(డా. పురాణపండ వైజయంతి)
అంబుదము అంచు వరకే
అంబకముల దృష్టి పరిధి
పయోధరము లేనిచో…
ఆ పరిధి ఎందాకా…

శూన్యమా… కాదు కాదు…
శూన్యానికి ఆవల వరకా…
ఆ వెలుగును దర్శించేది
జ్ఙాన చక్షువు మాత్రమే
అది కంటికి కానరానిది…
––––––––––––

నేత్రానికి నీలి వారిదము కమ్మితే..
ఆనందాశ్రువులు…
నయనాలకు నల్లని నీరదము అడ్డుపడితే
వ్యధాభరిత అశ్రు ధారలు
–––––––––––––

మబ్బుల రేడు ఇంద్రుడు…
సుర రాజు సంతతి మేఘాలు…
జలదాలు.. జలధరాలు…
నీటిగుట్టలు.. నీరదాలు…
మొగులు.. అంబుదము
అభ్రము.. వారిదము
జలధరము.. పయోధరము
ధారాధరము.. తోయదము
జీమూతము.. మొయిలు
–––––––––––––

నేత్రము, చక్షువు, అక్షి, నయనము, నీటిగుట్ట
అక్షికి ఊహా శక్తి అనంతము
చక్షువులకు మబ్బులే చిత్తరువులు…
ఒక నీరదం కుందేలు..
మరొక జలధరం గజరాజ సదృశం
ఒక నీరదం భయసదృశ కాలుడు
మరొక జలధరము ఆనంద సంద్రము

ఈ నయనాలకు ఎన్ని సంబరాలో…
నయనానందకరంగా…
నయన మనోహరంగా…
కన్నుల పండువుగా
కనులకు విందులుగా
మబ్బుల పిండివంటల విందులు…
అభ్ర మేఘ చయం
కంటి కడుపును నింపుతుంది.

మబ్బు కన్నులు రాల్చిన
చిటపట చినుకులు
ఆనందాశ్రువుల మెరుపులు
ఆ ఆనందబాష్పాలే వానలు
రైతుల పాలిటి వరి ధాన్యాలు

మబ్బు నయనాలు కురిపించిన
దుఃఖబిందువులే
వరదలు తుఫానులు
లంకల పాలిటి నిరాశ్రయాలు

మబ్బు గుండె రెండు ముక్కలైతే
అల్లకల్లోల సునామీ
అందరిపాలిటి గుండె జలదరింపు

మబ్బు మనసు
పొగిలిపొగిలి విలపిస్తే
ఉప్పెన
పూరిపాకల పాలిటి
ఉప్పు లేని చప్పిడి బువ్వ

మబ్బులు.. మేఘాలు
ఉరుములు.. మెరుపులు
వేయి కన్నుల వాడు
నీటిగుట్టలను కురిపిస్తే
వానలు.. వరదలు
తుఫానులు.. ఉప్పెనలు..
సునామీలు…
ఆ ఇంద్రుని వేయికన్నులు…
వెలుగులను చూచుటకు
రెండు కన్నుల మానవుల తరమా


