అన్నమయ్య అన్నది – 15
(రోచిష్మాన్, 9444012279)
“సిరి దొలంకెడి పగలు చీఁకటా యితఁడేమి?
ఇరవు దెలిసియుఁ దెలియ నియ్యఁడటు గాన”.
శోభ (సిరి) తొణికిసలాడే పగలులోని చీకటా ఏమిటి ఇతడు? ఉండే చోటు తెలిసినా కూడా తనను తెలియనివ్వడు కదా అంటూ అన్నమయ్య పరమాత్మ లేదా బ్రహ్మం గుఱించి ఒక సంకీర్తనను పల్లవింపజేశారు. పగలులోని చీకటి అని అనడం అత్యద్భుతంగా ఉంది. ఎంతో గొప్ప వ్యక్తీకరణ ఇది! ఇది ఉన్నత స్థాయి విరోధాభాస. పరమాత్మ సర్వత్రా ఉంటాడని తెలిసినా పగటి చీకటిలాంటి వాడవడం వల్లే కాబోలు చూడడానికి తనను తెలియనివ్వడు అని అంటున్నారు అన్నమయ్య. ఇది ఒక కవియోగి, ఒక యోగికవి మాత్రమే చెయ్యగల అభివ్యక్తి.
“ఈక్షతే ర్నా శబ్దమ్” అని ఒక బ్రహ్మసూత్రం (అధ్యాయం 1 పాదం 1 సూత్రం 5) చెబుతోంది. అంటే బ్రహ్మం చూడబడదు, అది పదం కాదు అని అర్థం. ఇంకో బ్రహ్మ సూత్రం ఇంకా స్పష్టంగా “ఈక్షతి కర్మ వ్యపదేశాచ్చ” (అధ్యాయం 1 పాదం 5 సూత్రం 13) అని చెబుతోంది. అంటే చూడడం అన్నది కపటంవల్లే అని అర్థం.
ఈ సందర్భంలో చైనీస్ కవి, తాత్త్వికుడు లావ్ – చు తన ‘టావ్ – ట – టీచింగ్’ అనే కృతిలో “టావ్ (TAO .. అంటే పరమాత్మ) గ్రహించబడలేనిది” అనీ, “టావ్ అన్నది చీకటి, తెలుసుకోలేనంత మార్మికమైనది” అనీ, “చూడు, ఆ టావ్ చూడడానికి సాధ్యంకానిది” అనీ చెప్పిన మాటలు స్మరణార్హమైనవి.
ఉండే చోటు తెలిసినా అనేది బ్రహ్మం అంతటా ఉంటాడు లేదా సర్వవ్యాపి అనేదే. “సర్వం ఖల్విదం బ్రహ్మ” అని ఛాందోగ్యోపనిషత్ (3-14) చెప్పింది. అంటే ఈ సకల ప్రపంచమూ బ్రహ్మమే. “ప్రసిద్ధేశ్చ” అన్న మఱో బ్రహ్మసూత్రం ( అధ్యాయం 1 పాదం 3 సూత్రం 17) కూడా ఈ సత్యాన్ని చెప్పింది. ‘ప్రసిద్ధేశ్చ’ అంటే బ్రహ్మం ప్రసిద్ధిమైనదే అని అనర్థం.
“తలపోయ హరినీల దర్పణంబో యితఁడు?
వెలుఁగు చున్నాఁడు బహు విభవముల తోడ,
కలగుణం బటు వలెనె కాఁబోలు లోకంబు
గలదెల్ల వెలిలోనఁ కనిపించుఁ గాన”.
ఇంద్రనీలమనే అద్దమా ఇతడు? ఆలోచిస్తే పలురకాల వైభవాలతో (విభవాలతో) వెలుగుతున్నాడు. ఉన్నతమైన గుణం వంటి వాడయినందువల్లే కాబోలు లోకంలో ఉండే స్పష్టమైన తెలుపులో కనిపిస్తున్నాడు కదా.
పల్లవిలో పగటి చీకటా ఇతడు అని అన్నాక ఈ మొదటి చరణంలో పరమాత్ముణ్ణి ఇంద్రనీలం వంటి అద్దమా అనీ, అనేకమైన వైభవాలతో వెలుగుతున్నాడు అనీ, ఆపై ఉన్నతమైన గుణం ఉన్నవాడయినందువల్లే కాబోలు స్పష్టమైన తెలుపులో కనిపిస్తున్నాడు కదా అనీ అనడం చాల గొప్పగా ఉంది. ఇంద్రనీలమణి ఉన్నతమైన తెల్లని కాంతులీనుతూంటుంది. అది ఆ మణి లక్షణం. ఆ విషయాన్నీ చెప్పారు అన్నమయ్య. ఏం చెప్పారు అన్నమయ్య అని అనిపించేట్టుగానూ, చెప్పడం అంటే ఇదే అన్నట్టుగానూ చెప్పారు ఇక్కడ అన్నమయ్య.
“మేర మీఱిన నీల మేఘమో యితఁడేమి?
భూరి సంపదలతోఁ బొలయుచున్నాఁడు,
కారుణ్యనిధి యట్లు కాఁబోలు ప్రాణులకు
కోరికలు దలఁపులోఁ గురియు నటుగాన”.
ఇతడేమిటి హద్దు మీఱిన నీల మేఘమేమోనా? చాల అలంకరణలతో (సంపదలతో) తిరుగుతున్నాడు (పొలయుచున్నాడు). కారుణ్యనిధి వంటి వాడయినందువల్లే కాబోలు జీవరాశులకు కోరికలో, తలపులో కురుస్తాడు కదా.
నీలమేఘమేమోనా? అన్న తరువాత కొనసాగుతూ, కొనసాగుతూ చివరికి కురుస్తాడు కదా అంటూ చరణాన్ని ముగించారు అన్నమయ్య. మేఘం అంటూ మొదలు పెట్టారు కాబట్టి కురుస్తాడు అంటూ ముగించారు అన్నమయ్య ఈ చరణాన్ని. అదీ నిర్మాణ కౌశలం అంటే; శిల్ప సౌందర్యం అంటే. మేఘానికి హద్దులుండవు. మేఘాలు రకరకాల అలంకరణలతో ఉంటాయి. అలాగే పరమాత్మకు హద్దులుండవు. పరమాత్మ వేర్వేఱు అలంకరణలతో ఉంటాడు. ఆ పరమాత్ముడు కోరికలో, తలపులో కురుస్తాడు (ప్రత్యక్షమౌతాడు) లేదా తెలియవస్తాడు.
పరమాత్మపై కోరిక కావాలి ముందు. “కామిగాని మోక్ష కామి గాఁడు” అని వేమన చెప్పాడు కదా. బ్రహ్మం లేదా పరమాత్మ తలపులో లేదా భావంలో తెలుస్తుంది అని తేల్చి చెప్పారు అన్నమయ్య. “అనుస్మృతేర్బాదరిః” అని ఒక బ్రహ్మ సూత్రం (అధ్యాయం 1 పాదం 2 సూత్రం 30) చెబుతోంది. అంటే తలపును అనుసరించి అని ఋషి బాదరి చెప్పారు అని అర్థం. “భావే చో పలబ్దేః” అని మఱో బ్రహ్మసూత్రం (అధ్యాయం 2 పాదం1 సూత్రం 15) స్పష్టం చేసింది. అంటే బ్రహ్మం భావంలోనే దొరుకుతుంది అని అర్థం. అన్నమయ్య ఆ సత్యాన్నే చెప్పారు ఇక్కడ.
“తనివోని ఆకాశ తత్త్వమో యితఁడేమి?
అనఘుఁడీ తిరువేంకటాద్రి వల్లభుఁడు,
ఘనమూర్తి ఆటు వలెనె కాఁబోలు సకలంబు
తనయందె యణఁగి యుద్భవమందుఁ గాన”.
ఇతడు తృప్తి కలిగించని (తనివోని) ఆకాశతత్త్వమా ఏమిటి? ఈ పరమాత్ముడు (పరమాత్ముణ్ణి తిరువేంకటాద్రి వల్లభుడు అని అంటున్నారు అన్నమయ్య) నిర్మలమైన వాడు (అనఘుడు), విస్తారమైనటువంటి వాడు (ఘనమూర్తి) ఆ ఆకాశం వంటి వాడే కాబోలు; సకలమూ తనలోనే లయిస్తాయి, ఉద్భవం ఔతాయి కదా.
ఆకాశానికి అంతం ఉండదు అందుకే తృప్తి లేదా తనివి కలిగించని అని చెప్పారు అన్నమయ్య. “అక్షర మంబరాన్త ధృతేః” అని ఒక బ్రహ్మసూత్రం (అధ్యాయం1 పాదం 3 సూత్రం 10) తెలియజేస్తోంది. అంటే క్షరం కాని లేదా నశించని బ్రహ్మం అంబరాంతాన్ని ధరిస్తుంది అని అర్థం. మఱో బ్రహ్మసూత్రం “ఆకాశస్తల్లింగాత్” (అధ్యాయం 1 పాదం 1 సూత్రం 22) అని తెలియజేస్తోంది. అంటే ఆకాశం బ్రహ్మానికి సంకేతం అని అర్థం. ఈ సంకీర్తనలో అన్నమయ్య బ్రహ్మసూత్రాలు సూచిస్తున్నట్టుగానూ, అనన్యమైన కావ్య రచనా సంవిధానంతోనూ పరమాత్ముణ్ణి వాఙ్మయం చేశారు.
చెక్కిన శిల్పంలాంటి ‘శిల్పం’ (aesthetic format)తో ఉంది ఈ సంకీర్తన. బిగితో నడిచింది ఈ రచన. ఇంగ్లిష్ కవి, విమర్శకుడు, ప్రముఖ సాహితీవేత్త జాన్ డ్రైడన్ (John Dryden) “కవిత్వం అంటే పదాల పొందిక” అని చెప్పారు. పొందికైన పదాలతోనూ, మేలైన పదాల పొందికతోనూ పటిష్టమైన నిర్మాణంగా ఉంది ఈ అన్నమయ్య విరచన.
పరమాత్మ భావాన్ని మహోన్నతమైన భావుకతతో ఉదాత్తంగా ఉత్ప్రేక్షిస్తూ ఉన్నత స్థాయి కవిత్వంగా విలసిల్లుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)