జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం
ఈ ఏడాది థీమ్ ప్లాస్టిక్ కాలుష్య అంతం
(డా. ఎన్. ఖలీల్, హైదరాబాద్)
పర్యావరణ దినోత్సవం పర్యావరణానికి అతిపెద్ద అంతర్జాతీయ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకునే ఈ UN దినోత్సవం, మన భూమిని రక్షించడానికి, పునరుద్ధరించడానికి, ప్రభుత్వాలు, వ్యాపారాలు, సంఘాలు, వ్యక్తులను స్థిరమైన మార్పును నడిపించడానికి శక్తివంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఒక భాగస్వామ్య లక్ష్యంలో ఒకచోట చేర్చింది.
2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇతివృత్తం “ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం .” ఈ ప్రచారం ప్లాస్టిక్ వ్యర్థాల యొక్క విస్తృత ప్రభావాన్ని, మహాసముద్రాలు, జలమార్గాలను కలుషితం చేయడం నుండి మైక్రోప్లాస్టిక్‌ల రూపంలో మన ఆహార వ్యవస్థల్లోకి చొరబడటం వరకు నొక్కి చెబుతుంది.
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అనేది ఒక దేశంలేదా సంస్థ తన ఆర్థికలాభం కోసం సహజ వనరులను దోచుకోవడం, దుర్వినియోగం చేయడం. ఇది ప్రధానంగా అడవుల నరికివేత, ఖనిజ సంపదను పెద్ద స్థాయిలో తవ్వుకోవడం, నీటి వనరులను అతిగా వినియోగించడం వంటి రూపాలలో ఉంటుంది. ఈ దోపిడీ వల్ల స్థానిక జీవజాలం, స్థానిక జనాభా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు, తమ పర్యావరణం వనరులను పరిరక్షించడానికి తగిన విధానాలను అనుసరించలేకపోతున్నాయి. ఇది ఆ దేశాల పర్యావరణాన్ని తీవ్ర స్థాయిలో నాశనం చేస్తోంది. ప్రపంచం మొత్తం పర్యావరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. గ్లోబల్ వార్మింగ్, వాయు కాలుష్యం, నీటి ప్రదూషణ, జీవవైవిధ్యం నష్టం వంటి అనేక సమస్యలు మన జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పర్యావరణ దోపిడీ. ఒక దేశం లేదా సంస్థ తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతర దేశాల సహజ వనరులను దోపిడీ చేయడం, తద్వారా స్థానిక ప్రజల జీవన విధానాలపై ప్రతికూల ప్రభావం చూపడం, పర్యావరణ దోపిడీకి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ఈ సమస్యను అరికట్టేందుకు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట దినాన్ని పాటిస్తారు. ఈ సందర్భంలో అంతర్జా తీయ పర్యావరణ దోపిడీ అంటే ఏమిటి, దాని ప్రభావాలు, నివారణ చర్యలు, మన బాధ్యతలు వంటి అంశాలను పరిశీలించడం అవసరం. అడవుల నరికివేత, భారీ పరిశ్రమలు నెలకొల్పటం, రసాయనాల వాడకం వంటివి అనేక జంతువుల, వృక్షజాలం నివాసాలను ధ్వంసం చేస్తాయి. వీటి వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతాయి. జీవవైవిధ్యం కనుమరుగవడం వల్ల పర్యావరణ సమతుల్యతలో గణనీయమైన మార్పులు వస్తాయి. పరిశ్రమల నుంచి ఉద్గారాలు, వ్యవసాయ రసాయనాలు, ఇతర వ్యర్థ పదార్థాలు నదులు, సము ద్రాలు, వాయు మండలాన్ని కలుషితం చేస్తాయి. ఇది పర్యావరణానికి మాత్రమే కాకుండా, మన ఆరోగ్యానికీ ప్రమాదకరం. దీని వలన వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూ సమర్థత తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వనరులను అతిగా వినియోగించడం, చెట్లను నరికివేయడం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను పెంచడం వలన వాతావరణంలో వేడి పెరుగుతోంది. దీని కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనే సమస్య పెరిగి వాతావరణంలో అతివృష్టి, కరవు వంటి ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పు వల్ల వరదలు, కరవులు, అగ్నిప్రమాదాలు వంటి సహజ వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ ప్రక్రియలతో పర్యావరణ నాశనం తక్షణమే కనిపించకపోయినా, దీర్ఘకాలంలో వీటి ప్రతికూల ప్రభావం పెద్ద స్థాయిలో ఉంటుంది. కాలుష్యం వల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. వాయుకాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, నీటి కాలుష్యంవల్ల నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ప్రబలుతున్నాయి. శరీరంలో విషపదార్థాలు చేరటం వల్ల కేన్సర్, జన్యు వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అంతర్జా తీయ పర్యావరణ దోపిడీని అరికట్ట డానికి ప్రయత్నాలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పలు అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి. టోక్యో ప్రోటోకాల్, పారిస్ఒప్పందం వంటి ఒప్పందాలు ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశాలు ఒక ప్రణాళికను అనుసరిస్తున్నాయి. ఈ ఒప్పందాలు పర్యావరణ పరిరక్షణకు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తున్నాయి. ప్రతి దేశం పర్యావరణ పరిరక్షణ కోసం సొంత చట్టాలను రూపొందిస్తోంది. వన రులను అధికంగా వినియోగించే సంస్థలపై నియంత్రణ విధించేలా చట్టాలు అమలు చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ, వనరుల పరిరక్షణ, రక్షణాత్మక చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలను రూపొందిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇతర సంస్థలు జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పర్యావరణ సమస్యలను ప్రజలకు వివ రించడం, అవగాహన కల్పించడం వల్ల ప్రజలు తమ జీవన శైలిని సవరించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, పవనశక్తి వంటి పున రుత్పాదక ఇంధనాలను వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ వనరులు పర్యావరణానికి హానికరమైన కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయ పడతాయి. ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతను నిర్వర్తించాలి. వాహనాలను తక్కువగా వినియోగించడం, పునర్వినియోగ పదార్థాలు ఉపయోగించడం, నీటి వనరులను ఆదా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పర్యావరణానికి మేలుచేసే మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ద్వారా వాయుకాలుష్యం తగ్గించవచ్చు. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ఎంచుకోవడం, ప్లాస్టిక్ వంటి పదార్థాల వాడకాన్ని తగ్గించడం, మన పరిసరాల్లోని వారికి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించడం చేపట్టాలి. అంతర్జాతీయ పర్యావరణ దోపిడీ ఒక తీవ్రమైన సమస్యగా మనముందుంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు కలిసి కృషిచేయాలి. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అత్యంత కీలకం. మనం పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందించగలుగుతాం.
చివరాగా చెప్పేదేంటంటే..
పుడమి నుండి పురుడు పోసుకున్న విత్తనాన్ని అడుగు..
తను పడ్డ పురిటి నొప్పుల గురించి చెబుతుంది..
నీ కడుపు నింపే ఆ విత్తనానికి లేని భేషజం నీకెందుకు?
నీ పాపాల శాపాలకు కాలుష్య రక్కసికి చిక్కి విలవిలలాడుతున్నా స్వచ్చమైన గాలిని అడుగు..
కలుషిత విషవలయం నుండి బైట పడ్డ వైనాన్ని చెబుతుంది
నీ ప్రాణాన్ని నిలిపే ఆ గాలికి లేని అహం నీకెందుకు?
భూపొరలలో నిక్షిప్తమై నీ మితిమీరిన అవసరాలకు బలి అవుతున్న నీటి వనరులను అడుగు..
నీవు గొట్టాలతో తోడే గడ్డు పరిస్థితుల నుండి తట్టుకుని నిలబడే సంధర్భాలను చెబుతుంది.
నీ దాహాన్ని తీర్చే ఆ నీటికి లేని ఆధిపత్యం నీ దాహానికెందుకు?
ఇకనైనా పర్యావరణాన్ని నీవు ప్రేమించకపోతే
నీ ఆత్మే నిన్ను “ఛీ” కొట్టి
నీ శరీరం నుండి వెళ్ళిపోతుంది !!
(వ్యాస రచయిత ప్రముఖ ఫార్మసిస్ట్)