు తెలుసు అనడానికి పొట్టి రూపమన్నమాట.
జోడు ఎడ్ల బండి ఎక్కారుగా… మరి జోడు దెయ్యాల బండి ఎందుకు ఎక్కకూడదు. విలక్షణంగా ఉంటుందిగా.
––––––
దృష్టి తీసివేశాను సృష్టిలోకి రారా వత్సా (పార్వతీదేవి అవ్వ వేషంలో వచ్చిన సందర్భంలో ఆ పాత్ర వేసిన కన్నాంబ మాటలు)
ఎంత మంచి వాక్కు పలుకులు. దోషం పోతే, వాస్తవంలోకి రాకమానరుగా. అందుకే దృష్టి పోయి సృష్టిలోకి వచ్చాడు.
––––––
కళ్లు లేక కాళ్లు లేక ముసలివాళ్లే రాజ్యం చేస్తుంటే… అని కొత్త తరం ఏడవకుండా ఉంటుందా. నిజమేగా…
––––––
దేవకన్యకలకు మానవ లోకం అంతా కొత్తకొత్తేగా.. అందుకే ఇంద్ర కుమారి మరిది వరస అయిన రేలంగిని –
‘మీ నాగరికం అంత బాగుండునా మరదిగారూ’ అని ప్రశ్నించింది.
అందుకు సరైన చక్కని ముచ్చటైన సమాధానంగా ‘నవరసభరితంగా ఉంటుంది..’ అని బదులుజవాబిచ్చాడు.
అక్కడితో ఆగకుండా వారి నాగరక లోకంలో ‘‘తిండితీర్థాలు… వినోద విషాదాలు… అబ్బ… సతమతం …సంకులం…’’ అంటూ రెండైన జంట పదాలతో నాగరీకుల్ని విపులంగా వివరించేశాడు.
––––––––––––––

ప్రగ్గడ… హే బాదరాయణ ప్రగ్గడా…
ఇక రాజనాల పాత్ర ఈ చిత్రానికే కిరీటసమానం. తనను కొత్త పిలుపుతో పిలిపించుకోవాలనే శక్తి గల బలమైన కోరిక వాంఛ ఉన్నవాడు. అందుకే
‘చిత్తం’ అంటూ ఉండకపోతే..
పాత మంత్రులైనా కొత్త పిలుపు పిలువలేరా…
‘హే రాజన్’ అని పిలవాలి.
ఇందులో కొత్తేమిటి.. ఓ రాజా అనటంలో తప్పేమీ లేదుగా. దానినే కొంచెం ఎడమకుడిగా… హే రాజన్ అన్నాడు.
అంతతో ఊరుకోకుండా..
‘మా కొత్తమంత్రి తెలివి ఎలా తెలిసి వస్తుంది’ అంటూ కొత్త మంత్రి గారి కొత్త తెలివిని, కొత్త అతి తెలివి (ఎక్కువ తెలివి) గురించి అబ్బో ప్రశంసల చుక్కలు.. అదే ప్రశంసల జల్లులు… కురిపుంచుచునేయుండెను.
‘హే రాజన్… హే శృంగారవీరన్…’ అంటుంటే…
‘కొత్త పిలుపుతో మత్తెక్కుతోంది…’ అంటూ కొత్త పదవిలో ఉండే మదమత్తుని చెప్పకనే పలికాడు రాజనాల.
ఇక మరో కొత్త ప్రపంచంలోకి ప్రవేశిద్దాం…
మన రాజ్యం పేరు కామకూటం…
మన రాజుగారి పేరు త్రిశోకానందులు…
కావున మన రాజుగారు రోజుకు మూడుసార్లు ఇలా పెళ్లికుమారునిలా ఇలానే ఉండాలి…
అని కొత్త మంత్రి కొత్త కొత్తగా మాట్లాడుతూంటే పాపం పాత మంత్రి రాజుతో..
‘దేవరాయలు ఈ బాదరాయణునితో చేరి…’ అంటూ చమత్కారంతో శోకిస్తాడు.
‘ఇదే తావళమనుకుని ఇంటికి వెళ్లి జపం చేస్తూ కూర్చోండి…’ అంటూ కొత్త మంత్రి వేళాకోళాల ఎగతాళం చేస్తాడు.
‘చేతకాకపోయినా కొత్తవాళ్లను చూస్తే పాత వాళ్లకు అసూయ…’ అంటూ కొత్త పదాలతో వచనాలను నిర్వచిస్తాడు.
––––––––––––––
ఇక రెండు చింతల ప్రియురాలు… ఏకాశి.
‘నా పేరు ఏకాశి… నాకు ఒక్కటే ఆశ…’ అంటుంటే.. ఆశ కలదానిని ఆశి అంటారేమో అనిపించిందా. ఇది పింగళి పదనిధి.
––––––––––––

మరోచోట రాజనాల…
‘ఈ వట్టి శృంగారంతో ఎన్నాళ్లు ఈ కామాటం…’ అని పలుకులు నుడివాడు. కామాటం అంటే.. జంజాటం, ఇరకాటం, పిసలాటకం లాంటిదేనేమో.
ఇహ కొత్త మంత్రికి రకారకాల విభిన్న లె లువులుండనే ఉంటాయి. అందుకే
‘నా తెలివితో పాటు మీ తెలివి కూడా వెంటవెంటనే పనిచేస్తుంటే…’ అంటూ ఆలోచన అనే దాన్ని తెలివిగా తెలివితో తెలివి అనిపించాడు.
–––––––––––––––––––
‘మారువేషాలతో నగరాయణం చేద్దామా బాదరాయణా…’ అనే నుడికారం ఈ సినిమాకే శిఖరాయమానం. నగరాయణమేమిటో… ఉత్తరాయణం, దక్షిణాయనం తెలుసుగా. అలాంటిదే నగరాయణం.
–––––––––––––––––––
ఇంతలోనే రాజనాల తనకు తప్పిపోయిన సుందరి గురించి ఎంత కడు బహు చక్కగా పలికెనో ఒక్కసారి పరిశీలన సాయదమా…
‘ఆ సుందరి అంత అందంగా ఎందుకు ఉండాలి…
ఉండెను పో… మా కంట ఎందుకు పడాలి…
పడెను పో… మాకు దక్కకుండా ఎందుకు పోవాలి…
అకటకటా ఈ మూడు శోకాల విరహానికి మేం తాళలేం….’
మూడు శోకాలుట. అవును అందంగా ఉండటం ఒక శోకం.
కంట పడటం రెండో శోకం.
దక్కకపోవటం మూడో శోకం.
అందుచేత మూడు శోకాల విరహం ఉండటం బాగు బాగు. లెస్స లెస్స. త్రిశోకానందులు సార్థక నామధేయులు.
–––––––––––––––––––
‘రాస భటులం…
అంటే యమభటులకు తమ్ములా…’
అవునా యమభటులకు తమ్ముళ్లు, అన్నలు ఉంటారా. ఇదిగో ఉన్నారుగా రాసభటులు.
ఇక మరో విశేషం ఏంటంటే…
‘మన భటులంతా కట్టలుకట్టలుగా పడిపోయారు…’ అంటూ భలే తెలివి ఉపయోగించాడు. గుట్టలుగుట్టలుగా పడటం అనే ప్రయోగం పాతబడిపోయింది. అందుకే కట్టలుకట్టలుగా అనే కొత్త పదాల పుట్టను కట్టారు.
తెలివి గురించి భలే తెలివిగా మరీ తెలివిగా చెప్పారు.
‘భలే… నీదీ తెలివే…
నీ తెలివింతేనా.. కొంచెం తెలివి చాలనుకుంటే చాలకపోయింది…. అతి తెలివిని ఉపయోగిస్తాను…’ అవును ఎక్కువ తెలివిని అతి తెలివి అంటే తప్పేంటంట.
అంత తెలివైనవాడు సేనాపతి. అందుకే అతి తెలివి ఉపయోగించి..
‘నా పనేంటో తెలుసా… పోయేరాజుకు ద్రోహం… వచ్చేరాజుకు భక్తి…’ అని నిజవాస్తవసత్యాన్ని నుడివాడు.
తండ్రిని చెరసాలలో వేసే దుష్టపాపిష్టి కొడుకు… ఒకసారి.. ‘మా దండకం చదవండి…’ అని ఆదేశాజ్ఞ జారీహుకుం చేయగానే..
‘మత్స్యావతారా…’ అని అందుకున్నాడు. ‘తెలుగులో చదవండి’ అన్నాడు. ‘‘చేపగా, తాబేలుగా, పందిగా… అన్ని అవతారాలెత్తిన ఆదినారాయణుడు తమరిని ఆశీర్వదించాలని…’ అంటూ భలేగా భేషుగ్గా పలికాడు.
ఇంకా…
‘అలనాడు సీతను చెరపట్టినట్టు, ఇలనాడు రాజ్యలక్ష్మిని చెరపట్టిన రావణబ్రహ్మ… కంసబ్రహ్మ…’ అంటూ రాజుని గొప్పగానే పొగిడాడో లేదో తెలియకుండా తెలివిగా పొగడ్త ప్రశంస ఇచ్చాడు.
ఎందుకంటే వారిరువురూ
‘‘అవ్యక్తపు రాజు…అవకతవక మంత్రి…’’
మీరు నాగలోకము వెళ్లనే వలయు…
తరవాత పిమ్మట జరిగే చిత్రం సంపూర్ణంగా చూడండి…
––––––––––––––––––––––––
పింగళి వారంటే పరమభక్తి.
ఆ భక్తిని ఎలా తెలుపుకోవాలో లె లియని తెలివి నాది.
అందుకే పింగళి రాజన్‌కి సాష్టాంగప్రణామము సాయుచుంటిని.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)