అన్నమయ్య అన్నది-19
(రోచిష్మాన్, 9444012279)
“ఘుమ్మనియెడి శ్రుతి గూడఁగను
కమ్మని నేతులు కాఁగఁగఁ జెలఁగె”
ఘుమ్మనే శ్రుతి కలవగా కమ్మనైన నేతులు కాగి ధ్వనించాయి (చెలగె) అంటూ ఒక సంకీర్తనను మొదలు పెట్టారు అన్నమయ్య.
అన్నమయ్య రాసినన్ని విషయాలపై ప్రపంచంలో ఏ కవీ రాసి ఉండక పోవచ్చు. ఎన్నెన్నో ఇతివృత్తాలతో అన్నమయ్య రాశారు. ఇదిగో ఇక్కడ నెయ్యి కాగడం మీద రాశారు. నెయ్యి కాగేడప్పుడు శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం శ్రుతి అట; ఆ శ్రుతిలో కమ్మని నేతులు కాగి ధ్వనించాయట. ఆహా ఏం చెప్పారు!

నెయ్యి కాగేడప్పుడు వచ్చే శబ్దాన్ని శ్రుతి అనడం ప్రశస్తంగా మాత్రమే కాదు ప్రత్యగ్రంగానూ ఉంది. ఇక్కడ శ్రుతి అని చెప్పడంవల్ల నెయ్యి కాగడాన్ని గానంగా పరిగణించారు అన్నమయ్య. ఈ చింతన న భూతో. ఘుమ్మని అనేది ధ్వని అనుకరణం ఝుమ్మనిలాగా.
“నీలవర్ణుఁడని నీరజాక్షుఁడని
బాలుని నతివలు పాడేరో
పాలు విదుకుచును బానల కాఁగుల
సోలి పెరుగు త్రచ్చుచుఁ జెలరేఁగి”
నీలం రంగువాడని, తామరపువ్వుల కన్నుల వాడని బాలుణ్ణి స్త్రీలు చెలరేగి పాడుతున్నారు … పాలు పితుకుతూ పరవశంతో బానలలోని, కాగుల్లోని పెరుగును చిలుకుతూ అని అన్నమయ్య ఒక దృశ్యాన్ని చిత్రించారు.
“మందర ధరుఁడని మాధవుఁడని గో
విందుడనిఁ బాడేరు వెలఁదు లిదె
నంద వ్రజమున నలుగడల నావుల
మందలఁ బేయల మంచి రవముల”
మందర పర్వతాన్ని ధరించిన వాడు (కూర్మావతారంలో మందర అనే పర్వతాన్ని ఎత్తిన సందర్భం) అని, మాధవుడు అని, గోవిందుడు అని స్త్రీలు పాడుతున్నారు … గోకులంలోని (నంద వ్రజమున) నాలుగు దిక్కుల్లో ఆవుల, దూడ(పేయ)ల మందల్లో మంచి చప్పుళ్లతో అంటూ ఒక భాగవత ఘట్టాన్ని తన పదాల్లో పొందుపఱిచారు అన్నమయ్య.
“వేంకటపతియని వేద నిలయుఁడని
పంకజనాభునిఁ బాడేరో
అంకుల చేతను అలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున”
వేంకటపతి అని, వేద నిలయుడని, పంకజనాభుడని పాడుతున్నారు … దవడ ఎముక (అంకుల) తోనూ, అందమైన శబ్దాలతోనూ, గొప్ప మాటలతోనూ బృందావనంలో అని ఒక సన్నివేశాన్ని చక్కగా చూపించారు అన్నమయ్య.
తెలిసిన సంఘటనలనో , తెలుసుకోవాల్సిన సంఘటనలనో , తెలియజెప్పాలనుకున్న సంఘటనలనో ఇలా వర్ణిస్తూ తాము విన్నవాటినీ, తాము చూసిన వాటినీ, తాము కలగన్న వాటినీ, తాము ఊహించిన వాటినీ ఇలా మనకు తెలియజెబుతూంటారు సత్కవులు. ప్రపంచంలో ఇవాళ ఎక్కువగా చదవబడుతున్న కవులలో ఒకరైన ఫార్సీ సూఫీకవి రూమీలోనూ ఈ లక్షణాలు మనల్ని ఆకర్షిస్తాయి. “నా ఏనుగు తన కల అయిన హిందూస్థాన్‌లో మళ్లీ విహరిస్తోంది” అని చెప్పి రూమీ తాను (కల)కన్న ఒక సన్నివేశాన్ని ప్రపంచం కళ్లముందుంచారు.
పల్లవిలో కమ్మని నేతులు కాగి ధ్వనించాయి అని ఆ నెయ్యిని గానంగా ప్రతిపాదించాక చరణాల్లో అతివలు బాలకృష్ణుణ్ణి పాడుతున్నారు, పాడుతున్నారు, పాడుతున్నారు అని నమోదు చేశారు అన్నమయ్య. కృష్ణుడు అని చెప్పకుండానే మనకు ఆ విషయం తెలియవచ్చేట్టు చేశారు అన్నమయ్య. ఆ గానం ఘుమ్మనే శ్రుతిలో ఉందనీ చెప్పారు. నెయ్యి అనేది పాలు, పెరుగు నుంచి వచ్చే ఉన్నతమైన పదార్థం; అది కమ్మనిది. కృష్ణుడి గుఱించి చేసే గానం నెయ్యిలాంటిది కనుక కమ్మనిది. ఈ భావనను మహోత్కృష్టంగా చెప్పారు మహాకవి అన్నమయ్య.
అన్నమయ్య చాల చోట్ల మహావిష్ణువు ఇతర అవతారాల విశేషాల్ని కృష్ణుడికి, వేంకటేశ్వరుడికి ఆపాదించి చెప్పారు. ఇక్కడ మందర ధరుడు, మాధవుడు, వేంకటపతి, వేద నిలయుడు, పంకజనాభుడు అని చెప్పినవి ఆ కోవలోకి వస్తాయి. కృష్ణుడి కాలానికి వేంకటపతి ప్రస్తావన ఎలా వచ్చింది? అలా ఎందుకన్నారు అన్నమయ్య? వేంకటపతి భక్తుడైన అన్నమయ్య భక్తి పొంగుకొచ్చే స్థితిలో మైమఱిచి ఆ ప్రస్తావన చేశారు అని అనుకోవాలి; అనుకుందాం.
ప్రత్యేకమైన శైలిలో ఎవరికీ స్ఫురించని ఆలోచన ఫలితమై ఎప్పటికీ విశిష్టంగా నిలిచేదై ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)