చంచల బుద్ధి మారుతుందా??

0
142

అన్నమయ్య – 7

చదువులు, శాస్త్రాలు మార్చగలవా
రోచిష్మాన్, 9444012279
(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)

“తనకేడ‌ చదువులు తనకేడ‌ శాస్త్రాలు
మనసు‌ చంచల‌‌ బుద్ధి మానీనా?”

చదువులెందుకు? శాస్త్రాలెందుకు? అంటూ మనసు చంచల బుద్ధిని మానుకుంటుందా? అనీ అంటున్నారు అన్నమయ్య. మనుషుల బుద్ధిపై అన్నమయ్య చేసిన సంకీర్తన ఇది.

ఎన్ని చదువులు చదివినా, ఎన్ని శాస్త్రాలు తెలిసినా మనుషుల్లో చంచల బుద్ధి పోవడం లేదు. ఇది అనాదిగా ఉన్నదే. మనసు‌ చంచలమైనది అని వాడుక. అన్నమయ్య ‘మనసుకు చంచల బుద్ధి’ అని అనడం ప్రత్యేకంగా‌ ఉంది. ఇలాంటి ప్రయోగాలు ఖలీల్ జిబ్రాన్, రూమీ వంటి కవులలో కనిపిస్తాయి.

జడ్డు మానవుఁడు చదువఁ జదువ నాస
వడ్డివారుఁ గాక వదలీనా?
గుడ్డి కుక్క సంతకుఁబోయి తిరిగిన
దుడ్డు పెట్టే కాక దొరకీనా?

“జడుడైన మనిషి చదవుకోగా, చదువుకోగా ఆశ పెరుగుతుందే కానీ అది వదలిపోతుందా?” ( జడ్డు మానవుడు చదువఁ జదువ నాస వడ్డివాఁరు గాక వదలీనా?) అని అంటున్నారు అన్నమయ్య. ఈ లక్షణం మనకు పెద్ద మెత్తంలో కనిపిస్తూనే ఉంది. పెద్ద చదువుల వాళ్లు దురాశతో సంఘానికి చేటు చేస్తుండడం మనకు తెలిసిందే.

“గుడ్డి కుక్క సంతకు వెళ్లి తిరిగితే కఱ్ఱ దెబ్బలే కానీ దానికి దొరకాల్సింది దొరకదు” (గుడ్డి కుక్క సంత కుఁబోయి తిరిగిన దుడ్డు పెట్టే కాక దొరకీనా?) అని అన్నమయ్య చెబుతున్నారు. ‘గుడ్డిగా చదువులు, శాస్త్రాలు ఎందుకు? వాటివల్ల దొరకాల్సింది దొరకదు’ అని అంటున్నారు. దొరకాల్సింది ఏమిటి?సంస్కారమా? మంచి బుద్ధా? సచ్చింతనా? చదువరులను ఆలోచింపజేసే గొప్ప లక్షణం, ఆలోచింప చెయ్యగల నేర్పు మహాకవులకు ఉంటుంది. అన్నమయ్య మహాకవి. చదువరిని రచనలోకి లాగి ‘ఆలోచించు’ అని‌ చెప్పకుండా చెబుతున్నారు మహాకవి అన్నమయ్య. ఇక్కడ ‘గుడ్డి కుక్క సంత కుఁబోయి తిరిగిన దుడ్డు పెట్టే కాక దొరకీనా?’ అని అన్నమయ్య అన్నది కవి వేమనను గుర్తుకు తెస్తోంది.

వేమన ధోరణి, భావజాలం అన్నమయ్యలో ఉన్నాయని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ తెలియజెప్పారు. తెలుగు కవితకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన వేమన కన్నా ముందే ఆ శైలి, భావనలు, శయ్య అన్నమయ్యలో ఉన్నాయి. వేమన తరహా చింతనకు ఆద్యులు అన్నమయ్యే! వేఱే, వేఱే సంకీర్తనల్లో అన్నమయ్య విరచించిన ఈ పాదాల్ని గమనిద్దాం… “అప్పులేని సంసారమైన పాటే చాలు/ తప్పులేని జీతమొక్క తారమైన చాలు”, “కంతలేని గుడిసొక్క గంపంతయిన చాలు” , “తిట్టులేని బ్రదుకొక్క దినమైన చాలు” , “చదివి చెప్పనియట్టి చదువేల?”, “దట్టపు జడునికి దైవంబేలా?”, “భయము‌ లేని యట్టి భక్తేలా?”, “తప్పు పట్టనిదే తగిన బుద్ధి” , “ధరణి జగత్తెల్లా ధన మూలము” ఈ పాదాల‌ వంటివి వేమనలోనూ ఉన్నాయి. వేమనకన్నా అన్నమయ్య ఎంతో పూర్వం వారు.‌

అన్నమయ్య ఒక‌ మహా సాగరం.‌ ఆ మహా సాగరంలో వేమన, శ్రీనాథుడు, పోతన‌‌ వంటి‌‌ మహాకవులు కనిపిస్తారు. అంతే కాదు ఇవాళ ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఖలీల్ జిబ్రాన్, రూమీ, హాఫిజ్, లావొచు, షేక్స్‌పిఅర్ వంటి కవులు కూడా కనిపిస్తారు.

దేవ దూషకుఁడై తిరిగేటి వానికి
దేవతాంతరము తెలిసీనా?
శ్రీవేంకటేశ్వరు సేవాపరుఁడు గాక
పావనమతియై పరగీనా?

“దేవ దూషణ చేస్తూ‌ తిరిగే వాడికి దైవ (దేవుడి) ఆత్మ లేదా హృదయం తెలుస్తుందా?” (దేవ దూషకుడై తిరిగగేటి వానికి దేవాంతరము తెలిసీనా?) తెలియదు‌ అని సూచ్యార్థం. దేవుడు లేదా దైవ ఆత్మ లేదా హృదయం అని అనడం చాల గొప్పగా ఉంది! మనిషి దైవ ఆత్మ లేదా హృదయాన్ని తెలుసుకోవాలి.

పూర్వాపర సందర్భానుగుణంగా (contextually) అంతరం అన్న శబ్దానికి ఆత్మ, హృదయం అన్న అర్థాలనే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంతరం అన్న శబ్దానికి ఉన్న భేదం, తేడా, తారతమ్యం, వెలుపల వంటి ఇతర అర్థాలు ఇక్కడ పొసగవు.

దైవ దూషణ కాదు‌ దైవ ఆత్మను లేదా హృదయాన్ని తెలుసుకోవడమే మనిషికి కావాల్సింది.
“శ్రీవేంకటేశ్వరుడి‌ సేవలో లయించని వ్యక్తి పవిత్రమైన బుద్ధితో ఉండగలడా?” (వేంకటేశ్వరు సేవాపరుఁడు గాక పావనమతియై పరగీనా?) ఉండలేడు‌‌ అని సూచ్యార్థం.

Mallarme Stephene అన్న ఫ్రెంచ్ కవి, విమర్శకుడు ఇలా అన్నాడు: “Describe not the object, but the effect it produces. Therefore a verse can not be composed of words but of intentions. All words must yield to sensation”. ఇక్కడ sensation అంటే అనుభూతి. Describe అంటే వర్ణించు అని కాదు వ్యక్తపఱచు (express) అని అర్థం. అన్నమయ్య ఉద్దేశం లేదా‌ చరమ లక్ష్యం పవిత్రమైన బుద్ధితో‌ పరమాత్ముడి సేవలో మనిషి బతకాలి అని.‌

అన్నమయ్య వ్యక్తపఱిచినది వస్తువు కాదు అది ఇవ్వగలిగే పరిణామాలు లేదా ప్రయోజనాలు. అన్నమయ్య ఈ‌ సంకీర్తనను మాటలతో మాత్రమే రాశారా? అంతకు మించిన ఉద్దేశాలతోనూ, సదుద్దేశాలతోనూ రాశారు.

భగవద్గీతలో కృష్ణుడు ”నేను” అని అన్నప్పుడు అది పరమాత్మను సూచిస్తుంది. అన్నమయ్య “వేంకటేశ్వరా” అని అంటున్నప్పుడు అది‌ పరమాత్మను సూచిస్తుందని గ్రహించాలి. “మనిషి పవిత్రమైన బుద్ధితో ఉండాలంటే పరమాత్మ సేవలో నిమగ్నమవాలి” అని‌ అన్నమయ్య చెబుతున్నారు. మనం విందాం; ఆ పని చేద్దాం. మనమూ మానసికంగా చంచల బుద్ధితో కాకుండా పవిత్రమైన బుద్ధితో బతుకుదాం‌. మనిషి పవిత్రతతో బతకాలని సరైన సందేశాన్నిస్తూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది‌.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here