మే 30 గుంటూరు శేషేంద్రశర్మ వర్ధంతి
(రోచిష్మాన్, 9444012279)
గుంటూరు శేషేంద్రశర్మ… ‘తెలుగు కవితకు భవిష్యత్తు ఉండాలన్నా, భవిష్యత్తులో తెలుగు కవిత ఉండాలన్నా గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వం ఎంతో అవసరం’. ‘శ్రీశ్రీ కాదు ఇకపై కవిగా గుంటూరు శేషేంద్రశర్మ తెలుగు కవితకు అత్యవసరం’. గత కొన్ని దశాబ్దులుగా కవులు, విమర్శకులు, ఎం.ఫిల్., పీహెచ్.డీల మేధావులవల్ల అతి వికృతమైపోయిన స్థితిలో ఉన్నందున తెలుగు ప్రజలు ఏవగించుకుంటూ కవిత్వాన్ని వదిలించేసుకున్నారు. ఇది క్షేత్రవాస్తవం. ఈ పరిస్థితిలో శేషేంద్రశర్మ కవిత్వం ఆవశ్యకతను మనం గుర్తించాలి. గుంటూరు శేషేంద్ర శర్మ తెలుగులో వచ్చిన నికార్సైన అంతర్జతీయ స్థాయి కవి. అన్నమయ్య, వేమన, తరువాత గత రెండు శతాబ్దుల కాలంలో విశ్వనాథ సత్యనారాయణ, ఉమర్ అలీ షాహ్ వరుసలో తెలుగులో మెరిసిన అంతర్జాతీయస్థాయి కవి గుంటూరు శేషేంద్రశర్మ; అంతర్జాతీయ స్థాయి కవిత్వపు మరో పార్శ్వం శేషేంద్ర. కులం, ప్రాంతీయత, మతం, ఇతర వాద ఉన్మాదాలకు, అసభ్యతకు అతీతమైన నికార్సైన కవిత్వం చెప్పారు శేషేంద్ర. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చదవబడుతూ, ప్రశంసించబడుతున్న భావ సరళి, రచనా సంవిధానం, అభివ్యక్తి శేషేంద్ర కవిత్వంలో పుష్కలంగా ఉన్నాయి.
చండాలోపి మమ గురుః
“చండాలోపి మమ గురుః” అంటూ 20యేళ్ల వయసులో (1946లో, ఆంధ్ర క్రైస్తవ కళాశాల పత్రికలో) ఒక17 పద్యాల కృతిని తన తొలి రచనగా అచ్చుకిచ్చారు శేషేంద్రశర్మ. ఆ పద్య కృతిలో “బాలాబ్జుండు ముఖంబు జేరెను, జటాపాశస్థకూలం కషా / కీలాలంబు కమండలంబున నణంగెన్, రౌద్రకీవమత్ / ఫాలాక్ష్యార్చులు బొందె ధీః ప్రచురతాభాస్వదృగబ్జంబులన్ / బ్రాలేయ ద్యుతి చూడు డిట్టు లవతారం బెత్తె నుర్వీస్థలిన్” అంటూ గొప్పగా చెబుతూ శేషేంద్ర తన ఉనికిని చాటుకున్నారు. శేషేంద్ర తొలి కావ్యరచన సొరాబు. 1947-48లలో రాసిన ఈ కావ్యం 1954లో అచ్చుకొచ్చింది. ఇంగ్లిష్ లో ఆనల్డ్ మేత్యూ(Arnold Matthew 1822-88) రాసిన సొహరాబ్ ఎండ్ రుస్తుం దీనికి మూలం. అయితే సొరాబు కావ్యంలోని సంభాషణాసంవిధానం పాత్ర చిత్రణలు శేషేంద్రవే. ఇందులో అయన పద్యరచనా ప్రకర్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.1996లో ఈ కావ్యాన్ని పునర్ముద్రిస్తున్నప్పుడు అచ్చు తప్పులు దిద్దుకుంటూ శేషేంద్ర తన “ఋతుఘోష పద్యాలకన్నా ఈ పద్యాలే మేలైన”వి అని అన్నారట. ఆ సొరాబులో “తూరుపుఁ గొండ కొమ్ముపయిఁ దోచెను భానుండు, కొండ గోగుల వ్వారిగఁ బూచినట్టుల…” అని తన భావుకతా నైపుణ్యాన్ని ప్రదర్శించారు శేషేంద్ర.
ఫార్సీ కవితాప్రభావం
ఫార్సీ కవితా ప్రభావం శేషేంద్రపై మొదటి నుంచీ ఉంది. సొరాబు ఇతివృత్తం ఫార్సీదే. చంపూ వినోదిని లో “జీవితమే ఒక పూలబాటగా హాయిగ, తీయగ, ఒక ఖయాముగ నీదు హయాము సాగుతన్” అని ఉమర్ ఖయ్యామ్ ప్రసక్తి చేసిన శేషేంద్ర ఋతుఘోషలో ఖయ్యామ్ రుబాయీ వంటి పద్యం చెపారు ఇలా: “ఇంతీ ఓ మధుర స్రవంతి! శశి తానెన్నాళ్ళు తారా పదా / క్రాంతుండై విలసిల్లు నన్నిదినముల్ కాంక్షింప నేదియున్ / సంతోషించిన చాలు నీ మృదు పదచ్ఛాయా సమీరంబులన్ / కాంతా మంగళ కామినై ప్రణయ శాఖా కోకిల స్వామినై”.
విశ్వఘోష
చంపూ వినోదిని (1961), ఋతుఘోష (1962) పక్షులు (1968) సంకలనాల్లో శేషేంద్ర పద్య రచనా ప్రతిభ తళుకులీనుతూంటుంది. ఆ పద్యాల్లో “హేమంతంబున రెక్క విప్పిన గులాబీ పువ్వులాగున్నదే భామా! నీ తనూ రేఖ” అనీ, “నా మనసు శమించుగాక మరుమల్లెలలో చిగురాకు చందమై” అనీ, “కాలపథమందొక యొంటెల బారు వోలె నశ్రాంతము సాగిపోవు ఋతు జాలము జాలము సేయ” అనీ శేషేంద్ర హృద్యంగా అన్నవి కొన్ని హృదయంగమమౌతాయి. ఋతుఘోషను మెచ్చుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ “ఇట్టి రచన చేయగల వారీనాడు పట్టుమని పదిమందియైనను లేరు” అన్నారు. “ఏ గాలికెగసెనో యీ చికిలి తారకలు..” అనీ, “చలి పులివోలె దారుల పచారులు చేయుచుండ” అనీ శేషేంద్ర అనడం మనకు ఈ ఋతుఘోషలో వినిపిస్తుంది. పక్షులు కావ్యంలో “క్రిమి బాధామయ కాళరాత్రికి ఉషః శ్రీ రేఖ జన్మింపదా?” అనీ, “కుల గోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూర క్రియా పీడిత జ్వలిత ప్రాణి చమూ సమూహ మొకటే సత్యంబు” అనీ శేషేంద్ర అనడం వినిపిస్తుంది. ఈ పక్షులు కావ్యంలో చోటు చేసుకున్న విశ్వఘోష అంతర్జాతీయ స్థాయిలో శేషేంద్ర రాసిన తొలి కవిత. శ్రీశ్రీ తప్పితే మరెవరూ ఇలాంటి కవిత రాయలేరు. “శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం” అన్నారు శ్రీశ్రీ శేషేంద్రశర్మ చిత్రణను. ఈ విశ్వఘోష కవితలో “అడగారిన అంబుధి కెరటంలాగై, వేసవికాలపు వాగై, శుక్లపాడ్యమీ వేళా శశిరేఖకు విడుచు నూలు పోగై అణగారిందేమో!” అంటూ శ్రేష్ఠంగా రాశారు శేషేంద్ర. విశ్వఘోష కవిత శేషేంద్ర అంతర్జాతీయ స్థాయిలో రాసిన తొలి కవిత. 1972లో శేషేంద్ర తన మొదటి వచనకవితా సంపుటి శేషజ్యోత్స్నను విడుదల చేశారు. శేషజ్యోత్స్నతో తమ వచనకవితా యాగాన్ని ప్రారంభించి తెలుగు సాహితీ గగనానికి అపూర్వమైన భావనా మేఘాలను రప్పించి విశ్వస్థాయి కవిత్వాన్ని తెలుగులో కురిపించారు శేషేంద్ర. దీనికి పీఠికగా ఆయన రాసిన నేను నా నెమలి లేక నా నెమలి నా నేను అన్న రచన అద్భుతమైన రచనా సంవిధానంతో వెలసిన కవిత. శేషేంద్రను ఒక మహోన్నతమైన కవిగా ప్రపంచానికి తెలియజేసే కవిత అది. కవిత్వంపై శ్రద్ధ, భక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన కవిత అది. “బ్రతుకు సారాంశం చావులో తెలుసుకోవచ్చు” అనీ, “ప్రతి రంగుకు ఒక శబ్దం ఉంది, ప్రతి శబ్దానికి ఒక రంగు ఉంది“ అనీ ఈ కవితలో శేషేంద్ర అంటారు. శేషజ్యోత్స్న నుంచీ కవిగా శేషేంద్ర రెండోదశ తెలియవస్తుంది.

ప్రౌఢిమ
రామరాజభూషణుడు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీలలా పదాల ప్రయోగంలో పదును, ప్రౌఢిమ ఉన్న కవి శేషేంద్ర. “చూతావనీజాత జాతాంకుర ప్రీత చేతః పికీ వ్రాత గీతి పరచె జాలానిలాలోల నీలాలకాజాల హేలావతీ ఖేల లీల మెరసె” వంటి శబ్దతత్త్వ వైదుష్యాన్ని ప్రయోగించారు శేషేంద్ర. “నానా విధానూన సూనాళి రసపాన / పీనాళి కులగాన వేణి మెరసె” అని శేషేంద్ర అన్నది ప్రాణావసాన వేళా జనితం/ నానా గానానూన స్వానా వళితం” అని శ్రీశ్రీ అన్నదాన్ని తలపిస్తూ శబ్దసంపదను సఫలం చేస్తోంది.
ఆధునిక మహాభారతం
శేషజ్యోత్స్న తరువాత శేషేంద్ర మండే సూర్యుడు (1975), నా దేశం నా ప్రజలు (1976), నీరై పారిపోయింది (1977), సముద్రం నా పేరు (1978), ప్రేమలేఖలు (1978), అరుస్తున్న ఆద్మీ (1984) కవితాసంకలనాల్ని ప్రకటించారు. వీటిని పర్వాలుగా చేసి, మౌక్తికపర్వంగా మరి కొన్ని కవితల్నీ కలిపి 1986లో ఆధునిక మహాభారతం విడుదలచేశారు. ఈ ఆధునికమహాభారతంలోని కవిత్వం శేషేంద్ర ఒక అంతర్జాతీయ కవి అని తెలియజెబుతూంటుంది. ఈ ఆధునిక మహాభారతం శేషేంద్ర శర్మ ఉత్కృష్ట రచనా నైపుణ్యానికి ఆకృతి. ఇది 2004లో నొబెల్ (Nobel) బహుమతికి పరిగణించబడింది. ఇందులో “చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది. మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను” అనీ, “కాలాన్ని నా కాగితం చేసుకుంటూ దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా దాని కింద ఊపిరితో నా సంతకం చేస్తా” అనీ, “ఇక్కడ జీవితం ఎవడ్నీ విడిచిపెట్టదు, మనిషి నుంచి మనిషికి నిప్పంటిస్తోంది” అనీ, “నేను చెట్లతో మొరపెట్టుకుంటున్నాను ఆకులు కాదు తుపాకులు కాయండని” అనీ, కవిత్వం ఎర్ర గుర్రంలా పరుగెత్తుకు వస్తోంది- రక్తంలో మునిగిన బాణంలా, వీరుడు వదిలిన ప్రాణంలా”అనీ, నేను చెమట బిందువుని కండల కొండల్లో ఉదయించే లోకబంధువుని” అనీ, ఈ దేశపు గర్భ గుడిలో దేవుడు జీర్ణమైపోయాడు, ఆకలి వేస్తోంది మరో దేవుడి కోసం” అనీ “సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు/ తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు/ పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు” అనీ, “నా చేతులు నా దేశపు ఖడ్గాలు” అనీ “దేవుడు మనిషిని కోల్పోయాడు” అనీ, “నా పాటకు మాటల్లేవు మధురిమే ఉంది” అనీ, “ప్రతి ఆత్మా ఒక రాగమే మనం వినాలే గానీ” అనీ, “చంద్రుడు నా చేతిలో ఉన్నంత వరకూ మాసాలెక్కడికి పోతాయి” అనీ, “పాత చెట్టు కూడా కొత్త పూలు పూస్తుంది” అనీ, “ఒక సెలయేటిలో ఎవడో కవి పడి కరిగిపోయినట్లున్నాడు, ఆ నీళ్లు ఎప్పుడూ కవితలు పాడుతూనే ఉంటాయి” అనీ, పక్షి ఆకాశంలో మాట్లాడేది వ్యాకరణం లేని భాష” అనీ, “నిశ్శబ్దాల నిర్మాణ వాస్తు తెలిసిన వాడు రుషి / శబ్దాలకు రెక్కలిచ్చి నిశ్శబ్దాల్లోకి ఎగరేసేవాడు కవి” అనీ అంటున్నప్పుడు శేషేంద్ర ఒక మహాకవి అన్నది తెలిసిపోతుంది.
విశిష్టమైన కవిత్వం
—————‐——
శేషేంద్ర రాసిన విశ్వఘోష , నేను నా నెమలి లేక నెమలి నా నేను, నీరై పారిపోయింది కృతులు శైలి, శిల్పం, శయ్య, ఇతివృత్తం పరంగా తెలుగు కవిత్వాన్ని విశ్వస్థాయిలో నిలిపేవి. కవిత్వంపట్ల, కవిత్వం రాయడంపట్ల ఆసక్తి ఉన్నవాళ్లు వీటిని తప్పక చదివాలి. చదివి విశిష్టమైన కవిత్వం అంటే, కవిత్వం విశిష్టంగా ఉండడం అంటే ఇదిగో ఇదే అని తెలుసుకోవాలి. నీరై పారిపోయింది ఒక అద్భుత సృజన. కావ్య జగత్తుకు ఆభరణం. నీరై పారిపోయిందిలో ఉన్నది అచ్చమైన, స్వచ్ఛమైన కవిత్వం. 1976లో వచ్చిన ఇది 2076కి మహోన్నత కవిత్వంగా ప్రపంచంలో పదిలమై ఉంటుంది.. శేషేంద్ర విశ్వఘోష , నేను నా నెమలి లేక నా నెమలి నా నేను, నీరై పారిపోయింది రచనలు విశ్వకవిత్వంలో తెలుగు తేజాన్ని పంచే రచనలు. “ఈ దేశానికి నాగలి ప్రతీక” అని చెప్పిన శేషేంద్ర “పని చేసే చేతుల్లో పద్మాలు పూచేదెప్పుడు?” అని అడిగారు. “నా కవిత్వం ఏ జెండాను ఎగరేయదు” అని కవిత్వానికి జెండాలు వద్దని చెప్పకనే చెప్పాక “పద్యం మనిషి విజయానికి ఒక జెండా అయి ఎగరాలి” అని శేషేంద్ర ఆకాంక్షించారు.
విశ్వస్థాయి
శేషేంద్ర “ఏమిటి ఈ చెట్టు నుల్చో ఉన్న మహాసౌందర్యం, దాని రహస్యం ఎక్కడుంది?” అని అడిగి ఖలీల్ జిబ్రాన్‌కు దీటుగా నిలిచారు. “అవి రాళ్లని ఎవర్నారు నోళ్లు మూసుకున్న అంతరాత్మలు” అనీ, “దేవుడు మనిషిని కోల్పోయాడు” అనీ రవీంద్రనాథ్ టాగోర్ స్థాయిలో అన్నారు. మేటి ఫార్సీ కవులకు సాటిగా “ద్రాక్ష పళ్లంత కన్నీటి బిందువులు తింటున్నాను” అని అన్నారు. “నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా” అని అంటూ చైనీస్ కవి లావోచు రీతిని అందిపుచ్చుకున్నారు. “కొందరు పుట్టక ముందే వాళ్ళని గొప్పతనం నిరీక్షిస్తుంది కొందరు చచ్చిన తర్వాత కూడా వాళ్ళని గొప్పతనం పరీక్షిస్తుంది” అని అని షేక్స్‌పిఅర్ పక్కన నిలిచారు. “నా తనువు ఎక్కడ అగ్నిలో కలుస్తుందో అక్కడ మధువు వర్షిస్తుంది నేనిక్కడ కాందిశీకుడ్ని” అంటూ జలాలుద్దీన్ రూమీ కవికి సరిసమానమయ్యారు. “తోటలో ఎగిరే ఇంద్రధనుస్సు ఆ సీతాకోక చిలుక”, “బయట గ్రీష్మ కాలం వస్తువుల్ని ఎండలో స్నానం చేయిస్తోంది”, “అందరూ నిద్రపోయారు గడియాన్ని ఒంటరిగా వదిలిపెట్టి… భయంతో కొట్టుకుంటోంది దాని గుండె”, “గదిలో వత్తి అంటించడం గదిలో వస్తువులకు నీడ లివ్వడమే” వంటి విశ్వస్థాయి వ్యక్తీకరణలతో శేషేంద్ర జాపనీస్ కవిత్వధోరణిని తెలుగులో నమోదు చేశారు.
గజలియత్
————‐–
శేషేంద్ర గజళ్లు రాయలేదు. కానీ ఆయన కవితల్లో
గజలియత్ (గజల్ శైలి, శయ్య) ఉంటుంది. “ధోతితో నాజూకు గజలును ప్రేమిద్దాం”, అనీ “గజల్ గురించి రాద్దామని కూర్చుంటే రాత్రి కవిత్వంతో తడిసిపోయింది” అనీ అన్నారు. ఆపై “నా బాధల్ని మరిచిపోనీకు” అనీ, “ఎందుకు నీకాగుండె నీవు దాన్ని బాధలతో నింపుకోలేకపోతే” అనీ, “మనసు ఇచ్చి గాయాలను మమత కొనుక్కున్నది” అనీ, “మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం” అనీ, “పానశాల నిషాలు బాటసారికేమి తెలుసు?” అనీ, “ప్రేమను గురించి ఉత్ప్రేక్షలు పేనుతూంటే గుండెను కోకిల తన్నుకు పోయింది” అనీ, “ఎన్నిసార్లు గుండె పగలాలో ఒక్క జీవితం దర్శనం ఇవ్వడానికి” అనీ, అంటూ గజళ్లని రాసిన వాళ్లకన్నా మిన్నగా గజలియత్ ఆవిష్కరణ చేశారు శేషేంద్ర.
“వసంతం అంటే అందరికీ తెలీదు కోకిలల్ని కోల్పోయిన కొమ్మలకే తెలుసు పాటల్ని కోల్పోయిన పక్షులకే తెలుసు”, “కోకిల కొమ్మ మీద కూర్చుంటుందేగానీ నేల మీద కూర్చోదు”; “నీవు లేకపోతే నాకు ఆకాశం మాత్రం ఏమవుతుంది? సూర్య చంద్రులు నక్షత్రాలు కలిపిన శూన్యం గాక…”; “ఎందుకలా చూస్తావు గుండెకు నిప్పంటిస్తావు”; “సూర్యుడు పోయిన తరువాత సూర్యుడి దెయ్యంలా వస్తుంది రాత్రి”; “జీవితం మనం అడక్కుండా వచ్చిన సంగరం”; “ఎండలాంటి నా ఊహ శబ్దం మీద పడింది”; “గాయంకంటే మచ్చకు గొంతు హెచ్చు”; “చుక్కల గుంపుల్లో ఉన్నా జాబిల్లి గగనంలో ఒంటరి బాటసారి”; “నీతో ఏవి చెప్పలేకపోయానో అప్పుడు అవి నా పాటల్లోకి వచ్చాయి ఇప్పుడు” ఇటువంటి అభివ్యక్తులు శేషేంద్రకు ఉర్దూ గజల్ తనం లేదా ‘గజలియత్ పై సరైన అవగాహన ఉంది’ అన్న విషయాన్ని తెలియజేస్తాయి. సీ. నారాయణరెడ్డి, మరి కొందరు తెలుగులో గజళ్లు అని రాసిన రచనల్లో ఈ గజలియత్ మచ్చుకైనా కనిపించదు. ఈ నగరం జాబిల్లి పేరుతో ఆంధ్రజ్యోతి వారపత్రికలో తొలిసారి తెలుగులో గజలియత్‌పై అవగాహన కలిగించే వ్యాసాల్ని రాశారు శేషేంద్ర. 1984లో ఆంధ్రజ్యోతిలో సీ.నారాయణ రెడ్డి రాసిన తెలుగు గజళ్లు వరుసగా వచ్చిన తరువాత ఈ నగరం జాబిల్లి వ్యాసాలు ఆ ఆంధ్రజ్యోతిలోనే (1985లో) రావడం గమనించాల్సిన విషయం. సినారె గజళ్లు గజల్ స్థాయి రచనలు కావని తెలిసిపోయాక జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంగానే శేషేంద్ర చేత గజల్‌పై అవగాహన కలిగించే వ్యాసాలను రాయించి ప్రచురించడమైందని అవగతమౌతోంది. ఈ నగరం జాబిల్లి వ్యాసాలను ఇవాళ తెలుగులో గజల్ అని రాస్తున్నవాళ్లు అవగతం చేసుకుని ఉంటే తెలుగులో గజల్‌కు ఇప్పుడున్న దుస్థితి వచ్చేది కాదు.
కవిసేన మేనిఫెస్టో
శేషేంద్ర మరో అద్వితీయమైన రచన 1977లో వచ్చిన కవిసేన మేనిఫెస్టో. ఇందులో ఉన్న విషయాన్ని మరో విధంగా తెలుసుకోవాలంటే ఒక పాఠకుడు విశ్వకవిత్వాన్ని పదేళ్లయినా చదవాల్సి ఉంటుంది. ఇందులో “సాహిత్యరంగంలో సాహిత్య స్పృహ ఉన్నవాళ్లకే సామాజిక స్పృహ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది” అనీ,
“పద్యం ఒక దేవాలయం అందులోకి ప్రవేశించాలంటే శబ్దాలూ, భావాలూ చివరకు దేవుడు కూడా శుభ్రంగా స్నానం చేసి మడికట్టుకుని రావాలి” అనీ అంటారు శేషేంద్ర. అభివ్యక్తి, రచనా సంవిధానం వీటితోనే కవిత్వం ఆవిష్కారమవుతుంది. ఈ సత్యం తెలిసినవారు శేషేంద్ర. మనదేశ కవిత్వాన్నీ, వివిధ దేశాల కవిత్వాన్నీ చాల లోతుగా చదువుకున్నారు ఆయన. విశ్వకవిత్వంపై ఆయనకున్న అవగాహన కవిసేన మేనిఫెస్టోలో వ్యక్తమైంది. కవిత్వం?రాయాలనుకుంటున్న ప్రతి తెలుగువ్యక్తీ శేషేంద్ర రాసిన కవిసేన మేనిఫెస్టో చదవాలి. అందువల్ల తెలుగు కవికీ, కవిత్వానికీ మేలు జరుగుతుంది.
జనవంశమ్
శేషేంద్ర ఆధునిక మహాభారతం తరువాత దానికి అనుబంధంగా 1993లో జనవంశమ్ అన్న సంకలనాన్ని వెలువరించారు. ఇక్కడ అంతకు ముందు రాసిన చంపూ వినోదిని, ఋతుఘోష, పక్షులు కావ్యాలతో పాటు తరువాతి రోజులలో రాసిన పద్యాల్నీ, కవితల్నీ, గేయాల్నీ సంపుటీకరించారు. ఇందులో “ఓ శేషేన్ జైలుకు అలవాటు పడ్ద ఖైదీ!” అని శేషేంద్ర అన్నప్పుడు ఖలీల్ జిబ్రాన్ కవి మనకు గుర్తొస్తారు. ఒక చోట “మీ రక్తం పారబోసి నా కవిత్వం నింపుకోండి” అంటారు. మరో చోట “గాలి చలనం కోల్పోయి వేలాడుతోంది” అని అనడం శేషేంద్ర మాత్రమే చెయ్యగలిగింది. “మనిషిని మనిషే చంపే మతాలవెందుకు/ మనిషిని పశువుగ మార్చే మందిరాలు ఎందుకు” అని శేషేంద్ర అంటున్నప్పుడు ఉమర్ ఖయామ్, మీర్ తకీ మీర్ కవులు గుర్తొస్తారు. “అశ్రువులను తుడవలేని అధికారం ఎందుకు/ నలుగురితో మట్లాడని నాయకత్వమెందుకు” అని ఆయన అన్నప్పుడు చైనా కవి లావ్ ట్సూ గుర్తొస్తారు. “ఇది నా పూర్వుల నేల” అని ఆయన అన్నప్పుడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గుర్తొస్తారు. “సమానతను మార్చేశారు సనాతన స్వప్నంగా” అనీ “కవులకూ, శబ్దాలకూ చెద పట్టింది ఈ దేశంలో” అనీ నిజం చెప్పారు శేషేంద్ర. ‘ఆకలి తన చెమట బొట్లని రాల్చుకోవడం’ చూసిన కవి శేషేంద్ర మాత్రమేనేమో?
శేషేంద్ర తమ కావ్యాలు కొన్నిటిని ఇంగ్లిష్ లోకి అనువదించి ప్రచురించారు.
సినిమా పాట
శేషేంద్ర ముత్యాల ముగ్గు చిత్రంలో ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అన్న పాట రాశారు. ఇదొక్కటే చాలు అయన ఒక గొప్పకవి అని తెలుసుకోవడానికి. తోట నిదురించడం, అందులోకి పాట రావడం అనడం, అది కవిత్వం అవడం… ఒక్క శేషేంద్ర వల్లే సాధ్యం.
కవిత్వానికి పెనుదెబ్బలు
దిగంబర కవిత్వంవల్లా, విప్లవ కవిత్వంవల్లా, కవిత్వంలోకి కమ్యూనిజమ్ చొరబడడంవల్లా,
తెలుగు కవిత్వానికి పెనుదెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలకు తెలుగుకవిత్వం ఎంతో వంకరపోయింది. ఆ దశలోనూ దాశరథి, సీ. నారాయణరెడ్డి వంటి కవులు మంచి కవిత్వాన్ని అందించారు. దశాబ్దుల వారీగా వాద కవిత్వం, మతం కవిత్వం, కులం కవిత్వం, ముఠాల కవిత్వం, ప్రాంతీయతా కవిత్వం అంటూ తెలుగులో అకవిత్వం పెద్ద ఎత్తున మురికిలా పేరుకుపోతోంది. ఏది ప్రక్రియ అవుతుందో, ఏది కాదో తెలియని ‘చదువు’ లేని దుస్థితిలో కులాల ప్రక్రియలు అని కూడా తెలుగులో వచ్చేశాయి. ఇవాళ తెలుగులో ఉచ్చల కవిత్వం కూడా వచ్చేసింది. శివారెడ్డి, గోపి, అఫ్సర్ వంటివాళ్లు కూడా ప్రముఖ కవులైపోయిన దయనీయ స్థితిలో తెలుగు కవిత్వం ఉంది. ‘శుద్ధి అవడం’ (Sanitization), ‘అవగాహన ఏర్పడడం’(Sensitization) అన్నవి ఇప్పుడు తెలుగు కవిత్వానికి అత్యవసరం. అందుకు శేషేంద్ర కవిత్వం కావాలి. శేషేంద్ర కవిత్వం భవిష్యత్తులోనైనా తెలుగులో మంచి కవిత్వం రావడానికి మార్గదర్శకమౌతుంది. కవిత్వం రాయాలి అని కుంటున్నవాళ్లు, కవులం అని అనుకుంటున్నవాళ్లు శేషేంద్ర కవిత్వాన్ని చదివి అర్థం చేసుకోవాలి. “లేమి దెల్ప పెద్దలెవరు లేరో” అని ఒక కీర్తనలో త్యాగయ్య అడుగుతాడు. తెలుగులో కవిత్వం అని వస్తున్న దాంట్లో ఏం లేదో తెలియజెప్పే పెద్దలు గత కొన్ని దశాబ్దులుగా లేకుండాపోయారు. శేషేంద్ర కవిత్వాన్ని ఆకళింపు చేసుకుంటే ఆ లేనిది ఏమిటో అర్థం అవుతుంది. శేషేంద్ర కవిత్వాన్ని అవగతం చేసుకోగలిగితే తెలుగులోనూ అంతర్జాతీయ కవిత్వం చెప్పుకోతగ్గ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది.
కర్తవ్యం
“సాహిత్యానిక్కూడా కుహనా కవుల, కుహనా పండితుల బాధ తప్పదు” అంటారు శేషేంద్ర. ప్రస్తుతం తెలుగును ఆ కుహనా కవులు, కుహనా పండితులు బాధిస్తున్నారు. వీళ్ల బాధను తట్టుకోలేక తెలుగు జనాలు కవిత్వాన్ని వదిలించేసుకుంటున్నారు. “అకవులందరూ కవులనే ధూర్తనామంతో దేశంలో అజ్ఞానాంధకారాన్ని నింపుతున్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దానికి ప్రథమ కర్తవ్యం అధ్యయనము, జ్ఞాననిష్ఠ” అని శేషేంద్ర అన్నారు. శేషేంద్ర కవిత్వాన్ని అధ్యయనం చెయ్యాలి. అనైతిక శక్తులు, అసాంఘీక శక్తులు, చవకబారు వ్యక్తులు, లోకజ్ఞానం లేనివాళ్లు, బూతు వ్యక్తులు కవులైపోయాక?అవాంఛనీయంగానూ, అత్యంత శోచనీయంగానూ ఉన్న ‘తెలుగు కవిత్వానికి మేలు చెయ్యగలిగిన వాటిల్లో శేషేంద్ర కవిత్వం ఒకటి’. ఈ ఎరుకతో తెలుగు కవిత్వం ప్రయోజనాన్ని పొందాల్సిన అవసరం ఉంది.
అంతర్జాతీయ ముద్ర
“నీ గుండె మీద నా ప్రయాణం రాస్తా నా గుండెతో దాని మీద ముద్రవేస్తా” అని అన్న శేషేంద్ర తెలుగు కవిత్వం గుండెపై తన ప్రయాణాన్ని రాశారు, తన గుండెతో దాని మీద ముద్ర వేశారు. అది అంతర్జాతీయ కవిత్వముద్ర. అంతర్జాతీయ కవీ, ఓ గుంటూరు శేషేంద్ర శర్మా, “నీ స్వరాలు ఫలిస్తాయి/ నీ పాటలు నిలుస్తాయి”.
(Author is a prominent literary critic)