గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

Date:

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు
(డా. పురాణపండ వైజయంతి)

మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే చాలు కావలసిన ప్రదేశానికి, అంశం దగ్గరకు వెళ్లిపోతాం. ఈ మౌస్‌ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ మౌస్‌దే ఆధిపత్యం. అదే ఎలుక. వినాయకుని వాహనం అయిన ఎలుక ఎక్కడికి కావాలంటే అక్కడకు వినాయకుడిని తీసుకువెళ్లేది. వినాయకుడంటే పిల్లలకి మహాప్రీతి. వినాయక చవితిని అమితానందంతో జరుపుకుంటారు పిల్లలు. అందుకే ఇది పిల్లల పండుగ.
తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌
కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల ఒజ్జౖయె
యుండెడి పార్వతీ తనయయోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌
అంటూ పిల్లలు గణేశుని ప్రార్థిస్తారు.
ఏ పని ప్రారంభించినా ఆటంకం కలగకూడదని ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తారు. అలాగే పిల్లలు వినాయకచవితి పండగంటే ఎంతో సంబరంగా ముందు నుంచే సిద్ధమౌతారు. వినాయకుడంటే పిల్లలకి ఇష్టం, ఆయనని స్నేహితుడిగా భావిస్తారు. పండగనాడు పిల్లలు ఎంతో సంతోషంగా పొద్దున్నే నిద్రలేచి గబగబ స్నానాలు చేసి, వినాయకుడితో పాటు ఆ గదిని ఎంతో అందంగా అలంకరిస్తారు. వినాయకుడి పుట్టినరోజంటే పిల్లలకి అంత క్రేజ్‌ మరి. బ్యాగులో ఉన్న పుస్తకాలని బయటకు తీసి మొదటి పేజీ మీద పసుపుతో స్వస్తిక్‌ గుర్తును రాసి ఆయన ముందుంచి పూజ చేస్తే చదువు బాగా వస్తుందని నమ్ముతారు. అంత ఇష్టంగా చేసుకునే పండుగ గురించి, అందులోని అంతరార్థాన్ని పెద్దలు పిల్లలకు వివరించి చెప్పాలి.
జ్ఞానాకృతి
వినాయకుడి ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏనుగు తల, పెద్దబొజ్జ, పొట్టి రూపం ఇలా ఉంటాడు. అయితేనేం ఆ శరీరం పిల్లలకి మంచి సందేశాన్నిస్తుంది. వినాయకుని శరీరంలోని ప్రతిభాగం ఒక్కొక్క అంశాన్ని ప్రతిబింబిస్తుంది.

  1. ఆటంకాలను తొలగించే తల
  2. చిన్నచిన్న విషయాలను కూడా గ్రహించగల శక్తిని కలిగిన చిన్న కళ్లు
  3. అన్ని విషయాలను శ్రద్ధగా వినే పెద్ద చెవులు
  4. తమ మీద తమకు గౌరవం కలగడానికి చిహ్నంగా తుండం
  5. అతి తక్కువగా మాట్లాడమని సూచించే నోరు
  6. అమితమైన జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పే పెద్దబొజ్జ
  7. ధర్మం, అర్థం, కామం, మోక్షం సాధించడానికి నాలుగు చేతులు
  8. కోరికలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతీకగా ఎలుక వాహనం
    వినాయకుడి రూపంలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇవి తెలియాలి కనుక వినాయక పూజ చేయమని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అలవాటు చేస్తారు. పిల్లలు చదువుకునేటప్పుడు ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. వాటిని అధిగమించడానికి వినాయకుని తలను పూజించాలి. చిన్నచిన్న విషయాలను జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకోవాలి. ఆ శక్తికోసం వినాయకుని చిన్న చిన్న కళ్లను పూజించాలి. అన్ని విషయాలను ఏకాగ్రతతో వినడానికి వినాయకుని ఉన్న చేటంత చెవులను పూజించాలి. వినాయకునికి ఉండే తుండం ఆత్మగౌరవానికి నిదర్శనం. పిల్లలు ఎప్పుడూ తమను తాము కించపరచుకోకుండా ఉండే లక్షణం కోసం తుండాన్ని పూజించాలి. అంత పెద్ద వినాయకుడికి నోరుమాత్రం చాలా చిన్నది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కనుక ఆ లక్షణాన్ని వినాయకుని ద్వారా తెలుసుకోవడానికి నోటిని పూజించాలి. వినాయకుడిది పెద్ద బొజ్జ. అది అధిక జ్ఞానాన్ని ఆర్జించడానికి గుర్తు. చదువుకునేటప్పుడు, ‘నేర్చుకున్నది చాలులే’ అని తృప్తిచెందకూడదు. మరి కాస్త నేర్చుకుని విజ్ఞానవంతులు కావాలి. అందుకోసం వినాయకుడి బొజ్జను తప్పనిసరిగా పూజించాలి. ధర్మార్థకామమోక్షాలు సాధించడానికి ఆయనకున్న నాలుగు చేతులను అర్చించాలి. అన్నిటికంటే విచిత్రమయిన విషయం వినాయకుడి వాహనం. మిగతా దేవతల వాహనాలతో పోలిస్తే అతి సామాన్యమైన వాహనం. అదే ఎలుక. అనవసరమైన కోర్కెలను అదుపులో ఉంచుకోమని చెప్పడానికి ఇది ప్రతీక. అందుకే ఆ ఎలుకను కూడా తప్పనిసరిగా ప్రార్థించాలి. పని ప్రారంభించినప్పుడు అందులో ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. అయితే వాటికి కుంగిపోకుండా, మనోబలం చేకూరాలంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ధ్యానించాలి.
  9. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
    దలచితినే హేరంబుని దలచిన నావిఘ్నములను తొలగుట కొరకున్‌
    వివిధ రూపాల్లో గణపతి
    పిల్లలకి ఆయనంటే ఎంతో ఇష్టం, చనువు కాబట్టి ఆయన విగ్రహాన్ని రకరకాలుగా తయారుచేసుకుంటారు. కంప్యూటర్‌ ముందు కూర్చున్న వినాయకుడు, రకరకాల కూరగాయలతో వినాయకుడు, ఆకులతో, పండ్లతో, డ్రైఫ్రూట్స్‌తో… ఎవరికి తోచిన ఆకృతిలో వారు ఆ గణనాయకుని పూజిస్తారు. అంతేకాక నేపాల్, చైనా, జపాన్, జావా దేశాలలో, ఇంకా జైన బౌద్ధులు సైతం వినాయకుడిని కొలుస్తారు.
  10. సామాన్యజీవనానికి అధిపతి విఘ్నేశ్వరుడు
    విఘ్నాధిపత్యం కోసం ముల్లోకాలలోని నదులలో స్నానం చేసి ముందుగా ఎవరు వస్తారో వారిని గణాధ్యక్షుని చేస్తానని పరమేశ్వరుడు కుమారస్వామి, వినాయకుల మధ్య పోటీ పెట్టాడు. కుమారస్వామి నెమలి వాహనం మీద వేగంగా వెళ్లిపోయాడు. వినాయకుడిది ఎలుక వాహనం. దానికి తోడు కదలలేని శరీరం. ఏం చేయాలో తోచలేదు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలుసుకున్నాడు. వెంటనే రెండుచేతులూ జోడించి పార్వతీపరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. కుమారస్వామి ఏ నదిలో స్నానం చేసినా తన కంటె ముందుగా స్నానం చేసి వస్తున్న వినాయకుడిని చూసి కుమారస్వామి, విషయం తెలుసుకుని సిగ్గుతో తల వంచుకున్నాడు. తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలుసుకున్నాడు. అందుకే పిల్లలు తల్లిదండ్రులను దేవుడిగా భావించితే ప్రపంచంలో సాధించలేనిదంటూ లేదని ఈ కథ చెబుతుంది.

  11. స్వస్తిక్‌ రాయడానికి కారణాలు
    స్వస్తిక్‌ అంటే శుభాన్ని కలిగించేది. పండుగల సందర్భాల్లో రకరకాల శుభసూచక చిహ్నాలను ముగ్గుల రూపంలో వేస్తుంటారు. అవి పిల్లలకు పండుగలొస్తున్నాయని సూచిస్తాయి. యంత్రశాస్త్రంలో స్వస్తిక్‌ గణపతి ఆధిపత్యాన్ని చూపిస్తుంది. పని నిర్విఘనగా కొనసగించడానికి ఈ చిహ్నం వేస్తారు. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది.
  12. గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుక దీనిని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుంది కనుక దానిని పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగా కూడా ఉండేదట. వ్యాపారాలు చేసేవారు గణపతి తమకు కాపుగా ఉండాలని ఈ చిహ్నాన్ని గీస్తారు.
    విద్యార్థులకు విద్యాసంపాదన ప్రధానం. విద్యలకు అధిపతిగా వినాయకుని చెప్పారు. నిర్విఘ్నంగా విద్య కొనసాగాలని, బుద్ధి వికసించాలని విద్యార్థులు తమ పుస్తకాల మీద పసుపుతో ఈ చిహ్నాన్ని రాసి పూజిస్తారు.
    పూజ పత్రిలో బోటనీ పాఠం
  13. 21 రకాల ఓషధీ గుణాలు కలిగిన ఆకులతో వినాయకుని పూజిస్తారు. పత్రి అంటే ఆకులు అని అర్థం. గణపతిని ఆకులతో పూజించాలే కాని కొమ్మలతో కాదు. ఈ ఆకులను పిల్లలే స్వయంగా వెళ్లి తుంపాలి. శాస్త్రం చెప్పిన 21 రకాల పత్రులను మాత్రమే తేవాలి. వీటి ద్వారా విద్యార్థులకు ఆయా చెట్ల పేర్లు, వాటి ఆకృతులు తెలుస్తాయి. తద్వారా జీవశాస్త్రాన్ని (బోటనీ) అర్థం చేసుకుంటారు. పిల్లలకి ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా భాద్రపదమాసంలో ఓషధులు అప్పుడే భూమిలోంచి బయటకు వచ్చి సజీవంగా ఉంటాయి. మిగతా దేవుళ్లలాగ ఈయనకు ఘనమైన పూజ అవసరం లేదు. 21 రకాల గరికతో పూజించే వీటిలో ఒక్కోదానిలో ఒక్కో రకమైన వ్యాధిని నిర్మూలించే లక్షణం ఉంది. వానల వల్ల ఏర్పడిన తడి కారణంగా వచ్చే వ్యాధులన్నీ ఈ గరికతో నిర్మూలనమౌతాయి.
    సామాన్య గణపతితో జాగ్రఫీ, ఆరోగ్యం
    వినాయకుడు భూతత్వాన్ని బోధిస్తాడు. పండగ దగ్గర పడుతోందంటే పిల్లలు చెరువు గట్లకు, కాలవ గట్లకు వెళ్లి మట్టి సేకరించి వాటితో వినాయక ప్రతిమ తయారుచేస్తారు. దీని ద్వారా మట్టిని గురించి తెలుసుకుంటారు. ఈ పండుగ నాడు ప్రసాదాలు ఘాటుగా, వికారాన్ని కలిగించేవిగా కాక ఆరోగ్యకరమైనవి తయారుచేస్తారు. కేవలం ఆవిరి మీద ఉడకపెట్టిన వాటినే ప్రసాదంగా స్వీకరిస్తాడు వినాయకుడు. అదే సాత్వికమైన ఆహారం. జీర్ణక్రియను పాడుచేయదు.
    అటుకులు, కొబ్బరి పలుకులు, చిటి బెల్లము నానుబ్రాలు చెఱకురసంబున్‌
    నిటలాక్షునగ్ర సుతునకు పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్‌
    వినాయకుడు – నిరాడంబరత్వం
    అందరిలోకీ నిరాడంబరుడు వినాయకుడు. గణనాయకుడు అయినప్పటికీ సామాన్య జీవితాన్ని ఇష్టపడినవాడు గణనాథుడు. అందుకే ఆయన నుంచి పిల్లలు సామాన్య జీవన విధానాన్ని అలవరచుకోవడానికి ఆయనన పూజించాలి. గాంధీజీ వంటివారు నిరాడంబర జీవితం గడిపారంటే అందుకు వినాయకుడే ఆదర్శం. చిన్నతనంలో పిల్లలకి అన్నీ కావాలనిపిస్తుంది. ఏది అవసరమో, ఏది అనవసరమో వారికి తెలియదు. చూసిన ప్రతిదీ మనసుకి కావాలనిసిస్తుంది. అందుకే వినాయకుని రోల్‌మోడల్‌గా చేసి పిల్లలకి చూపించాలి. ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని పిల్లలు చిన్నప్పటి నుంచే నిరాడంబర జీవితాన్ని గడపడానికి అలవాటు పడతారు. వినాయకతత్త్వం దేశభక్తి, సంస్కృతి పట్ల ప్రేమ, భక్తి, మన చుట్టూ ఇన్ని విలువైన వస్తువులున్నాయని తెలియచేస్తుంది. తద్వారా మన నేల గొప్పదనం, ఆత్మీయత, నిరాడంబర జీవితం పిల్లలు తెలుసుకోగలుగుతారు.
    పెద్దలను గౌరవించాలి
    తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. గణాధ్యక్షుడయ్యాడు. కుమారస్వామి అహంకారం కారణంగా శక్తి ఉన్నప్పటికీ గణాధ్యక్ష పదవి కోల్పోయాడు. పెద్దల సన్నిధిలో ఉండటం వల్ల ఎలా లాభం పొందుతారో ఈ కథ చెబుతుంది. అంతేకాక ఎప్పుడు పడితే అప్పుడు అనవసరంగా పెద్దలను చూసి నవ్వడం వలన అపనిందలను ఎదుర్కోవలసి వస్తుందని చంద్రుడి కథ ద్వారా తెలుస్తుంది. పరుల సంపదలకు ఆశపడకూడదని శమంతకమణి కథ చెబుతుంది. తెల్లని వస్త్రాలు, పరిశుభ్రత, ప్రశాంతత వంటి అంశాలను వినాయకుని వేషధారణ తెలియచేస్తుంది. మంచి వస్త్రధారణ, చిరునవ్వులు చిందించే ప్రశాంత వదనం తో ఏ పనులు ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతాయని గణేశుని ద్వారా తెలుస్తుంది.
    వినాయకుడే ఒక చదువు. ఆయన పూజకు చేసే ప్రతిపనిలో విద్య ఉంది. అందుకే చదువుకునే పిల్లలు వినాయకుని పూజించాలి. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనంత గొప్పవారవ్వాలి.
    అవిఘ్నమస్తు.
    గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశక
    వినాయక ఈశతనయ సర్వసిద్ధి ప్రదాయక
    (వినాయక చవితి సందర్భంగా గణేశుని విశేషాల సమాహారం ఇది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...

మన మౌనం ధర్మ వినాశనానికి దారివ్వకూడదు: పవన్ కళ్యాణ్

విజయవాడ, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన...

తిరుపతి లడ్డు వివాదం ..సమాధానం చెప్పవలసింది ఎవరు?

అపరిమిత అధికారాలిచ్చిన ఫలితం ఇది…(శివ రాచర్ల)సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు....