ఒక మాజీ ఉద్యోగి కథనం
పాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా రిగ్ తోనే..
నేను – ఈనాడు: 32
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
నేను రాస్తున్న పాశర్లపూడి బ్లో అవుట్ సంఘటన వివరాలను చూసిన ఒక ఒ.ఎన్.జి.సి. ఉద్యోగి ఆ బావికి సంబంధించిన కొన్ని వివరాలను నాతో పంచుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆ బావిని రెండు కిలోమీటర్ల లోతుకు తవ్వారు. బోరు రంధ్రం వెడల్పు దాదాపు 14 అంగుళాలు ఉంటుంది. లోపలి వెళ్లే కొద్దీ దాని వెడల్పును పెంచుతారు. అది 90 మీటర్ల వరకు ఉంటుంది. రెండువేల మీటర్ల అడుగులో ఎంతమేర రంధ్రంలో ఆయిల్ అండ్ గ్యాస్ ఎంత ఉంటాయో ఊహకు అందవు. కొన్ని బిలియన్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అక్కడ ఉంటుంది. ఒక్కొక్క బోరును మూడు కిలోమీటర్ల లోతు వరకూ తవ్వుతారు.
పాశర్లపూడి బావిని రెండు కిలోమీటర్ల వరకూ తవ్వారు. ఇలా తవ్వుతున్నప్పుడు ఉపయోగించిన రిగ్గును బి.హెచ్.ఇ.ఎల్. తయారు చేసింది. అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. అది విద్యుత్తు శక్తితో పనిచేస్తుంది. రిగ్గింగ్ చేస్తూ లోపలికి వెడుతున్నప్పుడు, ప్రతి మూడు రోజులకూ పైపులను మారుస్తూ ఉంటారు. వీటిని పైనుంచి లోపలి, లోపలి నుంచి పైకి తీస్తున్నప్పుడు ఎంతో నైపుణ్యంతో పనిచేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. వాస్తవానికి దేవరపల్లి గ్రామంలోని పాశర్లపూడి వెల్ లో జరిగింది పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ, ఆ ప్రాంతానికి పెను ప్రమాదం తప్పింది.
పైపులను మార్చేందుకు బయటకు తీస్తున్న సమయంలో ఒక బోల్ట్ లాంటిది జారిపడడంతో పైపులు ఇరుక్కుపోయాయి. విషయం గ్రహించేలోగా కింద ఉన్న గ్యాస్ ఒక్కసారిగా పైకి ఎగతన్నింది. అప్పుడే, భూకంపం లాంటి ప్రభావం ఆ ప్రాంతంలో కనిపించింది. అది గమనించిన రిగ్గుపై ఉన్న ఉద్యోగులు కిందకు దూకేశారు. ఆ క్రమంలో పైపుల మధ్య ఘర్షణకు నిప్పు రవ్వలు పుట్టడం.. అదే సమయానికి గ్యాస్ అక్కడికి చేరడం కారణంగా ఒక్కసారిగా బావి నుంచి మంటలు ఉవ్వెత్తున పైకి ఎగిశాయి. అక్కడ ఉన్నవారిని భయవిహ్వలులను చేశాయి. సమీపంలోని ప్రాంతాలవారు పరుగులు తీశారు.
మంటలు రేగాయి కాబట్టి అది బావికి పరిమితమైంది.. మంటలు రేగకుంటే.. గ్యాస్ కోనసీమ అంతా వ్యాపించి, ఆ ప్రాంతం మొత్తం నామరూపాలు లేకుండా అయ్యుండేదని అనుకున్నారు. చెడులో మంచి అంటే ఇదేనేమో కదా. ఈ బ్లో అవుట్ వల్ల సంస్థకు నష్టం వాటిల్లింది తప్ప, ప్రాణ నష్టం లేదు. ఈ కారణంగా సంస్థ ఊపిరి పీల్చుకుంది. కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో ఏడు గ్రామాలను మాత్రం ఖాళీ చేయించాల్సి వచ్చింది.
ఈ ప్రమాదం వల్ల సంస్థకు కొన్ని బిలియన్ డాలర్ల గ్యాస్ నష్టం వాటిల్లింది. తొమ్మిది కోట్ల రూపాయల విలువైన రిగ్గు, ఏడు కోట్ల రూపాయల విలువైన ఇతర సామాగ్రి నష్టపోయింది.
ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఉంది. కృష్ణ – గోదావరి బేసిన్లో ఒ.ఎన్.జి.సి. తవ్వకాలు చేసే ప్రదేశాలను సంస్థ లీజుకు తీసుకుంటుంది. సంబంధిత ప్రాంతంలో తమ పని పూర్తవ్వగానే, దాని యజమానికి అప్పగించేస్తుంది. యజమానికి ఆ ప్రదేశాన్ని అప్పగించే సమయంలో, బోరును కెమికల్ మడ్ తో నింపుతారు. దీనివల్ల గ్యాస్ లేదా చమురు వెలికితీయగా మిగిలిన జాగా కుప్పకూలిపోకుండా ఇది కాపాడుతుంది. బావుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ లేదా చమురును రవాణా చేయడానికి పైపు లైన్లను నిర్మించి, తాటిపాక, ఈతకోట, తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాలకు తరలిస్తుంది. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా రిఫైనరీలకు పంపుతారు. ఈ పనిని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షించేది.