అన్నమయ్య అన్నది-21
(రోచిష్మాన్, 9444012279)
“గొరబై మొదలుండఁగఁ గొనలకు నీరేల?
దొరదైవ మితఁడే తుదఁగల ఫలము”
వికారమైపోయి (గొరబై), మొదలు ఉండగా కొనలకు నీళ్లు పొయ్యడం ఎందుకు? అని అంటూ ఒక గొప్ప ఎత్తుగడతో అన్నమయ్య ఈ సంకీర్తనను మొదలుపెట్టారు. భక్తిని సమర్పించాల్సింది ఆదిదేవుడికే అనే అర్థం వచ్చేట్టుగా నీళ్లు పొయ్యాల్సింది మొదలుకు కాని కొనలకు ఎందుకు అంటున్నారు. దేవతలకే దైవం ఇతడే అనీ, పరమాత్ముడే చివరలో ఉండే పండు అనీ చెప్పారు అన్నమయ్య.
దైవాలు లేదా దేవతలు రెండు రకాలు అని మహానిర్వాణ తంత్రం తెలియజేస్తోంది. ఒకటి ‘అజాత’. అజాత అంటే పుట్టుక లేని సూర్యుడు, అగ్ని వంటి దేవతలు; రెండు ‘సాధ్య’. సాధ్య అంటే మానవులుగా పుట్టి దేవతలుగా రూపొందిన వాళ్లు. ఉదాహరణకు నహుష అనే రాజు ఇంద్రుడు అయ్యాడు. తరువాతి కాలంలో రాముడు, కృష్ణుడు ఇలా మఱి కొందఱూ మానవులుగా పుట్టి దేవతలయ్యారు. మహానిర్వాణ తంత్రంలో “నదులన్నీ సాగరంలోకి ప్రనహిస్తున్నట్టుగా ఏ దేవతకు పూజ చేసినా అది పరమాత్మ చేత అందుకోబడుతుంది” అనీ చెప్పబడ్డది. ఈ విషయం భగవద్గీతలోనూ చెప్పబడ్డది. ఆ విషయాన్నే దేవతలకే దైవమైన పరమాత్మే చివర్లో ఉండే పండు అని చెప్పారు అన్నమయ్య.
“క్రతువులు హరియే కర్మము హరియే
పితరులకు హరియే పెనుఁదృప్తి
సతత మంత్రముల సారము హరియే
ఇతని సేవేపో యిన్నిటి ఫలము”
యజ్ఞాలు హరే; వాటికి సంబంధించిన క్రియలు హరే; పితృదేవతలకు హరే పెద్ద సంతోషం. వ్యాపించి ఉన్న (సతత) మంత్రాల సారం హరే. ఇతడి సేవేపో వీటన్నిటి పండు అని చెప్పారు అన్నమయ్య మొదటి చరణంలో. పరమాత్మను హరి అని సూచించారు అన్నమయ్య ఇక్కడ.
దేవతల కోసమూ, పితృవుల కోసమూ యజ్ఞాలు చెయ్యబడతాయి. ఆ యజ్ఞాలు, వాటికి సంబంధించిన క్రియలు అన్నీ హరే అంటున్నారు అన్నమయ్య. “ఈశ్వరా, నువ్వు మానవ సమూహంలో దేవతల చేత సకల యజ్ఞాలకు హోతగా నియమించబడ్డావు” అని సామవేదంలో మొదటి ఖండం రెండో సామం తెలియజెబుతోంది. ఏవి మంత్రాలుగా ప్రచారంలో ఉన్నాయో అవి మాత్రమే కాకుండా వేదంలో ఉండే అన్ని ఋక్కులూ, సామాలూ కూడా మంత్రాలే. వ్యాపించి ఉన్న మంత్రాల సారం కూడా హరే అనీ, ఆ హరి సేవే ఇన్నిటి పండు అనీ అంటున్నారు అన్నమయ్య.
“అనలము హరియే ఆహుతి హరియే
జననీజనకుల సరవి హరే
పనివడి వేదముఁ బ్రణవము హరియే
ఎనసితని పూజ యిన్నిట ఫలము”
అగ్ని హరే; ఆహుతి హరే; తలితండ్రుల క్రమం హరే. అలవడిన (పనివడి) వేదమూ, ప్రణవమూ వాటికి సమానమైన (ఎనసితని) పూజ, ఇన్నిటిలోనూ హరే పండు అని రెండో చరణంలో నుడివారు అన్నమయ్య.
సామవేదంలో ఈశ్వరుడు లేదా పరమాత్మను అగ్నీ అని సంబోధించడం ఉంది. సామవేదం మొదటి ఖండంలోని మొదటి సామంలో ఇలా ఉంది: “ఈశ్వరా (అగ్నీ), కాంతినిచ్చేందుకు గొప్పదైన క్రియా శక్తిని (హవిస్సును) ఇచ్చేందుకై స్తుతించబడ్డవాడివై నీతివంతమైన పనుల నాయకుడిలా (హోత వలే) దేహంలో (దర్భపై) ఆసీనుడవై ఉండు”. అన్నమయ్య ఆ విషయాన్నే ఇక్కడ చెప్పారు. ఆహుతి కూడా హరే అని చెప్పారు అన్నమయ్య. (ఆహుతి అంటే మనకు తెలిసినది మాత్రమే కాదు; సామవేదం మొదటి ఖండం మూడో సామంలో ఆహ్వానించబడడం అనే భావనలో ఆహుతి పదం ప్రయోగించబడింది) వేదం హరే; ప్రణవం కూడా హరే అని అన్నమయ్య చెప్పిన సందర్భంలో పతంజలి యోగసూత్రాల్లో ఇరవై ఏడో సూత్రం “తస్య వాచకః ప్రణవః” అంటే అతణ్ణి (పరమాత్మను) పదంగా తెలియజేసేది ప్రణవం లేదా
ఓం అని తెలియజెప్పబడ్డదాన్ని గుర్తు చేసుకుందాం.
“ఏలికె హరియే యిరవును హరియే
వాలాయము సర్వము హరియే
కాలము శ్రీవేంకటగిరి హరియే
నేల నీతని శరణే సఫలంబు”
రాజు హరే; చోటు హరే; నిర్బంధం(వాలాయము), సర్వం హరే; కాలం కూడా శ్రీవేంకటగిరిపై ఉన్న హరే. భూమిపైన ఇతడి శరణమే ఫలవంతంగా ఉండేది లేదా ప్రయోజనాన్ని ఇచ్చేది అని చెప్పి సంకీర్తనను ముగించారు అన్నమయ్య.
పరమాత్మను రాజు, చోటు, కాలం, అని చెప్పడం వేదంలోనూ, భగవద్గీతలోనూ మఱికొన్ని సనాతన రచనల్లోనూ మనకు కనిపిస్తుంది. నిర్బంధం కూడా పరమాత్మే అని అన్నమయ్య అనడం మహోన్నతంగా ఉంది. ఇది గొప్ప అభివ్యక్తి. మానసికంగా ఎంతో ఎదిగిన కవికే ఈ స్థాయి అభివ్యక్తి సాధ్యపడుతుంది. అన్నమయ్యది ఎంతో ఎత్తైన స్థాయి.
ఫలము, ఫలము, ఫలము అంటూ భూమిపై పరమాత్మ శరణమే సఫలము అంటూ ఉన్నతమైన శిల్పంతో ఇదిగో ఈ సత్వ సంకీర్తనను చేశారు అన్నమయ్య.
పరమాత్మను ఫలము అని, ఆ ఫలాన్ని మనల్ని అందుకోమని, ఆ ఫలమే ఫలవంతమైనది అని తెలియజెబుతూ సఫలమైన సంకీర్తనై ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

