(మహాదేవ్, 9490646306)
సినిమా అనేది ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యాపారాత్మక కళ – డబ్బులు తీసుకుని, వస్తువు కి బదులుగా కేవలం ఒక కొత్త అనుభూతి ని ఇచ్చి, మనల్ని అందరిని ఆలోచింప చేస్తుంది.
ఒక మంచి సినిమా అనేక భావోద్వేగాల సమ్మేళనం.
సినిమా రంగం అనే ఈ అద్భుతమైన రంగుల ప్రపంచంలో ఎంతోమంది నటులు అవ్వాలి అని కన్నవారిని, ఉన్న ఊరిని వదిలేసి వచ్చి కష్టపడుతూ ఉంటారు – కొందరు నటులు అవుతారు, కొందరు వెనక్కి వెళ్తారు. మరికొందరు తారలుగా ఎదుగుతారు.
ఆలోచించారా ?
సినీ వినీలాకాశం లో ఎందుకు కొందరే నటులు తారలు గా మన ముందు వెలుగుతున్నారు ?
కొన్ని వేల మంది నటుల్లో, కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టే నటులే ఎందుకు మన మదిలో చెరగని ముద్ర వేస్తున్నారు ?
ఎప్పుడు అయినా ఆలోచించారా ?
దీనికి జవాబు వినడానికి చాలా సులభమైంది, కానీ ఒక నటుడికి చాలా కష్టమైంది.
అసలు నటుడు యొక్క కర్తవ్యం – రచయుత లేదా దర్శకుడు ప్రేక్షకులకు రసోత్పాదన కలిగేలా ఊహించి రాసిన సన్నివేశం లోని భావోద్వేగాన్ని ముందు తను అనుభవించి, ఆ అనుభూతి ని ప్రేక్షకుడు కూడా 100 శాతం అనుభవించేలా చేర్చగలిగే ఒకే ఒక్క మాధ్యమం (medium or transmitter).
అలా చేయగలిగే ఉత్తమమైన నటులు ఖచ్చితంగా వేళ్ళ మీదనే ఉంటారు..
ఒక పాత్రలా నటనని ప్రదర్శించడం వేరు, పాత్రలా జీవించడం వేరు.
Don’t act – Just behave.
కేవలం నవ రసాలుని ప్రదర్శన కోసం నటించడం కాదు నటుడు చెయ్యాల్సిన పని, సాధ్యమైనంత వరకు వాటిని నిజ జీవితంలో కూడా అనుభవించడానికి ప్రయత్నించి తన జ్ఞాపకాల దొంతరలో పదిలంగా దాచుకోవాలి.
సరైన సమయం వచ్చినప్పుడు తన అనుభవాల అమ్ములపొది లోంచి వాటిని తీసి ప్రేక్షకుడి హృదయాల పై సమ్మోహనాస్త్రాలుగా మలచాలి.
అందుకే జీవితం లో అనేక ఆటు పోట్లు, ఒడు దొడుకులు ఎదుర్కొంటూ ఎదిగిన నటుల నటన అత్యంత సహజంగా అనిపిస్తుంది.
Greatest art comes from the greatest pain.
అప్పుడు నటన లో ఎక్కడా plasticity అనేది ఉండదు.
నటుడు నటించాడా ? జీవించాడా ! అనే సందిగ్ధం లో సన్నివేశాలు అయిపోతాయి.
అందుకే నటుడు వీలు అయినంతవరకు ప్రజలతో మమేకం అవుతూ అనుభవాలు పోజేసుకోవాలి.
కొసరు మాట :
భారత దేశం గర్వించ దగ్గ నటుడు అమీర్ ఖాన్ ఎప్పుడూ ఒక మాట చెప్తారు – నటుడు అవ్వాలి అంటే ఏ ఇన్స్టిట్యూట్ లోను చేరకండి.
ఒక సంవత్సరం పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బ్యాక్ పాక్ వేసుకుని ప్రయాణం చెయ్యండి చాలు..
ఈ ప్రయాణం లో ఎంతో మందిని కలుస్తారు,వారిలో ఎన్నో పాత్రలు కనపడతాయి..మరెన్నో అనుభవాలు మీకు తోడు అవుతాయి..
అవి చాలు మిమ్మల్ని ఉత్తమమైన నటుడిని చెయ్యడానికి అని.

(Author is a Tollywood Actor)