ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణ
నేను – ఈనాడు: 31
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
సంస్థకు బద్ధులై, అధికారుల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ… అధినేత మనసెరిగి ప్రవర్తిస్తూ పని చేసేవారు. ప్రెస్ మీట్ కి వెడితే వారు ఇచ్చే మంచి నీరు కూడా తాగేవారు కాదు. ఇచ్చే బహుమతులను స్వీకరించేవారు అంతకంటే కాదు. అవసరానికి తగ్గట్టు పరిచయాలను ఉపయోగించుకోవడం అస్సలు చేసేవారు కాదు. ఇలా 99 శాతం మంది పాత్రికేయులు అప్పట్లో ఉండేవారు. ఆ 99 శాతం మందిలో ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న రిపోర్టర్ ఉన్నారు. ఆయన పేరు బొబ్బిలి రాధాకృష్ణ. సంస్థ నుంచి ఆయన నిష్క్రమణ ఎలా జరిగింది అనే అంశాన్ని నిష్క్రమణలు అధ్యాయంలో వివరిస్తాను.
బొబ్బిలి రాధాకృష్ణ … ఈయన స్వగ్రామం అయినవిల్లి మండలం క్రాప. విద్యాభ్యాసం గురించి నాకు తెలియదు. ఆయనకు ఈనాడు సంస్థలో రిపోర్టరుగా ఉద్యోగం తెచ్చిపెట్టింది మాత్రం ఆయన నిబద్ధత, నిజాయితీలే. రిపోర్టర్ కాకముందు ఆయన ఏమి చేసేవారని, రాధాకృష్ణ గారి అన్న కుమారుడు ప్రసాద్ ను విచారించాను. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఎపిసోడ్ రాస్తున్నాను.
ఈనాడు ప్రారంభమైన తరవాత కొద్దిరోజులకు బొబ్బిలి రాధాకృష్ణ గారు ముమ్మిడివరం ఈనాడు ఏజెన్సీ తీసుకున్నారు. ఏజెన్సీ అంటే… ఈనాడు పత్రికలను తెప్పించుకుని, ఇంటింటికీ పంపిణీ చేయడం. ఇది ఆషామాషీ పని కాదు. ఇంటింటికీ తిరిగి పత్రిక చదవమని ప్రోత్సహించి, వారికి ప్రతిరోజూ పత్రికను పంపడం వరకు ఒక ఎత్తు. ఆ తరవాత పత్రిక చందాను వసూలు చేయడం మరొక ఎత్తు. ఈనాడు ఏజెన్సీ అంటే ఇప్పటికీ సవాలే. ఎన్ని కాపీలు కావాలో దానికి తగ్గట్టుగా సంస్థ నిర్ణయించిన మేరకు డిపాజిట్ కట్టాలి. అప్పుడే పత్రికను ఏజెంట్ కి పంపుతారు. ఒక్కరోజు చెల్లింపు ఆలస్యమైనా పత్రిక రాదు. నిత్యం ఉషోదయం లోగా ఇంటి ముంగిటకు చేరే పత్రిక అది. తొలినాళ్లలో కొన్ని రోజులు ఉచితంగా వేశారని విన్నాను తప్ప నాకు రూఢీగా తెలియదు.
అప్పట్లో ముమ్మిడివరం ఏజెన్సీ చూసిన వ్యక్తి దానిని వదిలేసుకోవడంతో… కొన్నాళ్ళు రాధాకృష్ణ గారికి అప్పగించారు. తరువాత ఆయన దానిని కొనసాగించారు. రాధాకృష్ణ గారికి నిబద్ధత ఎక్కువ. ఏ పని అయినా ఆయన అత్యంత జాగరూకతతో… నిబద్ధతతో చేస్తారు. ఈ పనిని కూడా అలాగే నిర్వహించారు. తెలిసిన ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి, పత్రిక చందాదారుగా చేర్పించారు. ఆయన మీద అభిమానంతో తీసుకున్నవారూ ఉన్నారు. ఇలా ఆ పత్రిక సర్క్యులేషన్ ఒక్క ముమ్ముడివరం తాలూకాలోని మూడు వేల పైచిలుకు చేరింది. అప్పట్లో ఇది ఒక రికార్డని చెబుతారు. ఆ సందర్భాన్ని ఒక ఉత్సవంలా నిర్వహించారని అంటారు. రాధాకృష్ణ గారి ఇంటికి లైటింగ్ పెట్టి అట్టహాసంగా కన్పించేలా చేశారంటారు. అన్నట్టు ఈ కార్యక్రమానికి రామోజీ రావు గారు కూడా హాజరయ్యారని రాధాకృష్ణ గారి తమ్ముడి కుమారుడు చెప్పారు. రామోజీ రావు గారు ఎవరో వారికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన రావడం ఒక విశేషమే. ఆ కార్యక్రమాన్ని చూసిన వారు ఇప్పటికీ దానిని గుర్తుచేసుకుంటారు.
రాధాకృష్ణగారి నిబద్ధత గురించి నాకు తెలుసు అని ఒక ఈనాడు యూనిట్ కి మేనేజర్ గా చేసిన ఒకరు నాతో అన్నారు. ఎంతో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే తప్ప ఇలాంటి లక్ష్యాలు నెరవేరవు. ఇప్పటి ఈనాడు సర్క్యులేషన్ ఎంతో నాకు కచ్చితంగా తెలియదు కానీ, లక్షల్లోనే ఉంటుందని చెప్పగలను. ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడానికి రాధాకృష్ణ గారి లాంటి ఎందరిదో కృషి ఉంది.
ఇది ఇలా ఉంటే… కొన్నాళ్ళకు రాధాకృష్ణగారు అప్పులపాలయ్యారు. పేపర్ తీసుకునే వారే కానీ చందా కట్టేవారు లేరు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ వద్దంటారోననే భయం. ఈ సందేహంతో నెట్టుకొచ్చిన రాధాకృష్ణ గారు సంస్థకు పడిన బకాయిని తీర్చడానికి సొంత ఆస్తులు అమ్మారని అంటారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా రామోజీరావు గారి దగ్గరకు వెళ్లడం, రాధాకృష్ణ గారి గురించి, ఇచ్చిన వార్తల గురించి తెలిసి ఉండడంతో ఆయనకి స్టాఫ్ రిపోర్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఇక ఆయన కాకినాడ నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఈనాడు రాజమండ్రి యూనిట్ ప్రారంభం నాటికి (1992 సెప్టెంబర్ 30 నాటికి) ఆయనే స్టాఫ్ రిపోర్టర్. ఆయన రాసిన వార్తలను తిరగరాసేది నేనే. కాపీ కొంచెం గందరగోళంగా ఉండేది. తొలి రోజుల్లో ఉన్నది ఉన్నట్టు రాసేవాడిని. స్టాఫ్ రిపోర్టర్ ఇచ్చిన కాపీని మారిస్తే, కోపగించుకుంటారేమోననే సంశయంతో అలా చేసేవాడిని.
ఇది చూసిన మా డెస్క్ ఇంచార్జి ఏ.వి.ఎన్.హెచ్.ఎస్. శర్మ గారు నన్ను మందలించారు. ఉన్నది ఉన్నట్టు రాస్తే మీరెందుకు… ఎవరితోనైనా రాయించుకుంటానుగా అన్నారు. రిపోర్టర్ అనే వాడు మనకు గోధుమ పిండి ఇస్తారు. దానిని మనం రొట్టె చేసుకునేలా నీళ్లు కలిపి ముద్ద చేసి, కాల్చినట్టు తీర్చి దిద్దాలి అని చెప్పారు. ఇది నాకు ఒక పాఠం. అప్పటి నుంచి, ఎవరి కాపీ వచ్చినా శ్రద్ధగా చదివి తీర్చిదిద్దడం ప్రారంభించాను. ఇలా రాసినప్పుడు ఒక్కోసారి రాధాకృష్ణ గారు నొచ్చుకునేవారు. అదేమిటండి… నేను రాసింది రాసినట్టు రాలేదు… మార్చేశారు అంటూ కోనసీమ యాసలో అనేవారు. అవునండి. మీరు చెప్పింది నిజమే. కానీ లీడ్ సెంటెన్స్ మీరు చివర ఎక్కడో రాస్తారు. దానిని మేము ముందుకు తెచ్చి, పాఠకులకు అనుకూలంగా మారుస్తాం అని సద్దిచెప్పేవారు. అది మరొక పాఠం.
ఇక్కడ టెలిప్రింటర్ ద్వారా వార్త వచ్చే విధానం గురించి చెప్పాలి. ఈ విధానంలో వార్తలు టింగ్లీష్ లో వచ్చేవి… అంటే తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతో టైపు చెయ్యడం. అమ్మ అని రాయాలంటే ఎఎమ్ఎమ్ఎ అని టైపు చేసేవారు. ఇలా వార్త అంతా టింగ్లీషులో ఉండేది. తొలిరోజుల్లో దీనిని చూసి రాయడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించేది. రాను రాను అలవాటైపోయి వేగంగా రాయడం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సాక్షి టివిలో కె.ఎస్.ఆర్. లైవ్ షో నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు నేను విజయవాడలో చేరినప్పుడు, రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జిగా ఉండేవారు. ఆయన సీటుకు ఆనుకుని టి.పి. రూమ్ ఉండేది. ఒక కిటికీ, దానికి ఆనుకుని బుట్ట ఉండేవి. టెలిప్రింటర్ పై వచ్చిన వార్తలను ఆపరేటర్స్ ముక్కలు చేసి ఆ బుట్టలో వేసేవారు. వాటిని కొమ్మినేని గారు తీసుకుని, స్కేలుతో కత్తిరించి, ఏ డెస్కువి వారికి అందించేవారు. అది ఆయన పని కాదు. కానీ, సమయ నియంత్రణ అది. నిజానికి బాయ్ చెయ్యాల్సిన పని. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఈనాడులో ప్రతి ఉద్యోగి ఇదే రకమైన అంకిత భావాన్ని కనబరుస్తారని చెప్పడానికి. రాధాకృష్ణ గారికి దీనికి మించి రెట్టింపు అంకితభావం ఉంది. అదే ఆయనకు విధి నిర్వహణలో శ్రీరామ రక్ష అయ్యింది.
ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు రాధాకృష్ణ గారి వైఖరి చూసి, మిగిలిన రిపోర్టర్లు జోకులు వేసుకునే వారు. అవేవీ ఆయనకు పట్టేవి కావు. ఆయన పనేమిటో ఆయనది. అంతే… కానీ ఉద్యోగ జీవితం చివరి రోజుల్లో ఆయన నిబద్ధత, నిజాయితీ ఏవీ కాపాడలేకపోయాయి. హృదయాన్ని ద్రవింపజేసే ఈ వివరాలను ఇంతకుముందు చెప్పినట్టు, నిష్క్రమణల పర్వంలో రాస్తాను. ఈ ఎపిసోడ్ ముగించేముందు రాధాకృష్ణ గారిలోని రచన పటిమను చెబుతాను. వార్తలు రాసే విషయం ఎలా ఉన్నా, ఆయన మూడు నవలలు రాశారు. ఇది చాలామందికి తెలియని సంగతి. ఆ నవలల ముఖచిత్రాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాను.
ఆఖరుగా… బ్లో అవుట్ విషయంలో నేను రాసిన అనుభవాలను చదివిన ఒక మాజీ ఉద్యోగి అందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చెప్పారు. అది తెలుసుకోవాలంటే… రేపటి ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే..
చాలా మంది జర్నలిస్టులు ఉండొచ్చు..కానీ ఇలా నాటి అనుభవాలను కుతూహలం కలిగించేలా రాయటం .. సచిత్రంగా
మా ముందు ఉంచడం అందరికీ సాధ్యపడదు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యంగారు.
నమస్తే, మీరు ఒక విలేఖరి అయి ఉన్సాడి సాటి పాత్రికేయుని గురించి ఆయన ఘనత గురించి ఇంత వివరంగా చిన్న చిన్న సంఘటనలను కూడా వివరించి మెచ్చుకుంటున్నారు. అందుకు మిమ్మల్ని అభినందించాలి.👌 సంస్థ గురించీ యాజమాన్యం గొప్ప తనం గురించీ చాలా బాగా వివరిస్తున్నారు.
మీరు వ్రాసిన రిపోర్టర్ గొప్ప విలువలు ఉన్న వ్యక్తి. కానీ చివరలో ఫైనాన్సియల్ problems తో ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. అంతే sir, నిజాయితీ కి సుఖమయ జీవితానికి విలోమా సబందం ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఘటనలు వ్రాయండి sir