మా విధానం ఎప్పుడూ సమైక్య రాష్ట్రమే: సజ్జల రామకృష్ణారెడ్డి

Date:

మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారుడు
కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా విధానం
మళ్ళీ ఏపీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే.. మొదట స్వాగతించేది మేమే
విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచీ పోరాటం చేసింది వైఎస్ఆర్సీపీనే
కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలిగితే.. మళ్లీ కలవాలని సుప్రీం అంటే కావాల్సింది ఏముంది..?
ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్ధం
విజ‌య‌వాడ‌, డిసెంబ‌ర్ 08{
మ‌రోసారి ఉమ్మ‌డి ఏపీ అంశం తెర‌పైకి వ‌చ్చింది. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ కేసును ప్ర‌స్తావిస్తూ ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. కుదిరితే ఉమ్మ‌డి రాష్ట్రంగా మారితే… అందుకు సుప్రీం అంగీక‌రిస్తే తొలుత స్వాగ‌తించేది త‌మ పార్టీయేన‌ని ఆయ‌న చెప్పారు. సీఎం క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల‌లోనే…
ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ప్రస్తావిస్తున్న కేసు 2014 విభజన చట్టంపై వేసిన కేసుగా నేను భావిస్తున్నా. విభజన చట్టం అసంబద్ధం అనే అంశంపై కేసు వేసినట్లున్నారు. ఇంతకాలం తర్వాత, నిన్ననే ఆయన ఎందుకు రియాక్ట్‌ అయ్యారన్నది నాకూ అర్ధం కావడం లేదు. సాంకేతికంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి భావం స్ఫురించేందేమో అనుకోవాల్సి వస్తుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూల్‌ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా పార్టీ అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే కుదిరితే అందరం కలిసి రావాలని, ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటాం. ప్రాక్టికల్‌గా ఇంత దూరం వచ్చిన తర్వాత పెండింగ్‌ అంశాలపై ఫైట్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి మాటలు కొన్ని అసందర్భంగా ఉన్నట్లు, పనిగట్టుకుని జగన్మోహన్‌ రెడ్డిని విమర్శించారని అనిపించింది. ఆనాడు రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీజేపీ. వారికి సహకరించి టీడీపీ అన్యాయం చేస్తే,
విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడింది మేమే
చివరి నిమిషం వరకూ విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే.
ఇక విధిలేని పరిస్థితుల్లో విభజన జరిగిన తర్వాత విభజన హామీల కోసం మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. దౌత్యపరంగా, కోర్టుల్లో ఉన్న అంశాలపై పోరాటం చేస్తుంది మా పార్టీనే. ఉండవల్లి గారికి ఆ అనుమానం ఎందుకు వచ్చిందో కానీ మా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిది ఒకటే విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసిన అంశంపై మాకు బాధగానే ఉంది. మాకంటే బలంగా జగన్మోహన్‌రెడ్డికి ఆ బాధ ఎక్కువగా ఉంది. ఎక్కడ అవకాశం వచ్చినా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాగలిగితే ముందుగా స్వాగతించేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే.
విభజన హామీలనైనా మరింత మెరుగ్గా ఇవ్వాల్సిన బాధ్యత నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానిది…ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేటి బీజేపీ ప్రభుత్వంపై ఆ బాధ్యత ఉంది. దానికోసం ఎంతవరకైనా పోరాడేది మా ప్రభుత్వమే. దానికి ఈ కేసు కూడా ఒక వేదికగా, అవకాశంగా ఉపయోగపడితే అన్యాయం జరిగిందని ఎత్తిచూపుతాం. జరిగిన అన్యాయాన్ని వెనక్కు తిప్పగలిగితే ప్రయత్నం చేస్తాం. లేదంటే అన్యాయాన్ని సరిదిద్దాలనైనా గట్టిగా పట్టుబడతాం. దాంట్లో దాపరికాలు, మొహమాటాలు లేవు. ముందు నుంచీ మేం ఓపెన్‌గా ఉన్నాం. అలా ఉండటం వల్లే నాడు తెలంగాణాలోనూ నష్టపోయాం. ఉమ్మడి రాష్ట్రం ఉంటే అక్కడ కూడా అధికారంలోకి వచ్చేవాళ్లం. కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేము అనుకుంటే.. అక్కడ జరిగిన అన్యాయానికి అయినా న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తాం.
ఉండవల్లి అలా ఎందుకు మాట్లాడారో..?:
ఉండవల్లి ఎంపీగా చేశారు…అందరికి ఆయన పట్ల గౌరవం ఉంది. సగటు రాజకీయ నాయకుడిగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఉన్న అవకాశాలన్నిటినీ వినియోగించుకుంటున్నాం అన్నది గమనిస్తే ఆయనకే తెలుస్తుంది. కానీ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు డీల్‌ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇది ఉద్యమం కాదు కాబట్టి అలా చేయలేం. మరి ఉండవల్లి ఎనిమిదేళ్లుగా కోర్టులో వేసిన కేసు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చెన్నై కావాలి అన్నట్లు… చేయడానికి వెనక్కి పోలేము. ఈ విషయం ఉండవల్లికి కచ్చితంగా తెలుసు.. తెలిసినా ఇలా మాట్లాడితే మేం కూడా ఇలా రెస్పాండ్‌ కావాల్సిన పరిస్థితి వస్తుంది.


మళ్లీ కలవండి అంటే కావాల్సింది ఏముంది..?:
నిన్న ఎవరైనా అడ్వకేట్‌ అక్కడ అని ఉంటే అది కేవలం సాంకేతికపరమైన అంశమే తప్ప మా ముఖ్యమంత్రి అభిప్రాయం సుస్పష్టంగానే ఉంది. రాష్ట్రానికి రావాల్సిన హామీలపై ప్రభుత్వమే కోర్టులో పోరాడుతుంది. ఈ కేసు జరగాల్సిన రీతిలో విభజన జరగలేదు అనే అంశం పైనే. కాలచక్రాన్ని వెనక్కి తీసుకెళ్లగలిగితే లేదా సుప్రీం కోర్టు అసెంబ్లీ తీర్మానం, ఆర్టికల్‌ 3 ప్రకారం విభజన జరగలేదు..మళ్లీ కలవండి అంటే అంతకంటే కావాల్సింది ఏముంది..? మా పార్టీనే మొదటిగా స్వాగతిస్తుంది.
అది బీసీల సాధికారత సభ
నిన్న జరిగినది బహిరంగ సభలాంటిది కాదు. రాష్ట్రంలో 85 శాతం పైగా ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు అందరూ ఒక చోట చేరారు. ఎన్నడూ లేనంతగా బీసీలు అత్యధికంగా ఎన్నికయ్యారు. అలాంటి ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పదవులు పొందిన బీసీ వర్గాలకు చెందిన వారు ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందో ఆ సభలో కనిపిస్తుంది. అదీ రాజకీయ సాధికారికత అంటే. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే ఒక్క పార్టీ నుంచి ఎన్నికైన వారిని ఒకే చోట చూపాలనుకున్నాం. అది ఒక ఉత్సవం..తమ నాయకుడిని గౌరవించుకున్న సభ. నాయకుడు మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన వారంతా ముందుకు తోసుకువచ్చారు. దాన్ని కూడా పచ్చ మీడియా బూతద్ధంలో చూపాలని ప్రయత్నం చేస్తోంది. 80 వేల మందికి పైగా ప్రతినిధులు వచ్చింది అందరూ చూశారు. కానీ ఎవరూ రాలేదని, అక్కడ జనం లేరని చూపాలని, విషం కక్కాలని చూశారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు అంతకు మించి వేరే చేస్తారని మేం కూడా ఊహించడం లేదు. అది పక్కాగా జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని బీసీల సాధికారకత సభ.


వైసీపీ బీసీ నేత‌ల సెల‌బ్రేష‌న్ అది
నిన్నటి సభ ఏమీ పరీక్ష కాదు. మా పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులు చేసుకున్న సెలబ్రేషన్‌. ఇలానే మిగిలిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విషయంలోనూ నిర్వహిస్తాం. రియల్‌ లీడర్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్నారని అందరికీ తెలిసేలా సెలబ్రేట్‌ చేసుకున్నాం. ఎన్నికైన బీసీ లీడర్‌ షిప్‌ నిన్నటి సభలో ఉంది. వాళ్లే నిన్నటి సభను నిర్వహించారు. మిగిలిన వర్గాల నాయకులు సాంకేతికంగా సహకారం అందించిన వాళ్లు మాత్రమే. ఒక పార్టీ కులరహితంగానే ఉండాలి. లేదంటే తెలుగుదేశంలా తయారవుతుంది. జగన్మోహన్‌రెడ్డి గారు చేపట్టిన పథకాలు కూడా మతం, కులం అనేది లేకుండా నడుస్తున్నాయి. టీడీపీలోని అగ్రవర్ణాల లెక్కలు తీస్తే మేం మాత్రం విమర్శించలేమా..? పార్టీ కార్యక్రమం జరుగుతున్నపుడు కులాలను ఎందుకు చూస్తారు..? మా పార్టీలో ఎవరి పాత్ర వారికుంటుంది.
చంద్రబాబు చేసిందేమీ లేదు
టీడీపీ వాళ్లకి చెప్పుకోడానికి ఏమీ లేదు. 2014— 19 మధ్య మేం బీసీలకు ఇది చేశామని చెప్పలేని పరిస్థితి వాళ్లది. మా దగ్గర ఏ కుటుంబానికి, ఏ వర్గానికి ఎంత అందించామో కూడా లెక్కలన్నీ ఉన్నాయి. ఏదో విధంగా బీసీలను విభజించాలని, జగన్మోహన్‌రెడ్డిపై వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీసీలకు కొంతమేర ప్రాధాన్యం వచ్చినమాట వాస్తవం. ఆ తర్వాత వారిని చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాడు. జగన్మోహన్‌రెడ్డి గారు బీసీ డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాత బీసీలకు ఒక నమ్మకం కలిగింది. దాన్ని నిలుపుకుంటూ ఈ మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు. దీంతో బీసీల్లో జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. వైఎస్‌ జగనే మా నాయకుడు అని నిన్నటి సభ ద్వారా బీసీలంతా స్పష్టంగా చెప్పినట్లయింది.
రాష్ట్రానికి ప్రథమ శత్రువు టీడీపీనే..
చంద్రబాబు డీఎన్‌ఏ అనుకోవచ్చు. ఎన్‌డీఏ అనుకోవచ్చు…ఆర్‌ఎన్‌ఏ అనుకోవచ్చు…ఆయన ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ వాస్తవం మాత్రం బీసీలంతా ముక్తకంఠంతో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. నిజంగా చంద్రబాబు బీసీలంతా తనతో ఉండాలని భావిస్తే.. తన హయాంలో వారికి ఏదైనా సేవ చేసి ఉంటే, 2019 ఎన్నికల ఫలితాలు అలా ఉండేవి కావు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అలా ఉండేవి కావు. అది చంద్రబాబుకీ తెలుసు. కానీ డాంబికంగా బీసీలు తనతోనే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడిందే చంద్రబాబు మనుషులు. బిర్రు ప్రతాప్‌ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటికీ టీడీపీ వారితోనే ఉన్నాడు. ప్రతి దానికీ అడ్డుపడుతూ ఈ రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా ఉన్నది టీడీపీనే. కోర్టు ప్రకారం లేకపోయినా.. బీసీలకు మేం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.


జైలుకు వెళ్లడానికి తండ్రీ, కొడుకులకు అంత తొందరెందుకు..?:
తనపై వచ్చిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించండి అంటూ లోకేష్‌ మాట్లాడుతున్నాడు. కేసులు విచారిస్తుంది కోర్టు అనుకున్నాడా ఇంకేమైనానా..? లోకేష్, చంద్రబాబుకు జైల్లో కూర్చోవాలని తొందరగా ఉంటే మేము ఏమీ చేయలేం. విచారణలో ఆయా సంస్థల విధానాలు వాళ్లకి ఉంటాయి… వాళ్ల పని వాళ్లు చేస్తారు. మరో వైపు మీకు వ్యవస్థలను మేనేజ్‌ చేసే అలవాటూ ఉంది కాబట్టి మరింత ఆలస్యం అవుతుంది. ఎన్నిచేసినా తండ్రీకొడుకులు రాష్ట్రానికి అన్యాయం చేశారనే ఆధారాలు, నిధులు పక్కదారి పట్టాయన్న ఆధారాలు ఉన్నాయి. 2004కు మందు చంద్రబాబు చేసినవి కూడా చాలా ఉన్నాయి. రాజశేఖరరెడ్డి గారు ఉదారంగా ఉండబట్టే అవి పెద్దగా బయటకు రాలేదని స‌జ్జ‌ల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...