విజయవాడలో ఈనాడు మకుటం మాయం
(KVS Subrahmanyam)
ఎవరికైనా జీవితంలో మరిచిపోలేని అనుభవాలు తప్పనిసరిగా ఉంటాయి. తియ్యని అనుభవాలూ, అనుభూతులూ కాలగర్భంలో కలిసిపోతుంటే… ఎంతటివారికైనా మనసు చివుక్కుమానిపించక మానదు. అందుకు నేను కూడా అతీతుణ్ణి కాదు. ఈనాడు నాకు జీవితాన్ని ఇచ్చింది. స్థిరపడేలా చేసింది. కొందరి కుట్రల వాళ్ళ అర్ధంతరంగా సంస్థను వీడాల్సివచ్చినప్పటికీ ఆ సంస్థకు ఉన్న బ్రాండ్ నేమ్ నన్ను మళ్ళీ ఆకాశానికి ఎత్తింది.
విజయవాడకు ల్యాండ్ మార్క్ గా నిలిచిన ఈనాడు భవనం ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. దీని వెనక ఉన్న కారణాల జోలికి నేను వెళ్ళాలి అనుకోవడం లేదు. విజయవాడలో బెంజ్ సర్కిల్ ను దాటి పటమటలంక వైపు కొంచెం దూరం నడిస్తే శ్వేతవర్ణంలో మెరుస్తూన్న భవనంపై ఎర్రని అక్షరాలతో ఈనాడు అనే పదాలు మకుటాయమానంగా కనిపిస్తాయి. 1989 ఏప్రిల్ 25 నుంచి 1992 సెప్టెంబర్ 30 వరకూ నేను అక్కడే ఉప సంపాదకునిగా ఉద్యోగం చేశాను. అక్కడున్నది రెండున్నర ఏళ్ళే అయినా జీవితాంతం గుర్తుండే అనుభవాలను సొంతం చేసుకున్నాను. అప్పట్లో అక్కడ ఆరు జిల్లా డెస్కులు, జనరల్ డెస్కు పనిచేసేవి. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాల మినీలు అక్కడే తయారయ్యేవి. హైదరాబాద్ నుంచి మెయిన్ ఎడిషన్ ఫాసిమైల్లో వచ్చేది. ఇక్కడున్న జనరల్ డెస్క్ సభ్యులు ఈ ఆరు జిల్లాలకు తగిన విధంగా మార్పులు చేసి మెయిన్ పేజీలను తీర్చిదిద్దేవారు. నేను చేరినప్పుడు లెడ్ ఫాంట్స్ తో గాలీలలో కంపోజ్ చేసి కాపీ తీసేవారు. పొరపాటున చేయి తగిలి గాలి కింద పడితే… మళ్ళీ పని మొదటికే. ప్రూఫ్ రీడర్లు వాటిని దిద్ది ఇచ్చేవారు. బ్రహ్మం గారు ప్రూఫ్ రీడింగ్ బృందంలో సీనియర్.
డెస్కుల్లో పి.ఎస్.ఆర్. గారు, ఆచంట సుదర్శనరావు గారు, మహమ్మద్ గౌస్ గారు, వెల్లంకి అరుణ్ కుమార్ గారు, హరిప్రసాద్ గారు, అనంతనేని రవి కుమార్ గారు, ఏ.వి.ఎన్.హెచ్.శర్మ గారు, జనరల్ డెస్కులో ప్రభాకర్ గారు, చెన్నుపాటి రామారావు గారు ఉండేవారు. రిపోర్టింగ్ బ్యూరోలో ప్రస్తుత ఏపీ మీడియా కమిటీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సురేష్ గారు, నవీన్ గారు ఉండేవారు. కొమ్మినేని గారి సోదరుడు లక్ష్మీనారాయణ నేను చేరిన వారం రోజులకు ఎన్.ఎమ్.ఆర్.గా చేరారు. వీరందరికి హెడ్ మోటూరి వెంకటేశ్వరరావు గారు. మేనేజర్ గా కొల్లి వెంగళనీడు వ్యవహరించేవారు. తెల్ల దుస్తులతో బంగారు రంగు ఫ్రేమ్ కళ్లజోడుతో కనిపించేవారు. ఆయనకు డబల్ బారెల్ గన్ ఉండేది. అప్పుడప్పుడు ఆయన బారెల్ క్లీన్ చేస్తూ ఉండగా చూడడం గమ్మత్తుగా ఉండేది. వీళ్ళు అందరూ ఒక ఎత్తయితే… టెలిఫోన్ ఆపరేటర్ రాజేష్ ఒక ఎత్తు. ఎడిటోరియల్ విభాగంలోకి వెళ్లాలంటే ఆయన ముందు నుంచే వెళ్ళాలి. స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు.
ఇక విజయవాడ కార్యాలయంలో నేను ఉన్న కాలంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. మొదటిది… తుపాను. 1990 మే నెలలో వచ్చిన ఈ తుపాను కోస్తా జిల్లాలపై పెను ప్రభావాన్ని చూపింది. మాకు ఇళ్లకు వెళ్లే దారి లేదు. డెస్కులో ఉన్న నళిని, లీల గార్లను వెంగళనీడు గారు కారులో ఇంటికి పంపారు. అంతటి జడివానలో, ఈదురు గాలుల జోరులో కార్యాలయంలో ఉన్నవారందరికి క్యాంటీన్లో అన్నం వండించి, ప్రియా పచ్చళ్ళతో భోజనం పెట్టించారు. ఆ రాత్రి అందరికీ కాళ రాత్రే. పెను గాలులకు వెంటిలేటర్ అద్దాలు పగిలి హాలు అంతా పడ్డాయి. ఒక మూలకు ఒదిగిపోయి, తుపాను తగ్గేవరకూ బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వచ్చింది.
రెండో సంఘటన రాజీవ్ గాంధీ హత్య. అప్పట్లో మా డ్యూటీ టైమింగ్స్ మధ్యాహ్నం ఒంటిగంటన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకూ. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకున్న తరవాత ఈనాడులో ఒక సహచరుడు వచ్చి లేపి విషయం చెప్పాడు. అప్పటికే సెకండ్ షో సినిమాలను మధ్యలోనే ఆపేసి ప్రేక్షకుల్ని ఇళ్లకు పంపేశారు. ఒక పక్కన పోలీసుల హెచ్చరికలు… మరో పక్కన ఇళ్లకు త్వరగా చేరాలనే తపనతో రోడ్లపై పరుగులు తీస్తున్న జనం. విజయవాడ అంత హడలిపోవడానికి కారణం గత అనుభవాలు. వంగవీటి రంగ హత్యానంతరం పరిణామాలను తలచుకుని విజయవాడ వణికిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే… మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లడం ఒక ఎత్తు. దగ్గరలో ఉన్న సహచరులంతా కలిసి ఆఫీస్ కి కాలినడకన బయలుదేరాం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై భయపడుతూ నడుస్తుండగా సి.ఆర్.పి.ఎఫ్. పోలీసులు వెంటబడి తరమడం… లాఠీలతో కొట్టడం… వీరిని తప్పించుకుంటూ ఆఫీసుకు చేరడం తలచుకుంటే ఇప్పటికీ భయాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మరొక రకమైన ఉద్విగ్న వాతావరణం. ఎవరైనా కార్యాలయంపై దాడి చేస్తారేమో అనే అనుమానంతో బాల్కనీ మూలల్లో కంకరరాళ్లను పేర్చి ఉంచారు. తుపాకీ పట్టుకుని మేనేజర్ తిరిగేవారు. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటుంటే థ్రిల్ కలుగుతుంది.
వీటిని మించి… అదే భవనంలో రామోజీరావు గారు నన్ను ఇంటర్వ్యూ చేసిన గది పైనే ఎర్ర రంగులో ఈనాడు అనే అక్షరాలు ఉన్నాయని తెలిస్తే ఇప్పటికీ మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. అదే భవనం పై ఉన్న ఈనాడు అక్షరాలు ఇక కనపడవు అనే తలంపు ఎంతో ఆవేదన కలిగిస్తుంది. ఆ భవనం వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎందరో పాత్రికేయులతో ఓనమాలు దిద్దించి, పెద్దవాళ్ళను చేసిన ఆ భవంతికి వేరే పేరు భవిష్యత్తులో వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ భవనం చేతులు మారినా… పాత ఈనాడు అనే పిలుస్తారు తప్ప కొత్త పేరు ఎవరి నోటా రాదు. ముఖ్యంగా ఆ కాంపౌండులో పనిచేసిన నా బోటి వాళ్లకు అస్సలు రాదు. అన్నట్లు ఈనాడులో రిటైరైన మొట్టమొదటి ఉద్యోగి కేశవ రామయ్య గారు తన ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టింది… ముగించింది కూడా అక్కడే. ఈనాడే తమ శ్వాసగా జీవించిన మోటూరి వెంకటేశ్వరరావు గారు అర్ధాంతరంగా సంస్థ నుంచి నిష్క్రమించింది కూడా విజయవాడ నుంచే. ఇలా ఎంతోమంది నిష్క్రమించారు. కారణాలు ఏమైనప్పటికీ వారికి సంస్థ మీద ఎటువంటి కోపం లేదు. అందుకు కారణమైన వారిపై తప్ప. వీళ్లకీ బహుశా ఇలాంటి ఫీలింగే ఉంటుందని అనుకుంటున్నాను.