యూనివర్సిటీ, టెలిగ్రాఫ్ నెట్ వర్క్, పోస్టల్ మొదలైంది ఇక్కడే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేకం
(వ్యూస్ ప్రత్యేక కథనం)
అమరుల పోరాట త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానిది భారత దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రాంతం 230 BCE నుండి 220 CE వరకు శాతవాహన, 1083-1323 వరకూ కాకతీయ, 1326-1356 వరకూ ముసునూరి నాయకుల, 1347-1512 వరకూ బహమనీ సుల్తానుల-, ఢిల్లీ సుల్తానుల, 1512-1687 వరకూ గోల్కొండ సుల్తానుల, 1724-1950 వరకూ అసఫ్ జాహీ రాజవంశీయుల పాలనలో ఉంది.

1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్‌వర్క్‌లు, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు.

భారత స్వాతంత్రం తరువాత, హైదరాబాదు రాఫ్ట్రం భారతదేశంలో కలవడానికి విలీన పత్రంపై నిజాంరాజు సంతకం చేయలేదు. 1948లో భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడంతో విలీనం కాక తప్పలేదు. 2014 జూన్ 2న, హైదరాబాద్ రాజధానిగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.

దశాబ్దాలుగా (1969 నుండి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా… 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.
(అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు)