సమాధానం చెప్పిన ‘ఓ చిన్న ప్రశ్న’… శ్రావ్యత లేని ‘కచేరి’

0
51

రెండు ఎపిసోడ్లు రెండు విధాలు
ఒకటి ఇన్స్పిరేషన్… రెండోది నిర్లక్ష్యం
ఓ చిన్న ప్రశ్న … కచేరి
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ఈటీవీ విన్ ‘కథా సుధ’ ఆసక్తికరంగా సాగుతోంది. ఎవరూ అన్ని పనులూ ఎలా పర్ఫెక్ట్ గా చేయలేరు అనడానికి ఈ సిరీస్ ఒక ఉదాహరణ. కొన్ని ఎపిసోడ్లు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మరికొన్ని ఆహ్లాదంగా ఉంటాయి. ఇంకొన్ని కాపీ క్యాట్స్ ఉంటాయి. మరిన్ని అందరి మనసుల్నీ హత్తుకుంటాయి. అలా అని ఏ ఎపిసోడ్ నూ చెత్త అని కొట్టేయలేం. ఒక డైరెక్టర్ కచ్చితమైన దృక్కోణంతో డైరెక్షన్ చేస్తారు. ఒక డైరెక్టర్ వేరొక డైరెక్టర్ ప్రభావంలో ఉంటారు. మరొక డైరెక్టర్ కామెడీలో ప్రత్యేకత చూపుతారు. ఇంకొకరు రియల్ స్టోరీస్ పట్ల మొగ్గు చూపుతారు. ఎవరి కోణం ఎలాంటిదైనా అంతిమ లక్ష్యం ప్రేక్షకుడికి ఆనందం కలిగించాలి. ఆహ్లాదం పంచాలి. పకపకా నవ్వించాలి. చూసిన వారి ఆలోచనల్ని భూత కాలంలోకి తీసుకు వెళ్ళాలి. చివరిగా చూసినవారికీ, ఎపిసోడ్ నిర్మించినవారికీ తృప్తి మిగలాలి.

ఇప్పుడు నేను గత రెండు ఆదివారాలలో ప్రసారమైన ‘ఓ చిన్న ప్రశ్న’, ‘కచేరీ’ ఎపిసోడ్స్ గురించి చెప్పబోతున్నాను.


ఓ చిన్న ప్రశ్న … పెద్ద సందేశం…
ఓ
చిన్న ప్రశ్న అనే ఎపిసోడ్ ఆలోచింపచేసింది. తండ్రికి జరిగిన అవమానం గురించి ఒక కూతురు చేసిన పోరాటం ఆకట్టుకుంది. ఎంచుకున్న విధానం సోషల్ మీడియాను పోలి ఉన్నప్పటికీ, ఈ ఎపిసోడ్ ను ఆగకుండా చూసేలా చేసింది. ఫార్వర్డ్ చేయకుండా ఆపింది. ఆరోపణ వచ్చిన వ్యక్తిని భౌతికంగా కొట్టే హక్కు పోలీసులకు లేదని తెలియజేసింది. తండ్రికి కూతురి పట్ల ఉన్న అనురాగానికి మించిన అభిమానాన్ని ఆ కూతురు తన తండ్రి పట్ల చూపింది. అభినందించడానికి తండ్రి ఒక పాలిథిన్ కవర్లో స్వీట్స్ తీసుకుని వస్తే, కూతురు దానిని అందుకుని, కవర్ విసిరేయడం చూపకుండా ఉంటే బాగుండేది. అసలు పాలిథిన్ కవర్ లో స్వీట్ బాక్స్ పెట్టి తీసుకురాకుండా ఉంటే ఒక సందేశం ఇచ్చినట్టు ఉండేది. కవర్ విసిరేయడం సీన్… చూసిన వారికి ఎబ్బెట్టుగా అనిపించేలా ఉంది. ఇదొక్కటి తప్ప మొత్తం ఎపిసోడ్లో డైరెక్టర్ ప్రతిభ కనిపించింది.
తన లైన్ ఆయన తప్పలేదు. అడ్డూరి రవి వర్మ నటన హుందాగా ఉంది. బాలాదిత్య నటన సహజంగా ఉంది.

ఈ ఎపిసోడ్ పోలీసులకు ఒక సందేశం ఇచ్చింది. శతమానం భవతి బ్యానర్ ప్రతిష్ట నిలిచేలా ఈ ఎపిసోడ్ ఉంది. ‘మీరు స్నానం చేసి రండి… భోజనం వడ్డిస్తాను’ వంటి రొటీన్ డైలాగులు అనవసరం అనిపించింది.

నిరాశ పరిచిన కచేరి….
దర్శకుడు.. చెప్పదలచుకున్నది చెప్పడంలో విఫలమయ్యారనిపించింది. అప్పాజీ అంబరీష గారి ఆహార్యం, నటన చక్కగా ఉన్నాయి. శంకరాభరణంలో జె.వి. సోమయాజులు గారి ఆహార్యాన్ని అనుకరించబోయారనిపించింది. డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూరేది అనిపించింది. పాట పాడిన నాయకుని గాత్రానికి .. ఆయన గాత్రానికి పొందిక కుదరలేదు. తాళం కూడా సరిగ్గా వేయించలేదు. మంచి నటుణ్ని తీసుకుంటే సరిపోదనీ, దానికి తగ్గట్టుగా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ చూస్తే చాలు. పాత్రల్ని చంపేయడం గొప్ప కాదు. పాత్రని బతికించి ఎపిసోడ్ ద్వారా ఇవ్వదలిచిన సందేశాన్ని ఇవ్వడం గొప్ప. ఎందుకో ఈ దర్శకుడు సరైన శ్రద్ధ తీసుకోలేదు అనిపించింది. హడావిడిగా పూర్తిచేయడమో లేదా… తన కింది వారికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అప్పజెప్పేయడమో చేసి ఉండవచ్చని అనిపిస్తోంది.
కె. విశ్వనాధ్ గారి ప్రభావంతో చేయించిన ఈ ‘కచేరి’ ఆయన బాటలో కాకుండా బాలచందర్ బాణీలో సాగింది.
ఈ ఎపిసోడ్లో అక్కర్లేని డైలాగ్ ఒక్కటి కూడా లేదు కానీ, దర్శకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. వన్ ఓ 1 కాఫీ నిర్మాణంలో వచ్చిన ఈ ఎపిసోడ్లో అప్పాజీ నటన తప్ప చెప్పుకోదగ్గ అంశం లేదు. సందేశము లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here