నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?
నేను – ఈనాడు: 15
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ట్రైనీ(ఈనాడు భాషలో.. శిక్షణ) సబ్ ఎడిటర్‌గా ఆర్నెల్లు పూర్తయ్యింది. అదేదో పే స్కేలట..నాకు గుర్తు లేదు.. వెయ్యిరూపాయలవ్వాల్సిన జీతం పన్నెండు వందలయింది. ఈలోగా పెళ్ళయ్యింది. అంతలోనే గోదావరి పుష్కరాలు.. దానికోసం ప్రయత్నాలు. పత్రికలో ఎలాంటి అంశాలివ్వాలి. ఎప్పటినుంచి ఇవ్వాలి. ఏయే అంశాలపై ప్రత్యేక కథనాలివ్వాలి.. పూర్వరంగంలో ఏం జరిగింది.. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు.. (సూక్ష్మంగా చెప్పాలంటే ‘కవరేజి’)పై సమగ్ర నివేదిక ఇవ్వాలని రామోజీరావు గారి నుంచి ఆదేశాలు. అవి ఒక్క తూర్పు గోదావరి జిల్లా డెస్కుకే కాదు.. రాష్ట్రంలోని అన్ని డెస్కులకూనూ. అది ఆయన స్టైల్. వచ్చిన ఆలోచనలలో మంచివి ఏర్చి కూర్చడానికి హైదరాబాద్‌లో ఓ విభాగం. వీటన్నింటినీ పరిశీలించి రామోజీరావుగారు కొన్నింటిని ఎంపిక చేయడం. మాకు ఆదేశాలు రావడం. ఆ మేరకు.. కథనాల తయారీలో నిమగ్నంకావడం. కంట్రిబ్యూటర్లకు లేఖలు తయారు చేయడం.. వాటిని ఆరోజు రాత్రి పేపర్ పార్సిల్‌లో పంపడం. మరుసటి రోజు ఉదయాన్నే కంట్రిబ్యూటర్లకు ఫోను చేసి, అవి అందాయో లేదో కనుక్కోవడం.. అందకపోతే.. అదే సారాంశాన్ని చదివి వినిపించడం.. వారినీ కార్యోన్ముఖుల్ని చేయడం… ఇది ప్రాథమికంగా చేయాల్సిన పని. వీటన్నింటికోసం ఓ రెండు గంటల ముందు డెస్కుకు రావాల్సి ఉండడం.
మేము ట్రైనీలం కావడంతో ఉదయం పది గంటలకల్లా వస్తుండేవారం. వచ్చిన వార్తలను వచ్చినట్లు తిరగరాసుకోవడం. రెండు గంటలపాటు పుష్కర పని పూర్తయిన తరవాత నిత్యవార్తాకృత్యం మొదలుపెట్టడం. ఏనాడూ .. ముందు రాలేమని చెప్పిన వారు కానీ.. పర్మిషన్ కావాలనేవారు కానీ ఉండేవారు కాదు. పనిమీద అంత భక్తిశ్రద్ధలుండేవి.
తరువాత రావాల్సిన రోజు రానే వచ్చింది.. అదే రామోజీరావు గారు మూణ్ణెల్లకోసారి మా పనితీరును సమీక్షించే రోజు…
అందరం లోపలకు వెళ్ళి కూర్చున్నాం. అప్పటికే ఆయన తెల్లటి దుస్తులు, కాలికి నల్లని చెప్పులు(అప్పట్లో అంతే) ధరించి క్రీమ్ కలర్ సోఫాలో ఆసీనులయి ఉన్నారు. ఎందుకో ఆయన ముఖ కవళికలలో నాకు ప్రశాంతత కనిపించలేదు. ఏదో ఉందనుకున్నాను.
‘ఏమిటి పుష్కరాలకు సంబంధించిన పనులు మొదలు పెట్టారా..’ మొదటి ప్రశ్న.
మొదలయ్యాయండి… డెస్క్ ఇన్చార్జి…
రామోజీరావు గారి మొహం కొంత క్రోధంగా తయారయ్యింది.
ఏమిటయ్యా.. మొదలయ్యేది.. మీరిచ్చినట్లు వార్తలు ఇచ్చి కూర్చుంటే చాలా. పాఠకులకు తెలియని కొత్త అంశాలేమున్నాయి మీరు పంపిన ఆలోచనల్లో. విభిన్నంగా ఒక్కటి కూడా లేదు. ఎప్పుడూ ఏ పత్రికా ఇవ్వని కోణంలో వార్తలు కావాలి.. రామోజీరావుగారి హుకుం..
అంతా నిశ్శబ్దం…..
ఇప్పుడే చెప్పాలి… అందరూ కనీసం తలొకటయినా…. మరోసారి ఆయన గొంతు ఖంగుమంది..
నాకు పై ప్రాణం పైనే పోయింది… సీనియర్లే నోరుమెదపకుండా కూర్చున్నారు.
నన్నడిగితే నేనేం చెప్పాలి.. చెమట్లు పడుతున్నాయ్.
రామోజీరావుగారు ఓ సారి అందరి ముఖాలు వరుసగా పరిశీలిస్తున్నారు… నా మీదే ఆయన దృష్టి… దొరికిపోయాననుకున్నా…
నిజమే…
నువ్వు చెప్పవయ్యా! అన్నారు…
లేచి నిలబడ్డా.. నా పక్కనున్న వ్యక్తి ఎవరో గుర్తులేదు.. (బహుశా అప్పటి ప్రాసెస్ ఇన్ఛార్జి జి.వి. రావు గారనుకుంటా లేవద్దని చొక్కా పట్టుకు లాగారు.) అది గమనించారాయన.. ఎందుకయ్యా అతన్ని లాగుతావ్.. నీ పేరు సుబ్రహ్మణ్యం కదా.. చెప్పు.. అన్నారు మరోసారి.
ధైర్యం కూడదీసుకున్నా..
పుష్కరాలు పన్నెండు రోజులు పవిత్ర స్నానాలు చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఒకటుంటుందండి… అవి సేకరించి ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది… అక్షరాలు కూడబలుక్కుని చెప్పేశా.
బాగుంది… ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావా… కొంత మందస్మిత వదనంతో అడిగారాయన..
నవ్వు విచ్చుకున్న ఆయన పెదవుల్ని చూసిన నాకు ఇంకాస్త ధైర్యం వచ్చింది..
ముందూ వెనుకా ఆలోచించలేదు..
చేస్తానండి….. అని చెప్పేశా..
మిగిలిన వారినుంచికూడా సలహాలు తీసుకున్న తరవాత.. ఆయన ఒక్కొక్కరికీ దిశానిర్దేశం చేశారు. ఏ అంశాన్ని ఎలా ప్రోది చేయాలో.. నాకేసి చూసి అన్నారు.
నువ్వు చెప్పిన శ్లోకాలు అంశం చాలా కొత్తది..
నాకు దానిమీద అవగాహన లేదు..
నువ్వు చెయ్యాలి.. చేస్తావ్ అన్నారు.. రామోజీ రావుగారు.
(రామోజీ రావు గారిలో గొప్పతనం అదే. ఇప్పుడు అందరూ దానినే అనుసరిస్తున్నారు. ఎవరైతే ఆలోచన చెప్పారో వారిచేతే దానిని చేయించడం. దీనికి కారణం లేకపోలేదు. కొత్త ఆలోచన ఇచ్చిన వారికి ఆ అంశంపై కనీస అవగాహన ఉంటుంది. కొంత కృషి చేస్తే, సత్ఫలితం తప్పక వస్తుందనేది ఆయన అభిప్రాయం.)
సమావేశం ముగిసింది..
నా ఆలోచనలన్నీ శ్లోకాలపైనే… అసలు ఆ మాటలు నా నోటినుంచి ఎలా వచ్చాయో నాకే ఆశ్చర్యం వేసింది. అసలు అలాంటి శ్లోకాలు ఉంటాయా.. ఉంటే ఇంతవరకూ ఎవరూ ప్రచురించకుండా ఉండి ఉంటారా… మనం చూడకపోతే ఆ శ్లోకాలు ఎవరికీ తెలియనట్లేనా… ఇలా ప్రశ్నలు కందిరీగల్లా నా మదిలో తిరుగాడుతున్నాయి. నా సీనియర్లు కూడా అదే అన్నారు. ఎక్కడో వేదాల్లో ఉండి ఉంటాయి.. ఎక్కడని వెతుకుతారు.. ఆ ఆలోచన చెప్పకుండా ఉండాల్సిందన్నారు.
నాకు రాలేదనుకుంటున్నావా ఆ ఆలోచన.. చెబితే ఇరుక్కుంటాననే నిశ్శబ్దంగా ఉన్నానన్నాడు మరో సీనియర్.. ఏమైనా.. అన్నీ విన్నా.. సాధించాలనే పట్టు పెరిగింది…
ఆ మరుసటి రోజు నుంచి వాటిని సాధించడానికి డిటెక్టివ్ వర్క్ మొదలైంది…
ఆ శ్లోకాలు సాధించానా… అందుకోసం ఏం చేశాను.. ఎక్కడ తిరిగాను.. ఎవర్ని కలిశాను… ఈ వివరాల కోసం రేపటి దాకా ఆగాల్సిందే…..మిత్రులారా!!!