ఆ పద ప్రయోగం ఆయనకే సాధ్యం

0
115

అన్నమయ్య‌ అన్నది – 3
(రోచిష్మాన్, 9444012279)

అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగుభాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.

అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా‌ సంవిధానం, ఏ‌ విధమైన చింతన, ఏ విధమైన‌ భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య.

అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!

అన్నమయ్యలోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!

అన్నమయ్య‌ అన్నది మనకై ఉన్నది… స్మరించుకుందాం రా రండి-

(2019లో అంధ్రజ్యోతి నెట్ ఎడిషన్‌లో 32 వారాలు 32 అన్నమయ్య కృతుల ఔన్నత్యాన్ని స్మరించుకున్నాను. వాటిని మళ్లీ ఇప్పుడు మీతో పాటు స్మరించుకుంటున్నాను…)

  • * *

కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు
కుమ్మరింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు

ఒయ్యారమున విభుని వొరపు గనుఁగొని రెప్ప
ముయ్యనేరక మహా మురిపెమునను
కయ్యంపుఁ గూటమికి గాలు దువ్వుచు నెంతె
కొయ్యతనమునఁ దెచ్చుకొన్నదీ వలపు

పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు
తాపమవునని చెలులు దలఁకగానే
తోపు సేయుచుఁ గెంపు దొలఁకుఁ గన్నుల కొనల
కోపగింపుచుఁ దెచ్చుకొన్నదీ వలపు

ఎప్పుడునుఁ బతితోడ నింతేసి మేలములు
ఒప్పదని చెలిగోర నొత్తఁగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌఁగిటఁ గూడి
కొప్పుగులుకుచుఁ దెచ్చుకొన్నదీ వలపు

వేంకటేశ్వరుడి సతి ఇలా, ఇలా వలపు తెచ్చుకున్నది అంటూ ఈ సంకీర్తన చేశారు అన్నమయ్య.

సౌందర్యాన్ని (పగటు) కుమ్మరిస్తూనూ, కఠినత్వం (కొయ్యతనం)తోనూ, కోపగించుకుంటూనూ, కొప్పు కులుకుతూండగానూ ఆమె రకరకాలుగా వలపు తెచ్చుకున్నదట. ఆమె వేర్వేఱు సన్నివేశాల్లో వలపు తెచ్చుకోవాడాన్ని ఇలా కవితాత్మకంగా చెప్పారు అన్నమయ్య.‌ రకరకాల‌ మనః స్థితుల్లో వలపు ఉంటుందని అన్నమయ్య తెలియజేస్తున్నారు. ఎరుపు తొణికే కళ్ల కొనల (గెంపు దొలఁకుఁ గన్నుల కొనల) అనడం మంచి‌ చిత్రణ.‌

“సౌందర్యాన్ని కుమ్మరిస్తూ” అనడం‌ అన్నమయకే చెల్లింది. మఱో సంకీర్తనలో కూడా ఇలాగే “అలరులు(అందాలు) కురియగ” అని అన్నారు అన్నమయ్య.

“పన్నీరు‌ గడు తాపమవునని…” అని అన్నదాంట్లో‌ పన్నీరు ఇవాళ మనకు తెలిసిన‌ గులాబీ పూలతో ఉత్పత్తయ్యే పన్నీరు కాదు. అన్నమయ్య కాలానికి వారి ప్రాంతంలో‌ గులాబీలు లేవు‌. మఱి దేన్ని అన్నమయ్య పన్నీరు అని‌ అన్నారు? అది ‘పని-నీర్’ తమిళ్ష్ పదం. తమిళ్ష్ భాషలో పని అంటే మంచు‌ అని; నీర్ అంటే‌ నీరు అని. పన్నీరు‌ అంటే మంచు‌ నీరు లేదా చల్లని నీరు అని. చల్లని నీరును ఇక్కడ అన్నమయ్య‌ “పన్నీరు” అన్నారు. చల్లని నీరు తాపమవుతుందట! ఎంత గొప్పగా‌ అన్నారు అన్నమయ్య! ఇది చక్కటి విరోధాభాస.

ఈ‌ సంకీర్తన‌ గజల్ రచనా విధానానికి కొంత మేఱకు దగ్గరగా ఉంది. పునరావృతం‌ అవుతున్న “దెచ్చుకున్నదీ వలపు”‌ అన్న భాగం‌ గజల్‌లో ఉండే ‘రదీఫ్’ వంటిది.‌ కుమ్మరింపుచు, కోపగింపుచు, కొప్పుగులుకుచు అన్నవి గజల్‌లో ఉండే ‘కాఫియా’ (rhyme) వంటి పదాలు. ఇలా కాఫియాతో కలిసి రదీఫ్ (పునరావృతం అయ్యే పదాల భాగం) ఉండడం‌ గజల్ ప్రక్రియలో ఉంటుంది. ఈ‌ సంకీర్తన సాంతం గజల్ ప్రక్రియగా లేదు. గజల్‌లోలాగా ఈ సంకీర్తనలోనూ ఇతివృత్తం వలపే.

“మహా మురిపెమునను కయ్యంపు గూటమికి…” అనడం ఎంత బావున్నదో కదా? ఎంతో బావున్నది‌ ఇలా అన్నమయ్య‌ అన్నది.
(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here