అన్నమయ్య అన్నది -20
(రోచిష్మాన్, 9444012279)
“అణు రేణు పరిపూర్ణుఁడైన శ్రీవల్లభునిఁ
బ్రణుతించు వారువో బ్రాహ్మలు”
అణువులోనూ, దుమ్ము (రేణువు) లోనూ పరిపూర్ణుడైన శ్రీవల్లభుణ్ణి కీర్తించే వాళ్లుపో బ్రాహ్మలు అంటూ అన్నమయ్య ఒక సంకీర్తనను సంధిస్తూ ఎవరు బ్రాహ్మలు? ఆన్న ప్రశ్నకు అత్యవసరమైన సమాధానాన్ని తెలియజేస్తున్నారు.
“హరి నామములనె సంధ్యాది విధులొనరించు
పరిపూర్ణమతులువో బ్రాహ్మలు
హరి మంత్ర వేద పారాయణులు హరి భక్తి
పరులైన వారువో బ్రాహ్మలు”
లేచిన దగ్గఱ నుంచీ అన్ని పనులూ హరి పేర్లు మీదే చేసే పరిపూర్ణమతి ఉన్న వాళ్లుపో బ్రాహ్మలు; హరి మంత్రాల్ని , వేద పారాయణను చేసే హరి భక్తి పరాయణులైన వాళ్లుపో బ్రాహ్మలు అని అన్నమయ్య తెలియజేస్తున్నారు. ఇక్కడ పరిపూర్ణమతులు అనడం విశేషం. పరిపూర్ణమతులైన వాళ్లు అన్ని పనులూ భగవంతుడి పేరు మీదే చేస్తారు.
“యేమి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచు
భావించువారువో బ్రాహ్మలు
దేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియు
పావనులు వారువో బ్రాహ్మలు”
ఏం చూసినా ఇన్నిట్లోనూ హరి ఉన్నాడంటూ భావించే వాళ్లుపో బ్రాహ్మలు; దేవకీనందనుడె దేవుణ్ణి మతితో తెలుసుకున్న పావనులైన వాళ్లుపో బ్రాహ్మలు అంటూ అన్నమయ్య కొనసాగుతున్నారు. ఇక్కడ దేవుణ్ణి మతితో తెలుసుకున్న అని గొప్పగా అన్నారు అన్నమయ్య. దేవుణ్ణి ‘మతి’తోనే తెలుసుకోవాలి. మతి అంటే ఏది? ఏమిటి? మతి అంటే బుద్ధి, జ్ఞానం. దేవుణ్ణి బుద్ధితోనే, జ్ఞానంతోనే తెలుసుకోవాలి. దేవుణ్ణి మాత్రమే కాదు ఏ విషయాన్నైనా బుద్ధితోనే, జ్ఞానంతోనే తెలుసుకోవాలి మనం.
“ఆదినారాయణుని ననయంబుఁ దమయాత్మఁ
బాదు కొలిపిన వారు బ్రాహ్మలు
వేద రక్షకుఁడైన వేంకట గిరీశ్వరుని
పాద సేవకులవో బ్రాహ్మలు”
ఆదినారాయణుణ్ణి అత్యధికంగా (అనయంబు) తమ ఆత్మల్లో నెలకొల్పుకొన్న వాళ్లు బ్రాహ్మలు; వేదాల రక్షకుడైన వేంకటేశ్వరుడి పాద సేవకులుపో బ్రాహ్మలు అంటూ బ్రాహ్మలంటే ఎవరు అన్న సత్యాన్ని తెలియజెప్పారు అన్నమయ్య.
శ్రీవల్లభుడు, హరి, దేవకీనందనుడు, ఆదినారాయణుడు, వేంకటగిరీశ్వరుడు ఈ మాటల్ని పరమాత్మకు పర్యాయపదాలుగానే తీసుకోవాలి. మహావిష్ణువు ప్రళయకాలంలో మత్స్య అవతారంలో వేదాలను రక్షించాడు ఆ విషయాన్నే వేదాల రక్షకుడైన వేంకటేశ్వరుడు అని చెప్పారు అన్నమయ్య. వేంకటేశ్వరుడే అన్నమయ్యకు మహావిష్ణువు.
ఎవరూ పుట్టికతో బ్రాహ్మలు అవరు. బ్రాహ్మలు లేదా బ్రాహ్మణులు ఒక కులానికి సంబంధించిన వాళ్లు కాదు. ‘బ్రాహ్మణులు ఒక స్థితికి సంబంధించిన వాళ్లు’. బ్రాహ్మణత్వం ఒక స్థితికి సంబంధించినది. పుట్టుకతో అందఱూ శూద్రులే. ‘శూద్రులు అంటే సామాన్యులు’ అన్నది సరైన తెలివిడి. ఈ సందర్భంలో మనువు చెప్పినదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలి మనం.
“జన్మనా జాయతే శూద్రః / సంస్కారాత్ ద్విజ ఉచ్యతే / విద్యయా యాతి విప్రత్వమ్ / బ్రహ్మ జ్ఞానాత్ బ్రాహ్మణః” అని మనువు చెప్పాడు. అంటే పుట్టుక చేత శూద్రులుగా అంటే సామాన్యులుగా పుడతారు; సంస్కారంవల్ల లేదా అభ్యాసంవల్ల రెండవ జన్మను పొందుతారు మామూలుగా పుట్టి ఒక వృత్తిని నేర్చుకున్నాక ఆ వృత్తికారుడవడమే ద్విజుడవడం అంటే. విద్యవల్ల విప్రులవుతారు లేదా విద్వాంసులవుతారు. బ్రహ్మజ్ఞానంవల్ల బ్రాహ్మణులవుతారు అని ఆ మనువు మాటలకు అర్థం.
ఈనాటి మన కుల వ్యవస్థకు మనువు మూలమూ, కారణమూ కాదు. మనదేశంలో వేలల్లో కులాలు ఉన్నాయి. నిజానికి వేఱు వేఱు పేర్లతో ప్రతి దేశంలోనూ ప్రతి మతంలోనూ ఈ హెచ్చు తగ్గుల తెగలు, వర్గాలు ఆపై వివక్ష ఉంటూనే ఉన్నాయి. మనువు చెప్పింది మనుషుల్లోని నాలుగు విభాగాలను మాత్రమే. ఇప్పుడున్న ఇన్ని కులాలకు సనాతన ధర్మానికి సంబంధించిన ఏ మూల రచనలోనూ ఆధారాలు లేవు. మన సనాతన ధర్మం ఇప్పుడున్న వేల కులాలను నిర్ణయించ లేదు.
బ్రహ్మ జ్ఞానంవల్ల అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానంవల్ల బ్రాహ్మణులు అవుతారని మనువు చెప్పాడు. ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటివాళ్లు పరమాత్మను తెలుసుకున్నవాళ్లు; బ్రహ్మ జ్ఞానం ఉన్న ఆ మహనీయులు బ్రాహ్మణులు అవుతారు; అయ్యారు. జీసస్, మహమ్మద్ నబి, బయాజిద్ వంటివాళ్లకు ఆల్‌మైటీ లేదా అల్లాహ్ లేదా పరమాత్మ జ్ఞానం ఉందని తీసుకుంటే వాళ్లకు బ్రహ్మ జ్ఞానం ఉన్నది కాబట్టి వాళ్లూ బ్రాహ్మణులే.
మనువు కాలానికి భారత (ప్ర)దేశంలో మతం అన్నదే లేదు. కుల వ్యవస్థకూ, కుల వివక్షకూ మనువుతో ఏ సంబంధమూ లేదు. మహాభారత కాలం వఱకూ కులం అన్న పదం వంశం అన్న అర్థాన్నే సూచించింది. తరువాతి కాలంలో మనుషుల్లో కుత్సితమూ, మదమూ కారణాలుకాగా ఇప్పున్న కులం అన్న అవలక్షణం పుట్టి పెరుగుతూ, పెరుగుతూ ఈనాడు మనం చూస్తున్న స్థితిలో ఉంది. ప్రస్తుత కాలంలో రాజకీయ కారణాలవల్లా, కొన్ని వర్గాల లబ్ది కోసమూ, ఈ కులం అన్నది బలం పుంజుకుంది.
వేదంలో మంత్ర భాగాలకు ‘సంహిత’ అని పేరు. ఆ సంహితను వివరిస్తూ యజ్ఞయాగాల్లో మంత్రాల వాడుకను వివరించే గ్రంథానికి ‘బ్రాహ్మణం’ అని పేరు. ఆ బ్రాహ్మణానికి సంబంధించినవాళ్లు, ఆ బ్రాహ్మణాన్ని అమలు చేసే వృత్తికారులు తొలిదశలో బ్రాహ్మణులుగా చలామణిలోకి వచ్చారు. వృత్తి పరంగా బ్రాహ్మణానికి లేదా బ్రాహ్మణాలకు చెందిన వాళ్లు బ్రాహ్మణులయ్యారు కుమ్మరి వృత్తి చేసే వాళ్లు కుమ్మరులయినట్టుగా.
వేదానికి బ్రహ్మ అనే పేరు కూడా ఉంది. వేదపరమైన వృత్తి చేసే వాళ్లు బ్రహ్మలు లేదా బ్రాహ్మలు అయ్యారు. బ్రహ్మ అంటే యాగం లేదా యజ్ఞం అనే అర్థం కూడా ఉంది. ‘బ్రహ్మ వై బ్రాహ్మణః’ అని శతపథ బ్రాహ్మణం తెలియజేసింది. (శతపథ బ్రాహ్మణం అన్నది వేద కర్మలను వివరించే గ్రంథం. ఇది శుక్ల యజుర్వేదానికి సంబంధితమైనది) బ్రహ్మ వై బ్రాహ్మణః అంటే ‘యాగం లేదా యజ్ఞానికి చెందిన వ్యక్తి బ్రాహ్మణుడు’ అని అర్థం. ఇక్కడ యాగం లేదా యజ్ఞానికి, వేదానికి, మంత్రానికి చెందిన వ్యక్తి బ్రాహ్మణుడు అని అవగాహన చేసుకోవాలి. బ్రహ్మ వై బ్రాహ్మణః అంటే బ్రహ్మం లేదా భగవంతుడే బ్రాహ్మణుడు అని కాదు. వైద్యం చేసే వాళ్లు వైద్యులు అయినట్టుగా బ్రహ్మ కర్మలు చేసే వాళ్లు బ్రాహ్మలు అయ్యారు. వీళ్లు మనువు చెప్పిన బ్రహ్మ జ్ఞానం ఉన్న బ్రాహ్మణులు కాదు.
బ్రాహ్మణత్వం మాత్రమే కాదు ఏ కులత్వం కూడా జన్మతః రాదు. కులం అన్నది జీవన విధానానికి సంబంధించింది. మనదేశంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, దళిత డీ.ఎన్. ఎ.లు విడివిడిగానూ, విభిన్నంగానూ లేనేలేవు. జన్మతః కులం అన్నది పూర్తిగా తప్పుడుతనం.
సరైన చదువు ఉంటేనూ, చదువు సరిగ్గా ఉంటేనూ తప్పుడుతనం తొలగిపోతుంది; సరైన అవగాహన వస్తుంది. తెలివిడితో, తెలివితో అసత్యాలనూ, అపథ్యాలను నిర్మూలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సరైన చదువుతోనూ, సరైన తెలివిడితోనూ మనం తప్పుడుతనం నుంచి బయటపడి మేలైన మనుగడ చేద్దాం.
సరిగ్గా మనువు చెప్పిన దానికి కొనసాగింపుగా, తప్పుడుతనానికి వ్యతిరేకంగా సామాజిక బాధ్యతతో అన్నమయ్య ఈ సంకీర్తన చేశారు; బ్రాహ్మలపై మనకు సరైన అవగాహననిచ్చారు.
బ్రాహ్మలు ఎవరు అన్న దానిపై స్పష్టతను ఇస్తూ భాసిల్లుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)