జాతకం పుస్తకం చూసి ఆశ్చర్య పోయాను
ఈనాడు – నేను: 5
(సుబ్రహ్మణ్యం వి.ఎస్.కూచిమంచి)
మా తాతగారు ఇచ్చిన జాతకం పుస్తకాన్ని తెరిచి చూసి నిరుత్తరుడినైపోయాను. ఎందుకంటారా… అందులో ఇలా రాసి ఉంది..
నైన్టీన్ ఎయిటీనైన్ ఏప్రిల్ ట్వెంటీ ఫిఫ్త్: గెటింగ్ జాబ్ ఇన్ ఈనాడు.
నైన్టీన్ నైన్‌టీ ఫిబ్రవరి: మ్యారేజ్
నైన్టీన్ నైన్టీ వన్: ఫిమేల్ చైల్డ్
నైన్టీన్ నైన్టీ టూ: మేల్ చైల్డ్..
నైన్టీన్ నైన్టీ టూ: ట్రాన్సఫర్ టు రాజమండ్రి
టూ థౌజండ్: ట్రాన్స్‌ఫర్ టు హైదరాబాద్…
ఎప్పుడు రాశారిది? 1974కు ముందు రాసి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికి ఈనాడు పుట్టలేదు. ఆ తరవాత రాసి ఉంటారా… అదే అనుమానంతో అడిగా ఆయన్ని. ఇంత కచ్చితంగా ఎలా.. ఎప్పుడు రాశారని.. నా జాతక చక్రాన్ని ఆయన 1961లోనే రాశారు. ఆపై వివరాలను 1986లో రాశారు. దీని గురించి చెప్పాలంటే వ్యక్తిగతమవుతుంది. అది అందరికీ ఆసక్తి ఉండకపోవచ్చు. ఇక ఆ శషబిషలకి స్వస్తి చెప్పి.. చలో విజయవాడకు సన్నద్ధంకావడం మొదలుపెట్టా.
1989 ఏప్రిల్ 23 ఉదయం కందుకూరు వెళ్ళి అక్కడ జాయినింగ్ టెలిగ్రామ్ తీసుకుని 24 ఉదయానికి విజయవాడ చేరా. 25 ఉదయం 10గంటలకల్లా బెంజ్ సర్కిల్ దగ్గర్లో ఉన్న ఈనాడు కార్యాలయానికి చేరా. అప్పటికే మోటూరి వెంకటేశ్వరరావు(న్యూస్‌టుడే డైరెక్టర్) గారు వచ్చేశారు. లోపలికి అడుగుపెట్టిన నన్ను చూడడంతోనే ఆయన ఎదురొచ్చి రారా అంటూ సాదరంగా తీసుకెళ్ళారు. వెంటనే అసిస్టెంట్ నాగరాజును పిలిచి, జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేయించారు. రూమెక్కడ తీసుకుంటావ్! ఆయన వేసిన మొదటి ప్రశ్న.
ఇంకా చూడలేదండి. చూడాలి
(Moturi Venkateswararao garu, First Director of Newstoday division, Eenadu, Vijayawada)
అవసరమైతే చెప్పు.. మీ కొలీగ్స్‌కి అప్పజెప్పుతానని భరోసా ఇచ్చారు.
అప్పటికి సమయం 12. భోజనం చేసి వచ్చేయ్యమన్నారు.
ఒంటి గంటకల్లా మళ్ళీ ఆయన ముందు వాలాను.
ఒకటిన్నరకి నా సీనియర్లు రావడం మొదలైంది.
బాయ్‌ని పిలిచి శీనుని రమ్మను అంటూ చెప్పారు.
నల్లగా పొట్టిగా..సన్నగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు.
(Pamuri Srinivasarao, My Guru in Eenadu. He was the then Desk InCharge of combined Godavari districts Mini Edition)
ఒకటే సిగరెట్ వాసన.. గుప్పుమని వచ్చింది.
ఇతను సుబ్రహ్మణ్యం..
మీ డెస్కుకి ఇస్తున్నాను.
జాగ్రత్తగా తయారు చేసుకోమని చెప్పారు.
ఆయన వెంట వెళ్ళాను…
టేకుతో తయారు చేసిన ఓ పదడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పున్న దిట్టమైన బల్ల. దానికి రెండువైపులా ఆరుగురు చొప్పున కూర్చుని ఏదో రాసేసుకుంటున్నారు. ఒకాయన నా కేసి చూసి చిరునవ్వు నవ్వారు. కుడి చేతి చూపుడు వేలూ, మధ్య వేలు మధ్య చెక్క పెన్ను పెట్టుకుని గమ్మత్తుగా గాలిలో తిప్పుతున్నారు. కాసేపటికి అలా తిప్పడం ఆపి రాయడం మొదలు పెట్టారు.
ఈలోగా శీను అని మోటూరి గారు పిలిచిన పి.శ్రీనివాసరావు(పి.ఎస్.ఆర్.) అందరికీ నన్ను పరిచయం చేశారు. నవీన్, లీలగారు, శర్మ, సుదర్శనరావు, హరి ప్రసాద్, కేశవ్, వీర్రెడ్డి, పార్థసారథి, పెద్దిరాజు, గౌస్, అనంతనేని రవి కుమార్, కృష్ణయ్య, వైవి కృష్ణయ్య, సుబ్బారావు, నళిని, కొమ్మినేని లక్ష్మీనారాయణ… ఇలా అందర్నీ పరిచయం చేశారు. అందరితో చేతులు కలిపి, నాకు చూపించిన సీట్లో కూర్చున్నాను. న్యూస్ ప్రింట్‌తో తయారు చేసిన ఒక పుస్తకాన్నీ, ఒక టెలిప్రింటర్ కాపీని, పెన్నును నా చేతికిచ్చారు. రాయమన్నారు. ఆ తరహా లిపి చూడడం అదే మొదటిసారి. అయినా కూడబలుక్కుంటూ వార్త రాసేశాను. అదో ప్రమాదానికి సంబంధించింది.
కారు బోల్తా: ఐదుగురి దుర్మరణం…
రాసిన తీరు నాకే నచ్చలేదు. కాగితాలను మెల్లిగా డస్ట్‌బిన్‌లోనికి జారవిడిచి.. మళ్ళీ రాశాను.
పిఎస్‌ఆర్ గారికి ఇచ్చాను. ఆయన ఆ కాపీని చూసి అప్పుడే రాసేశావా! అన్నారు.
గడగడ పైకి చదవడం మొదలుపెట్టారు. (ఏ వార్తయినా పైకి చదవడం ఆయన అలవాటు. దాని వల్ల తప్పులు చాలా తేలిగ్గా దొరుకుతాయని ఆయన చెప్పిన మొదటి పాఠం).
గుడ్ బాగా రాశావ్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేశావా… అడిగారు.
చెప్పాను.. నా వివరాలు…
మా పెద్దనాన్న గారి పేరు చెప్పేసరికి అందరూ ఒక్కసారి నాకేసి తిరిగి చూశారు.
సుదర్శనరావు గారైతే.. ముందే చెప్పలేదేవిటోయ్! అన్నారు.
ట్రాన్స్‌లేషన్స్ ఉంటాయనుకున్న నాకు ట్రాన్స్‌లిటరేషన్ చేయడం నిరాశ కలిగించింది. అయినా కోరుకున్న ఉద్యోగం.. తప్పదు కదా.. ఆ రోజు హుషారుగా నాలుగువార్తలు రాశాను. తూర్పు గోదావరి జిల్లా మినీ ఎడిషన్‌కు నన్ను కేటాయించారు. ఆ పేపర్ల కట్ట నా ముందేసి, చదువుకోమన్నారు…తరవాత. రాత్రి పేజీలు పెట్టించే చోటకు వెళ్ళి పరిశీలన. మరోసారి ఆశ్చర్యం. నేను రాసిన ప్రమాదం వార్త మొదటి పేజీలో మాస్ట్ హెడ్ పక్కన ఎర్రక్షరాలతో కనిపించింది. సంతోషం కూడా వేసింది. హుషారుగా ఇంటికెళ్ళాను. ఆ రోజు అనుభవాల్ని నెమరేసుకుంటూ తనివితీరా నిద్రపోయాను. 7గంటలకల్లా లేచి తయారై పోయి.. మోటూరి గారు చెప్పిన ప్రకారం పదింటికల్లా ఆయన ముందు హాజరు. రెండో రోజున మిగిలిన వారు(మల్లపరాజు, పత్రి వాసుదేవన్, వేణు, పట్నాయక్) చేరారు. మా అందరికీ జర్నలిజం క్లాసు. వార్తంటే ఏమిటి.. ఎలా రాయాలి.. ఎలా మొదలు పెట్టాలి. ఫైవ్ డబ్ల్యూ స్ అండ్ వన్ హెచ్ ఫార్ములా వివరించారు. నిజమే ఇంతవరకూ రాసేశాను. తప్ప ఇలా రాయడం ఎవరూ చెప్పలేదు. అవసరం రాలేదు కూడా.
డెస్కులోకి వెళ్ళి కూర్చోగానే పిఎస్‌ఆర్ పిలుపు..
ఆ రోజు పేపరు.. నేను రాసిన కాపీ అక్కడున్నాయి..
ఈరోజు తప్పొచ్చింది నువ్వు చూశావా!అడిగారాయన
పై ప్రాణాలు పైనే పోయాయి..
జరిగిన తప్పేమిటి… ఎలా జరిగిందీ.. లోపం ఎక్కడ.. వివరాలు రేపు….