కృష్ణా పుష్కర దీపికకు పనిచేసిన విధానం…
రాజమండ్రిలో దివ్యానుభూతి
ఈనాడు – నేను: 17
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
గోదావరి పుష్కరాలకు నేను సేకరించిన శ్లోకాల ప్రభావమో మరేదో కానీ, కృష్ణా పుష్కరాలకు ప్రచురించాలి అనుకున్న కృష్ణా పుష్కర దీపికకు నన్ను, అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా డెస్కులో ఉన్న దామోదర్ ను ఎంపిక చేశారు. పుష్కరాలకు సంబంధించిన వ్యాసాల కూర్పుతో పాటు, కొంత సమాచారం సేకరించే పని కూడా మాకు అప్పగించారు. వాటిలో పుష్కర యాత్రికులకు ఉపయోగపడేలా రైళ్లు, బస్సుల వివరాలు, వాటి సమయాలు, వసతి కోసం చేసిన ఏర్పాట్లు, పుష్కర్ ఘాట్ల వివరాలు, వాటి వద్దకు చేరుకునే అంశాలు, ఉచితంగా పాలు, ఆహారం, ఇతర సౌకర్యాలు లభించే ప్రాంతాలు, ఇలా ఎన్నెన్నో సేకరించాల్సి వచ్చింది. ఈ సేకరణ అంత తేలికేమీ కాదు. సంబంధిత కార్యాలయాలకు వెళ్లడం, అధికారులను కలవడం, కావాల్సిన వివరాలు అడగడం… వారు చెప్పిన రోజుకు వెళ్లడం… ఏ ఒక్క పనీ అనుకున్నట్టు పూర్తి కాదు. కనీసం మూడు సార్లు వెళ్లాల్సి వచ్చేది. ఇలా చేయించడం వెనక కూడా ఒక పరమార్థముంది. రిపోర్టింగ్ ఎలా చెయ్యాలో నేర్పుతుంది. అదే సమయంలో ఒక నిఘా నేత్రం కూడా గమనిస్తుంది. రిపోర్టింగ్ కు వెళ్లిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనిస్తారు. అర్థం.. పరమార్థం కూడా తెలుస్తుంది. కృష్ణా పుష్కర దీపికకు చేసిన పని గంటలు అదనం. రోజుకు అథమ పక్షం పన్నెండు గంటల పని. ఎక్కువ వేతనం ఏమీ ఉండదు. మన ఆసక్తి కొద్దీ చేయడమే. కొత్తగా చేరే సబ్ ఎడిటర్లతో పనిచేయించుకోడానికి వాడే బ్రహ్మాస్త్రం… నీకు ఇంకా పెళ్లి కాలేదుగా… ఇప్పుడే నేర్చుకునేది నేర్చుకోవాలి. ఇంటికెళ్లి చేసేది ఏముంది… వంటి తూటాల్లాంటి మాటలు. పని చెయ్యాలనే ఉత్సాహం ఉన్నవారిని సీనియర్లు ఇట్టే కనిపెడతారు. అప్పుడప్పుడు వారి పనులు చేయించుకున్న వారూ ఉంటారు. ఇది మనం చెప్పే సమాధానం, స్పందన బట్టి ఉంటుంది. చాలా మంది దీనిని ఎక్సప్లోయిట్ చెయ్యడం అంటారు… నేర్చుకునే వాడికి ఇవేమీ పట్టవు. తన పని ఏమిటో అదే.
డెస్కులో ఉండే ఉప సంపాదకుడికీ, బయట తిరిగే రిపోర్టర్ కీ తేడా ఉంటుంది. ఉప సంపాదకుడికి ఎలివేషన్ ఉండదు. బావిలో కప్ప మాదిరి అన్నమాట. రిపోర్టర్ తెచ్చింది, అవసరమైతే తిరగరాయడం, మంచి శీర్షిక పెట్టడం ప్రధాన విధులు. ఆ వార్త వెనుక విషయాలు తెలియవు. ఎంతో అనుభవం ఉంటే మాత్రమే, ఒక వార్తలో ఒక్కొక్క పదం వెనుక అర్థం తెలుస్తుంది. ఒక్క వాక్యం కొందరి జీవితాల్ని తలక్రిందులు చేస్తుంది. (ఇలాంటి వివరాలు ముందు ముందు రాస్తాను). కృష్ణా పుష్కర దీపిక పని పూర్తయ్యింది. ఆ సమయానికి రాజమండ్రిలో ఈనాడు కార్యాలయం సిద్ధమైంది. నేను తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను కాబట్టి, అక్కడికి బదిలీ అయ్యింది. విజయవాడలో ఎంతో సునాయాసంగా పనిచేసిన నాకు, అసలు అనుభవాలన్నీ రాజమండ్రిలోనే ఎదురయ్యాయి. ఇక అసలు విషయంలోకి వస్తాను.
రాజమండ్రిలో పండుగ
ఈనాడులో ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలంటే… అల్లాటప్పాగా సాగదు. దానికో విధానం ఉంటుంది. అదే సిస్టం. ఎన్నో పత్రికలలో లేనిదీ… ఈనాడులో ఉన్నది అదొక్కటే. బృహత్తర కార్యక్రమాలు చేసే ముందు సంస్థలోని సంబంధిత ఉద్యోగుల అభిప్రాయాలను లేదా ఆలోచనలనూ ప్రోది చేయడం ఈనాడుకు ముందు నుంచీ అలవాటు. అవి అసెంబ్లీ ఎన్నికలైనా.. పార్లమెంటు ఎన్నికలైనా… పుష్కరాలైనా.. ప్రత్యేక సంచికలైనా… ఇదే పద్ధతి. ఆఖరికి ఏదైనా ఘోర ప్రమాదం సంభవిస్తే అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సబ్ ఎడిటర్లను సమావేశపరిచి, వార్తా సమర్పణకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఇలాంటి అన్ని సమావేశాలకూ రామోజీరావుగారు నేరుగా హాజరు కాకపోయినప్పటికీ, వాటి సారాంశాన్ని ఆయన ముందుంచుతారు. వచ్చిన సూచనలలో ఉత్తమమైన వాటిని ఆయనే ఎంపిక చేస్తారు. ఆ సూచనలు చేసిన వారికి ప్రశంస లేదా అందుకు అనుగుణమైన బహుమతో గ్యారంటీ. ఓ ఉద్యోగికి అంతకు మించి కావాల్సిందేమిటి? ఇప్పుడు పైన మీకు కనిపిస్తున్న చిత్రం అలాంటిదే. కృష్ణా పుష్కర తరంగిణి ప్రత్యేక సంచిక కోసం పనిచేసినందుకు రామోజీ రావుగారు స్వయంగా నాకు బహుమతిని అందిస్తున్న దృశ్యమిది.
ఇక్కడ కూడా ఓ ట్విస్టుంది.
అదేమిటంటరా.. 1992 నవంబర్‌లో రాజమండ్రి యూనిట్ ప్రారంభమైన తరవాత రామోజీరావు గారితో మొదటి సమీక్ష సమావేశం. ఆ రోజు రాత్రి రామోజీరావుగారు… జనరల్ డెస్క్‌కువచ్చి కూర్చున్నారు. అది నేనెప్పుడూ చూడని, ఎరుగని సన్నివేశం. ఎప్పుడూ ఆయన చాంబర్‌కు వెళ్ళి మాట్లాడాల్సిందే ఎవరైనా.. లేకపోతే సమావేశ మందిరంలో కలవాల్సిందే. ఆయన ఎందుకొచ్చి కూర్చున్నారో నాకు తెలియదు. కొద్దిసేపటికి మేనేజర్ జివి రావుగారు… ఈనాడు పేపర్ సైజులో ఉన్న ఒక ఫైలు(దస్త్రం)ను ఆయన ముందుంచారు. రామోజీరావు గారు దానిని ఆసాంతం పరిశీలించి, తెలుగులో దస్కతు(సంతకం) చేశారు. అప్పుడు నా సీనియర్ పి.ఎస్.ఆర్. గారు చెప్పారు. దాన్ని ప్రింట్ ఆర్డర్ అంటారనీ, ప్రతి యూనిట్ ప్రారంభోత్సవానికీ ముందు రామోజీరావుగారు దానిపై సంతకం చేసి, పత్రిక ప్రచురణను ప్రారంభిస్తారనీ… బాగుంది… ఒక కొత్త విషయం తెలిసింది.
ఆ పని పూర్తయ్యాక… ఆయన సీటు నుంచి లేచారు.. అంతా కలియతిరిగారు. మెట్ల మార్గం గుండా కిందకు దిగారు. రండయ్యా! అనడంతో అందరం వెళ్ళాము. అక్కడ… ముద్రణ యంత్రాలు రేసు గుర్రాల్లా తళతళా మెరుస్తున్నాయి. కళ్ళెం బిగించి ఉన్నట్లు మధ్యలో… సైరన్లు.. నన్నొదిలిపెడితే ప్రతాపం చూపిస్తానంటున్నట్లు శబ్దాలు.. అన్ని యంత్రాలనూ పరికించిన తరవాత ఆయన సమయం చూసుకున్నారు. మీరనుకున్నట్లు ముహూర్తం కాదు.. ప్రింటింగ్ మొదలు పెట్టాల్సిన సమయం.. 12.16 నిముషాలు. ఒక మిషన్ దగ్గరకు వెళ్ళి ఆకుపచ్చగా ఉన్న బటన్ వత్తారు. అంతే ఒక్కసారిగా మిషన్లు పనిచేయడం ప్రారంభించాయి. ఎక్కడికక్కడ ప్రింటింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగులు ముద్రితమై వచ్చిన పేపర్లను చూస్తూ… రంగుల కలయికను మారుస్తూ సరి చూసుకుంటున్నారు. అప్పుడు అందించారు.. రామోజీరావుగారికి మొదటి కాపీ…. ఈనాడు రాజమండ్రి నుంచి వెలువడిన ఫస్ట్ కాపీ..
ఆయన మొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మెషిన్ సెక్షన్ వారు ఈలోగా ఒక కేకును తెచ్చారు. ఆయనతో కోయించారు. ఆయన కేకును గుప్పెటతో పట్టుకుని కనిపించిన వారిని దగ్గరకు తీసుకుని నోట్లో కుక్కడమే… ఆనందమే ఆనందం. నేను ఈనాడులో చూసిన మహత్తరమైన ఆనందకరమైన రోజది. అప్పటి జనరల్ డెస్క్ ఇన్చార్జి పి. శ్రీనివాసరావుగారినీ, సెకండ్ ఇన్చార్జి మల్లికార్జునరావుగారినీ, మేనేజర్ జీవీ రావుగారిని హత్తుకుని మరీ కేకు తినిపించారు. అలాగే ఫొటోలు కూడా తీయించుకున్నారు. కొత్తవారిమవడంతో మాకు ఆ అవకాశం రాలేదు… కాదు.. కాదు.. ఆ హడావిడిలో మేము ఆయన దగ్గరకు చేరలేకపోయాం. ఆనందోత్సాహాలతో సాగింది ఆ వేడుక. ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఒకటుంది.
వసుంధర….
మహిళల కోసం ఈనాడు కానుక… ప్రత్యేక పేజీ వసుంధర.. రాజమండ్రి యూనిట్‌తోనే ప్రారంభం కావడం గర్వకారణం. పేపరు చూసే వరకూ ఆ విషయం ఇన్చార్జిలకు తప్ప వేరెవరికీ తెలీదు. అంత రహస్యంగా ఈనాడులో వ్యవహారాలు సాగిపోతాయి… (మంచైనా.. చెడైనా…). వెలుగు చూసే రోజు వచ్చే వరకూ అవి మూడో కంటికి తెలియవు. వసుంధర పేజీ స్ఫూర్తిదాయకమైన కథనాలకు వేదిక. మహిళకు కరదీపిక. ముగ్గుల నుంచి స్వయం ఉపాధి వరకూ అందరితో చదివించే కథనాలు. ఫుల్ పేజీని రంగులద్ది అందించడంతో మరింత పాఠకాదరణ పొందింది. కరోనా తరవాత అది కుంచించుకుపోయింది. అది వేరే విషయం. వసుంధర అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక రెండేళ్ల క్రితం సుధా మూర్తి గారు రెండు కొమ్ముల ఋషి అనే పుస్తకాన్ని తెలుగులో ప్రచురించారు. ఆ పుస్తకావిష్కరణకు ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావును ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ సభలో ఆయన వసుంధర పేజీ గురించి… అందులోని కథనాలను గురించి సవివరంగా చెప్పారు. పఠనాసక్తి తగ్గిపోతున్న ఈ తరుణంలో ఇలాంటి ప్రయత్నాలు కొంతైన మేలు చేస్తాయి అనేది ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు.
మరుసటి రోజు మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతా ఆనందంగా, ఆహ్లాదంగా చెణుకులతో సాగింది. బాగా చేయండి.. ఈనాడు పేరుప్రతిష్టలను పెంచండని చెప్పారు రామోజీరావుగారు. సమావేశం ముగిసింది. ఆయన గదిలోకి వెళ్లారు. అంతా బయటకొచ్చేశాం. ఈలోగా లోపలి నుంచి ఒక వ్యక్తి వచ్చి సుబ్రహ్మణ్యం గారు రామోజీరావు గారు మిమ్మల్ని ఆగమన్నారు…. అని చెప్పారు. గుండెల్లో రాయి పడింది. ఏమిటిది… నన్నే ఎందుకు ఆగమంటున్నారు. కొద్దిసేపు భయం… ఈలోగా… ఒక అయిదు నిమిషాల్లో లోపలి నుంచి పిలుపు.. నా వెనకే ఫొటోగ్రాఫర్… ఆ వెనకే దామోదర్.. పశ్చిమ గోదావరి జిల్లా డెస్క్ సభ్యుడు. ఇద్దరికీ అర్థం కాలేదు. ఏంటని అడిగాడు… నాకేం తెలీదన్నాను.
ఈలోగా రామోజీరావుగారు లోపల నుంచి వచ్చారు. గుండె గబగబా కొట్టుకుంది.. ఆయన మొహం కూడా కొంచెం సీరియస్‌గా ఉంది. వస్తూనే.. ఇద్దరితోనూ కరచాలనం చేశారు. ఈలోగా మేనేజర్ గారు లోపలి నుంచి రెండు ప్యాకెట్లతో వచ్చారు. ఒకటి విప్పారు. రామోజీరావుగారికి అందించారు. ఆయన నన్ను తన దగ్గరికి పిలిచారు. వెల్‌డన్ కృష్ణా పుష్కరాలకి బాగా చేశారు. అంటూ మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ జ్ఞాపికను అందించారు. తీసుకుని వెళ్ళబోతుంటే చేయిపట్టుకుని ఆపి అటు చూడన్నారు. అలా చూసే లోగానే ఫొటోగ్రాఫర్ కెమెరా క్లిక్‌మనిపించారు. అదే పైన ఉన్న చిత్రం. నా జీవితంలో మరపురాని ఘట్టం. ఎందరికో కాని దక్కని అదృష్టం నాకు దక్కింది. ఆ అనుభూతి ఇప్పటికీ నాలో సజీవంగానే ఉంది.. ఉంటుంది..కూడా.. అప్పుడు చూశారా.. జుట్టు ఎంతుందో.. ఆ చిత్రం చూసిన వారు ఇప్పుడు నన్ను చూస్తే గుర్తుపట్టలేరు.
ఆ చిత్రాన్ని లామినేట్ చేయించుకుని పదిల పరచుకున్నాను.
మరో మూడునెలలు గిర్రున తిరిగాయి.. మళ్ళీ ఆ రోజు అదే సమీక్ష సమావేశం రోజు రానే వచ్చింది. పరమాన్నం తింటుంటే పంటికింద రాయి పడ్డట్టు అంతకుముందు రోజే ఓ అపశృతి. ఫలితాన్ని ఆ సమావేశంలోనే చూశాం.. అదేమిటో తెలుసుకోవాలంటే రేపటిదాకా ఆగాల్సిందే…