సంగీతం సంస్కారానికి ఆవిష్కారం

0
100

జూన్ 21 ప్రపంచ సంగీత దినం
(రోచిష్మాన్, 9444012279)
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో‌ మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం.

“భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం” అని‌ ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం.‌ మనిషికన్నా సంగీతం‌ గొప్పది కాబట్టే మనిషికి సంగీతం‌ మేలు చెయ్యగలిగేది అయింది. “ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు” అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది”. “తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు” అని ఇంగ్లిష్ కవి షేక్స్‌పిఅర్ ఒక చోట చెబుతాడు. మరింకదేనికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు.

సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం‌ మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం‌ కావాలి.

సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు.

సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా‌ మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో‌ భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ , మళ్లీ పొందచ్చు.

వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం.

ప్రతిమనిషికీ తెలుసు తాను‌ కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని.‌ సంగీతాన్ని వింటున్నంతసేపూ తన నుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం వినడం ఉన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు‌.

సంగీతం మౌలికంగా శబ్దమే. కానీ వినిపించే శబ్దాలన్నీ సంగీతం అవవు.
శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది.‌ రండి, సంగీతం వల్ల మ‌నం మళ్లీ,‌ మళ్లీ పుడుతూ ఉందాం.

“అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు ఆవుతూ ఉండే వాడు.‌ సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి”


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here