యోగాసనం హఠయోగం

0
117

యోగానందం
ఇవాళ అంతర్జాతీయ యోగా దినం.
(రోచిష్మాన్, 9444012279)

భారతదేశానికి గర్వకారణంగానూ, భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుకగానూ పరిఢవిల్లుతోంది యోగా. మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని పొందేందుకు దేశ, కాల, మత, జాతి ఎల్లలకు అతీతంగా మనిషైన ప్రతి ఒక్కరికీ యోగాసనాలు ఎంతో ఉపయోగకరమైనవి అని ప్రపంచం తెలుసుకుంది; ప్రపంచం యోగాను ఆచరణలోకి తీసుకుని లబ్ది పొందుతోంది.
మోడీ కార్యాచరణ ఫలితం…
మనదేశ ప్రజాప్రధాని నరేంద్రమోదీ కార్యాచరణ ఫలితంగా, మనదేశ విజయంగా 2015 జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగాదినం అనుసరించబడుతోంది. సనాతన ధర్మం ప్రపంచానికి సమర్పించిన సమున్నతమైన సంస్కారం యోగా. యోగాదినం కు ‘వసుధైవ కుటుంబకం’ అన్న వైదిక భావన ఇతివృత్తం. ఆ భావన యోగాదినంతో సమ్మిళితమై విశ్వ ఆమోదాన్ని పొందింది. యోగాకు లేదా యోగాసనాలకు జన్మస్థలం భారతదేశమే అయినా పాశ్చాత్యదేశాల్లోనూ, పాశ్చాత్య దేశాలవల్లానూ యోగా బాగా ప్రాచుర్యంలోకి రావడం విశేషం.
యోగాసనాలకు అవి మూలం కాదు…
కొందరు అంటున్నట్టుగానూ, అనుకుంటున్నట్టుగానూ పతంజలి యోగసూత్రాలు యోగాసనాలకూ ఎంత మాత్రమూ మూలం కాదు. యోగాసనాలు ఏ ఒక్కరివల్లో రూపొందలేదు. పలువురు ఋషులు, మునులు, సాధకులు పలు కాలదశల్లో తమ తమ సాధన, ఆలోచన, ఆచరణలతో యోగాసనాల్ని రూపొందించారు; సకలమానవాళికీ పెనుమేలు చేశారు. పలువురి సమష్టి కృషి ఫలితమే ఈనాటి యోగా.

యోగాసనాల్ని హఠయోగం అంటారు. యోగా పదం సంస్కృతం ‘యుగ్’ అన్న మూలం నుంచి వచ్చింది. యుగ్ అంటే కలిపేది అని అర్థం. ‘హ’ అంటే సూర్యుడు లేదా సానుకూలమైన శక్తి అనీ, ‘ఠ’ అంటే చంద్రుడు లేదా ప్రతికూలమైన శక్తి అనీ అర్థం. ‘హఠయోగం’ అంటే రెండు శక్తులు మానవ శరీరాన్ని కదిలించడం అనీ, సానుకూల, ప్రతికూల శక్తుల కలయిక ఆపై సమతౌల్యం అనీ తెలుసుకోవాల్సి ఉంటుంది.

మనసును అదుపు, క్రమబద్ధీకరణ చెయ్యడం, శ్వాసను అదుపు, క్రమబద్ధీకరణ చెయ్యడం లేదా ప్రాణాయామం, ఆసనాలు లేదా శారీరిక భంగిమలు ఈ మూడింటి అవిభక్త నిర్మాణం హఠయోగం. ప్రాణాయామంలో పలు పద్ధతులు ఉన్నాయి, పలు విధాలైన ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు లేదా యోగ భంగిమలు 8,400,000 ఉన్నాయని వాటిని పరమశివుడు చేసి చూపాడని చెప్పడం ఉంది.

శివ సంహిత, ఘేరండ సంహిత వంటి సంస్కృత గ్రంథాల్లో యోగాసనాలకు మూలాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మైసూర్ కష్ణమాచార్య, బి.కె.ఎస్. అయ్యంగార్, విష్ణుదేవానంద, శ్రీ ఆనంద వంటివాళ్లు జాతీయంగా, అంతర్జాతీయంగా గొప్ప యోగా గురువులయ్యారు. తెలుగువాళ్లైన రాఘవేంద్ర యోగీశ్వరులు, గర్రె వీరరాఘవగుప్త వంటివాళ్లు యోగాసనాలపై మంచి పుస్తకాలు వెలువరించారు.
పలువురు అలోపతి వైద్యులు యోగాసనాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.

యోగా భారత దేశానిదైనందుకు సంతోషిస్తూ భారతీయులమైన మనం యోగాను అభ్యసిస్తూ మానసిక, శారీరిక ఆరోగ్య సామరస్యంతో లేదా సంయోగంతో సరిగ్గానూ, యోగానందంతోనూ జీవించాల్సిన అవసరం ఉంది.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here