మానవ వికాసానికి దోహదపడేలా కీర్తనలు
అన్నమయ్య అన్నది 6
(రోచిష్మాన్, 9444012279)
అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగు భాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.
అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం, ఏ విధమైన చింతన, ఏ విధమైన భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ స్థాయిలో కవిత్వం చెప్పారు అన్నమయ్య.
అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!
అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!
అన్నమయ్య అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం రా రండి-
(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)
- * *
“ఛీ ఛీ నరుల దేఁటి జీవనము
కాచుక శ్రీహరి నీవే కరుణింతు గాక!”
ఈ సంకీర్తనను అన్నమయ్య “ఛీ ఛీ” అంటూ మొదలుపెట్టారు. ఛీ ఛీ అనడం కావ్య భాషేనా? ఒక కవితలోనో, సంకీర్తనలోనో ఇలా అనచ్చా? అన్నమయ్య అలా అనడమే కాదు ఛీ ఛీ అంటూనే కృతిని మొదలుపెట్టారు. అలా అనడం అవసరం కనుక. అలా అనడం కావ్యరచనకు అనర్హం కాదు కనుక. ఆదిశంకరాచార్య కూడా “మూర్ఖుడా” అని అన్నారు. ఆదిశంకరాచార్యుల వారిలా అన్నమయ్య కూడా విప్లవశీలి. దూసుకుపోయే తత్త్వం ఉన్న వారే. ఎంత హేయమైన బతుకు? అన్న అర్థంలో “ఛీ ఛీ ఏం బతుకు ఈ జనాలది? శ్రీహరీ రక్షించి నువ్వే కరుణించాలి” అని అంటున్నారు అన్నమయ్య.
అడవిలో మృగజాతి యైనాఁ గావచ్చుఁగాక
వడి నితరులఁ గొలు వఁగ వచ్చునా?
ఉడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
విడువ కెవ్వరినైనా వేఁడ వచ్చునా?
“అడవిలో మృగమైనా కావచ్చు కానీ ఇతరులకు దాసులుగా ఉండచ్చా? (అడవిలో మృగజాతియైనాఁ గావచ్చుఁ గాక / వడి నితరులఁ గొలువఁగ వచ్చునా)
పనికిరాని పక్షిలా అయినా ఉండచ్చు కానీ ఇతరుల్ని అదే పనిగా యాచించచ్చా? (ఉడివోని పక్షియై వుండనైనా వచ్చుఁగాక / విడువ కెవ్వరినైనా వేఁడవచ్చునా)” అని అంటూ…
పసురమై వెదలేని పాటు వడవచ్చుఁగాక
కసివో నొరులఁబొగడఁగా వచ్చునా?
ఉసురు మానై పుట్టి వుండనైన వచ్చుఁ గాక
విసువక వీరి వారి వేసరించ వచ్చునా?
“పశువులా సుఖంలేక పాటుపడచ్చు కానీ ఇతరుల్ని లేనిపోని మాటల్తో పొగడచ్చా? (పసురమై వెదలేని పాటు వడవచ్చుఁగాక / కసివో నొరులఁబొగడఁగా వచ్చునా) పెద్దగా అవసరంలేని చెట్టులా అయినా ఉండచ్చు కానీ వాళ్లనీ, వీళ్లనీ విసిగించచ్చా? ఉసురు మానై పుట్టి వుండనైన వచ్చుఁ గాక
విసువక వీరి వారి – వేసరించ వచ్చునా? (ఉసురు మానై పుట్టి వుండనైన వచ్చుఁ గాక / విసువక వీరి వారి – వేసరించ వచ్చునా)” అని అంటూ…
ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁగాక
కమ్మి హరి దాసుఁడుగా వచ్చునా?
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమే కాక
దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా?
“పెద్దపెద్ద పుణ్యాలు చేసి ఇలను ఏలచ్చు కానీ హరికి దాసుడవడం సాధ్యపడుతుందా? (ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁగాక
కమ్మి హరి దాసుఁడుగా వచ్చునా) ప్రశాంతత సిద్ధించేది వేంకటేశ్వరుడిపై చిత్తాన్ని ఉంచడం వల్లే కానీ గుంపులు గుంపులుగా ఉన్న కర్మల్ని తోసెయ్యగలమా? (నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమే కాక / దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా)” అని అంటూ అన్నమయ్య మనిషి ఉన్నతంగా బతికేందుకు హితవు పలికారు.
ఇతరులకి దాసులుగా పడి ఉండడమూ, ఇతరుల్ని అడుక్కోవడమూ, ఇతరుల్ని పొగడడమూ, ఇతరుల్ని విసిగించడమూ చెయ్యచ్చా? అంటూ చెయ్యకూడదని పరోక్షంగా చెబుతున్నారు అన్నమయ్య. అంతకన్నా మృగంగా, పశువుగా, పనికిరాని పక్షిగా, అవసరం లేని చెట్టుగానైనా ఉండచ్చు అంటున్నారు. “వచ్చునా?” అంటూ “కూడదు” అనీ, చివర్లో అదే వచ్చునా అన్నదానితోనే హరికి దాసులవగలమా? అనీ, కర్మలను తప్పించుకోగలమా? అనీ అన్నారు అన్నమయ్య. ఇది ఉన్నతమైన రచనా సంవిధానం. అన్నమయ్యది ఒక సచ్ఛైలి (సత్+శైలి, మంచి శైలి).
‘కర్మలు గుంపులుగా ఉన్నాయి’ అని అనడం చాల గొప్పగా ఉంది. ఒక పండిన హృదయం మాత్రమే ఇలా అనగలదు. ఇలా కర్మల సమూహం అని అన్నమయ్యకు పూర్వం ఎవరూ అనలేదేమో?
ఈ సంకీర్తనలో శబ్ద వైచిత్రి , చింతనా వైచిత్రి ఉన్నాయి. ఉన్నతమైన కవులు మాత్రమే వైచిత్రితో సంచారం చేస్తారు లేదా చెయ్యగలరు.
శబ్దం, అర్థం రెండూ ప్రజ్ఞావంతంగా కవి నుంచి ఉద్భవించినప్పుడూ, వాటి నుంచి వక్రోక్తి ఉద్భవించినప్పుడూ కావ్యం వెల్లివిరుస్తుంది. 11వ శతాబ్ది లాక్షణికుడు కుంతలాచార్యుడు “విచిత్రో యత్ర వక్రోక్తి వైచిత్ర్యం జీవితాయతే / పరిస్ఫురతి యస్యాంతః సా కాపి అతిశయాభిథా” అన్నారు (ఎక్కడ వైచిత్రి శబ్దార్థాన్ని దాటి ఏదో ఆశ్చర్యకరమైన అర్థాన్ని స్ఫురింపచేస్తుందో అక్కడ వక్రోక్తి జీవిస్తున్నది). అదే కుంతలాచార్యులు శబ్దార్థాల కావ్యం ఆహ్లాదకరమౌతుంది అన్న సత్యాన్ని తెలియజేస్తూ “శబ్దార్థౌ సహితౌ వక్రకవి వ్యాపార శాలిని / బంధే వ్యవస్థితౌ కావ్యం తద్విదాహ్లాదకారిణి” (శబ్దార్థాల కలయికతో,
కవి వక్రోక్తితో బంధించబడిన లేదా నిర్మించబడిన కావ్యం ఆహ్లాదకారి అవుతుంది) అనీ అన్నారు. ఆ తీరులో, ఆ సౌరులో ఈ అన్నమయ్య సంకీర్తన వక్రోక్తితో, శబ్దార్థ సాహిత్యంతో ఒక ఆహ్లాద కావ్యం అయింది.
‘మనిషికి హేయమైన జీవన విధానం తగదు’ అని అంటూ అన్నమయ్య అచ్చమైన వ్యక్తిత్వ వికాస సూచనల్ని తెలియజేశారు. అన్నమయ్య సామాజిక స్పృహతో ఒక మనిషి బతుకు ఇలా ఉందేమిటి అన్న ఆవేదనను వ్యక్తపఱిచారు. వాటితో పాటు నెమ్మది కావాలంటే భక్తి ఉండాలి అనీ సరైన పరిష్కారాన్ని ఎఱుకపఱిచారు అన్నమయ్య.
ఒక సాధారణ మనిషి గుఱించిన ఆలోచనతో, ఆ మనిషికి కావాల్సిన సరైన సందేశంతో ఇలా మిలమిలలాడుతూ ఉన్నది అన్నమయ్య అన్నది.
(వ్యాసరచయిత ప్రముఖ విమర్శకుడు)